🔱కుర్తాళం చిత్రసభ
తిరువణ్ణామలై (అరుణాచలం) గురించి
తలచినా ,
చిదంబరం దర్శించినా, తిరువారూరు లో జన్మించినా,
కాశీలో మరణించినా ముక్తి లభిస్తుందని వారు గాఢంగా నమ్ముతారు.
కానీ తిరుకుర్తాళం లో
జన్మించినా, మరణించినా, దర్శించినా,
మనసార స్మరించినా తప్పక ముక్తి లభిస్తుందని
కుట్రాల స్ధల చరిత్ర చెపుతుంది.
పరమేశ్వరుడు నటరాజస్వామిగా తాండవం చేసిన పంచ
సభలలో యిది చిత్రసభ. ఇతర సభలలో
నటరాజస్వామి లోహమూర్తిగా దర్శనం
యిస్తాడు, కాని యీ సభలో మాత్రం స్వామి చిత్ర రూపంలో దృశ్యకావ్యంగా
దర్శనమిస్తున్నాడు.
ఈ నటరాజస్వామి కి
అభిషేకం చేయరు.
ఈ స్వామికి అభిషేకాలు లేక పోయినా
తన దర్శనానికి వచ్చే భక్తులందరిని
కుల,మత భేదాలు లేకుండా అభిషేకించి
వారిని పవిత్రులను చేస్తున్నాడు. కుట్రాలానికి
వెళ్ళినవారెవరూ అక్కడి జలపాతంలో స్నానం చేయకకుండా తిరిగివెళ్ళరు.
దేశ విదేశాలనుంండి వివిధ వర్గాల యాత్రీకులు కుర్తాళ జలపాతాలలో స్నానం చేసి పునీతులవుతారు. కుర్తాళ శిలలపై అనేకమైన శివలింగాలు
వున్నవి. ఆ శివలింగాల ను అభిషేకిస్తూ జలపాతాల నీరు క్రిందికి ప్రవహిస్తుంది. కుర్తాళ
జలపాతంలో ఎవరైతే స్నానం చేస్తారో
వారి సకల పాపాలు తొలగిపోతాయి.
పరమశివుడు తీర్ధంగాను, చిత్రం గాను, శివలింగముగాను
వున్న యీ పుణ్య స్ధలంలోని వృక్షాలకు కూడా ప్రత్యేకమైన
మహిమలు, విశిష్టతలు వున్నవి.
ఈ స్ధలంలోని కురుంపలా( పొట్టి పనస)
వృక్షాన్ని కీర్తిస్తూ
తిరుజ్ఞాన సంబధర్ అనే
మహా భక్తుడు ప్రత్యకంగా పదికం( స్తోత్రం) గానం చేసారు. ఈ విధమైన ప్రత్యేక పదికం మరే ఇతర
ఆలయంలోని స్ధల వృక్షానికి లేదు.
ఈ ఊరులో పొట్టి పొట్టి మఱ్ఱి వృక్షాలు అనేకం వున్నందున ఈ వూరికి
"కుట్రాలం" అనే పేరు వచ్చినా, స్ధల వృక్షమైన కురుంపలా వృక్షం పేరుతోనే యీ స్ధలంలో
ఈశ్వరుడు "కురుంపలావీశ్వరుడు" అని
పిలువబడుతున్నాడు. అందుకు కారణం,
యీ కురుంపలా వృక్షం నుండి వచ్చిన కొమ్మలను పళ్ళలోని తొనలను , గింజలను అన్నిటినీ శివలింగ రూపాలుగా
కుట్రాల కురవంజి తమిళ పద్య కావ్యం కీర్తించింది.
ఇక్కడ వెలసిన ఈశ్వరునికి
అగస్త్య మహర్షికి ఒక సంబంధం వున్నది.
పార్వతి పరమేశ్వరుల కళ్యాణ సమయంలో ముక్కోటి దేవతలు,ముల్లోక ప్రజలు తరలి వెళ్ళినందున
ఉత్తరదిశ భూభాగం పల్లమై దక్షిణ దిశ ఎత్తు బాగా పెరగడం చూసి మహేశ్వరుడు భూభారం సమతుల్యం చేయడానికి తనతో సమానమైన శక్తిమంతుడు అగస్త్య మహర్షియని భావించి దక్షిణ దిశలోని
పొదిగై పర్వతానికి వెళ్ళమని అగస్త్య మహర్షిని ఆదేశించడంతో అగస్త్యుడు కుర్తాళంలో స్థిరపడ్డాడు.
అర్జునుడు తను నిత్యం పూజించే కలశమూర్తిని ఎక్కడో
పోగొట్టుకున్నాడు. దానిని తిరిగి పొందడానికి ఇక్కడ పశ్చిమాభిముఖంగా సోమనాధస్వామి
అనే పేరుతో శివలింగాన్ని ప్రతిష్టించి, దానిని భక్తితో పూజించి పోగొట్టుకున్న స్వామిని తిరిగిపొందినట్లు
స్ధల పురాణ కధ.
అర్జునుడు పూజించిన
సోమనాధుడు , ఆలయ సమీపమున
పశ్చిమ ముఖంగా వున్న వినాయకుడు యాత్రికులకు దర్శనమిస్తారు.
కుర్తాళంలో ఒక ప్రత్యేక కోణం నుండి చూస్తే అగస్త్య పర్వత శిఖరం, ఆలయ విమాన కలశం, పరమేశ్వరానుగ్రహమైన కుర్తాళ జలపాతం, సోమనాధుడు, వినాయకుడు , అందరినీ
ఒకేసారి దర్శించి తరించవచ్చును.
కుర్తాళానికి
సౌపర్ణికాపురం, ముక్తవేలి,
నదిమున్రిల్ మానగరం, తిరునగరం,
నన్నగరం,
జ్ఞానప్పాక్కం వేడన్ వలంసెయిదపురం, యానై పూజిత్తపురం,
వేదశక్తి పీఠపురం అని అనేక పేర్లు వున్నవి. దక్షిణభారతంలోనే పరమ పవిత్రమైన , ఆరోగ్యప్రదమైన పుణ్యక్షేత్రం కుర్తాళం.