ఆకాశరాజు మరణంతో తొండమానునకూ, వసుధాముడికీ రాజ్యము గూర్చి కలహము ఏర్పడింది. అన్న అయిన ఆకాశరాజు చనిపోయినాడు కనుక రాజ్యానికి పాలకుడుగా నేనే అవుతాననీ తొండమానుడూ, తండ్రి అయిన ఆకాశరాజు చనిపోయిన కారణముగా కుమారుడనైన నేనే రాజ్యపాలకుడవవలసి ఉన్నదనీ వసుధాముడూ వాదించుకోసాగారు. చివరకు యుద్ధానికి తయారయ్యారు.
ముందుగా వారిద్దరూ అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళి తమవైపు సహయము చేయవలసిదిగా శ్రీనివాసుని అభ్యర్ధించారు. ఆయనకు యిద్దరూ దగ్గర బంధువులే కదా! ఆలోచించాడు శ్రీనివాసుడు.
తొండమానునకు తన శంఖ చక్రాలను సహాయముగా యిచ్చాడు. తాను మాత్రము బావమరిదియైున వసుధాముని వైపున సమరం చేయడానికి నిశ్చయించుకొన్నాడు.
యుద్ధరంగము సిద్ధమయినది పోరు జోరుగా సాగింది. ఇరువైపుల సైన్యములోని వారూ చాలామంది మరణించినారు. కొన్ని వందలమంది క్షతగాత్రులయ్యారు. ఆ సమయములో తొండమానూడూ, శ్రీనివాసుడూ ఘోర యుద్ధము చేయసాగారు. తొండమానుడు ఒక తీవ్రబాణము శ్రీనివాసుని హృదయంపై వేసినాడు, దానితో శ్రీనివాసుడు మూర్చపోయినాడు.
ఈ వార్త పద్మావతికి తెలిసి రోదిస్తూ యుద్ధ రంగానికి వచ్చి మూర్చలోనున్న తన భర్తకు ఉపచారాలు చేసినది. శ్రీనివాసుడు మూర్చ నుండి తేరుకొన్నాడు. అప్పుడు పద్మావతి ‘‘ప్రాణప్రియా! ఈ యుద్ధములో ఒకరు పినతండ్రి, మరొకరు తమ్ముడు. వారిలో ఎవరు ఓడిపోయినా నేను చూడలేను స్వామీ! దయచేసి మీ చాకచక్యమును ఉపయోగించి వారిద్దరకూ రాజీ చేయండి’’ అని వేడుకొన్నది.
అప్పుడు శ్రీనివాసుడు తొండమానునీ, వసుధామునీ
పిలిచి యుద్దము కన్నా రాజీ పడడమే ఉభయతారకముగా వుంటుందనీ బోధించాడు.
వారిరువురకూ శ్రీనివాసును అనిన చాలా గౌరవము కనుక ఒప్పుకున్నారు.
శ్రీనివాసుడు రాజ్యాన్ని వారిద్దరకూ చెరిసగముగా చేసి పంచి యిచ్చాడు.
వారు ఒప్పుకున్నారు. ఆడబిడ్డకు ఆధారముగా వారిరువురూ తమ రాజ్యములలో ముప్పయిరెండు గ్రామములు భరణముగా యిచ్చివేశారు. పిదప శ్రీనివాసుడు, పద్మావతి ఆగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళిపోయారు.
శ్రీనివాసుడు తొండమానునకూ, వసుధామునకూ రాజీ కుదిర్చిన వెనుక, వారు చక్కగా రాజ్యపాలనము చేసుకొనుచుండిరి. అక్కడ ఆగస్త్యమహాముని ఆశ్రమములో శ్రీనివాసుడూ, పద్మావతీ హాయిగా కాలక్షేపము చేయుచుండిరి.
*ఇహపరదాయక గోవిందా,*
*ఇభ రాజ రక్షక గోవిందా*
*పరమ దయాలోగోవిందా,*
*పద్మనాభ హరి గోవిందా; |*
*గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,* *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. |* |27||.
శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలలలో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.
*జై శ్రీమన్నారాయణ*
*ఓం నమో వేంకటేశాయ*