శ్రీ రాఘవేంద్ర కల్పవృక్షము 1 వ భాగము

P Madhav Kumar


రచయిత: శ్రీ  మట్టుపల్లి  శివసుబ్బరాయ

గుప్త గారు 


వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్రాంచితం

నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా 

హస్తాబ్జైరసి ఖేటపుస్తకసుధా కుంభాం కుశాద్రీన్ హలం

ఖట్వాఙ్గం మణిభూరుహం చ దధతం సర్వారి గర్వాపహం॥

(పరాశర సంహిత)


వానర నృసింహ గరుడ సూకర అశ్వముఖములు కలవాడు, అనేక అలంకార ములు కలవాడు, కాంతిచే దేదీప్యమానముగ ప్రకాశించుచున్నవాడు, ప్రతిముఖమునందు మూడు నేత్రములు కలవాడు, పద్మములవంటి కరములందు భేటము (డాలు)ను, పుస్తకమును, అమృతకలశమును, అంకుశమును, పర్వతమును, నాగలిని, ఖట్వాంగమును (మంచపుకోడు)ను, మణిని, వృక్షమును ధరించినవాడును, వైరులందరి గర్వమును హరించిన వాడునునగు హనుమంతునకు నమస్కరించుచున్నాను


శ్లో॥ హనుమంతం చ భీమం చ పవనం చ పునః పునః

నతోస్మ్యహం పునర్మధ్వం మధ్వో మాం పాతు సర్వదా॥


హనుమంతునికి, భీముని కి, వాయుదేవునికి  మాటిమాటికి నమస్కరిం చుచున్నాను. మరల మధ్వాచార్యునికి  నమస్క రించుచున్నాను. మధ్వా చార్యులు నన్ను ఎల్లప్పుడు కాపాడుగాక. 


శ్లో॥ పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ |

భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ॥


పూజింపదగినవాడును, సత్యధర్మములయందు  ఆసక్తి గలవాడును, భక్తితో సేవించువారికి కల్పవృక్షము వంటి వాడును, ప్రపత్తితో నమస్కరించువారికి కామ ధేనువువంటి వాడును నగు శ్రీరాఘవేంద్రస్వామికి నమస్కారము.


శ్లో॥ ఓం శ్రీరాఘవేంద్రాయ నమః, ఇత్యష్టాక్షరమంత్రతః |

జపితాద్భావితాన్నిత్య మిష్టార్థాః స్యుః ర్న సంశయః


'ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః' అను ఈ అష్టాక్షరీ మంత్రమును నిత్యము జపము సేయువారికి సర్వాభీష్టములు సిద్ధిం చును. ధ్యానము చేయు వారికి సంశయములు నశించి యెల్లప్పుడు కోరిన కోర్కెలు సిద్ధించును. ఇందు సంశయము లేదు.


దివినుండి భువికి:


ఈజగమునకు ఆది దేవుడు, అఖిల దేవతలకు విభుడు, త్రిలోకములకు పరమ గురుడు, శ్రీహరి దివ్యపాదారవింద భక్తి రహస్యోపదేష్టయు  నైన విధాత కల్పారంభములో తన జన్మస్థానమైన పద్మమునకు మూలమేదో తెలిసికొనుటకు అనేకదివ్య వర్షములు ప్రళయజలము లలో వెదకి వెదకి మొదలు గానలేక విసిగివేసారి పద్మమునకు తిరిగి చేరి మనస్సులో సృష్టిచేయవలె నను  వాంఛ ఉదయించి నను సృష్టినిర్మాణ జ్ఞానమును పొందజాలక మాయామోహితుడై చింతాక్రాంతుడై యుండెను.


ఒకదినము సరోజభవుడు పద్మంబున నుండి చింతించు చుండగా ప్రళయ జలముల నుండి వ్యంజనములలో పదు నాఱవ అక్షరమైన 'త', ఇఱువదియొకటవ అక్షరమైన 'ప' అనువానితో గూడిన తప యనుపదము రెండు పర్యాయములు విని పించెను. ఆశబ్దమును పల్కిన పురుషుని దర్శింపవలెనని బ్రహ్మ నాల్గు దిక్కులందు వెదకెను. ఎచ్చోటను అతనిని గానక మఱలివచ్చి తన స్థానమైన పద్మమున ఆసీనుడై కొంతతడవు యోచించి ఆశబ్దము తనను తపస్సుజేయమని ఆదేశించెనని నిర్ణయించు కొని, ప్రాణాయామ పరాయణుడై, కర్మేంద్రియా దులను నిగ్రహించి ఏకాగ్ర మనస్కుడై సకలలోక సంతాపనాశ హేతువైన ఘోరతపము నాచరించు టకు సంసిద్ధుడయ్యెను.


అపుడు సరస్వతీ దేవి బ్రహ్మతో “బ్రహ్మ దేవా! క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ  స్వాహా” యను ఈ దివ్య మంత్రము నీ అభీష్టముల దీర్చునని బల్కెను. ఆది పురుషుని ఆదేశానుసార ముగ విధాత సహస్ర దివ్య వర్షములు శ్వేతద్వీప పతియు, గోలోకేశ్వరుడు నగు శ్రీకృష్ణుని గూర్చి ఘోరతపము ఆచరించెను.


బ్రహ్మదేవు డొనరించిన తపస్సున కత్యంత ప్రసన్నుడై భగవంతుడు  ఆయనకు సర్వశ్రేష్ఠము, సర్వోన్నతము,       జన్మ

మృత్యుజరాదుఃఖ రహితము, మోహభయ రహితము నైన తన దివ్యగోలోక పరంధామ మును చూపెను. ఆలోకము త్రిగుణా తీతము, కాలాతీతము, మాయారహితము, స్వయంప్రకాశకము, చింతామణి నిర్మితము. ఆ దివ్యలోకములో అనంత కింజల్క సహితమైన సహస్రదళ పద్మము మధ్యలో కర్ణికపై నధిష్ఠించి శబ్దబ్రహ్మమయమైన వేణునాద మొనరించుచు గోపికలు పరివేష్టించి యుండగా అనంతకోటి సూర్యప్రభకంటే మిన్నగ ప్రకాశించుచున్న చిదానందుడును, సనాతనుడును, సచ్చిదానంద విగ్రహుడును నైన శ్రీకృష్ణ పరమాత్మను బ్రహ్మ తన కన్నుల కఱవుదీర దర్శించి చరితార్థుడయ్యెను.


ఆ సచ్చిదానంద విగ్రహుని దివ్య వేణునాదము నుండి సకల వేదజననియైన గాయత్రి ప్రాదుర్భవించి జగన్నాథుని సంకల్పముచే బ్రహ్మ దేవుని అష్టకర్ణముల ద్వారమున చతుర్ముఖము లలో ప్రవేశించెను. ఇట్లు ఆదిగురుడైన శ్రీకృష్ణ పరమాత్మనుండి గాయత్రీ మంత్రోపదేశమును పొంది సంస్కృతుడై జలజ భవుడు ద్విజుడైనాడు, భగవంతుని సంకల్ప మాత్రముననే బ్రహ్మ సకల వేదశాస్త్ర పారంగతుడై దివ్య జ్ఞానసంపన్నుడై, తత్త్వసాగరుడై ప్రకాశింప నారంభించెను. 


అపుడు     బ్రహ్మదేవుడు 

తన శరీరమంతయు పులకింపగా అనన్య  భక్తి పారవశ్యమున కంఠము కంపింపగా, నేత్రముల నుండి ఆనందాశ్రువులు ప్రవహించుచుండగా వినీతుడై సనాతనుడైన పురుషోత్తముని “గోవిందా, ఆదిపురుషా, ఆది మధ్యాంత రహితా, సచ్చిదానందవిగ్రహా, సకల కారణకారణా, అరవింద దళాయతాక్షా, దివ్య వేణుగాన వినోదీ, గోపీజన వల్లభా, ఆశ్రితభక్తరక్షకా, పాహి, పాహి” యనుచు అనేక విధములు స్తుతించెను.


బ్రహ్మదేవుని స్తోత్రమునకు సంతుష్టుడై ప్రభువైన శ్రీకృష్ణ భగవానుడు శ్వేత ద్వీపాధీశ్వరుడైన మహా విష్ణువుగ అసంఖ్య పార్షద పరివేష్టితుడై బ్రహ్మ సమక్షమున ఆవిర్భవించి యిట్లుపల్కెను ‘వత్సా! నళినసంభవా! నీ హృదయములో సకల వేదజ్ఞానము ఉదయించి నది. నీవు సృష్టి చేయ వలెననెడి సంకల్పముచే నా ఆదేశానుసారముగ నన్ను గూర్చి చిర కాలము ఘోరతపమాచరించి నాయనుగ్రహమునకు పాత్రుడవైతివి. కుమారా! నీకు శుభమగుగాక. నీ యభీష్టముల నర్ధింపుము, ప్రసాదించెదను.


నేను దేనినైనను ఈయగల వాడను. బ్రహ్మదేవా! జీవుల సకల శ్రేయ స్సాధనములకు పర్యవసానము లేదా ప్రతి ఫలము నా దివ్య సందర్శనమే. పాప రహితుడా! తపమే నాహృదయము, నేనే స్వయముగ తపమునకు  ఆత్మను. తపోశక్తిచే నేనీ సకల జగన్నిర్మాణ కార్య మొనరించు చున్నాను; తపశ్శక్తిచే విశ్వములను ధరించి పోషించు చున్నాను, తపశ్శక్తిచే సకల విశ్వములను నాలో లీనమొనరించు కొను చున్నాను. తపస్సు దుర్లంఘ్యమైన మహాశక్తి.


పరబ్రహ్మ మగువిష్ణువు పల్కిన మధురాతి మధురములైన అనుగ్రహ వాక్యముల నాలకించి బ్రహ్మ పరమానంద భరితుడై భగవంతునిట్లు ప్రార్థించెను. దేవాదిదేవా! నీవు సకల ప్రాణుల హృదయాంతరంగములలో సాక్షిరూపుడవై యుండెడు పరమాత్మవు, సర్వజ్ఞుడవు, సకలశక్తి  సమన్వితుడవు, సకలవిశ్వములకు బీజస్వరూపుడవు, నాహృదయాంత రంగము నీకు విదితమే. ప్రభూ! నీ దివ్యతత్వ జ్ఞానమును నాకు ప్రసాదింపుము. నీ సచ్చిదానంద విగ్రహ సందర్శన సేవాసౌభాగ్య ము నొసంగుము. పరమాత్మా! నీవు మాయాధీశుడవు. నీ సంకల్ప మెన్నడును వ్యర్థము కాజాలదు. గోవిందా! నీవు మాయాద్వారమున వివిధశక్తి సంపన్నములైన అసంఖ్యాక విశ్వములను సృజించి, ధరించి, పాలించి, సంహార మొనరించుచు అనేక రూపముల ప్రాదుర్భవించి దివ్యక్రీడల నొనరించు చున్నావు. నీదివ్యస్వరూప జ్ఞానమును నాకు ప్రసాదించి నన్ను కరు ణింపుము. "దేనిని తెలిసి కొన్న తెలియనిది మఱియొకటి యుండదో, అట్టి మహాజ్ఞానమును నాకుపదేశించి నన్ను రక్షింపుము. నిష్కామినై నాకర్తవ్యమును పరిపాలింపగల శక్తిని నాకు ప్రసాదింపుము”.


బ్రహ్మదేవుడర్థించిన వరముల నాలకించి శ్రీహరి యత్యంత ప్రసన్నుడై మహాజ్ఞానము నిట్లు ఉపదేశింప నారంభించెను. “కుమారా ! అనుభవము, ప్రేమభక్తి, విజ్ఞాన సమన్వితము, అత్యంత గుణ్యమునైన నాస్వరూప జ్ఞానమును, నా ప్రేమభక్తి కరమగు సాధన భక్తిని ఉపదేశించెదను అవధరిం పుము. నేనెంతటి వాడనో, యెట్టి లక్షణములు గలవాడనో, నారూపము లెన్నియో,  నీకావిషయ ముల యథార్ధ జ్ఞానము నాకరుణవలన పరిపూర్ణముగ లభింప గలదు. సృష్టికి పూర్వము నే నొక్కడనేయుంటిని. నాకంటె వేఱుగ స్థూలముగాని, సూక్ష్మము గాని, వీని రెండింటికి కారణమగుప్రధానము (అజ్ఞానము) గాని లేదు.


ఎచ్చోట ఈసృష్టి లేదో అచ్చోటగూడ నేనే యున్నాను. దృశ్యములైన యీ సమస్త చరాచర పదార్థములన్నియు    నేనే

యని తెలిసికొనుము. అనంతకోటి విశ్వముల లోపల, బయట నేను గానిది ఏదియు లేదు. అన్నియు నేనే, అంతయు నేనే, శేషించువాడనుకూడ నేనే. వాస్తవముగ లేనప్పటికిని అనిర్వచ నీయమగు ఏవస్తువు నాకంటే భిన్నముగ పరమాత్మనైన నాలో ఇఱువురు చంద్రులవలె అనగా మిథ్యగ గోచర   మగుచున్నను ఆకాశము నందలి నక్షత్రములలో రాహువువలే ఆవస్తువు వెల్లడికాదు. దానినే నా మాయగా దెలిసికొనుము. ఎట్లు పృథివ్యాది  పంచభూతములు పంచ భూత నిర్మితములైన దేవతిర్యగాది దేహము లందు నిర్మాణానంతరము ప్రవేశించియు నిర్మాణము నకు ముందునుండి అచ్చోటనే యున్నందున ప్రవేశింపనట్లు ఉండునో, అట్లే నేను భూతమయ ములగు సకలజగములలో సర్వభూతములందు ఆత్మరూపమున విరాజిల్లి యున్నవాడనైనను యథార్ధముగ నేనుదక్క మఱియొకటి లేని కారణ మున వానిలో ప్రవేశింపక యున్నాను. ఇది బ్రహ్మము కాదు, ఇది బ్రహ్మము కాదనెడి  నిషేధ పద్ధతి ద్వారమున, ఇదిబ్రహ్మము, ఇది బ్రహ్మముననెడి అన్వయపద్ధతి ద్వారమున సర్వాతీతుడను, సర్వ స్వరూపుడను, భగవంతు డనునైన నేనే సర్వదా సర్వత్ర విరాజిల్లి యున్నా నని తెలిసికొనుటయే సత్యతత్వము. ఆత్మను పరమాత్మను దెలిసికొన దలచినవారు ఈవిషయ మును మొదట తెలిసికొన వలెను.


జగన్నిర్మాణమునకు సంకల్పించి భగవానుడ నగు నేను స్వయముగ రెండు రూపములుగ ప్రకటితుడ నైతిని. ఒకరూపము నేను శ్రీకృష్ణుడను, రెండవ రూపము శ్రీరాధ, ఆమె పరబ్రహ్మ స్వరూపిణి, నిత్య సనాతని, ఆమె ఐదు రూపముల ప్రాదుర్భవించినది. 1.శివస్వరూపిణి, నారాయణి, సంపూర్ణ బ్రహ్మస్వరూపిణి, దుర్గ. 2. శుద్ధసత్త్వస్వరూపిణి శ్రీ హరిశక్తి సర్వసంపదలకు నధిష్ఠాత్రి దేవి యైన శ్రీ మహాలక్ష్మి. 3. బుద్ధికి, వాణికి,  జ్ఞానమునకు నధిష్ఠాత్రీదేవి యైన సరస్వతి. 4 బ్రహ్మ తేజ సంపన్న, శుద్ధసత్వమయి, బ్రహ్మకు పరమప్రియ శక్తియైన సావిత్రి    అనగా గాయత్రి. 5. శ్రీకృష్ణ భగవానుని హృదయేశ్వరి, సంపూర్ణ దేవతలయందు అగ్రగణ్య, సర్వలక్షణ విలక్షణ, అనుపమేయ, అతులిత సౌందర్యరాశి, సద్గుణ సమూహసంపన్న, మధురభక్తి సమన్విత, చిన్మయస్వరూపిణి యైన శ్రీరాధ.


క్షీరమునకు ధవళత్వము, అగ్నియందు దాహకశక్తి, పృథ్వి యందు గంధము, జలములందు శీతలత్వ ము నుండునట్లు ఈ ఆద్యప్రకృతి నాయందు  మిళితమైయున్నది. పురుష ప్రకృతులమైన మాయందు భేదములేదు. సృష్టియంతయు ఆద్య ప్రకృతిరూపమే. నేను మూలము, ఆమె రూపము. నేను లేని యామె నిర్జీవము. ఆమె లేని నేను అదృశ్యుడను. నేనెట్లు నిత్యుడనో, పరాప్రకృతి యైన ఆమెయు నిత్యమే. సువర్ణము లేనిదే స్వర్ణకారుడు  ఆభరణ ములు నిర్మింప లేనట్లు ఈమె లేనిదే నేను సృష్టిచేయలేను. ఆమె సచ్చిదానంద శక్తి స్వరూపిణి, సత్తు, చిత్తు, ఆనందము ఆమె యొక్క మూడురూపములు. ఆనందము చిత్స్వరూప శక్తి, ఆమెయే ఆహ్లాదిని యగు రాధాదేవి. అంతరంగశక్తి, మూర్తి మతి యగు ఆహ్లాదినీశక్తి ఆనందస్వరూపుడనగు నాకు (శ్రీకృష్ణుపకు) అనిర్వచనీయము, మధురము, దివ్యమునగు అనుభూతిని కలిగించును. నా దివ్యానందానుభూతి ద్వారమున ఆమెకూడ అచింత్యదివ్యసుఖమును  ఆస్వాదించును. ఆమె యొక్క మఱియొకరూపమే మాయాశక్తి    అనగా బహిరంగశక్తి. సకల విశ్వములరూపము. మూడవది జీవశక్తి; అనగా తటస్థశక్తి- ఈసకలశక్తి స్వరూపిణియైన శ్రీరాధ శ్రీకృష్ణభగవానుని ఆత్మ. ఆమెయందు నిత్యము రమించు చుండుట చేతనే శ్రీకృష్ణుని ఆత్మారాము డందురు.


బ్రహ్మదేవా! నీవు అవిచలమైన తపస్సమాధి ద్వారమున నా యీ గుహ్య సిద్ధాంతమును పరిపూర్ణముగ దెలిసి కొనెదవుగాక! ఈజ్ఞానము చే ప్రతికల్పములోను వివిధసృష్టుల నొనరించు నీకు నేనే సృష్టికర్త నను  అహంకారము గలుగ జాలదు.


ఇట్లు మహా జ్ణానోపదేశ మొనరించి శ్రీహరి,  బ్రహ్మదేవా! నీవు నాభక్త  శిఖామణివి. కావున నీభక్త్యారాధన నిరాటంక ముగ సాగుటకు నీసేవలకై నాపార్షదుడైన శ్రీ శంఖు కర్ణుని    వినియోగించు చున్నాను. ఈపరమ భాగవతోత్తముని సాంగత్య ముచే నిరహంకారుడవై సృష్టికార్యముల నిర్వర్తింపు మని పల్కి శ్రీశంఖుకర్ణుని బ్రహ్మదేవుని సేవలందు వినియోగించి శ్రీహరి అంతర్హితుడయ్యెను.


శ్రీశంఖుకర్ణుడు సత్య లోకములో బ్రహ్మదేవునకు సేవ లొనరించుచు సతతము శ్రీహరి దివ్య నామ సంకీర్తనాతత్పరుడై హరి నామసుధా మాధుర్య మును గ్రోలుచు ఏబది సంవత్సరములు (బ్రహ్మ కాలమానప్రకారము) పూర్తి చేసెను. ఒక దినమున శ్రీకృష్ణనామ సుధాపాన మత్తుడై శ్రీశంఖుకర్ణుడు  బ్రహ్మ సేవలకు ఆలస్యము ను కల్పింపగా విధాత ఈ భాగవతోత్తముని యనన్య భక్తిప్రపత్తుల కత్యంత ప్రసన్నుడై ఈమహాను భావుని భవరోగపీడిత మానవ శ్రేయస్సునకై అవనిపైకి పంపవలెనని సంకల్పించి, తన సేవలకు లోప మొనరించినాడనెడి మిషతో దైత్యతనయుడవై వసుధపై జన్మింపవలసి నదిగా ఆదేశించెను.


శ్రీ గురు రాఘవేంద్ర

*****

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము

1 వ భాగము 

సమాప్తము **

💥💥💥💥💥💥


🙏 శ్రీ గురు రాఘవేంద్ర యే నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat