🌸కర్ణాటక రాష్ట్రంలో బేలూరుకు
సమీపమున హోయసలేశ్వరుని ఆలయం వున్నది. ద్వారకాపురి వాసులమని చెప్పుకొనే హోయసలలు 1121లో కట్టిన యీ శివాలయంలో హోయసలేశ్వరునికి శాంతలేశ్వరుని కి రెండు సన్నిధులు వున్నాయి.
ఈ ఆలయం అత్యంత సునిశితంగా, సౌందర్యంగా చెక్కబడిన శిల్ప సౌందర్యం తో అలరారుతున్నది. ఆలయ ప్రవేశ ద్వారము వద్ద వున్న నర్తన గణపతిని ఒక తామరపీఠం మీద వీక్షిస్తాము.
🌸హస్తాలలో ఆయుధాలు ధరించి,
పెద్ద బొజ్జతో, దేహమంతా ఆభరణాలతో, శిరస్సున కిరీటంతో, దర్శనమిచ్చేవినాయకుని శిల్ప సౌందర్యం వర్ణించడానికి మాటలు చాలవు.తొండము , ఎడమచేయి మాత్రము విదేశీయుల దండయాత్రలో ఛిన్నాభిన్నమైనవి. అయినా ఆ శిల్పాల సౌందర్యానికి కొరతలేదు. హోయసలేశ్వరుని ఆలయం అంతా ఒక విధమైన సున్నపు
రాయితో నిర్మించారని చరిత్ర పరిశోధకులు తెలుపుతున్నారు. శిల్పం చెక్కడానికి యీ బండలు మైనం లాగ మెత్తగా అమరి వున్నందు వలన వర్ణించలేనంత సౌందర్యంగా శిల్పాలు మలచబడ్డాయి.
🌸ఇక్కడ పరమ శివుడు , అమ్మవారు ఏకాంతంగా ఆశీనులైన శిల్పం పరమాద్భుతం. హోయసలేశ్వరునికి, శాంతలేశ్వరునికి ముందు భాగంలో
నంది మండపాలు వున్నాయి. మండపం చుట్టు శిల్ప సంపదతో కూడిన స్ధంభాలన్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఇక్కడి నంది విగ్రహాలు రెండూ ఏక నల్ల బండరాతితో మలచబడినది. రెండు నందులూ రూపంలో ఒకలాగే వుంటాయి. పరమేశ్వరుని రాకకోసం ఎదురుచూస్తున్నట్టు నంది కళ్ళు సజీవంగా వుండి చూసేవారిని
విస్మయ పరుస్తాయి.
🌸గజసంహారమూర్తి సౌందర్య వంతమైన విగ్రహాన్ని దర్శిస్తాము. విగ్రహాలంకరణలోని వస్త్రాలు , ఆభరణాలు శిల్ప కళా నైపుణ్యం తో
చూపరులను ఆకట్టుకుంటాయి.
హస్తంలో దానవుని శిరస్సు
కోరపళ్ళు, కోపంతో రంకె వేసే నంది ..
అని ఏనుగుని చర్మం ఒలిచే భంగిమ మన దేహాన్ని జలదరింపచేస్తుంది.
ఎత్తిన పాదంతో ఆకాశాన్ని కొలుస్తున్న అందమైన వామనమూర్తి రూపం.
శ్రీ మహావిష్ణువు పాదంక్రింద
మహాబలి చక్రవర్తి శరణుకోరే
భంగిమ, జీవకళ ఉట్టి పడేలా వున్నది.
పైన క్రింద చెక్కిన అపురూప శిల్పం శిల్పి కళానైపుణ్యాన్ని
చాటుతున్నాయి. ఆలయ వెలుపల గోడలమీదచెక్కబడిన సుందరశిల్పాలు అంతస్తుల వరుసలతో ఆలయమంతా ఒక ప్రత్యేక సౌందర్యాన్ని సంతరించుకుంది.
ఏనుగుల వరుసలు, యాళి అనే పురుషామృగాల వరుస, వాద్యాలు మ్రోగించే స్త్రీల బృందాల వరుస, యుధ్ధ వీరుల గుంపు , పుష్పాల వరుసలు ముగ్గుల, చిత్రాలతో ఆలయ గోడలన్ని
అపూర్వ శిల్ప సంపదతో భారతీయ శిల్ప కళా సౌందర్యాన్ని చాటుతాయి.
🌸శంఖు, చక్రం, గదలతో శ్రీ మహావిష్ణువు యొక్క సౌందర్య శిల్పం, నర్తకి నాట్య భంగిమ , సంగీతం పాడే గంధర్వులు, చుట్టూ వుండగా
మహావిష్ణువు మూర్తి అత్యంత
వైభవంగా, చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిస్తాడు.
పరమేశ్వరుని ఆలయమైనా ఇక్కడ , బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు
దర్శనమిస్తాయి.యోగినీ దేవతలు చుట్టూ నిలబడి వుండగా దుర్గాదేవి
ఆవేశంతో నిలబడిన మూర్తి. శూలం, ఢమరుకం, దానవుని శిరస్సు, నాగాస్త్రం ధరించిన దేవీమూర్తి.
🌸నాగ కన్యలు పాదాల వద్ద సేవిస్తుండగా, ఈ అమ్మవారి ముఖంలో కోపంతో పాటూ చిరునవ్వును కూడా ఒక చిన్న రేఖలో చూపించడం శిల్పి యొక్క కళానైపుణ్యాన్ని తెలుపుతుంది.
ముమ్మూర్తులో బ్రహ్మా విష్ణువుల అందమైన మూర్తులు.
ఎడమ ప్రక్కన అప్సరసల నాట్య భంగిమలు బ్రహ్మ ,విష్ణువు చరణాల వద్ద దేవ గణాలు, ఈ మూర్తుల అన్నిటి మీద చెక్కబడిన నగిషీల పనితనం అద్భుతం.
🌸శిల్ప కళా సౌందర్యానికే కాదు దైవీక శిల్పాలన్ని మనలోని ఆధ్యాత్మికని తట్టి లేపే కేంద్ర స్ధానంగా ఖ్యాతిగాంచినది యీ హోయసలేశ్వరుని ఆలయం.
దైవ ధ్యానానికి తగిన ఆలయంగా పేరు పొందినది.