*21.భాగం*
చతురంగ బలముతోడను నీకుమారుల తోడను గూడి యింద్రాది దేవతలను వెంటబెట్టుకొని వెంటనే రాక్షసులను జంపుము.
అని యిట్లు శివుడాజ్ఞాపించిన తోడనే దేవాంగమహా రాజు చిత్తమనియంగీకరించెను. తరువాతను శివుడు దేవేంద్రునితో మరల నిట్టనియె. ఇంద్రా ! నీ వీదేవాంగుని సాయముగా దీసికొని యుద్ధమునకు బొమ్ము. ఇతడు వజ్రదoదులగు రాక్షసులను దప్పక జయించును. అని యిట్లు శివుడు
చెప్పినమాటలు విని సంతోషించి యింద్రుడిట్లనియె. దేవేశా ! యట్లే కానిమ్ము.తమవాక్యముచేతను రాక్షసులు పరాజితు లగుదురుగాక. వాండ్రు మమ్ములను జాల
బాధించుచున్నారు. అని చెప్పి దేవదేవు డగు శివునకు నమస్కరించి యతనియాజ్ఞను
బొంది దేవాంగునితో గూడ బయలుదేరెను. అపు డింద్రునితో దేవాంగు డిట్లనియె.దేవేంద్రా ! నీ విపుడు దేవతలతో గూడి స్వర్గమునకు బొమ్ము, నేనును జతురంగ
బలముతో నీయనుపదమే వచ్చుచున్నాము. అని చెప్పగానే వేగముగా రమ్మని చెప్పి దేవతలతో గూడి సంతోషించుచు నింద్రుడు స్వర్గమునకు బోయెను. తరువాతను దేవాంగ దామోదపట్టణము చేరెను. పణిహారులను బిలిచి చతురంగబలమును
సిద్ధముచేయునట్లాజ్ఞాపించెను. తరువాతను వారందఱును గూడిరి వాద్యధ్వనులు
మ్రోగుచుండగా రాజపుత్రులతోగూడి స్వర్గమునకు బోయెను. ఇంద్రుడు తనకు
సహాయము చేయ వచ్చినవారి నందఱును గౌరవముగా నెదుర్కొని పట్టణములోనికి
దీసికొనిపోయి యతిథిసత్కారమును యధేష్టముగా జేసెను. నాడు రాక్షసులు యుద్ధమునకు రారని తెలిసికొని నాటి రాత్రి సుఖముగా వెళ్ళించెను. మఱునాడు తెల్లవాఱగానే పణిహారులను బిలిపించి దేవసైన్యము నంతను యుద్ధము నకు
సిద్ధముగా నుండునట్లు చేయుడని యాజ్ఞాపించెను. యుద్ధప్రయాణమునకు
సూచకముగా రణభేరులు మ్రోగింపబడినవి. దేవతలందఱును నిత్యకృత్యములను
నెఱవేజ్చుకొని యింద్రునియొద్దకు వచ్చిరి. రాజపుత్రులతో గూడి దేవాంగుడును
మహేంద్రునియొద్దకు వచ్చెను. అందఱును గూడి యున్నారని దేవేంద్ర డనెను.ఇంతట వజ్రదంష్ట్రుడు మొదలగురాక్షసులు వచ్చి దేవతలతో దొమ్మిగా
యుద్ధముచేయ మొదలిడిరి. దేవతలు రాక్షసులు పరస్పరమును జయించుతలం
పుతో గొట్టుకొనుచుండిరి. శూరులగు దేవతలు రాక్షసులను గట్టిగా కొట్టురి.
రాక్షసులు దిక్కులేక వ్యాఘ్రవక్రుని శరణుజొచ్చిరి.
*సశేషం......*