*శాస్త్రం నిర్దేశించిన సద్గురువు యొక్క లక్షణాలు - 1*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
శాస్త్రం సద్గురువును వర్ధిష్ణువైన లేదా మోక్షేచ్ఛ కలిగిన శిష్యుడెలా గుర్తించాలో ఇలా తెలియజేస్తున్నది.
*సిద్ధం సత్సంప్రదాయే స్థిరధియ మనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం సత్త్వస్థం సత్యవాచం సమయనియతయా సాధువృత్త్యా సమేతమ్ దంభాసూయాది ముక్తం జితవిషయ గణం దీర్ఘబంధుం దయాళుమ్ స్టాలిత్యేశాసితారం స్వపరహితపరం దేశికం భూష్ణురీప్సేత్ ॥*
1. సద్గురువుకు ఉండవలసిన మొదటి లక్షణాన్ని *'సిద్ధం’* అనే పదం తెలియజేస్తుంది. గురువు శిష్యుణ్ణి ఉద్ధరించడానికి ముందు తాను మంత్ర సాక్షాత్కార సిద్ధిని పొందిన సిద్ధపురుషుడై ఉండాలి. తాను తరించినవాడైతేనే ఇతరులను తరింపచేయ గలుగుతాడు. ఈ విషయాన్ని శ్రీరామకృష్ణ పరమహంస భవసాగరంలో కొట్టుమిట్టాడే జీవులకు సద్గురువు ఒక అచ్చిద్రమైన తెప్పలాంటివాడు. అలాంటి సద్గురువు నాశ్రయిస్తే ఆవలి ఒడ్డు చేరగలం. కాకుండా రంధ్రమున్న తెప్పలాంటి సిద్ధుడు కాని గురువు నాశ్రయిస్తే అతనితో పాటుగా నీవు కూడా మునగడం తథ్యమని హెచ్చరిస్తారు పరమహంస , కావున ఆచార్యుడు సిద్ధపురుషుడౌనా కాదా ? అనే విషయాన్ని ముందుగా గుర్తించాలి. ఈ విషయాన్ని నిర్ధారించడానికి మిగిలిన లక్షణములు ఉప లక్షణములుగా ఇలా చెప్పబడినాయి. వానిలో మొదటిది 'సత్సంప్రదాయే' (సిద్ధం) అనే పదం. గురువు మంత్రము , విద్య , జ్ఞానమును ఉపదేశించే ముందు మన గురుపరంపర ఇది అని తన గురువు పరమగురువు) ఆ గురువుగారి గురువు (పరమేష్ఠి గురువు) కూటస్థ గురువు వరకు గురు పరంపరను తెలియజేస్తాడు. ఈ సంప్రదాయాన్ని బట్టి అనగా వారికి గల ప్రసిద్ధిని బట్టి , తాను మున్నెఱిగిన సిద్ధ పురుషులీ సంప్రదాయంలో నుండే తరించేరా లేదా అనే విషయాలను శిష్యుడు బేరీజు వేసుకోగలుగుతాడు (ఇలా తెలిసికొనే అవకాశం వుంది)
*స్థిరధియం:* గురువు మాట్లాడే తీరును బట్టి అతడిచ్చే భరోసాను బట్టి ఆయన బుద్ధిలోని సుస్థిరతను గ్రహించాలి. స్థిరబుద్ధి గల ఆచార్యుడే చలచిత్తుడైన శిష్యునికి అచలదీక్ష నిచ్చి ఉద్దరిస్తాడు.
*అనఘం:* అనఘం అనునది తరువాతి లక్షణం. అఘమనగా పాపమని అర్ధము. అనఘుడు అనగా పాపబుద్ధి లేదా పాపపుటాలోచనలు లేనివాడు అని అర్ధము. సిద్ధుడైనా , సత్సంప్రదాయంలోనివాడే అయినా , నిశ్చయాత్మకమైన స్థిర బుద్ధి కలవాడైనా కామ ప్రలోభములకు లోనై పాపచింతన పరుడైతే ఆయన నాశ్రయించి లాభం లేదు. అందుకని అనఘడు పాపచింతన లేనివాడుగా ఆచార్యుని నిర్ధారించుకోవాలి. శుశ్రూష సమయంలో ఆయనలో పాపబుద్ధిని గ్రహించగలిగితే వెంటనే ఆయనను విడిచిపెట్టవచ్చు. ఈ విషయాన్ని కులార్ణవ తంత్రం
*మధులుబో యథాభృంగః పుష్పాత్ పుష్పాంతరం ప్రజేత్ || జ్ఞానలుబో తథాశిష్యః గురోః గుర్వంతరం ప్రజేత్ ॥*
తనకు ఈ గురువు నాశ్రయించడం వల్ల జ్ఞానం లభించలేదనే స్థిరనిశ్చయం కలిగినట్లయితే మధువు కోసం మధుపము తానున్న పూవ్వును విడిచి మరొక పూవ్వునకెగసిపోయినట్లుగా శిష్యుడు కూడా తన గురువును వీడి వేరోక సద్గురువునాశ్రయించవచ్చునని భావం. 'శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ'నే పదాలకర్థాన్ని ముందే చెప్పుకున్నాం
*సత్త్వస్థం :* శుద్ధసత్త్వ గుణసంపన్నుడై ఉండాలి ఆచార్యుడు. తనకు ఎవరెంతటి అపచారము చేసినా , సహనమును ప్రదర్శిస్తూ మనసా వాచా కర్మణా ఇతరులకు అపకారలేశము కూడా తలపెట్టని సద్గుణము సత్వగుణము. నిత్యము యీ విధమైన సత్వగుణ నిష్ఠుడై ఉంటాడు సద్గురువు.
*సత్యవాచమ్ :* సర్వకాల సర్వావస్థల యందు నిర్భయముగా సత్యమును పలికే సత్యనిష్ఠ కలిగి ఉండేవాడు. నిత్య సత్య నిష్ఠ వల్ల వాక్శుద్ధి సిద్ధిస్తుంది. అట్టి వాక్శుద్ధి గల ఆచార్యుడిచ్చిన మంత్రం వేగంగా సిద్ధిస్తుంది. అతని దీవెనలు ఫలిస్తాయి. శిష్యులు తరిస్తారు.
*సమయ నియతయా సాధువృత్త్యా సమేతమ్ :* వ్రతా చరణము , యమనియమాద్యనుష్ఠానములకు సమయపాలన ముఖ్యం. సంధ్యావందనాదులన్నీ సకాలంలోనే నిర్వర్తించాలి. సమయానికి శాస్త్రం ఎంతటి ప్రాధాన్యాన్నిచ్చిందంటే
*శుచిర్వాప్యశుచిర్వాపి కాలేసంధ్యా విధీయతే:* నీవు శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా స్నానానికి నీళ్ళు లభించకపోయినా అవకాశం లేకపోయినా సరే సంధ్యావందనం నిర్వర్తించవలసినదే. మహాప్రస్థానంలో నీళ్ళు లభించకుంటే ఇసుకతోనే అర్ఘ్యములిచ్చి సంధ్యావందనం చేశారు పాండవులు అని చెబుతారు. సమయ పాలనము , సాధుప్రవృత్తి అనగా శత్రువునకు కూడా కీడును తలబెట్టని స్వభావము కలిగి ఉండుట కూడా సద్గురువుకు వుండవలసిన ప్రధాన లక్షణములలో ఒకటి.
*దంభాసూయాది ముక్తం:* దంభమనగా మిథ్యాచార వేషభాషలు దాల్చుట. బ్రహ్మనిష్ఠ లేకుండగనే బ్రహ్మోపదేశము చేయుటకై కేవల సత్కార సమ్మానములకై కాషాయమును ధరించడం , విలక్షణమైన వేషధారణ , చమత్కార సంభాషణములతో ప్రవచనములు చేసి జనులనాకర్షించుట ఇవన్నీ దంభాచారములు. ఇవి అహంకారమును తద్వారా కామక్రోధాదులను మమకారమును తద్వారా లోభమోహములను కలిగిస్తాయి.
*అసూయ :* అనగా గుణేషు దోషావిష్కరణమని శాస్త్రం నిర్వచించింది. ఎదుటివానిలోని సద్గుణ సంపదను శ్లాఘించలేక పోవడమే కాకుండా అతని అభివృద్ధిని సహించలేక వారి గుణములను దోషములుగా వర్ణిస్తూ తన వాగ్జాలముచే వారిని దూషిస్తూ సంతోషించే స్వభావాన్ని అసూయ అంటారు. ఆచార్యునికి ఇది లేశం కూడా ఉండకూడదు. ఉంటే దీనివల్ల మాత్సర్యవిద్వేషాలు పెరిగి అతడూ అతని అనుయాయులు కూడా నశిస్తారు.
*జిత విషయ గుణం -* కీర్తి ప్రతిష్ఠలను పాడుచేయడానికి ప్రత్యర్థులు కాంతా కనకాభరణాదులను ధన సంపదలను ఎరచూపి పతితులను చేయ ప్రయత్నించవచ్చు. లేదా తానే వాటికాకర్షితుడై భ్రష్టుడు కావచ్చు. కావున విషయ వాసనలైనా కామినీ కాంచనాదుల వ్యామోహాన్ని గురునిష్ఠలో నున్నవాడు కలుగకుండా జాగ్రత్త వహించాలి. కలిగినా మరుక్షణమే వాటితో తెగతెంపులు చేసుకుని బయటపడాలి. అలా వాని వ్యామోహంలో పడినట్లు గమనిస్తే ఆ ఆచార్యుణ్ణి నిర్భయంగా శిష్యుడు విడిచిపెట్టాలి.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌺🙏