శ్రీదేవీభాగవతము - 13

P Madhav Kumar


*ప్రథమ స్కంధము - 9*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః*

*లలితా సహస్రనామ శ్లోకం - 13*

*కనకాంగదకేయూర కమనీయభుజాన్వితా!*
*రత్నగ్రైవేయచింతాక లోలముక్తాఫలాన్వితా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

👉 *నిన్నటి భాగములో....*

వ్యాస మహర్షి..... శుకునితో..
నీ సందేహాల నివృత్తి కోసం..
మిథిలా నగరానికి వెళ్ళి, జనకమహారాజును కలవమని చెప్పగా.... శుకుడు బయలుదేరతాడు.

మోక్షం అంటే ఏమిటి,  భుక్తం అభుక్తం ఎలా అవుతుంది.  కృతం అకృతం ఎలా అవుతుంది.  ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి,  తల్లి . తండ్రి, భార్య-సోదరి-వేశ్య ఈ భేదాభేదాలు ఎలా నశిస్తాయి వీటినుంచి విడుమర (విముక్తి) ఎలాగ, రకరకాల రుచులూ, శీతోష్టాలూ,  సుఖదుఃఖాలూ,  వీటి పరిజ్ఞానం ఎలా కలుగుతోంది, ముక్తత్వలక్షణం ఏమిటి, రాజ్యవ్యవహారాలన్నీ చేస్తూ శత్రుమిత్ర భావాలకు అతీతంగా ఎలా ఉంటున్నాడు, ఒక దొంగనూ ఒక తాపసినీ సమానంగా ఎలా చూడగలుగుతున్నాడు, అసమబుద్ధి ఉంటే మరి ముక్తత్వం ఎలాగ – ఇవన్నీ తీర్చుకోవలసిన సందేహాలు. జీవన్ముక్తుణి నేనింతవరకూ కనీవినీ ఎరగను, సంసారంలో ఉండి ముక్తుడుగా గడపడం - ఇప్పటికీ నాకు అనుమానమే. కుతూహలం పెరుగుతోంది. కనీసం ఈ సందేహ నివృత్తికోసమైనా మిథిలకు వెడతాను.

*(అధ్యాయం - 6, శ్లోకాలు - 67)*
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡️

🙏 *శుకమహర్షి మిథిలాయాత్ర* 🙏

*శౌనకాది మహామునులారా!* ప్రయాణానికి నిశ్చయించుకొని శుకుడు తండ్రి పాదాలకు సాగిలపడ్డాడు. లేచి దోయిలించి నిలబడ్డాడు.

*మహానుభావా!* అనుమతించు. నీమాట నాకు శిరోధార్యం, జనకుడు పాలించే విదేహదేశాలకు వెడుతున్నాను. దండం లేకుండా (శిక్షలు) రాజ్యం ఎలా ఏలుతున్నాడో! దండనలు లేకుండా లోకులు ధర్మమార్గంలో ఎలా నడుస్తున్నారో! నా తల్లి గొడ్రాలు అన్నంత విచిత్రంగా ఉందని. ఈ వ్యవహారం. వెళ్ళి చూసిరావలసిందే! బయలుదేరుతున్నాను. అనుమతించు – అని అభ్యర్థించాడు.

ఆ నిస్పృహుణ్ణి ఆ జ్ఞానిని వ్యాసుడు గట్టిగా కౌగిలించుకున్నాడు.

*పుత్రకా!* బయలుదేరు. నీకు శుభమగుగాక! దీర్చాయుష్యమస్తు. కానీ నాకొక మాట ఇచ్చి మరీ బయలుదేరు. నువ్వు తిరిగి ఇక్కడికే నా ఆశ్రమానికే రావాలి. మరెక్కడికీ వెళ్ళకూడదు. నిన్ను చూస్తూ నేను సుఖంగా బతకాలి. నువ్వే నా పంచప్రాణాలూను. కనపడకపోతే బతకలేను సుమా. జనకుణ్జి దర్శించి సందేహాలన్నీ తీర్చుకుని సుఖంగా తిరిగివచ్చి అధ్యయన తత్పరుడవై, నా కళ్ళముందు హాయిగా కాలక్షేపం చెయ్యి.

శుకుడు మరోసారి పాదాభివందనం చేసి, ప్రదక్షిణం చేసి, విల్లు విడిచిన బాణంలా మిథిలవైపు దూసుకుపోయాడు. దేశాలను చూస్తూ, రకరకాల ధర్మాలనూ మనుషులనూ గమనిస్తూ, చెట్టూచేమా తిలకిస్తూ, తాపస-యాజక-యోగి-వానప్రస్థులను దర్శిస్తూ, అడవులు దాటి, నదులు దాటి, పుణ్య క్షేత్రాలను సేవించి, శైవ-పాశుపత-సౌర-శాక్త-వైష్ణవ సంప్రదాయాలను గుర్తించి రెండేళ్ళకు మేరువును దాటి, ఏడాదికి హిమాచలం దాటి మిథిలకు చేరుకున్నాడు.

అక్కడి ప్రజల జీవన విధానానికి ఆశ్చర్యపోయాడు. అందరూ ధనవంతులే. సదాచారసంపన్నులే. సుఖమయంగా ధార్మికంగా జీవనం సాగిస్తున్నారు. అలా సంచరిస్తూంటే ఒక నగర ద్వారం దగ్గర ద్వారపాలకుడు అటకాయించాడు. ఎవరు నువ్వు? నీకు పనేమిటి? - ప్రశ్నించాడు.

శుకుడు నివ్వెరపోయి నిలబడ్డాడు. స్థాణువులా నిలబడ్డాడు. విరగబడి నవ్వుతున్నాడే తప్ప పలుకూ ఉలుకూ లేదు. దౌవారికుడికి ఏమీ అర్థం కాలేదు.

విప్రుడా! చెప్పు. మాటాడవేం? మూగవాడివా? ఏ పనిమీద ఇటువచ్చావు? ఉలుకూ పలుకూ లేకపోతే పని జరగదు. రాజాజ్ఞలేకుండా ఈ నగరంలోకి పరులెవ్వరూ ప్రవేశించకూడదు. కులశీలాలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అసలు ప్రవేశం లేదు. నీ తేజస్సు చూస్తోంటే వేదవేత్తవుగా బ్రాహ్మణుడివిగా కనపడుతున్నావ్‌, నీ ఊరూ పేరూ భోగట్టా అంతా చెప్పి, ఏ పనిమీద వచ్చావో తెలిపి - అప్పుడు నీ ఇష్టం హాయిగా సంచరించు.

*దౌవారికా!* నేను వచ్చిన పని నీమాటలతోనే అయిపోయింది. మిథిలానగరం చూడటానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది. మూర్ఖుణ్ణి ఎంత మోహపడి వచ్చాను! రెండు పర్వతాలు దాటి వచ్చాను. మూడేళ్ళు నడిచీ నడిచీ వచ్చాను. నా కన్నతండ్రే నన్ను మోసగించాడు. ఎవరిని అనుకుని ఏమి లాభం? లేదా ఇదొక కర్మఫలం. అనుభవించాను.

సాధారణంగా ధనాశ ఉన్నవాళ్ళు ఇలా రాజదర్శనాలకోసం తిరుగుతారు. కానీ నాకు అలాంటి ఆశ ఏదీ లేదు. కేవలం భ్రమపడి వచ్చాను. ఆశలు లేనివాడికి అంతా సుఖమే. అయినా మోహసాగరంలో మునిగాను.

ఎక్కడి మేరువు, ఎక్కడి మిథిల? కాలినడకను వచ్చానా! ఇంతకీ ఫలితం ఏమిటి? హుఁ! విధివంచితుణ్ణి. ప్రారబ్ధం అనుభవించక తప్పుతుందా! మన ప్రయత్నాలన్నీ దాన్నిబట్టే సాగుతాయి.

*ప్రారబ్దం కిల భోక్తవ్యం శుభం వాష్యథవా౬శుభమ్‌ ॥*
*ఉద్యమస్తద్వశే నిత్యం కారయత్యేవ సర్వధా ॥*

మిథిల మిథిల అంటూ ఎగురుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక తీర్ధమా, ఒక వేదమా? విదేహుడు రాజు! పట్టణంలోకి ప్రవేశం లేదు!!

శుకుడు ఇలా తనలో తానే కొంచెంసేపు మాట్లాడేసుకుని విరమించాడు. ఆ మాటలు అన్నీ విన్న ద్వారపాలకుడికి విషయం అర్ధమయ్యింది. ఈయన ఎవరో బ్రాహ్మణోత్తముడనీ జ్ఞాని అనీ తెలుసుకున్నాడు. చేతులు జోడించాడు. సంభాషణకు దిగాడు.

*ద్విజోత్తమా!* క్షమించు. నిన్ను నివారించాను. అపరాధం మన్నించు. నీ ఇష్టం. వెళ్ళు. లోపలికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు. నీవంటి విముక్తులకు ఓర్చే కదా బలం! *(విముక్తానాం క్షమాబలమ్‌)*

*ద్వారపాలకా!* నువ్వు పరతంత్రుడివి. ఇందులో నీ తప్పు ఏముంది ? ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చెయ్యడమే కదా సేవకుల కర్తవ్యం. నిజానికి ఇందులో నీ ప్రభువు తప్పూ లేదు. వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలిగదా! తప్పంతా నాదే. నేను ఇక్కడికి రావడమే తప్పు. పరుల ఇళ్ళకు వెళ్ళడం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే.

*బ్రాహ్మణ సత్తమా!* నువ్వు మహాజ్ఞానిలాగా కనపడుతున్నావు. నేను ప్రతీహారిని. అజ్ఞానిని, ఈ లోకంలో ఏది సుఖం, ఏది దుఃఖం? ఏది శుభం, ఏది అశుభం? ఎవడు శత్రువు, ఎవడు మిత్రుడు? ఈ సందేహాలు నన్ను పట్టిపీడిన్తున్నాయి. దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళు.

*దౌవారికా!* లోకంలో రెండురకాల మనుషులు ఉంటారు. *రాగులూ విరాగులూ.* వారి మనః ప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి.

విరాగులలో మళ్ళీ మూడు రకాల వారుంటారు. పూర్తిగా తెలిసి విరక్తులైనవారూ, ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైనవారూ, అటూ ఇటూ ఊగిసలాటతో విరాగులయ్యేవారూను.

రక్తులు రెండు రకాలే. మూర్ఖులూ చతురులూను. ఈ చతురుల చాతుర్యం, *శాస్త్రజన్యమూ (మతి) బుద్ది జన్యమూ* అని రెండు విధాలుగా ఉంటుంది. వీరి మతి - *యుక్తమూ, అయుక్తమూ* అని రెండు రకాలు.

*విప్రవర్యా !* నువ్వేదో చెబుతున్నావు. నాకేమీ అర్ధం కావడంలేదు. కొంచెం విపులీకరించి అర్ధమయ్యేట్టు చెప్పు.

*ప్రతీహారీ!* సంసారంపట్ల ఎవడికి అనురక్తి ఉంటుందో అతడిని *రాగి* అంటారు. అతడికీ సుఖాలూ దుఃఖాలూ కూడా పలువిధాలు, ధనం సంపాదించగలిగితే భార్యాపుత్రులూ జయాలూ సమ్మానాలూ - ఇవన్నీ సుఖాలే. ఆ ధనమే సంపాదించలేకపోతే ఇవన్నీ దుఃఖాలే. ప్రతిక్షణమూ అశాంతి. అంచేత అతడికి సుఖసంపాదకమైన ధనార్దనమే కర్తవ్యం. అతని సుఖాలకు ఎవడు అడ్డువస్తే వాడల్లా అతడికి శత్రువే. ఎవడు సహకరిస్తే వాడల్లా మిత్రుడే. చతురుడైన రాగి ఎప్పుడూ దేనికీ మోహపడడు. మూర్ఖుడైన రాగి అన్నింటికీ మోహపడతాడు. అదీ తేడా.

ఇక విరక్తులున్నారే - వారికి ఏకాంతమే సుఖం. వేదాంత చింతన - ఆత్మానుచింతనలు వారికి కర్తవ్యాలు. సంసార ప్రసక్తి వారికి దుఃఖ హేతువు. కామక్రోధప్రమాదాదులు అనేకం శత్రువులు. సంతోషం ఒక్కటే వారికి మిత్రుడు.

ఈ సంభాషణతో ప్రతీహారి సంబరపడ్డాడు. శుకుణ్డి జ్ఞానిగా గుర్తించాడు. లోపలి కక్ష్యలోకి ప్రవేశపెట్టాడు. అది అతి విశాలంగా అతిమనోహరంగా ఉంది. నగర సౌందర్యం కనువిందు చేస్తోంది. రకరకాల విపణివీథులు (బజారులు). క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కోలాహలంగా ఉంది. ఎటుచూసినా జననమ్మర్దం. కొనేవాళ్ళూ, అమ్మేవాళ్ళూ. రాగద్వేషాలు, కామక్రోధలోభమోహాలు. వాదవివాదాలు. అంతా డబ్బూ, డబ్బూ. శుకుడు అన్నీ చూస్తూ నడిచి వెడుతున్నాడు.

మహాతేజస్వి, ఇతడు మరొక భాస్కరుడా అనుకుంటున్నారు చూసినవాళ్ళు. అలా వెళ్ళి వెళ్ళి రాజమందిరం చేరుకున్నాడు. అక్కడ మరో ద్వారపాలకుడు ఉన్నాడు. కర్రలా అడ్డుపడ్డాడు. శుకుడు ఠక్కున నిలిచిపోయాడు. మౌనంగా
తన ధ్యానంలో తానుండి అలా నిలబడ్డాడు. ఎండా నీడా రెండూ ఒకటే తనకి. స్థాణువులా నిలుచున్నాడు.

అంతలోకీ ఒక మంత్రిగారు వచ్చి శుకుడికి నమస్కరించాడు. సాదరంగా లోపలికి తీసుకువెళ్ళాడు. అది రెండవ కక్ష్య. పూలతోటలతో ప్రశాంతంగా ఉంది. నిలువునా పుష్పించిన ఒక దివ్య వృక్షం శుకుడి మనస్సును ఆనందింపజేసింది. అమాత్యులవారు అతిథి సత్క్రియలు జరిపారు. ఒక దివ్యభవనంలో విడిది చేయించారు. కామశాస్త్ర విశారదలైన వారవనితలను, ఆడి, పాడి అలరింపజెయ్యగల అందగత్తెలను - అతడి సేవకోసం నియమించి మంత్రిగారు సెలవుతీసుకున్నారు.

వారవనితలు భక్తి శ్రద్ధలతో శుకుడికి సమర్చనలు జరిపారు. దేశకాలోచితమైన తినుబండారాలను అందించారు. అంతఃపుర - ఉద్యానవనానికి తీసుకువెళ్ళారు. యువకుడు, అందగాడు, మృదుభాషి, తేజస్వి - శుకుణ్జి చూసి వారంతా కామమోహితలు అయ్యారు. కానీ, జితేంద్రియుడైన మునీశ్వరుడు గదా అని కేవలభక్తితో పరిచర్యలు మాత్రం చేశారు. అరణీగర్భ సంభూతుడైన శుకుడి మనస్సు నిశ్చలంగానే ఉంది. నిర్మలంగానే ఉంది. వారిపట్ల మాతృభావన చేశాడు. వారిలో కొందరు నిలువరించుకోలేక కామవికారాలను ప్రదర్శించినా అతడిలో ఏ కదలికా కలగలేదు. హర్షించనూ లేదు ధర్షించనూ లేదు. (కసురుకోవడం),

*ఆత్మారామో జితక్రోధో న హృష్యతి న తప్యతి ।*
*పశ్యంస్తాసాం వికారాంస్తు స్వస్థ ఏవ స తస్థివాన్‌ ॥*

ఆ భవనంలో అతడికోసం రమ్యమైన శయ్య ను ఏర్పాటు చేశారు. అది సర్వాలంకార శోభితం, విలువైన దుప్పటి పరిచారు. రకరకాల సౌఖ్యాలకు అనువైన అమరికలు దానికి ఉన్నాయి.

శుకుడు శుచియై జాగరూకుడై దర్భలు చేతితో పట్టుకుని సాయం సంధ్యను ఉపాసించాడు. ఒక జాముసేపు ధ్యానం చేసుకుని అటు పైని రెండుజాములు హాయిగా నిద్రపోయాడు. నాల్గవ జాములో లేచి కాసేపు ధ్యానంచేసి స్నానాదికం ముగించి ప్రాతఃస్సంధ్యను అర్చించి, సమాహితచిత్తంతో మళ్ళీ ధ్యానంలోకి జారిపోయాడు.

*(అద్యాయం - 77, శ్లోకాలు - 66)*

అప్పుడు మంత్రిపురోహిత సహితుడై జనకమహారాజు గురుపుత్రుణ్ణి దర్శించడంకోసం ఆ భవనానికి వచ్చాడు. అతిథిపూజలు జరిపి, ఒక పాడి అవును కానుకగా సమర్పించాడు. ఉభయకుశల ప్రసంగోపరి -

*(రేపు శుక - జనక సంవాదము)*

*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*

               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*

♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾

*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*

*భావము:* 💐

ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏

🙏🔱🙏🔱🙏🔱🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat