Sannyasa Ashramam |
సన్న్యాసాశ్రమం అంటే ఏమిటి? సమాజానికి సన్న్యాసుల వల్ల ఎంతవరకు ఉపయోగముంటుంది?
సమ్యక్-న్యాస: సన్న్యాస: సర్వ సంగ పరిత్యాగమే సన్యాసము. శాస్త్రాలు బోధించిన ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్య ఆశ్రమవాసులు కర్తవ్యాలతోను, గృహస్థాశ్రమం లోనివారు బాధ్యతలతోను ముడిపడి వుంటారు. వారు తమ కర్తవ్యాలను, బాధ్యతలను విడిచిపెట్టడం ఎంత దోషమో వాటిలోనే కూరుకు పోవడం కూడా అంతే దోషమని గ్రహించాలి. తన కర్తవ్యాలను, బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించిన వ్యక్తి వాటిని తన తరువాతి తరానికి అప్పజెప్పి మోక్షమనే పరమ పురుషార్థాన్ని పొందేందుకు ఆంతరంగికంగాను, బహిరంగంగాను సంసిద్ధుడు కావాలి. ఈ సంసిద్ధతనే సన్యాసమని, దీనినే విద్వత్ సన్యాసము, వివిదిషా సన్యాసమని శాస్తాలు రెండు విధాలుగా వివరించాయి.
విద్వత్ సన్న్యాసమనగా?
వేదవేదాంత తత్వాన్ని గ్రహించిన విద్వాంసుడు ఆ తత్త్వంలో నిష్ట ను పొంది పరమధర్మమైన మోక్షమును పొందుటకు సమస్తాన్ని పరిత్యజించే వాడు విద్వత్ సంన్యాసి.
వివిదిషా సన్న్యాసమనగా?
వేత్తుం ఇచ్చా వివిదిషా .. అంటే శాస్తాల ద్వారా తత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలనే సంకల్పంతో తనకున్న ప్రతిబంధకాలను దాటుకుంటూ శ్రవణ, మననముల కొరకై అన్నింటినీ త్యజించేవాడు వివిదిషా సంన్యాసి. ఈ విధంగా ఐహిక, ఆముష్మిక, సామాజిక, వ్యావహారిక, లౌకిక భావాల నుండి విడివడి, వాటితో లేశమాత్రపు సంబంధమైనా లేకుండా కేవలం ఆత్మస్థితి యందు రమిమ్చేవాడే సన్యాసి. వారి వల్ల సమాజానికి ఉపయోగం ఉందా, లేదా అని భావించడం మన అవివేకమే.
అన్నీ వదులుకున్న సన్యాసులు సమాజసేవ, ధర్మప్రచారం వంటి వ్యవహారాల్లో ఎందుకు నిమగ్నమౌతున్నారు?
సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ కాషాయాంబర ధారుల్ని సన్యాసులు అనేకన్నా సాధువులు లేక మహాత్ములని పిలవడం సమంజసంగా ఉంటుంది. పరకార్యం సాధయతీతి సాధు: అంటే ఇతరులకోసమై జీవించేవాడు సాధువని అర్ధం.
ఈ భగవత్ సృష్టిలో నది, వృక్షం, సూర్యుడు మొదలగునవన్నీ ఇతరుల కోసమే జీవించే సాధు స్వరూపాలు. అలాగే ఇతను కూడా ధర్మ ప్రచారం చేసినా, భక్తి ప్రభోధం చేసినా, మఠ మందిర వ్యవస్థలను స్థాపించినా, వైదిక ధర్మాభివృద్ధికై వేద పాఠశాలలు నిర్వహించినా అవన్నీ మానవ శ్రేయస్సుకై, లోక కళ్యాణార్థమై చేసే సేవలేనని గ్రహించాలి. “చికీర్ణుర్లోకసంగ్రహం' అని గీతావాక్యం. వీరు లోక కళ్యాణం కొరకే వాటిని నిర్వర్తిస్తారని వాక్యార్ధం.
మరి సాధువులకు, సన్న్యాసులకు తేడా ఏమిటి?
శాస్త్రంలో చెప్పబడ్డ సన్యాసికి ఈ సాధువులకు తేడా వుంది. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ అంటున్నది వేదం. సన్యాస లక్షణాలను వివరిస్తూ వారికి లౌకిక, వైదిక కర్మలతోనూ, ధనంతోను, సంతానంతోను వేటితోను లేశమాత్రపు సంబంధం లేకుండా, వికల్ప రహితమైన
ఆత్మస్వరూప స్థితిలో సదా రమించేవారిని సన్యాసులని వివరించింది. అయితే కాషాయాంబర ధారులైన సాధు సత్పురుషులు సమాజ సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్సంత మాత్రాన వాటితో మమేకమై తాదాత్మ్యము చెందనవసరం లేదు. ధార్మిక, వైదిక, సామాజిక కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో నిర్వర్తించి, తద్వారా చిత్తశుద్ధిని పొంది క్రమేపి స్వాత్మనిష్టకై యోగ్యతను పొందగలరు.
ఆదిశంకరులు వేదోద్ధరణకై రెండుసార్లు ఆసేతుహిమాచలం పాదయాత్ర చేశారని విన్నాం. మరి వారిని సన్యాసి అనవచ్చా?
శ్రీ శంకరులు ఆసేతుహిమాచలం పర్యటించి వేదాంత రహస్యమైన అద్వైత సిద్ధాంతాన్ని సర్వమానవాళికి అందించిన అవతారమూర్తి. మనవలెనే మాతృగర్భం నుండి ఉద్బవించి, సామాన్యంగా వ్యవహరించినప్పటికీ వారిని కారణ జన్ములని గ్రహించాలి. వేదప్రామాణ్యాన్ని స్థిరపరచడం, వేదాంత ప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని సర్వ మానవాళికీఅందించడం కోసమే వారు జన్మించారు. కనుకనే వారు చిరస్మరణీయులు. ఇన్ని వందల సంవత్సరాలైనా నేటికీ వారిని జగద్గురువులుగానే ఆరాధిస్తున్నాం.