🔱 కుమారచరిత్ర-20 🔱

P Madhav Kumar


శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః

కుమార స్వామి - సుబ్రహ్మణ్య స్వామి గా పిలవబడుటకు కారణాలు


ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి వచ్చారు.ఆసమయమున పరమేశ్వరుడు ధ్యాన స్ధితిలో ఉన్నారు.అక్కడ వున్న కుమారస్వామి బ్రహ్మదేవుని చూచి నీవెవరివి అని అన్నాడు. 

అప్పుడు బ్రహ్మదేవుడు. అహం బ్రహ్మాస్మి అని సమాధాన మిచ్చారు.


వెంటనే కుమారస్వామి నవ్వుచూ  ఏమి ? బ్రహ్మ నిర్గుణము, రూపం లేదు.నీవు రూపంతో ఉన్నావు 

బ్రహ్మ అక్షరుడు కాని నీరూపము నశించును . 

బ్రహ్మ నిశ్ఛలము.నీవు చలించుచుంటివి. 

నీవా శబ్ధమునకు తగవని వాదించినాడు 

బ్రహ్మదేవుడు ఏమనుటకు శక్తి చాలక మౌనంగా వున్నారు

 

ఆ స్ధితిలో శంకరుడు బాహ్యదృష్టుడై “సుబ్రమణ్యం ՚ అని అన్నారు.బ్రహ్మదేవుడు తలలు వాల్చారు 

కుమారస్వామి తండ్రకి సాష్టంగ నమస్కారం చేసినాడు 

శూలి సుబ్రమణ్య పదము నీకు జగద్వాప్తి అగు గాక అని దీవించారు .

 

ఆ పరమేశ్వరుని దీవెన వలన సుబ్రమణ్య పేరు వచ్చింది. అని అగస్త్య మహర్షి తన శిష్యు డైన మాండవ్యు నకు చెప్పారు 

  

 

కుమార స్వామి - సర్ప రూపములో కొలవబడుటకు కారణములు


 

స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం లో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భం లో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది.

 

అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరి స్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది.


 వింధ్య పర్వతం అహంకారం తో విజృంభించి, ఆకాశం లోకి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్నిసైతం నిరోధించ సాగింది. ప్రకృతి స్థంభించింది.గ్రహ సంచారాలు నిలిచిపోయాయి. 

  

ఈ మహోపద్రవాన్నినివారించ గలిగేది అగస్త్యమహర్షి మాత్రమే నని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షి కి , విషయాన్ని వివరించారు. 

యోగదృష్టి తో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీ ని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడ లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు . 

 

లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి ,కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసు లో నిలుపుకొని , దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.

 

పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు.


 కనకదుర్గామాతను ,శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువు ని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.

 

“ వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్”


 అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది,. 

 

ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్టనుండి దివ్యతేజస్సుని గమనించి. ఇదే “సుబ్రమణ్య క్షేత్రమని ఇది భుక్తి ము క్తి ఫలప్రదమని “శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. 


 

కుమారస్వామి ఉరగ (పాము) రూపం లో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధం గా శిష్యులకు వివరించారు అగస్య్త మహర్షి.“


 సనక,సనకస,సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు, పైగా దిగంబరులు.వారు ఎల్లప్పుడూ భగవదారాధన లోనే కాలం గడుపుతుంటారు.

  

వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయం లో పరమేశ్వరుడు కైలాసం లో లేడు.లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. 

 

అదేసమయం లో శచీ,స్వాహా మొదలైన దేవతాస్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు.


 ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాల తో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. 

“ కుమారా! ఏల నవ్వుచున్నావు ?. వారు నేనులా కన్పించలేదా.? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? భేదమేమైననూ కన్పించినదా ?” యని జగదంబ కుమారుని ప్రశ్నించినది.

 

 ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపై బడి క్షమాపణ కోరుకున్నాడు.

  

 తల్లి కాదన్న వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపం తో తపస్సు ప్రారంభించాడు.

  

ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టి తో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. 


పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు.

 

” అత్రస్నానం తు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్, “ 

అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్ర తో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి. కాలాంతరం లో ఆ ప్రదేశమంతా పుట్టల తో నిండిపోయింది.


ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపం లోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు.  

వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఈతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి , ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. 

 

పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామి కి అంకితం చేశాడు.మట్టి తో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయం లో భద్రపరచేవాడు. 

 

అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయం లో శిథిలమై పోగా మిగిలిన నంది ,గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపం లో భద్రంగా ఉండి , భక్తులకు కనువిందు చేస్తున్నాయి.ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.


