కృష్ణం వందే జగద్గురుం - అర్ధం, పరమార్ధం - Krishnam Vande Jagatgurum

P Madhav Kumar

 శ్రీకృష్ణ పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఇష్టమైనవారికి జగన్నాటక సూత్రధారి. గిట్టనివారికి కపట నాటక సూత్రధారి. విలక్షణమైన వైరుధ్యాలతో మాయచేసే గమ్మత్తయిన వ్యక్తిత్వం కాబట్టే కృష్ణుడంటే అంత ఆకర్షణ. ఒకసారి చూస్తే ఇంత ఆకతాయి ఇంకెక్కడా కనిపించడు అనిపిస్తుంది. మరు నిమిషంలోనే మన సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని తెలిపే గురువు ఆయనే అన్నట్టు కనిపిస్తుంది. గోపబాలురతో ఆడిపాడినా గోవర్ధనగిరిని కొనగోటితో ఎత్తినా భారతాన్ని బాధ్యతగా నడిపించినా ఆయన ప్రతి అడుగూ మానవజీవితానికి మార్గనిర్దేశనం చేసేదే. అందుకే కన్నయ్య పుట్టిన రోజంటే (ఈరోజు కృష్ణాష్టమి) జగతికి పండగ రోజే.

 శ్రావణ బహుళ అష్టమి... కృష్ణ జన్మాష్టమి. దేవకీదేవికి అష్టమ గర్భంలో ప్రవేశించిన కథానాయకుడు శ్రీకృష్ణుడు.
జన్మిస్తూనే తన నిజరూప సందర్శన భాగ్యాన్ని జననీ జనకులకు కలిగించిన మధుమోహనుడు. వారికి తన జన్మ కారణాన్నీ, వారి తక్షణ కర్తవ్యాన్నీ వివరించాడు. నందుని ఇంట నడయాడాడు. యదు కులాన్ని ఉద్ధరించాడు. బృదావనాన్ని ప్రేమతో నింపేశాడు. రేపల్లె రాగంతాళం రాజీవం చేశాడు. మరోవైపు దుష్టశిక్షణా శిష్టరక్షణా చేసి మానవజాతిని ధర్మపథాన నడిచేలా చేశాడు. మానవుడే మాధవుడిగా ఎదిగి పరిపూర్ణ వ్యక్తిత్వం అంటే ఇదీ అని రేపటి తరాలకు చాటిచెప్పాడు. ప్రేమతో పిలిచినా, భక్తితో ధ్యానించినా, వైరంతో దూషించినా... ఇలా ఏ విధంగా తనను ఆశ్రయించినా మోక్షమిచ్చే కరుణామయుడు కృష్ణస్వామి. జీవితంలో కష్టనష్టాలూ సుఖదుఃఖాలూ ఎత్తుపల్లాలూ ప్రతీదీ ఓ భాగమే అంటాడు. వాటన్నింటిలో ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలో తన జీవన విధానంతో ఆచరించి చూపిన జ్ఞానస్వరూపుడు. గోకులంలో లీలలు చూపినా, యుద్ధం వద్దని రాయబారం నడిపినా, కురుక్షేత్రంలో వివశుడైన అర్జునుడికి గీతోపదేశం చేసినా... ప్రతిదీ మధుర ఘట్టమే. రేపటి తరానికి ఒక వ్యక్తిత్వ పాఠమే. అందుకే కంప్యూటర్‌ కంటే వేగంగా కాలానికి పోటీగా పరుగులు తీయాలని ఉవ్విళ్లూరుతున్న వేళకూడా మానవజాతి కృష్ణతత్వాన్ని వదల్లేకపోతోంది. ఆ ప్రేమతత్వాన్ని మనసావాచా మననం చేసుకుంటోంది.

ఆనందగోవిందం

‘అధరం మధురం నయనం మధురం... మధురాధిపతే అఖిలం మధురం...’ అంటూ కన్నయ్య ముగ్ధమనోహర రూపాన్ని ఎంత కీర్తించినా తనివితీరదు. ఒక్క రూపమేనా, నల్లనయ్య... కన్నయ్య... కిట్టయ్య... గోపాలుడు... ఇలా ఆ మధుసూదనుడి పేరు తలచినా అలవికాని ఆనందమే. ‘కృష్ణుడు’ అంటేనే ‘అందరి హృదయాలనూ ఆకర్షించేవాడు’ అని అర్థం.
నిజానికి కృష్ణుడికి వశంకాని ప్రాణి ఏదీ లోకంలో లేదు. ప్రేమతో గోపికలూ, భయంతో కంసాది రాక్షసులూ, బంధుత్వంతో యాదవ పాండవులూ... ఇలా అందరూ ఆ రసరమ్య రూపాన్ని పొదివిపట్టుకోవాలని చూసినవారే. తమని తాము అర్పించుకుని తరించినవారే. మార్గాలే వేరు అందరి గమ్యమూ ఒక్కటే... కృష్ణుడిలో చేరిపోవడం. ఆయన్ను చేరుకోవడమంటే కృష్ణ తత్వాన్ని మన జీవనంలోకి ఆహ్వానించడమే. మన మనసును చైతన్యవంతంగా నిత్యనూతనంగా మహదానంద భరితంగా మలచుకోవడమే. జీవితంలో ఎదురైన ప్రతిపనిలో ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలో యుగాలనాడే చేసిచూపాడు ఆ కృష్ణస్వామి. బాలుడిగా పారాడుతూనే అమ్మచనుబాలు తాగినంత సులువుగా పూతనను తుదముట్టించాడు. చేతిలో వెన్నముద్దను పెట్టుకున్నంత ఆనందంగా గోవర్ధన గిరినిమోసి గోకులాన్ని రక్షించాడు. పూబంతులు విసిరినంత అవలీలగా పరమ రాక్షసుడైన కంసమామ గుండెలమీద పిడిగుద్దుల వర్షం కురిపించి సంహరించాడు. కాళీయుడి విషపుపడగలమీద కూడా ఆనందతాండవం చేయగల చిద్విలాసరూపుడు. వేలాది రాజుల సమక్షంలో తనను అగ్రపీఠంమీద కూర్చోబెట్టినా తన కళ్లముందే ద్వారకాపట్టణం సముద్రంలో కుంగిపోతున్నా రెండూ కర్మననుసరించి వచ్చిన ఫలితాలే అంటాడు. రెంటినీ అంతే ఆనందంగా స్వీకరిస్తాడు. సమస్య తలెత్తినప్పుడూ అదే నవ్వూ... గెలిచిన తర్వాతా అదే చిరునవ్వూ. ఆ నవ్వే కృష్ణతత్వం.
సంసారాన్ని వీడడు... ఏదీ త్యాగంచేయడు... కష్టాలు ఎదురైనప్పుడు కూడా సంతోష సాగరంలో ఎలా మునకలువేయాలో సులువుగా చేసిచూపడమే మానసచోరుడి లీలావినోదం.

పూర్ణగోవిందం

జీవితం అంటే ఏమిటీ... అని ప్రశ్నించుకునే మనుషులకు పరిపూర్ణం నుంచి ఉద్భవించిన మానవ జన్మ తిరిగి పరిపూర్ణంలోనే కలిసిపోయే నిర్దిష్టమైన గమనమన్నాడు గీతాచార్యుడు. ఈ ప్రయాణం అంత సులువైంది కాదన్నాడు. అది బంధాలతో అల్లుకుంటుందనీ బాధ్యతలతో నిండి ఉంటుందనీ, శిఖరాలను చూపిస్తుందనీ, లోతుల్లోకి తోసేస్తుందనీ తెలిపాడు. ఎలా జీవించాలో జీవితాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో ఆచరించి చూపాడు. అందుకే కృష్ణుడి జీవితం మానవాళికి ఓ విలువైన సందేశం. నందనందనుడు నమ్మి చేరిన వారిని కాదన్న సందర్భమే లేదు. ఒకవైపు ప్రేమను పంచుతూనే మరోవైపు ధర్మాన్ని నిలబెట్టాడు. మనిషిగా పరిపూర్ణత్వాన్ని ఎలా సాధించాలో మొత్తం మానవజాతికి చెప్పకనే చెప్పాడు. కృష్ణుడు దేవుడు కాబట్టి ఆయన జీవితం అంతా ఆనందంగానే సాగిందనుకుంటే పొరపాటే. కృష్ణపరమాత్మ సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారమే కావచ్చు. ఆయనలో దేవతాంశ ఉండిఉండొచ్చు. కానీ ఇవేవీ దేవకీసుతుడిని దేవుడిగా నిలబెట్టలేదు. కేవలం ఆయనలోని స్థితప్రజ్ఞత, వర్ణించనలవికాని వ్యక్తిత్వమే గోపబాలుడిని గోవిందుడ్ని చేశాయి. అవే మానవ రూపంలో జన్మించినప్పటికీ మాధవుడిగా నిలిపాయి. నడయాడి యుగాలు గడిచినా ఆయన రూపాన్ని మన మనసుపొరల్లో సుస్థిరం చేశాయి.

శ్రీకృష్ణుడి జీవితం ఆద్యంతం మానవాళిని జాగృతం చేసే గీతాపాఠమే. యద్భావం తద్భవతిగా నిలిచిన పూర్ణజ్ఞాన స్వరూపమే. నిజానికి కృష్ణుడిని అనేకులు అనేక విధాలుగా చూశారు. రకరకాలుగా అర్థం చేసుకున్నారు. అనుభూతి చెందారు. దుర్యోధనుడి మాటల్లో చెప్పాలంటే... ‘అందరితోనూ నవ్వుతూ తిరిగే అసలు సిసలైన మోసగాడు. ఏదైనా చేయగల సమర్థుడు. వయోభేదంలేకుండా ఎవరితోనైనా ఆడిపాడగల నేర్పరి...’ ఇదీ దుర్యోధనుడి అవగాహన. ‘కృష్ణుడంటేనే ప్రేమ, ప్రేమంటేనే కృష్ణుడు. ఆయన ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా ప్రేమకు వశుడే...’ ఇదీ కన్నయ్య చిననాటి ప్రేమికురాలు రాధమ్మ అనుభూతి. ‘దేవదేవుడైన శ్రీకృష్ణుడిని మించిన బలం, బలగం మరొకటిలేదు. ఆయనుండగా వేరే ఏదీ అవసరం రాదు కూడా...’ ఇదీ పాండవమధ్యముడి నమ్మకం. కృష్ణుడు పరిపూర్ణమైన విశ్వంలాంటివాడు. సూర్యుడూ చంద్రుడూ కృష్ణబిలాలూ గ్రహశకలాలూ... అన్నీ అందులో భాగమే. ఎవరు ఏది కోరుకుంటే, దేన్ని చూడాలనుకుంటే అవే కనిపిస్తాయి. కృష్ణస్వరూపమూ అంతే.

ప్రేమైకగోవిందం

కన్నయ్యకు బంధాలంటే అమితమైన తీపి. అందుకే ఆయన అందరికీ బంధువే. ప్రతి బంధాన్నీ వెన్నముద్దల్లా అపురూపంగా ఒడిసిపట్టాడు. బంధుత్వాలను ఎలా కొనసాగించాలో చెప్పకనే చెప్పాడు. బంధాలు మనకి బంధనాలు కావనీ ఆయా రూపాల్లో భగవంతుడేననీ గ్రహించమంటూ భాగవత సూత్రాన్ని అలవోకగా వివరించాడు.

మురళీగాన లోలుడు కదా... ఆ గానం ఎంత మధురమో ఆయన ఉపదేశమూ అంతే సమ్మోహనం. మధుసూదనుడు అవతార పురుషుడే అయినా అమ్మంటే ఆయనకు ఎనలేని ప్రేమ. అమితబలశాలి అయినా అమ్మచేతి మూరెడు తాడుకు కట్టుబడ్డాడు. అందుకే పోతన సైతం చిన్నికృష్ణయ్య లీలను ఇలా చెబుతాడు...

చిక్కడు సిరి కౌగిటిలో  
జిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్‌ 
జిక్కడు శృతిలతికావలి 
జిక్కెనతండు లీల దల్లి చేతన్‌ రోలన్‌ 

... యోగుల తపస్సులకు సైతం అందలేదు. అమ్మవారి బిగికౌగిలిలోనూ ఇమడలేదు. అలాంటి అనంతాకారుడు అమ్మప్రేమకు బందీ అయ్యాడు మరి. అన్న బలరాముడన్నా ఆయనకు అలవికాని అనురాగం. అంతకు మించిన గురు భావం. మరోవైపు అన్నగా నిలబడి సుభద్రా కళ్యాణాన్ని ముందుండి జరిపించాడు. సోదరికి సవతి అయినా ద్రౌపదినీ తోబుట్టువులాగే ఆదరించాడు. చీరకొంగును చింపి వేలికి చుట్టినందుకే పరమానంద భరితుడయ్యాడు. అది ఆమె మెట్టినిల్లే చూట్టూ ఉన్నది సొంతవాళ్లే అయినా అయిదుగురు భర్తలూ పక్కనే ఉన్నప్పటికీ... కష్టకాలంలో ద్రౌపదికి తోడునిలిచింది కన్నయ్యే. అన్నా అంటూ ఆర్తిగా పిలవగానే అక్కున చేర్చుకున్నాడు. చీరలు అందించి ఆమె మానాన్ని కాపాడాడు. భీష్మాచార్యుడు యోధుడు.

వరసకి తాత. కృష్ణుడంటే అమితమైన ప్రేమ. ఆయనంటే కన్నయ్యకూ అంతే గౌరవం. కానీ కౌరవ పక్షాననిలిచి ఆయనకు వ్యతిరేకంగా పోరాడాడు. నేలకొరిగే సమయం ఆసన్నమైనప్పుడు మాత్రం ఆయన కృష్ణుడి సాన్నిధ్యాన్నే కోరుకున్నాడు. మాధవుడు వచ్చేవరకూ ప్రాణాలు అరచేతపట్టుకుని ఎదురుచూశాడు. అలాగే స్నేహం ఎలా చేయాలో స్నేహితులు ఎలా ఉండాలో కృష్ణుడిని చూసి ఈతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. జతగాడైన కుచేలుడిని ఆదుకున్న తీరు అద్భుతం. కుచేలుడు నిరుపేద. శ్రీకృష్ణుడు రాజ్యాధినేత. మొహమాట పడుతూ తనవద్దకు వచ్చిన నేస్తాన్ని అడిగిమరీ అటుకుల మూట తీసుకున్నాడు. అడక్కపోయినా సకలసౌభాగ్యాలూ ప్రసాదించాడు. స్నేహితుడిని సమాదరించి, స్నేహబంధం అన్నింటికీ అతీతమైందని నిరూపించాడు కృష్ణస్వామి.

జ్ఞానగోవిందం

పదవులకోసం పాకులాడటం, స్కాంల కోసం స్కీంలు వేయడం కాక రాజకీయమంటే ఏమిటో, దాన్ని రసవత్తరంగా ఎలా నడపాలో చూపిన రాజకీయ దురంధరుడు శ్రీకృష్ణుడు. ధర్మ రక్షణ కోసం ఆ మధుసూదనుడు నెరిపిన రాజకీయ చదరంగమే కురుక్షేత్ర యుద్ధం. దుష్టులను శిక్షించడానికీ ధర్మం పక్షాన నిలబడటానికీ మాధవుడు వేయని ఎత్తుగడ లేదు, చేయని రాజకీయం లేదు. కాళీయ మర్దనం నుంచీ కురుక్షేత్ర సంగ్రామం వరకూ ప్రతిదీ కన్నయ్య ప్రణాళికే. అంతటి రాజనీతిజ్ఞుడు మరొకడుండడు. మహాభారతాన్ని రాజకీయకోణంలో చూస్తే కృష్ణుడిదే కీలక పాత్ర. కౌరవుల దుర్మార్గాన్నీ, దుర్బుద్ధినీ దెబ్బతీయడానికి తానే స్వయంగా రంగంలోకి దిగాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను తాను కావాలా లేక కోట్ల సైన్యం కావాలా అని ప్రశ్నించి తెలివిగా తప్పుదోవ పట్టించాడు. రథ, గజ, తురగ పదాతి దళాలను కౌరవుల పరం చేసి, తానొక్కడు మాత్రం పాండవుల పక్షం వహించాడు. సర్వవేదాంత సారమైన గీతా శాస్త్రాన్ని మానవాళికి అందించాడు. కురుక్షేత్ర రణరంగంలో సారధిగా అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేసి మార్గదర్శి అయ్యాడు. ధర్మాన్ని రక్షించడానికి పాండవుల పక్షాన చేరి వారికి వెన్నుదన్నుగా నిలిచాడు. మహాభారత సంగ్రామంలో పాండవులకే విజయాన్ని కట్టబెట్టి అంతిమ విజయం ధర్మానిదేనని రుజువుచేశాడు. బలగం కంటే బలం, జ్ఞానం కంటే బుద్ధీ గొప్పవని చాటిచెప్పాడు.

గురుగోవిందం

నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలో కృష్ణయ్య యుగాలనాడే చూపించాడు. ముందుండి నడిపేవాడు సమస్యలకూ, సవాళ్లకూ భయపడిపారిపోకూడదు. చివరివరకూ విజయం మనదేనన్న భావంతో పోరాడాలి. తన బృందంలోనూ అదే స్ఫూర్తిని నింపాలి. గోకులంలో ఉన్నప్పుడు ఊరి సమస్యను తనదిగా భావించాడు కాబట్టే గోకులాన్ని రక్షించడానికి గోవర్ధనగిరిని చిటికెనవేలిమీద మోశాడు. తనవారికి కష్టం వచ్చినప్పుడు తాను ముందుండి పోరాడి జగత్తుకి దిశానిర్దేశం చేశాడు. జీవితమంటేనే పోరాటమని తెలిసినవాడు కాబట్టే జరాసంధుడితో పదిహేడుసార్లు యుద్ధం చేయాల్సి వచ్చినా వెనకడుగు వేయలేదు. యుద్ధంలో ఓడిపోయే సందర్భం ఎదురైన ప్రతిసారీ జరాసంధుడు పారిపోయేవాడు. కానీ మళ్లీ బలం పుంజుకుని యుద్ధానికి సై అనేవాడు. దీంతో వరుస యుద్ధాలు చేయక తప్పలేదు కన్నయ్యకు. సమస్యలకు దూరంగా ఉండటమే కాదు, అపాయంలో ఉపాయం ఎలా ఆలోచించాలో చేసి చూపాడు. ఎప్పుడూ ఎదురెళ్లి పోరాడటమేకాదు ఒక్క అడుగు వెనక్కివేసినట్టు కనిపించైనా శత్రువుని తుదముట్టించడమూ ఆయనకి తెలుసు. కాలయవనుడి ఉదంతంలో కృష్ణుడు ఈ ఎత్తుగడనే వేశాడు. అక్షౌహిణులకొద్దీ సైన్యంతో తనమీద యుద్ధానికి వచ్చిన కాలయవనుడికి నిరాయుధుడై ఎదురునిలిచాడు. భయపడినట్టు నటించాడు. కొండకోనల్లోకి పరుగులు తీశాడు. ఓ పాడుబడ్డ గుహను చేరాడు. ముందూ వెనకా ఆలోచించకుండా కన్నయ్యనే వెంబడిస్తూ గుహలోకి అడుగుపెట్టాడు కాలయవనుడు. గాఢాంధకారంలో నిద్రపోతున్న ఓ వృద్ధుడిని చూసి శ్రీకృష్ణుడిగా భ్రమించి ముచికుంద మహర్షిని తట్టిలేపాడు. ఆ ముని ఆగ్రహంతో కళ్లుతెరిచేసరికి నిలువునా భస్మమైపోయాడు. అదీ గోవిందుడి వ్యూహమంటే. భారతంలోనూ అంతే, పాండవ పక్షపాతిలా కనిపించినా వారికీ ఏమీ చేసినట్లుండడు. దుర్యోధనుడితోనూ మంచిగానే ఉన్నట్లు కనిపించినా... ఏ సహాయమూ చేయడు. కానీ తాను నిలిచిన పక్షపు బలాబలాలను తెలుసుకుంటూ ఎత్తూలూ పై ఎత్తూలూ వేస్తూ పాండవులను విజయపథాన నడిపించాడు. నాయకుడు ప్రణాళిక, వ్యూహం అన్నీ సమపాళ్లలో రంగరించి బృందాన్ని ముందుకు నడిపించాలనీ, కదనరంగంలో కత్తిపట్టితీరాలనేమీ లేదనీ వ్యవహారాన్ని చక్కదిద్దే నేర్పు ఉంటే చాలనీ చాటిచెప్పాడు. శ్రీకృష్ణుడనే నాయకుడే లేకపోతే పాండవుల విజయాన్ని ఊహించనేలేం.

భాగవత భారతాల్లో మరపురాని మధుర ఘట్టాలకు మూలకారకుడు మాత్రమే కాదు, మానవులకు జీవిత పర్యంతం పాఠాలు నేర్పే జగద్గురువు శ్రీకృష్ణుడు. జీవితంలోని ప్రతిదశనూ పరిపూర్ణంగా ఆస్వాదించాడు గోపాలుడు. చిలిపి అల్లరితో తన బాల్యాన్ని తరతరాలకూ చిరస్మరణీయం చేశాడు. మధురమైన మురళీ గానంతో ప్రకృతిని సైతం ఆనందడోలికల్లో ఓలలాడించాడు. తలచినంతనే చెంతచేరి పదహారువేల మంది గోపికల్నీ ప్రేమధారల్లో ముంచెత్తాడు. మేధాశక్తితో నారితో సైతం వింటినారిని పట్టించాడు. యుద్ధంలో పాంచజన్యాన్ని పూరించి శత్రువుల గుండెల్లో భయాన్ని నింపాడు. అయినా... ఏ మూసలోనూ ఒదగడు. ఏ అధికారానికీ లొంగడు. అందుకే శ్రీకృష్ణుడు ‘అయినవాడే అందరికీ - అయినా అందడు ఎవ్వరికీ’!

కృష్ణమంత్రం

భూమ్మీద మనిషి మనుగడ మొదలై ఎన్ని యుగాలు దాటినా... ఎన్ని కాలాలు మారినా... మనసులో ఏదో వెలితి. ఇంకేదో అశాంతి. వ్యవస్థలకు తగ్గట్టు వ్యక్తినీ, వ్యక్తిత్వానికి నప్పేట్టు మనసునీ మార్చేసుకుంటున్నా ఆ లోటు మాత్రం గుండెను మెలిపెడుతూనే ఉంది. పనిలో ధర్మాన్ని  నిలుపుతూ, ప్రవర్తనలో నీతిని చూపుతూ, అలవాటుగా న్యాయాన్ని అందించే ఒకేఒక్క మంత్రం కృష్ణతత్వం. ఎందుకంటే... కృష్ణుడు న్యాయం వైపు ఉన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు ప్రవర్తించాడు. సర్వాంతర్యామే అయినా అందరితోనూ అంటీముట్టనట్టు వ్యవహరించాడు. అదే సమయంలో కోరి పిలిస్తే ఆలోచించకుండా ఆదుకున్నాడు. ఏమీ తెలీనట్లే ఉంటాడు. కానీ న్యాయం ఎక్కడుంటే అక్కడుంటాడు. కష్టాలూ, సవాళ్లూ ఎదురైనప్పుడు.. ధైర్యంగా అడుగు ముందుకు వేయమంటాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకోమంటాడు. మానసిక ధైర్యాన్ని అలవర్చుకోమంటాడు. అందుకే కృష్ణతత్వం...సమస్యల సుడిగుండంలో కూరుకుపోయినవారికి నిచ్చెనలు మాత్రమే ఉండే పరమపదసోపానం, గమ్యమేంటో తెలియక పరుగులు తీసేవారికి దారిచూపే వెలుగురేఖ, ఒత్తిడితో సతమతమయ్యే వారికి తిరుగులేని ఔషధం.

రాధామాధవం

ప్రేమంటే రాధ. రాధంటేనే ప్రేమ. కృష్ణుడి ఆనందం తప్పమరేమీ ఆశించని ప్రేమ ఆమెకే సాధ్యం. ఆ ప్రేమే రాధను రసరాణిని చేసింది. దేవదేవుడైన కృష్ణుడిని రాధాదాసుడిగా మార్చింది. అందుకే ఆ ఇద్దర్నీ ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. రాధాకృష్ణుల్లో ఏ ఒక్కరు లేకపోయినా ఆ ప్రేమ పరిపూర్ణంకాదు. అలాంటి ప్రేమను శ్రీకృష్ణుడు ఓసారి పరీక్షించాలనుకుంటాడు. గోపిక వేషం కడతాడు. గోపదేవిగా రాధను ఏడిపిస్తాడు. తాను గోవర్ధన గిరివైపు వెళ్తున్నప్పుడు కృష్ణుడు తన వెంట పడ్డాడనీ, పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేశాడనీ గోపదేవి రాధతో చెప్తుంది. కృష్ణుడి ధోరణి తనకి ఎంత మాత్రం నచ్చలేదంటూ అందగాడినని మిడిసిపడుతున్న కృష్ణుడి ప్రేమను తిరస్కరించి తగిన అవమానం చేశాననీ అంటుంది. ఆ మాటలు తట్టుకోలేనట్టుగా రాధ కన్నీళ్ల పర్యంతమవుతుంది. నవనీత హృదయుడి అంతరంగాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్లనే గోపదేవి అంత కఠినంగా మాట్లాడగలుగుతోందని అంటుంది. ఆమె ప్రవర్తనకు గోపాలుడి మనసు ఎంత గాయపడిందోనని ఆవేదన చెందుతుంది. దీంతో రాధ హృదయంలో తనకి ఉన్న స్థానం ఎంత గొప్పదో కృష్ణుడికి అర్థమైపోతుంది. ఆయన గోపదేవి రూపాన్ని విడిచి నిజరూపంలో రాధ ఎదుట నిలుస్తాడు. ఆశ్చర్యపోయిన రాధ ఆనందబాష్పాలతో కృష్ణుడి కౌగిలిలో ఒదిగిపోతుంది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat