Veda Shastras |
విశిష్టమైన సంప్రదాయంతో ఇన్ని ధర్మాలను ప్రబోధించే వేదశాస్త్రాలు ఎలా ఆవిర్భవించాయి?
వేదములకు పుట్టుక లేదు. ఇవి మానవునిచే రచించబడినవీ కావు. అందుకే వీటిని అపారుషేయములంటారు. అపారుషేయములనగా మనిషి యొక్క బుద్ధి నుండి వెలువడినవి కావు. సృష్టిలో భాగంగానే ఈ అమూల్యమైన వేదసంపద నిక్షిప్తమై యున్నది.
వేదము అంటే అర్ధము?
సంస్కృత వ్యాకరణం ప్రకారం వేదమనే శబ్దము *విద్' అనే ధాతువు నుంది పుట్టినదని, దానికి జ్ఞానమనే అర్ధాన్ని చెప్పబడింది. అనంతమైన జ్ఞానరాశిని (1) బుగ్వేదం; (2) యజుర్వేదం; (3) సామవేదం; (4) అథర్వణ వేదం అని నాలుగు భాగాలుగా విభజించారు.
శాస్త్రమనే పదం వాడుతుంటాం. దాని అర్ధమేమిటి? అది వేదం కన్నా వేరైనదా?
"శాసనాత్ త్రాయతే రక్షతీతి శాస్త్రం". శాసించి మనలను ఆపదల నుండి రక్షించేదని భావం. తెలిసీ తెలియని మందబుద్ధితో చేయకూడని పనిని శిశువు చేయడం వల్ల దానికి వాటిల్లే ప్రమాదం నుండి రక్షించుటకై తల్లి శాసిస్తుంది. అలానే శాస్తం కూడా జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని మనకు తెలియజెప్పి సార్ధక్యతను చేకూర్చుతుంది. వేదంలోని మంత్రాలను క్షుణ్ణంగాను, సమగ్రంగాను తెలియ జెప్పేందుకే (1) శిక్ష; (2) కల్పం; (3) వ్యాకరణము; (4)
నిరుక్తము; (5) ఛందస్సు; (6) జ్యోతిష్యము అనబడే శాస్తాలు ఆవిర్భవించాయి.
వేదమును ఎలా గ్రహించారు?
సృష్టిలో నిక్షిప్తమై యున్న వేద జ్ఞానాన్ని తపస్సు ద్వారా మన బుషులు దర్శించి మనకు అందించారు. కనుక వేదం వ్యక్తి చేత వ్రాయబడ్డది కానే కాదు. బుషులచే దర్శింపబడి గురుశిష్య పరంపరతో అవిచ్చిన్నంగా శోభిల్లుతున్న జ్ఞానము.
వేదాలు మావంటి సామాన్యులకర్ధమయ్యేది ఎలా?
వేదాలు ప్రబోధించే జ్ఞానాన్ని సామాన్యులకు తెలియజేయాలనే భావనతో వాల్మీకి, వ్యాస మహర్షులు రామాయణ, మహాభారత గ్రంథాల ద్వారా సులభమైన శైలిలో మనకు అందజేసారు. కాబట్టి భక్తీ శ్రద్ధలతో వాటిని అధ్యయనం చేస్తే వేదములను తెలుసుకున్నట్లే! "భారత: పంచమోవేద:' అందుకే భారతం ఐదవ వేడమని మహాభారతానికి వేదంతో సమానమైన స్థాయిని ఇచ్చారు.