 

స్వామివారి ఆలయం తూర్పుదిశ గా ఉంటుంది. గర్భగుడి లో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామి కి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధం గా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రం లో పాలుపోయడం జరుగు తుంది. ఆలయ ప్రదక్షిణ మార్గం లో ఉన్న పుట్టనుండి గర్భగుడి లోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.

 

ఇక్కడ స్వామి వారి ఆలయం లో పుట్టలో పాలుపోయడం విశేష సేవ గా భక్తు లు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం,మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు.స్వామి వారి ఆలయం లో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం , అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. 


నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించు కుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.


  🔱   ఓం శరవణ భవ  🔱


శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏


🌸 జై శ్రీమన్నారాయణ🌸


*🙏వక్రతుండ మహాకాయ* *సూర్యకోటి సమప్రభ|*

*నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా౹౹ 🙏*

  

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | 

గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః   


 

తనచుట్టూ పరివేష్ఠితులై యున్న మహాముని జనావళిని దయా దృక్కులతో వీక్షిస్తూ, శ్రీ మహా శిపురాణాంతర్గతమైనదీ - ముచ్చటైనదీ అనదగ్గ  సంహితను, సమ్మోహ - సమ్మోదాలతో ప్రారంభించాడు సూతమహర్షి. 


అంతా శ్రద్ధాళువులై వినసాగారు.

 

సూత మహర్షిని శౌనకాది ఋషులు ఈ విధముగా అడుగుచున్నారు. ....


ఓ మహర్షీ! ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోవుచున్నారు. కొందరు సంతానము లేక మరికొందరు ధనము లేక ఋణములతోను ఇంకొందరు వ్రణములు ; ప్రమాదములు, అగ్ని బాధలు, శత్రు బాధలు పొందుచున్నారు. 

 అసలు కుజుడెవరు? అతని శక్తి సామర్థ్యములు ఎలాంటివి? కుజదోష నివారణోపాయములు ఏమిటి? అని అడుగగా, 

 

సూత మహర్షుల వారు ఋషులారా! శ్రద్ధగా వినండి, పై దోషములు గలవారుఅపర్ణాదేవి దేవి పూజ , సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనా చేసి, కుజ జన్మ వృత్తాంతము, శ్రీ అపర్ణాదేవి కళ్యాణ వృత్తాంతమును ఎవరైతే శ్రద్ధగా భక్తి తోపారాయణ చేస్తారో వారికి జన్మలగ్నవసాత్తు గాని, గోచారలగ్నవసాత్తు గాని, ద్వితీయ, చతుర్ధ, సప్తమ, అష్టమ వ్యయస్థానములలో కుజుడు ఉండుట వలన కలుగు సమస్త కుజదోషములు తొలగి కోరిన కోరికలు నెరవేరును.  

ముందుగా కుజ జన్మ వృత్తాంతము చెప్పుచున్నాను. శ్రద్ధగా వినవలెను, అని సూతులవారు ఈవిధంగా ప్రారంభించిరి.



 

శ్రీ మహావిష్ణువు తన నాభికమలము నుండి బ్రహ్మను సృజించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు.  

దక్షుడు అనగా సమర్ధుడు అని అర్ధము. ఆ దక్షప్రజాపతి తన కుమార్తెలలో ఇరవైఏడు మందిని "అశ్వని" (నక్షత్రములు) మొదలగువారిని చంద్రునకు ఇచ్చి వివాహము చేసినాడు. 

 ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమె దాక్షాయణి, శ్రీమాత. పరమశివుడు ప్రతీరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు వచ్చింది. ఆ నాట్యం చూడటానికి ముక్కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా వచ్చేవాడు.  

దక్షుడు మామగారు ఐనప్పటినుండి శివుడు నాట్యం పూర్తైన తర్వాత ముందుగా దక్షుని సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. 

ఒకరోజు వీలులేక దేవతలందరినీ సాగనంపి చివరకు దక్షుని సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు ఓ పెద్దయజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను, అల్లుడిని పిలవలేదు. (కొన్ని పురాణాలలో దక్షుడు చంద్రునికి ఇచ్చిన శాప నివారణకు మహా శివుడు సాయపడ్డాడని దక్షుని కి కోపం వచ్చిందని చెప్పబడినది) 

మరీచ్యాది మహర్షులు హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల ద్వారా యజ్ఞకార్యాన్ని గురించి విన్న దాక్షాయణి పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. శివుడు పిలవని పేరంటానికి వెళ్ళడం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. 

 ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రమథగణాన్ని పంపించాడు. దాక్షాయణి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను (దాక్షాయణిని) చూసి దగ్గరకు వచ్చి పరమశివుని నిందించాడు.  

"అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం" అన్నాడు. దాక్షాయణి తండ్రికి, అక్కడ ఉన్న దేవతలందరికి పరమశివుని గొప్పతనం చెప్పి, శివనింద చేసినవాని కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించింది.  

యజ్ఞకుండము దగ్గరకి వెళ్ళి యోగాగ్నిచే దగ్థమైంది. ఆవార్త తెలిసిన శివుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసినాడు. పిమ్మట శివుడు కైలాసమునకు వెళ్ళి సతీవిరహమును పొందుచూ తిరిగి హిమవత్ పర్వతము నందు తపస్సు చేయుచుండెను.  

అటుల తపస్సు చేయుచుండిన శివుని మూడవ నేత్రమునుండి శ్వేద బిందువులు నేలపై పడి, ఒక శిశువు ఉద్భవించెను. ఆ బాలుడు ఎర్రని కాంతితో దివ్య తేజస్సుతో నాలుగు భుజములతో ప్రకాశిస్తున్నాడు. దిక్కులు ప్రక్కటిల్లేలా ఏడవడం ప్రారంభిచాడు.  

ఆ ధ్వనికి భూమి, ఆకాశము ఏకమవుతున్నట్లు ఉంది. ఇంతలో భూదేవి స్త్రీ రూప ధారిణి అయి ఆబాలుడిని ఎత్తుకుని స్తన్యమిచ్చినది.  

శివుడు భూదేవితో నీవు చాలా పుణ్యాత్మురాలవు. నా శ్వేదబిందువు నీపై పడుటచే ఈ బాలుడు ఉద్భవించాడు. నేటి నుండి నీకుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు. 

ఇతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక, తాపత్రయరహితుడై నీ పేరుతో విఖ్యాతి పొందును, అని చెప్పాడు. శివలలాటజలము భూమిపై పడి ఇతడు జన్మించుటచే (కు-భూమి యందు, జ-జన్మించినవాడు) కుజుడు అని ప్రసిద్ధి నామం కలిగెను.  

 

భూమి కుమారుడు గాన భౌముడనియు, అగ్ని తేజస్సుచే పుట్టినవాడు (సర్వాంగములను పీడించువాడు) గాన అంగారకుడనియు ప్రసిద్ధి నొందెను. ఇతడు జన్మించిన కొన్ని క్షణములకే యువకుడై కాశీయందు ఉండి చిరకాలము శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహముచే గ్రహత్వమునొంది శుక్రలోకమునకు పైభాగమున ఉండెను.


నాటి నుండి ఎవరు ఇతనిని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి, సర్వకామ్యసిద్ధి కలుగును. ఈ కుజ జన్మ వృత్తాంతము పరమ పావనమైనది. అని సూతుడు శౌనకాది మునులకు తెలిపెను.

  

ఈ వృత్తాంతమంతయు శ్రద్దగా ఆలకించుచున్న మునిపుంగవులు సూత మహర్షిని : 

మహానుభావా కుజ దోష నివృత్తికి ఏ దేవతా ఆరాధనా చెయ్యవలెనో తత్ విధానము తెలియచేయ వలసినిదిగా ప్రార్ధించగా సూత మహర్షి మందహాసముతో మీ ప్రశ్నలకు సమాధానం శ్రీ సుబ్రమణ్య చరిత్ర తెలియ చేయ గలదు అని సెలవీయగా మునులందరూ ఎంతో ఉత్సుక తతో అయ్యా ఆ వృత్తాంత మంతయు మాకు సెలవీయవలసినిదిగా కోరారు .   

       

సూత మహర్షి అప్పుడు శివపుత్రుడు గాంగేయుడు అగ్నిసంభవుడు , కార్తికేయుడు , మరియు శ్రీ మహావిష్ణువు కు మేనల్లుడు గా మురుగన్ అనే నామ ధేయాలతో దేవతల సేనాని గా తారకాసురుని సంహరించిన శ్రీ సుబ్రమణ్య చరిత్ర ను ఈ విధంగా ప్రారంభించారు .   

 


*వల్లీశ దేవసేనేశ* 

 *భక్తపాలన తత్పర* 

 *దరహాస ముఖాంభోజ* 

 *సుబ్రహ్మణ్య నమోస్తుతే*


 *శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏*

🔱   *ఓం శరవణ భవ* 🔱

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat