🌸శిలలోని సౌందర్యాన్ని తమ బుధ్ధితో గ్రహించి వాటితో అద్భుతమైన కళాత్మక శిల్పాలు చెక్కి మన దేశానికి సరికొత్త అందాలను అందించిన మహాశిల్పులెందరో. అలాటి గొప్ప కళాకారులను ఆదరించి పోషించిన గొప్ప కళాపోషకులు పల్లవులు. పల్లవ చక్రవర్తులు , మహారాజులు
నిర్మించినగుహాలయాలెన్నో వారి కళాభిరుచికి తార్కాణాలుగా నిలిచిపోయాయి.
🌸ఆవిధంగా అనేక వింతలను, అతిశయ విశేషాలను తనలో నింపుకునివున్నది, మహేంద్రవర్మ కాలంనాటి ఒక గుహాలయం.
🪷చెంగల్పట్టు నుండి తిరుక్కళ్ కున్డ్రమ్ వెళ్ళే మార్గం లో సుమారు
3 కి.మీ దూరంలో వల్లం అనే గ్రామం ఉన్నది. ప్రకృతి అందాలతో నిండి వున్న యీ గ్రామంలో విశిష్టమైన విశేషాలు కలిగిన ఒక గుహాలయం.
🌸1. మొదటి రోజుల్లో ఈ గుహాలయానికి చేరుకోవడానికి సరియైన మెట్లు లేవు. ఈ మధ్యకాలంలోనే మెట్లను అమర్చారు.
🪷రాశి మెట్లు, పంచాక్షర మెట్లు, నవధాన్య మెట్లు నవలోహ మెట్లు, నవరత్న మెట్లు అనే పదహారు పేర్లతో గుహాలయానికి వెళ్ళడానికి మార్గాలు ఏర్పడ్డాయి.
🪷2. ఒక చిన్న కొండ మీద మూడు అంతస్తులుగా ఈ గుహాలయాలు నిర్మించబడ్డాయి. సుమారు 1400 సంవత్సరాల క్రితం నిర్మించబడిన గుహాలయాలు ఇవి.
🌸మెట్ల మీదుగా పైకి ఎక్కివెడితే మొదటగా కనిపించేది కరివరదరాజపెరుమాళ్
గుహాలయం. దీనిని పల్లవ చక్రవర్తి పుత్రిక కొమ్మై నిర్మించినట్టు గుహాలయంలోని శిలా శాసనాలు తెలుపుతున్నాయి.
🪷3. ఇక్కడ పెరుమాళ్ శ్రీ దేవి భూదేవీలతో అనుగ్రహం కటాక్షిస్తున్నాడు. పక్కనున్న ద్వారపాలకులు చేతిలో ఏ ఆయుధాలు లేకుండా ఒక చేయి నడుముపై పెట్టుకొని మరో చేతితో చామరం వీచే దృశ్యం ఎక్కడా కానరాని భంగిమ.
🌸4.ఈ పెరుమాళ్ సన్నిధికి సమీపమున ఒక దొలచిన శిల్పంగా విష్ణు దుర్గని దర్శిస్తాము. దుర్గామాత వదనంలోని చిరునవ్వు దర్శకులకు ప్రశాంతతను చేకూరుస్తుంది.
🪷5. మెట్టమీద మధ్య భాగంలో ఒక ధ్యాన మండపం వున్నది.
ఇక్కడవున్న గుహాలయం లో పాను వట్టము లేని పొడుగుపాటి స్ధంభ రూపంలోని అతిశయ
లింగమూర్తి దర్శనం అపురూపం.
🌸 లక్క సోమాచియార్ పుత్రిక నిర్మించిన దేవ కుళం యిది ' అని శిలా శాసనము ఒకటి కానవస్తుంది. దేవకుళం అంటే దేవాలయం. ఒక సామాన్య కుటుంబానికి చెందిన స్త్రీ నిర్మించిన ఆలయం ఇది.
🪷6.మెట్ట శిఖరాన వేదాంతేశ్వరుని ఆలయం వున్నది. ప్రవేశ ద్వారము వద్ద శిలలతో దొలచిన బ్రహ్మాండమైన వినాయకుని విగ్రహం అత్యంత సుందరమైన మూర్తి. ఈ వినాయక స్వామి పదమూడు నామాలతో పూజించబడుతున్నాడు. ఒక ఆవరణలో జ్యేష్టాదేవి కొలువై వున్నది.
🌸7.గర్భగుడి లో వేదాంతేశ్వరుడు గంభీరంగా రుద్రాక్ష పందిరి క్రింద దర్శనం ప్రసాదిస్తున్నాడు. పల్లవుల కాలంలో సామంత రాజుగా వున్న
వయన్దప్రియుని కుమారుడు కంద సేనుడు ఈ ఆలయం నిర్మించినట్టు శిలాశాసనం తెలుపుతున్నది.
🪷8.ఈ ఆలయ గర్భగుడిలోని స్ధంభాల మీద పగపిడుగు,లలితాంకురుడు,
శతృమల్లుడు, గుణభరుడు, మొదలైన
మహేంద్ర వర్మ యొక్క బిరుదు నామాలు అన్నీ కనిపిస్తాయి.
🌸9.ఈశ్వరుని ద్వార పాలకులు ఇద్దరు మళు అడియార్ ,(మళు అనే
ఆయుధం ధరించిన భక్తుడు) శూల
అడియార్( శూలం ధరించిన భక్తుడు) వ్యత్యాసమైన రూపాలతో కనిపిస్తారు.
🪷10. పరమశివుని ఎడమ భాగమున జ్ఞానాంబిక దేవిని దర్శిస్తాము. త్రినేత్రములతో ఈ దేవి సిధ్ధురాలిగా భక్తులను కటాక్షిస్తున్నది. ఈ దేవి కాళ్ళకు అలంకరించబడిన పాదరస గొలుసు సిధ్ధులచే సమర్పించబడిన అతిశయ సంపదగా
చెప్తారు.
🌸వినాయకుడు, వళ్ళీ ,దేవయానీ సమేత కుమారస్వామి , చండికేశ్వరుని సన్నిధులు కూడా ఇక్కడ
వున్నాయి.
🪷11. ఒక గొప్ప చక్రవర్తి, మరో మహారాజు కుమార్తె, ఒక సామాన్య స్త్రీ - ఈ ముగ్గురిచే వివిధ దశలలో నిర్మించబడిన యీ గుహాలయాల ప్రాంతమంతా వసంతేశ్వరంగా ఖ్యాతి చెందినది
🌸12. ఏడుగురు సిధ్ధ పురుషులు నిత్యమూ పూజలు చేసే పవిత్ర ఆలయం.ఇక్కడి శివగంగా పుష్కరిణి ,
కొండ శిఖరాన వున్న పరమశివుని పవిత్ర చరణాలు శని దోష నివారణంగా సంతాన భాగ్యం కలిగించే గణపతి నెలవైన పుణ్య క్షేత్రంగా వెలుగొందుతోంది యీ వల్లం వసంతేశ్వరం.