అయ్యప్ప సర్వస్వం - 2

P Madhav Kumar


*గురుమహిమ - 2*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

గురువుకన్న మించిన విద్యయో , తపము లేదు. అన్నది. శాస్త్రము. కావుననే గురువు త్రిమూర్తులకు సమమైనవాడు అని అందురు. తల్లికి మించిన దైవము లేదు. తండ్రిని మించిన గురువు లేదు. తండ్రికి ప్రణవార్ధమును ఉపదేశించిన వాడు కనుక కుమారస్వామిని పరమ గురువందురు. *గురు పుత్రుని శాపమును దీర్చి గురువుగారి పుత్ర శోకమును పోగొట్టి 'గురు విన్ గురు' అను నామధేయం పొందివాడు మణికంఠుడు. గురువు శమంతకమణికన్న మిన్న. శమంతకమణి తాకిన దాన్నెల్లా బంగారం చేయగలదేమోగాని తనలాంటి మరో శమంతకమణిని తయారుచేయలేనిదగును. కాని గురువు తన లాంటి శిష్యులను , తన కన్నగొప్ప వారైన శిష్యులను గూడ తయారు చేయగలరు. కావుననే గురువు శమంతకమణి కన్న మిన్న అని అందురు.*


నవగ్రహాలలో గురువు చూస్తేనే కోటి పుణ్య మంటారు. గురుబలం ఉంటేనే వివాహాది శుభకార్యాలు జరుగు తుందంటారు. గురు శిష్యుల మధ్య సంబంధాన్ని ఆ భగవంతుడే నెలకొల్పుతాడు. గురువుకన్నా మిన్నయగు దైవము లేదు. గురువు ఎంతటివాడు. అనేదికాదు. గురువు నందు మనకు గల భక్తి శ్రద్ధలు , అచంచలమైన నమ్మకము ఎంతటిది అనేది మనని త్వరగా తరింపజేస్తుంది. గురువు నేర్పరి , శిష్యుడు ఓర్పరి అయినపుడే శిష్యుడు సంస్కరింప బడుతాడు. గురుద్రోహం చేయనేకూడదు. తన దరిచేరిన వారి మనస్సులో గల అజ్ఞానమనే చీకటిని తొలగించి , జ్ఞానమనే ప్రకాశవంతమైన దీపమును వెలిగించువాడు గురువు. కావున గురువు కరదీపం వంటివాడు. బ్రహ్మ మనిషిని సృష్టిస్తాడు. గురువు ఆ మనిషిని ఉత్తమమైన మనిషిగా తీర్చిదిద్దుతాడు. కావున గురువు బ్రహ్మసమానుడు.


*పదినెట్టాంపడినెక్కేటపుడు తనకు మాలవేసి ఇరుముడి కట్టించిన తన గురువును మనసాస్మరిస్తూ ఎక్కాలి. అదియే గురువిన్ గురువగు అయ్యప్ప స్వామి వారికి ఇష్టదాయకం.  గురువు పరమాత్మను చేరుకొనే మార్గములో సోపానము వంటివాడు. ఆయన చూపిన బాటలో నడుచువాడు ఉత్తమ శిష్యుడు. దేవుడు న్యాయ దేవత ఐతే , గురువు న్యాయవాదిలాంటివాడు. భక్తుడు క్లయింట్ (న్యాయార్థి) లాంటివాడు. తన దరిచేరిన భక్తుని వద్దగల న్యాయమును ఎలుగెత్తి చెప్పి మంచితీర్పు ఇచ్చునట్లు న్యాయ దేవతయైన న్యాయమూర్తి వద్ద సిఫార్సు చేసేవాడు గురువు. దేవుని యెడ పొరబాటు దొర్లియుంటే... గురువు మనకొరకు దేవుని వద్ద మనలను మన్నించమని సిఫార్సు చేసినచో దేవుడు దయతలచి ఆ గురువు కొరకు శిష్యుని తప్పును మన్నించవచ్చును. కాని గురువు మనమీద అలిగి ఆగ్రహించినచో మనలను రక్షించేవారే వుండరు. చివర ఆ దేవదేవుని వద్దకు వెళ్ళి రక్షించమని ప్రాధేయబడినా ఆ దేవుడు తానేమియూ చేయజాలనని , ఆ గురువు వద్దకే వెళ్ళి క్షమాభిక్ష పొందమని ఆదేశిస్తాడు.* కావున గురువు యెడపొరబాటు చేయక అతని మాటలు విని నడుచుకొనుటయే ఉత్తముల లక్షణం.


దేవతలందరు కూడ తమలను గురువులుగానే చూపించు కొనుటకు ఇష్టపడుతారు. ఉదా:- 

*వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్ధనం |* *దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥* 

*గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |*

*నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః ॥* గురుతత్వమును ఎరింగిన వాడు సర్వశాస్త్రములను సాధన చేసినట్టే అని పెద్దలందురు. సర్వ శాస్త్రములు గురువులోనే గలవు. *దేవతలందరు కూడా ఒక గురువు వద్ద శిష్యరికం అనుష్టించినవారే.*


దేవతల గురువు బృహస్పతి. దానవుల గురువు శుక్రాచార్యుడు. కృష్ణుని గురువు సాందీపమహర్షి, దశరథుని గురువు వశిష్టుడు. శ్రీరాముని గురువు విశ్వామిత్రుడు. అర్జునునకు కృష్ణుడు గురువు. కచునికి బృహస్పతి గురువు. లవకుశలవులకు వాల్మీకి గురువు. వాల్మీకికి (రత్నాకరునికి) సప్త ఋషులు గురువు. కురుపాండవుల గురువు ద్రోణాచార్యులు. సనత్కుమారుల గురువు శ్రీ దక్షిణామూర్తి. హనుమంతుని గురువు సూర్యభగవానుడు. *మనందరి గురువు అదిగురువు గురువిన్ గురువైన ఆ అయ్యప్ప స్వామి వారే.* కండకు గోరుకు గల బంధము వంటిదే గురుశిష్య బంధము. కండకన్నా గోరు పెరిగినప్పుడెల్ల నరికి పారేసినట్లు గురువు వద్ద శిష్యుడు తోకజాడించినపుడు తనవద్దనున్న అతీతశక్తితో ఆ తోకను నరికి పారేస్తుంటాడు గురువు. రాముని బాటను అనుసరించాలి. కృష్ణుని మాటను ఆచరించాలి. ఇవి రెండు తారుమారైతే మనిషి వీధిన పడుతాడు. జీవితము అపహాస్య పాలగును. అందుకే రాముడు కృష్ణుడు మనగురువులన్నారు. ప్రత్యక్ష దైవాలగు తల్లిదండ్రులు బిడ్డలకు ఆదిగురువులు. వారి గొప్పదనములను మనకు తెలిపెటివాడు అక్షరాభ్యాసము నేర్పించిన గురువు. అందుకే గురువులేని విద్యగ్రుడ్డి విద్య అని అన్నారు. దత్తాత్రేయుడు *"కాకివద్ద ఐక్యమత్యమును , కుక్కవద్ద విశ్వాసమును , కుందేలు వద్ద వేగమును , తాబేలు వద్ద సహనమును , గోమాత వద్ద త్యాగమును నేర్చుకున్నాను. కాబట్టి అవిగూడ నాగురువువంటివే"* అని అన్నాడు. *కావున మనవద్ద లేని సద్విషయము ఎవరివద్ద యుండినను వారలను గురువులుగా స్వీకరించ వలయును. అందుకు వయోభేధముగాని , లింగభేధము గాని , జీవరాశుల భేధముగాని యెంచరాదు.


ఆచార్య సేవకన్న దైవారాధన మిన్నకాదు. ఆచార్యసేవలో వున్న వారిని దైవము ఎన్నడు పరిశోధించడు. గురుద్రోహమునకు పరిహారము ఏ శాస్త్రమునందు చెప్పబడలేదు. గురుద్రోహిని క్షమించుట యనునది కాటువేయటకు బుసకొట్టే నల్లత్రాచువద్ద జీవకారుణ్యము చూపినట్టేయని మనునీతి శాస్త్రము నందు చెప్పబడియున్నది. గురుదక్షిణ యడిగి చిన్న బోయాడు ద్రోణా చార్యుడు. ఆయన అడిగిన గురుదక్షిణ ఇచ్చి కీర్తిశేషుడై నేటికి శిష్యులకు ఉదాహరణగా నిలిచియున్నాడు ఏకలవ్యుడు. చెట్టులోను పుట్టలోను కనిపించే వాటినే గురువుగా దలచి మొక్కమన్నాడు స్వామి అయ్యప్ప.


అందరిలోను ఒక అదర్శగురువున్నాడు. ఆయనను ముందుంచి ఆయన ఆదేశానుసారం కార్యనిర్వహణ గావించినచో విజయం తథ్యం. ఒక్కో సద్గ్రంధము ఒక్కొక సద్గురువు. అందుండి మనకు కావలసినవి మాత్రం హంస క్షీరోదక న్యాయంతో స్వీకరించి తక్కిన వాటిని వదలి పెట్టుట వివేకిలక్షణము. పరిశుద్ధమైన మనసు , ధర్మార్థకామ మోక్షాలనే పురుషార్ధాల విషయంలో ఆసక్తి కలిగి వుండటం , చక్కని అధ్యయనం , బుద్ధి కుశలత , ప్రాణుల హితం కోరగలగడం , ఆస్తిక భావాలుండటం , తనధర్మం వదలకుండుట , తల్లిదండ్రుల కోసం శ్రమించే స్వభావం , త్రికరణశుద్ధిగా గురుసేవయే పరమలక్ష్యంగా వుండటం, అనే ఈ శుభ లక్షణాలన్నీ కల్గి వున్నవాడే ఉత్తమశిష్యుడనిపించు కొంటాడు. గురుపాదులను స్మరిస్తూ , గురుదేవుల పాదారవిందాలకు ప్రణమిల్లుతూ , గురుతత్త్వాన్ని బాగా జీర్ణం చేసుకొని గురుమంత్రం జపించేవాడు కృతార్థుడు , ధన్యుడు , మరియు పండితుడు , ఈ విధంగా చేయడం వలన సకలశాస్త్ర సిద్దాంతాలను సులువుగ తెలుసుకొనగల్గును.


ఏ శిష్యుడైతే గురువుగారింట్లో నివాసం చేస్తూ , పుణ్యకార్యాలు చేస్తుంటాడో అలాంటివాని పుణ్యమెప్పుడూ తరుగదు. కొన్ని వందల పుణ్యక్షేత్రాలు దర్శించినా లభ్యం కాని పుణ్యం దీనివల్ల వస్తుంది.


గురువులను దేశికులని కూడా వ్యవహరిస్తారు. చక్కని అర్ధాన్ని బోధించే పదమిది. 'దే' దేవతా రూపం ధరించినందువలననూ , 'శి' శిషుగ్రహ కారణంగానూ , 'క' కరుణామయ మూర్తి కావడం చేత , దేశికుడు అనేపదం సార్థకమైంది. గురుదర్శనార్ధం వెళ్ళేటపుడు ఏవిధమైన ఆడంబరాలతో వెళ్ళరాదు గురుదేవుల ఇంటికి వెళ్ళేటపుడు ప్రశాంత చిత్తం , భక్తిభావం కలిగి యుండాలి. వాహనాలు , ఛత్రచామ రాదులు , మొదలైన వాటిని దూరంగా వుంచాలి. తాంబూలం సేవిస్తూ వెళ్ళరాదు. వేగంగా అడుగులేయక నెమ్మదిగా నడుస్తూ వెళ్ళాలి. ఇంతేకాదు రాజదర్శనం , దైవదర్శనం , గురుదర్శనం కోసము వెళ్ళేటపుడు వట్టిచేతులతో వెళ్ళరాదు. తనశక్తి కొద్దీ , పూలు , పండ్లు మరియు వస్త్రాలతో వెళ్ళి దర్శనం చేసుకోవాలి.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat