🔱 శబరిమల వనయాత్ర - 84 ⚜️ నిలక్కల్ ⚜️

P Madhav Kumar

⚜️ నిలక్కల్ ⚜️

*ఎరిమేలి నుండి కాలినడకగా పంబానది చేరుకొనే వనయాత్ర మధ్యములో  ఎదురయ్యే స్థలముకాదు*

ఈ నిలక్కల్ , కోట్టాయం - ఎరుమేలి మార్గముగా బస్సులోను , కారులోను తదితర వాహనములలోను పంబ చేరుకొనే భక్తాదులకు *నిలక్కల్ మహాదేవ క్షేత్రము* మార్గమునే రావలయును , శబరిమల నుండి తిరుగు పయణమయ్యే ప్రతియొక్క భక్తుడును ఈ మార్గముగానే మరలవలెను. ప్రధాన రహదారి నుండి ఎడమవైపు ఒక కి.మీ. వెడలినచో *అతి ప్రాచీనమైన ఈ శివ క్షేత్రమును దర్శింపవచ్చు.*

ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డువారి పర్యవేక్షణలో క్రమముగా ఇచ్చట త్రికాలపూజలు సలుపబడుచున్నది. అయినను సరియైన బస్సు సర్వీసు లేనందు వలనను , సరియైన
ప్రచారము లేకపోవడము వలనను అనేకులకు ఈ ఆలయమును దర్శించుట వీలుకాకున్నది. టూరిస్టుబస్సు , ప్రయివేటుకార్లు , వ్యాన్లలో వచ్చువారు ఈ నిలక్కల్
దేవాలయమును సందర్శింపగలుగు చున్నారు. పూర్వకాలమున దట్టమైన అడవి ప్రాంతముగా యున్న ఈ స్థలము ఇపుడు ఫామింగ్ కార్పోరేషన్ వారి రబ్బరు ఎస్టేటుగా రూపొందియున్నది. ఈ రబ్బరు ఎస్టేటు యొక్క భాగమున ఈ దేవాలయము నెలకొని యున్నది. పలువేల సంవత్సరములకు మునుపటినుండియే ఈ శివాలయము
యుండినట్లు , అప్పటి నుండియే పూజాధికాలు సలుపబడి యున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపియున్నారు. శబరిమల శ్రీ ధర్మశాస్తావారి ప్రతిష్ఠా కైంకర్యము సలుపబడినది
సాక్షాత్తు శ్రీ భార్గవరాముని స్వహస్తముననే యనుట ఇచ్చటి ఐతిహ్యము.

శబరిమలకు ఎదురుగాయుండు కాంతమల శిఖరాగ్ర భాగమున పొన్నంబల మేడు నందు ఋషులచేత , అజ్ఞానునలకంట పడనిరీత్యా నిర్మించబడిన పొన్నంబలమునందు (స్వర్ణమందిరము) దేవతల పూజలందుకొని అనుగ్రహించు చుండు శ్రీ ధర్మశాస్తావారిని పామర , సాధు , సజ్జనులు గూడా పూజించి , మ్రొక్కి సద్గతి పొందుటకు వీలుగా ఒక ఆలయమున శ్రీ ధర్మశాస్తావారిని ప్రతిష్టచేయ వలయునను అభిలాష శ్రీ పరశురాములవారి మనస్సులో కల్గినది. అందులకు అనువైన స్థలమును అన్వేషిస్తూ పలుతపోవనములను పరిశీలించిన భార్గవరాముడు చివర నిలక్కల్ ప్రాంతమునకు వచ్చెను. నిలక్కల్ అనబడు ఆ సుందర వన ప్రదేశము యొక్క ప్రకృతి సొందర్యములను అచ్చటకానవచ్చిన శివశక్తి ప్రభావము యొక్క మహిమలను గ్రహించిన ఋషి తాను ఇంతకాలము వెదుకుచుండిన స్థలమిదియే అని నిశ్చయించి,తన యాత్రను ముగించుకొని అచ్చటనే నెలకొని పోయెను. ఆ దినము మొదలు
వారి యాత్రాగూడా నిలచిననందున ఆ స్థలమునకు పరశురాముని యాత్రా నెల కొనిన స్థలము (నిలక్కల్) అను సార్థకనామము ఏర్పడినదని అందురు.

శ్రీ భార్గవరాముడు నిలక్కల్ నందే నివసించి పరమేశ్వరుని తలచి ప్రార్థించెను. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమైన భార్గవరాముని ప్రార్థనను వినిన పరమేశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమై పరశురాముని హృదయాంతర్గత
అభిలాషను గ్రహించి కలియుగవరదుడైన శ్రీ ధర్మశాస్తావారిని పంబానదికి ఆవలివైపు నందుగల శబరిమలపై ప్రతిష్టించుటకు అనుజ్ఞయొసగి అదృశ్యమయ్యెను. వెంటనే శ్రీ పరశురాములవారు ఆ ఆలయము ప్రతిష్టకు సన్నద్ధులై మొదట నిలక్కల్ నందు శ్రీ పార్వతి పరమేశ్వరులను ప్రతిష్టించి పూజాధికాలు సలిపి , మ్రొక్కి అచ్చటి
తపోవనవాసులతో గూడి శబరిమలచేరి అచ్చట హరిహరసుతుడైన శ్రీ ధర్మశాస్తా వారి ప్రతిష్ట సలిపి నారనియు నిలక్కల్ గ్రామ వాస్తవ్యులగు నంబూద్రులను శబరిమల పూజాదికాలను నిర్వహించుటకు ఆదేశించినారనియు చెప్పబడుచున్నది.

తదుపరి కాలమునందలి నిలక్కల్ గ్రామము జనవాసము నిండిన స్థలములలో యొకటిగా వెలసెను. అచ్చటనుండి నంబూద్రులు (పూజారులు) తలైప్పారై,రాజాంప్పారై మొదలగు మార్గాన పంబానదిని దాటి వలియానవట్టం , పంబా సరస్తటం , నీలిమల , అప్పాచ్చిమేడు , శబరిపీఠం , శరంగుత్తి మార్గముగా శబరిమల సన్నిధానము
చేరి శ్రీ ధర్మశాస్తా అగు అయ్యప్ప స్వామికి పూజా కైంకర్యములు చేసేవారట. పాండ్యదేశము నుండి కుమిళి మార్గాన కేరళలో ప్రవేశించుటకు ఒక అడవి మార్గము ఆ కాలమున ఈ దారిలోనికి వచ్చిచేరును. మధురలోను కేరళలోను కొల్లగొట్టుచు ఇంజిప్పార , కరిమల మున్నగు వనాంతర్భాగముల యందు దుర్గాదిపతులై ఏలుచుండిన బందిపోట్లకు శబరిమల , నిలక్కల్ యాత్రీకులచే పలు అవాంతరములు ఏర్పడుచుండెను. కావున శబరిమల , నిలక్కల్ మున్నగు క్షేత్రములు లేకుండా పడగొట్టి వేయవలయునను దుస్తలంపుతో ఆ రెండు క్షేత్రములను ఆ దుర్మార్గులు కొల్లగొట్టిరి. ఆ కాలపు వేదవేదాంత తాంత్రపూజారులు గూడా , ఆత్మరక్షణ కొరకై సకల యుద్ధపరిపాటుల యందును , ప్రావీణ్యత చెందిన వారై యుండినందు వలన బందిపోట్లు పలు పర్యాయములు ఓడిపోయినను పిదప ఎక్కువ సంఖ్యలో బందిపోటు దొంగలు ఒకటిగా చేరి ఆ ఇరుస్థలములపై మెరుపుదాడి చేసి , ఆ స్థలమును పూర్తిగా కొల్లగొట్టుకొని అచటి వార్లను చంపి జనసంచారమునకు యోగ్యతలేని స్థలముగా జేసిరి. దానితో ఆ రెండు దేవాలయములందు పూజాధికములు లేక దట్టమైన అడవిగా మారినది. పిదప 1957న నిలక్కల్ శివక్షేత్రము
ట్రివేంకూర్ దేవస్వం బోర్డు వారిచే స్వీకరింపబడి , పునరుద్ధరింపబడి , పూజాధికములు ప్రారంభమైనది కానీ దానికి సమీపము నందుగల *'పల్లియరక్కావు'* క్షేత్రము ఇంకను పునరుద్ధరింపబడక అటులనే కన్పించుచున్నది.

ఈ క్షేత్ర పునఃనిర్మాణమునకు కావలసిన స్థలము కేటాయించకపోవడమే ఇందులకు కారణమని చెప్పుచున్నారు. అలనాటి శబరిమల పూజారియగు
శాంతిక్కార్ నిలక్కల్ నందే నివసించే వారు. బందిపోట్లు శబరిమలను , నిలక్కలను ధ్వంసము చేసినారట. ఆ దృశ్యమును కనులారాగాంచిన పూజారి కుమారుడు అచ్చటనుండి తప్పించుకొని పారిపోయి పొన్నంబలము చేరి కఠిన తపము గైకొనెననియు , ఆ బ్రాహ్మణ యువకుని తపమునకు మెచ్చిన శ్రీ అయ్యప్పస్వామివారు అతనికి దర్శనమొసంగి అనుగ్రహించి ఆదుకొన్నారట. శ్రీ ధర్మశాస్తావారి ఆజ్ఞానుసారము ప్రవర్తించిన ఆ బ్రాహ్మణ యువకుడు మిక్కిలి చాకచక్యముతో బందిపోట్ల నివాసమగు కరిమల కోటచేరి అచ్చట బందిగానున్న పందళ *రాకుమారిని* విడిపించి పొన్నంబలమునకు కొనివచ్చి ఆమెను వివాహమాడెను. వారికి సాక్షాత్ శ్రీధర్మశాస్తావారే పుత్రుడై జన్మించినారనియు , ఆ పుత్రుడే శ్రీ అయ్యప్ప అనియు , తల్లిదండ్రుల వద్దనుండి సకల యుద్ధనేర్పరి తనములు నేర్చుకొన్న స్వామి వారు
భువిలో నివసించిన 12 సంవత్సరముల నందే అధర్మమును తొలగించి ధర్మమును శాసించి , వికసింపజేసి , శత్రునిగ్రహముజేసి , శబరిమల ఆలయము పునరుద్ధరణజేసి ,
విగ్రహప్రతిష్టచేయించి , సత్యమును లోకులకు తెలియజెప్పినారనువంటి పలుగాధలు వివరించుచున్నందున వాటిని గూర్చి తదుపరి పరిశీలించెదము.

🙏🌺ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌺🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat