*వరలక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోవడం ఎలా...??*

P Madhav Kumar

 *వరలక్ష్మి ప్రసన్నత* 

🌺శ్రావణ సోమవారాలు శివుడికు అత్యంత ప్రీతికరాలు. అందుకే ఉత్తరాదిలో కాశీ, ఉజ్జయిని, సోమనాథ్ వంటి శివక్షేత్రాలు శివవ్రతాచరణ చేసే భక్తులతో కిటకిటలాడుతుంటాయి. మంగళవారం గౌరీవ్రతాలు, శుక్రవారం లక్ష్మీవ్రతం, ఇలా శ్రావణమాసమంతా ఒక మంగళకర వాతావరణాన్ని దర్శించింది మన సంప్రదాయం.


🌺శుక్రవారం భారతీయులకు పవిత్ర దినాల్లో ఒకటి. శక్తి ఆరాధనకు ప్రశస్తి. అందునా శ్రావణమాసం శుక్లపక్షం. శుక్లపక్షపు శుక్రవారం, పైగా పూర్ణిమకు దగ్గరగానున్న శుక్రవారం మహాప్రాశస్త్యం. 


🌺శ్రావణములో పూర్ణిమ ముందు శుక్రవారం లక్ష్మీపూజ కొందరు చేస్తే, మరికొందరు పౌర్ణమి తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా లక్ష్మీవ్రతం చేస్తున్నారు. రెండూ మహిమాన్వితాలే.


🌺ఆహ్లాదం, ప్రసన్నత, ఆర్ద్రత (రసస్వభావం), నిండుదనం, ప్రీతి. మొదలైనవన్నీ చంద్ర భావనలు. ఈ భావనల దేవత లక్ష్మి.


🌺విశ్వవ్యాపక చైతన్యం వివిధ భావాలుగా వ్యక్తమవుతుంటుంది. ప్రసన్నత, గాంభీర్యం, ప్రచండత, సౌజన్యం, కారుణ్యం, కాఠిన్యం. ఈ భావాలన్నీ విశ్వచైతన్య విన్యాసాలే. ఆయా భావనల రూపంగా ఆ చైతన్యాన్ని గ్రహించడమే వివిధ దేవతా రూపాల ఆవిష్కారం. 


🌺ఒకే చైతన్యం నుంచి అన్ని భావనలు వ్యక్తమైనట్లుగానే, ఒకే పరమాత్మను అనేక దేవతాకృతుల్లో ఆరాధిస్తున్నారు. విశ్వవ్యాపకమైన శోభ, కళ, ఆర్ద్రత, సంపద, కాంతి, సౌమ్యత, వాత్సల్యం, ఉత్సాహం, ఆనందం వంటి దివ్య భావనలన్నీ సమాహారం చేస్తే ఆ స్వరూపమే లక్ష్మి.


🌺జగతిని పోషించే ఐశ్వర్యశక్తి, లక్షణ శక్తి లక్ష్మి. ఏ వస్తువు లక్షణం దానికి ఐశ్వర్యం. కంటికి బంగారు కళ్లజోడు లక్ష్మికాదు. కంటికి చక్కని చూపు, చక్కని ఆకృతి లక్ష్మి. ఇలా ప్రకృతిలో ప్రతి పదార్థానికి ఉండవలసిన లక్షణ కళ లక్ష్మీ స్వరూపం. 


 *సిద్ధ లక్ష్మీః మోక్షలక్ష్మీః జయలక్ష్మీః సరస్వతీ |* 

 *శ్రీర్లక్షీః వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ॥* 


🌺ఏ కార్యమైనా సిద్ధే ప్రయోజనం. అది లేనపుడు కార్యానికి ప్రయత్నమే ఉండదు. అందుకే సిద్ధి అనేది మొదటి లక్ష్మి. సిద్ధించిన తరవాత కార్యభారం నుంచి విముక్తులమవుతాం. ఇల్లు పూర్తవడం అనే సిద్ధి లభించాక, ఇల్లు కట్టడం అనే కార్య శ్రమ నుంచి విడుదల పొందినట్లుగా. ఆ ముక్తియే మోక్ష లక్ష్మి.


🌺ప్రతికూల పరిస్థితులను దాటడమే జయలక్ష్మి. పనికి కావలసిన తెలివి తేటలు, సమయస్ఫూర్తి సరియైన నిర్ణయశక్తి, విజ్ఞానం... వంటివన్నీ విద్యాలక్ష్మి. అదే సరస్వతి. ఫలితంగా పొందే సంపద, ఆనందం శ్రీ లక్ష్మి దాని వలన కలిగే శ్రేష్ఠత్వం, (ఏ రంగంలోనైనా) ఉన్నతి వరలక్ష్మి, చివరి గమ్యం ఇదే. అందుకే వరలక్ష్మీ వ్రతమంటే మిగిలిన ఐదు లక్ష్ములను కూడా ఆరాధించి, ఆ అనుగ్రహాన్ని సంపాదించడమే.


🌺ఈ పూజలో ఆరాధించే స్వరూపం కలశం, కలశంలో బియ్యమో, జలమో వేసి పచ్చని చిగుళ్ళు పెట్టి, దానిపై ఫలాన్ని ఉంచి ఆరాధించడం గొప్ప విశేషం. బ్రహ్మాండమనే కలశంలో సంపద, పచ్చదనం (మంగళం), సత్ఫలం నిండి ఆరాధన పొందుతున్నాయి. వ్రతంపై శ్రద్ధను పెంచడానికి పురాణం అందించిన కథలో - చారుమతి అనే సాధ్వి లక్ష్మి దయను పొంది అమ్మను ఆరాధించింది.


🌺భగవదారాధనకు కావలసిన పాత్రత. దైవాన్ని ఆరాధించే వారి మతి చారుమతి కావాలి. ఉత్తమమైన గుణాలే చారు (చక్కదనం). అవి కలిగిన బుద్ధి చారు మతి. ఆ బుద్ధిని లక్ష్మి కరుణిస్తుంది. ఈ సంకేతమే ఆ కథ అందించే సందేశం. పొందే సంపదలన్నీ దేవతా స్వరూపాలుగా, ప్రసాదాలుగా (ప్రసన్న భావాలుగా) దర్శింపజేసే సత్సంప్రదాయాలు మనవి. వరం అంటే శ్రేష్ఠత. ప్రతిదీ శ్రేష్ఠమైనదే కావాలని అనుకుంటుంటాం. అలాంటి శ్రేష్ఠతలను ప్రసాదించే జగదాంబ వరలక్ష్మి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat