*శాస్త్రం నిర్దేశించిన సద్గురువు యొక్క లక్షణాలు - 2*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*దీర్ఘబంధుం - దయాళుమ్ :* సద్గురువు సదా తన శిష్యులపట్ల - దీనజనోద్ధరణ విషయంలోను అవ్యాజమైన దయను ప్రదర్శిస్తాడు. అవ్యాజమైన దయ అనగా ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా ఎదుటివారి నుండి ఏ విధమైన ప్రత్యుపకారమును కోరకుండా తన వంతు కర్తవ్యముగా యావచ్చక్తి సహాయమునందించి శిష్యులను , దీనులను ఉద్దరించే స్వభావం సద్గురువులకు ఉంటుంది. అంతేకాదు దీనజనోద్ధరణ బాంధవ్యము , శిష్య జనోద్ధరణములను సద్గురువులు జన్మాంతరములందు , దేశాంతరములందు , కాలాంతరాల్లో కూడా సుదీర్ఘమైన వాత్సల్యముతో కూడిన బాంధవ్యంగా కొనసాగిస్తూనే ఉంటారు శిష్యులను కటాక్షిస్తూనే ఉంటారు. సద్గురువులతోడి బాంధవ్య బంధము యొక్క గొప్పతనం ఇలా ఉంటుంది. ఈ విష యాన్ని వారిశిష్యపరంపర నుండి గ్రహించి సద్గురువు భౌతికంగా లభించకపోయినా అతని మూర్తిని లేదా పటమును అర్చించి లేదా ధ్యానము ద్వారానైనా సంభావించి వారి అనుగ్రహమును పొందవచ్చు. ఇది సద్గురువుల యొక్క మహా మహిమోపేతమైన ప్రధాన లక్షణము. నీవు ఎక్కడ నుండి స్వామి అని పిలచినా ఏమి ? అంటూ వచ్చి ఆదుకుంటారు సద్గురువులు. కాకుంటే వారిని శ్రద్ధతో ఆర్తితో ఆరాధించాలి. విధి వైపరీత్యములను సైతం శాసించి రక్షించే సామర్థ్యం సద్గురువుల కుంటుంది. *దైవే రుష్టే గురుతా* అని శాస్త్రం. విధి వైపరీత్యాల నుండి కూడా గురువు శిష్యుణ్ణి రక్షిస్తాడని భావం. ఇది వారి అపార కృపాళు త్వానికి నిదర్శనం.
*స్థాలిత్యేశాసితారమ్-:* స్థలనమనగా జారుట లేక పతనము చెందుట అని అర్థం. సాధన మార్గంలో ప్రయాణిస్తున్న శిష్యుడు భ్రమ ప్రమాదాల కారణంగా తడబడి కాలుజారి తప్పటడుగు వేసి పడిపోతూ ఉంటే తగురీతిలో వానిని శాసించి భ్రష్టుడు , పతితుడు కాకుండా రక్షిస్తాడు సద్గురువు. ఆ సామర్ధ్యము కలవాడు లోకంలో గురు దేవుడొక్కడే !
*స్వపర హితపరమ్:* క్షణికానందమును కలిగించేదాన్ని ప్రియ మైనదనిశాశ్వతానందాన్నిచ్చేదాన్ని హితమైనదని వ్యవహరిస్తారు. స్వపర శబ్దాలకు తనవారు , పరాయివారు అనే అర్థాలను సాధారణంగా చెప్పు కుంటున్నాం. కానీ మంత్రశాస్త్రంలోను వేదాన్త శాస్త్రంలోను స్వ శబ్దానికి ఆత్మ అనిన , పర శబ్దానికి ఆత్మ మినహా ఇతరములైన (ఆత్మేతర) పదార్థములన్న అర్థాన్ని గ్రహించాలి. ఇది ఆ శాస్త్రాల పరిభాష. కాగా స్వవరహిత పరుడు అంటే శాశ్వతంగా ఆత్మజ్ఞానాన్ని జగద్వి జ్ఞానాన్ని తెలియజేయడంలో సదా నిమగ్నమై యుండేవాడని భావం. ఈ విధమైన యెఱుక కేవలం సద్గురువు మాత్రమే కలిగించ గలడు. ఇదే అసలైన గురుశబ్దార్థం. లోని కన్నును అనగా జ్ఞాననేత్రాన్ని తెరిపించేవాడు అనే అర్థంలో
*గు శబ్ద స్వంధకారః స్యాత్ రు శబ్దస్తన్నిరోధకః అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే*
అని గురుశబ్ద నిర్వచనము.
*అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః*
అనే ఈ సద్గురువందనము పైఅర్థాన్నే విశదీకరిస్తాయి. నీవు అనంతమైన శక్తికి అపారమైన విజ్ఞానమునకు నిధానమైన వాడవు. అంతయు నీలోనే ఉన్నది. బయటినుండి ఏదో సంప్రాప్తిస్తుందను కోవడం భ్రాంతి అనే యీ ఎఱుకను కలుగజేసేవాడు సద్గురువు అంటాడు వివేకానందస్వామి.
ఈ విధమైన జ్ఞాన విజ్ఞానములను రెండింటినీ ప్రసాదించి జ్ఞానము (ఎఱుక) ద్వారా మోక్షమును ప్రసాదించువాడు సద్గురువు అని సాధకుడు గ్రహించాలి. సంగ్రహంగా ఇదీ మన సంప్రదాయం నిర్వచించిన సద్గురు స్వరూపం. ఇంకా ఆచార్యుణ్ణి లేదా గురుమూర్తిని దేవునివలె ఉపాసించాలంటూ ఆయన కారణ గుణాలనిలా వివరిస్తుంది.
*అజ్ఞానధ్వాంతరోదాత్ అఘపరిహరణాత్ ఆత్మసామ్యావహత్వాత్ జన్మప్రధ్వంసి జన్మప్రదగరిమతయా దివ్యదృష్టి ప్రభావాత్ నిష్ప్రత్యూహాన్నృశంస్యాన్నియతరసతయా నిత్యశేషిత్వయోగాత్ ఆచార్యః సద్భిరప్రత్యుపకరణధియా దేవవత్స్యాదుపాస్యః ॥*
అజ్ఞానాంధకార మావరించకుండా నిరోధించడం వలన , పాపములను పరిహరించుట వలన , ప్రస్తుత జన్మకు గౌరవాన్ని కలుగజేస్తూ , మరల మరుజన్మ లేకుండా చేసి జీవన్ముక్తునిగా చేయుట వలన , కారుణ్యమూర్తియై సర్వవిఘ్నములను పరిహరిస్తూ , నిత్యశేషిత్వ యోగాన్ని కలిగించడం వల్ల , ఇంతగా శిష్యులను ఉద్దరిస్తూ కూడా వారినుండి యే విధమైన ప్రతిఫలాపేక్ష లేకపోవడం కారణంగా కరుణాసముద్రుడైన సద్గురువును ప్రత్యక్ష దైవంగా సదా ఉపాసించాలని భావం.
ఇలా మన శాస్త్ర గ్రంథాలలో ముఖ్యంగా మంత్రశాస్త్ర తంత్రశాస్త్ర గ్రంథాలలో గురువును దైవంకన్నా మిన్నగా ఆరాధించాలనే నిర్దేశాలు కోకొల్లలుగా కానవస్తాయి. *దైవేరుప్టే గురుతా గురౌరుష్టే న కశ్చన* అంటే విధి వక్రించి దైవం కోపించినా సరే గురువు సంరక్షిస్తాడు. కానీ గురువే కోపిస్తే సాక్షాత్తు ఫాలాక్షుడు సైతం రక్షించలేడు. కావున శిష్యుడు సదా సేవాశుశ్రూషా తత్పరుడై గుర్వనుగ్రహానికి పాత్రుడుగా నడుచుకోవాలి. ఇలా సద్గురువు యొక్క మాహాత్యాన్ని వివరించుకుంటూపోతే అదే ఉద్గ్రంథమైపోతుంది. భూమినంతను కాగితంగా జేసి , సమస్త వృక్షజలములను కలములుగా జేసి , సప్తసముద్రములను సిరాగా చేసుకుని వ్రాసినా ఇవన్నీ సద్గురు గుణాలను వ్రాయడానికి సరిపోవంటాడు కబీరు.
*సబరతీ కాగర్కరూం...* అనే దోహాలో. సద్గురువు గురించి ఇంతగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే అయ్యప్ప సద్గురు అవతార స్వరూపం. అయ్యప్ప దీక్షలో గురువు , దైవము , శిష్యుడు , సర్వమూ ఒక్కటే. గురుశిష్యులు పరస్పరం స్వామి అనే సంబోధించుకుంటారు. అంతా స్వామిమయమే. కావున అయ్యప్ప దీక్ష లాంటి గొప్ప ఫలప్రదమైన మండల వ్రతదీక్ష మరొకటేదీ లేదు.
పైగా ఇది అందరకు అనుష్ఠింపదగినది. అందరినీ ఉద్ధరించేదీ అని తెలుపడానికే. కాగా , అయ్యప్ప ఆరాధన సద్గురువు యొక్క ఆరాధన. ఇది సద్యః ఫలితాన్ని సద్బుద్ధిని అనుగ్రహిస్తుందనే విషయం లక్షలాది భక్తజనావళికి అనుభవంలో నున్నదే. ప్రత్యేకంగా వ్రాయనవసరం లేదు.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌸🙏