సికింద్రాబాద్‌లోని స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం - skandagiri subrahmanyeswara
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

సికింద్రాబాద్‌లోని స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం - skandagiri subrahmanyeswara

P Madhav Kumar

 


స్కందగిరివాసా... సుబ్రహ్మణ్యేశ్వరా..!
స్కందగిరివాసా... సుబ్రహ్మణ్యేశ్వరా..!

‘నమో దేవాయ మహా దేవాయ సిద్ధాయ సంతాయ నమో నమః శుభాయ దేవసేనాయ షష్ఠి దేవాయ నమో నమః’ అంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నిండుమనసుతో ఆరాధించే భక్తులు లెక్కకుమిక్కిలిగానే ఉన్నా ఆయన కొలువుదీరిన ఆలయాలు మాత్రం అత్యంత అరుదుగా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి సికింద్రాబాద్‌కు చెందిన స్కందగిరి. 

ఆ ఆలయ విశేషాలు...
మార్గశిరమాసం, శుక్లపక్షం, ఆరో తిథి... శివపార్వతుల ద్వితీయ పుత్రుడైన కుమారస్వామి జన్మించిన సుదినం. అదే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. ఆ రోజుని ఎంతో పవిత్రమైనదిగా భావించి భక్తిశ్రద్ధలతో స్వామిని అర్చిస్తారు. కుమారస్వామి కారణజన్ముడనీ తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేది పురాణ కథనం.

దేవగణాలకు సేనాధిపతి అయిన కుమారస్వామిని షష్ఠినాడు దర్శించుకుని, అభిషేకించి, తమ శక్తికొద్దీ పేదలకు అన్న, వస్త్ర, వస్తు దానాలు చేస్తే బ్రహ్మహత్యా పాతకంతో సహా అన్ని పాపాలనుంచీ విముక్తి కలుగుతుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఐదు తలల పాము రూపంలో ఈ లోకాన్ని సంరక్షిస్తుంటాడనీ పేర్కొంటున్నాయి. అందుకే ఆ రోజున పుట్టలో పాలుపోయడం ద్వారా కుమారస్వామిని పూజిస్తారు. సర్పదోషం ఉన్నవాళ్లు షష్ఠిరోజున పుట్టలో పాలు పోస్తే అది తొలగిపోతుందనీ విశ్వసిస్తారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడు, కార్తికేయుడు, మురుగన్‌, స్కందుడు... ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో స్వామివారిని అర్చిస్తారు. షష్ఠిని కూడా కార్తికేయ సుబ్రహ్మణ్య షష్ఠి, కుక్కు సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అందులో భాగంగానే సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌లో ఉన్న స్కందగిరి ఆలయంలో జరిపే పర్వదినాన్ని స్కంద షష్ఠిగా చెబుతారు. ఆగమశాస్త్ర పద్ధతిలో పూజలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. నిష్ఠతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరతాయన్న నమ్మకంతో నిత్యం ఈ ఆలయాన్ని అనేకమంది భక్తులు సందర్శిస్తారు. షష్ఠి పర్వదినం నాడయితే వేేలకొద్దీ భక్తులు తరలి వచ్చి పూజలూ చేయిస్తారు.
స్థల పురాణం!

స్థానికంగా ఉండే ఓ భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కలలోకి వచ్చి గుడిని కట్టాలని కోరగా, ఆయన సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌లో ఆంజనేయుడి విగ్రహం ఉన్న ఎత్తైన కొండమీద స్కందుడి ఆలయానికి దాతల సహాయంతో శ్రీకారం చుట్టాడట. ఆ తరవాత దీన్ని కంచి పీఠానికి అప్పగించగా, నాటి కంచి పీఠాధిపతి చంద్రశేఖరస్వామి శంకరమఠం పేరుతో ఈ ఆలయాన్ని ప్రారంభించారు. అప్పటినుంచీ ఈ ఆలయం మఠం నిర్వహణలోనే కొనసాగుతోంది. ఆ తరవాత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అష్టోత్తరపూజలో వచ్చే ‘ఓం స్కందాయేనమః’ అన్న మంత్రంలోని ‘స్కంద’ అన్న పదానికి, కొండమీద ఆలయాన్ని నిర్మించిన కారణంతో ‘గిరి’ అన్న పదాన్నీ చేర్చి ‘స్కందగిరి’గా నామకరణం చేశారు.

ఆలయ సముదాయం! 
ఆలయంలో ప్రధాన మూలవిరాట్టు సుబ్రహ్మణ్యస్వామియే అయినప్పటికీ భక్తుల దర్శనార్థంఅనేక ఉప ఆలయాలనూ నిర్మించారు. సుందర గణపతి, ప్రసన్నాంజనేయుడు, శివుడు, మీనాక్షి, దక్షిణామూర్తి, లింగోద్భవ, బ్రహ్మ, చండికేశ్వరుడు, గోవిందరాజులు, శ్రీదేవి, భూదేవి, దుర్గామాత, నటరాజ, ఆలయం బయటనున్న రాగిచెట్టు కింద నాగదేవత, సంకట విమోచన గణపతి, షణ్ముఖ, నవగ్రహాలు, రాహుకేతువులు, కదంబ దేవతల ఆలయాలతోపాటు ఆదిశంకరాచార్యుల పాదుకలనూ ఏర్పాటుచేశారు. ఆలయంలో ఉన్న అన్ని దేవతామూర్తులకూ నిత్యం పూజలు జరుగుతాయి.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ప్రతి మంగళవారం అభిషేకం చేయించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. స్కంద షష్ఠిని ఘనంగా చేయడంతోబాటు ఏటా రెండుసార్లు స్వామివారికి కళ్యాణోత్సవాన్నీ కావడి పూజలనీ నిర్వహిస్తుంటారు. 51 లేదా 101 ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషం పోతుందనీ సంతానంలేని వారికి సంతానం కలుగుతుందనీ, రుణ విమోచన కలుగుతుందనీ ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు విశ్వసిస్తుంటారు.

ప్రతి మంగళవారం మహిళలు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు నిమ్మకాయలను కోసి, వాటిని వెనక్కి తిప్పి అందులో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు. అలా చేయడంవల్ల కుటుంబ బంధాలు మెరుగుపడతాయనీ, పెళ్లిళ్లు కుదురుతాయనీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారనీ విశ్వసిస్తారు. ఆలయంలో ఉన్న లింగోద్భవ విగ్రహానికి ప్రతి శివరాత్రి రోజున అర్ధరాత్రి(లింగం ఉద్భవించిన సమయం) మాత్రమే అభిషేకం చేస్తారు. శివధ్యానంలో ఉన్న చండికేశ్వరుడి విగ్రహం వద్ద భక్తులు చప్పట్లు కొట్టి తమ కోరికలను విన్నవించుకుంటే అవి నెరవేరతాయని ప్రతీతి.

ఆలయంలో కార్తీకమాసంలో శివుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మహాన్యాస పూర్వ రుద్రాభిషేకాన్ని హోమంతో చేస్తారు. ప్రత్యేక అలంకరణలతో యాగశాలను రూపొందించి, 108 మంది రుత్వికులు మహాన్యాస పారాయణంతో హోమాన్ని జరుపుతారు. చక్కెరపొంగలి, పులిహోర, పంచామృతం, కట్టుపొంగలి, వడలు, దధ్యోదనం తదితర ప్రసాదాలకీ ఈ ఆలయం పెట్టింది పేరు. ఏటా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. పునర్నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వేడుకను నిర్వహించడం లేదు. సికింద్రాబాద్‌లో ఉన్న ఈ ఆలయానికి ఏ ప్రాంతం నుంచయినా చేరుకోవచ్చు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow