శ్రీ రాఘవేంద్ర కల్ప వృక్షము 5 వ భాగము

P Madhav Kumar


శ్రీ అగ్ని సూక్తము:


వెంకన్నాచార్యులు కేవల ము అగ్రజుని     ఆజ్ఞా పరిపాలనార్థమై గృహ స్థాశ్రమమును స్వీకరించి అన్నగారి వద్దనే నివసించు చుండెను. 


వెంకన్నాచార్యులు సకల భూతములందు  ఎట్టి ద్వేషము లేనివాడు. స్నేహము, దయ సమముగ గల్గిన మహాత్ముడు. నేను నాది యనెడి యహంకారము లేనివాడు, సుఖ దుఃఖము లందు ఏకభావము గల్గి వర్తించువాడు, సహనశీలి, సదా సంతృప్తియుతుడు. శ్రీహరి చరణారాధన మనెడు మహాయోగ సమన్వితుడు. మనస్సునే  జయించిన మహామనీషి, దృఢచిత్తుడు.


సర్వము శ్రీరామార్పణ ముగా భావించు పరమ భాగవతోత్తముడు. ఎవ్వని వలన భూతములు భయము నొందవో, ఎవడు లోకమునకు భీతినొందడో, ఎవడు   సంతోషము, క్రోధము, భయము, మనో వ్యాకులత్వము మొదలగు దౌర్బల్యములను కల్గి యుండడో, అతడే శ్రీ వెంకన్నాచార్యులు. ఈ పరమభాగవతోత్తమునకు కోరికలే లేవు. ఈయన బాహ్యాభ్యంతర పరిశుద్ధుడు, సకల కార్యసమర్థుడు, దుఃఖమునే  యెఱుగని ధీశాలి, సర్వధర్మములను శ్రీరామార్పణముగ పరి త్యజించి శ్రీ సీతారాముల పదసరోజములను ఆశ్ర యించిన చరితార్దుడు. శత్రువునందు, మిత్రుని యందు, కూడా మానావ మానములందు, శీతోష్ణ  సుఖదుఃఖములందు తటస్తుడై చలింపని మహామేరువు, దేనియందు ను ఆశ లేనివాడు. నిందా స్తుతులను సమముగ గఱపెడివాడు. లభించినదాన్ని మహా సౌభాగ్యముగ నెంచి తృప్తి నొందు వాడు. సాంసారిక విషయములందు విరాగి, ధనము నపేక్షింపని మహాజ్ఞాని, సదా తృణము వలె వినీకుడై మెలగు వాడు, తరువువలె సహిష్ణుత గల్గినవాడు, మాననీయులు కానివారల నైనను ఆదరింపగల సద్బ్రాహ్మణుడు, సదా శ్రీహరి నామసంకీర్తనా  పానమత్తుడు; ఏ ప్రదేశములలో శ్రీహరి భక్తులు సమావిష్టులై శ్రీరామనామ సంకీర్తన మొనరింతురో ఆప్రదేశ మందే సకలజగన్నాథుడు, సర్వాత్ముడు, సచ్చిదా నందవిగ్రహుడు నైన శ్రీహరి సకల పరివారముతో విరాజిల్లును.


ఇట్టి దివ్య గుణ సంపన్నుడైన శ్రీవెంకన్నా చార్యులు కుటుంబ సంరక్షణభారము నంతటిని తనసోదరుని భుజస్కంధ ములపైనుంచి సతతము శ్రీహరి కైంకర్యమగ్ను డయ్యెను. శ్రీ గురురాజు కూడ సోదరునేమీ అనజాలక కుటుంబ భారము నంతయు తానే వహించి కష్టముల పాలగుచుండెను.


ఈ విషయమును తెలిసి కొనిన వెంకన్నాచార్యులు  తన కుటుంబ భారమును తానే వహించెదనని అగ్రజునొప్పించి వేరుగ ఈ భవసాగరములో తన జీవిత నౌకాసారథ్వము వహించెను. వారి కుటుంబ మెన్నియో యిడుముల ననుభవింపవలసి వచ్చెను. కాలక్రమమున శ్రీసరస్వతీ దేవి గర్భము దాల్చి ఒక కుమారుని ప్రసవించెను. సాంసారిక విషయములందు నిర్లిప్తుడైన శ్రీ వెంకన్నా చార్యులు తన శిశువునకు క్షీరములను కూడ సమకూర్చ లేకపోయెను. సువర్ణమైనను అగ్నితప్త ము కానిదే  సమ్మెటవేటుల నొందనిదే  తన కాంతు లను వెదజల్లలేదు. కావున శ్రీ వెంకన్నా చార్యులు పరమ భాగవతోత్తము డైనను సాంసారిక కష్టము లాయనకు తప్పలేదు. వారి గ్రామమునకు చేరువలో గల ఒక జమీందారు గృహములో మహాయజ్ఞ మొనరిoప వలెనని నిరంతము సమారాధనల నొనరింప వలెనని ఋత్విక్కులు సంకల్పించిరి. ఆ జమీందారు కూడ అందులకు నంగీకరించి తన జమిoదారీలో గల సకలగ్రామములలో యజ్ఞ సమారాధనా విషయమై చాటింపువేయించెను.


దినములపర్యంతము పస్తులనుండలేక పసి బాలుని ఆక్రందనల నాలకింపలేక శ్రీ సరస్వతీ దేవి యజ్ఞసమారాధనకు బయలుదేరి  కొంతకాల మైనను జమీందారు గృహమందుండి పసి బాలుని రక్షించుకొనవల యునని పతి దేవుని  అర్థించెను. సుఖ దుఃఖములందెట్టి భేద భావమునులేని శ్రీ వెంకన్నాచార్యులు యజ్ఞశాలకు దారాపుత్రుల తీసికొని బయలు దేరెను. సంపన్నుని గృహములో నిరంతరము హోమము, పూజారాధనలు జరుగు చుండెను. ఆశ్రీమంతుని   పురోహితుడు  యజ్ఞ కార్యములను నిర్వర్తించు చుండెను. ఆ యజ్ఞశాలలో ఒకపక్కగా భార్యా పుత్రుల తో ఆసీనుడైయున్న ఆజానుబాహుడు, బలిష్ఠు డైన శ్రీవెంకన్నాచార్యుని గాంచి పురోహితుడు "ఓయీ, బ్రాహ్మణుడా ఎందులకు కాలమును వ్యర్థము చేయుచున్నావు. నీవు యజ్ఞకార్యములను నిర్వర్తించుటకుగాక కేవలము భోజనముకొఱకే వచ్చితినా? లెమ్ము శీఘ్రముగ రమ్ము. ఈ చందన కాష్టమును గైకొని గంధమును దీయుమని తిరస్కారముగ బల్కెను. పురోహితుని పరుష వాక్య ములను ఆలకించినను గృహస్థు శ్రీవెంకన్నా చార్యుని సామాన్య బ్రాహ్మణునిగ భావించి వారింపలేదు. శ్రీ వెంకన్నా చార్యుడు మాత్రము కోపింపక ప్రశాంతచిత్తము తో చందనమును దీయు కార్యమందు సంసిద్ధ మయ్యెను. భర్త మనోగత భావములను గ్రహింపగల సాధ్వీలలామ శ్రీసరస్వతీ దేవి కూడ పరుష వాక్యముల నాలకించి మిన్నకుండెను.


భాగవతాపచారమును దేవతలు సహింతురా? భక్తుడు సహించుగాక! సకలజగములకు సాక్షులైన పంచభూతములు భాగవతాపరాధమును మన్నింపవు. శ్రీహరి పరమ భక్తునకు జరిగిన యవమానమును జూచి భూసురులకు ప్రత్యక్ష దైవము సకలసాక్షియైన శ్రీ అగ్నిభట్టారకుడు మహా క్రోధసమన్వితుడై ఆకాశమునంటి ప్రజ్వరిల్ల నారంభించెను. ఈ హఠాత్పరిణామమునకు ఋత్విక్కులతో పాటు ఆహూతులైన సకల జనులు భయ సంభ్రమ ములచే కంపించిపోయిరి. ఈ మహోత్పాతమును గాంచి శ్రీవెంకన్నాచార్యులు సర్వము  గ్రహించినవాడై శ్రీ అగ్నిదేవుని శాంతింప జేయుటకు తనలోతాను అగ్ని సూక్తమును పఠించెను.


భక్తాగ్రేసరుని ప్రార్థనల నాలకించి అనిలుడు తన విశ్వ రూపమును విసర్జించి సూక్ష్మ ఆకారుడై భాగవతాపరాధులను మన్నింపజాలక శిక్షించు టకు శ్రీ వెంకన్నాచార్యులు తీయుచున్న చందనమున ప్రవేశించెను. అగ్ని శాంతింపగనె యిది కేవలము కాకతాళీయమని భావించి ఋత్విక్కులు, యజమాని యథార్థమును గ్రహింపలేనివారై మిన్న కుండిరి. 


సాయంసమయమువరకు శ్రీ వెంకన్నాచార్యులు తనకొసంగిన చందన కాష్ఠమునంతయు అరగ దీసి చందనముగ మార్చివేసెను. కాని ఆ చందనములో అణువణు వందు శ్రీఅగ్నిదేవుడు ప్రవేశించి యుండెను.


భానుడు ప్రపంచమును అంధకారమున ముంచి వేసి అస్తమింపగ పురోహితుడు శ్రీవెంకన్నా చార్యులచే దీయబడిన చందనమును మంత్రాక్షత లను తాను ధరించి తోటి ఋత్విక్కుల కొసంగి యజమానికి సమర్పిం చెను. వారందఱు చందన మును ధరింపగనే ఒడలంతయు అగ్ని మయమై భగ్గున మండ నారంభించెను. భాగవతా పచారమును గాంచి మిన్నకుండిన యజమాని, పురోహితులు అందఱు అగ్నిదేవుని ఆగ్రహమునకు గుఱియైరి. ఈ వైపరీత్య మునకు యజమాని అత్యంతదుఃఖితుడై అగ్ని బాధను భరింపలేక చందనమును పంచిన ముఖ్య పురోహితుని నిందింప నారంభించెను. అగ్నిక్రోధపీడితులై విలపిం చుచున్న ఈ అభాగ్యు లను గాంచి యజ్ఞ మంటపమునందు సమావేశమైన.      సకల

జనులు  హా హా కారముల నొనరిం నారంభించిరి. శ్రీహరి ధ్యానమగ్నుడైన శ్రీవెంకన్నాచార్యుడు మాత్రము బాహ్య ప్రపంచమును మరచి ఆత్మ సాక్షాత్కారమున నుండెను. మంటలకు తాళలేక విలపించు పురోహితులు తాము ప్రాతఃకాలమున ఒక ఆజానుబాహుడైన బ్రాహ్మ ణోత్తముని నిందించితిమని జ్ఞప్తికి దెచ్చుకొని తామొనరించిన భాగవతా పచారమున కత్యంత పశ్చాత్తప్తులై జరిగిన దంతయు తోటివారికి విన్నవించి ఈ క్లేశములకు ఆ   మహానుభావుని తిరస్కరించుటయే కారణమని గ్రహించిరి.


యజమానితోసహా బ్రాహ్మణులందఱు ధ్యానమగ్నులై  యున్న శ్రీ వెంకన్నాచార్యుని పాదము లనాశ్రయించిరి. తన పాదములను దాకిన అశ్రుధారలకు శ్రీవెంకన్నా చార్యులు బాహ్యస్మృతిని బొంది జరిగినదంతయు తృటిలో గ్రహించి అగ్ని దేవుని శాంతింపజేయు టకు శ్రీహరిని, శ్రీ అగ్ని దేవుని, శ్రీవరుణదేవుని ప్రార్థించెను. ఆచార్యులు వరుణ సూక్తమును సమాప్తమొనరింపగనే అగ్ని దేవుడు చందనమును వీడి అగ్ని గుండమున ప్రవేశించెను. బ్రాహ్మణులు యజమానితో పాటు బాధా విముక్తులై శీతలత్వమును బొంది పరమానందభరితులై శ్రీ వెంకన్నా చార్యుని పాదములపైబడి "భక్త శిఖామణీ! కరుణింపు” మనిప్రార్థించిరి. యజమాని తానొనరించిన భాగవతా పచారమున కత్యంత దుఃఖితుడై శ్రీ ఆచార్యుల వారి ననేకవిధముల క్షమాపణల నర్థించి యెన్నియో బహుమానము లతో, ధనములతో సత్కరించెను.


కోపమే యెఱుగని శ్రీవెంకన్నాచార్యులు వారి నందఱిని క్షమించి ఆదరించెను. యజ్ఞము సంపూర్ణమగువఱకు యజమాని శ్రీ వెంకన్నా చార్యుని, శ్రీసరస్వతీ దేవిని, వారి కుమారుని అపర దేవతలుగ భావించి గౌరవించెను.


యజ్ఞము పరిసమాప్తి కాగా పూర్ణాహుతిదినమున వెంకన్నాచార్యులు యజమానిచే ననేక సత్కారముల బొంది ఆగ్రామమును వీడి స్వస్థలమును జేరెను. ఎంతటివారైనను భగవ ద్భక్తులను హింసించిన భగవంతుడేకాదు, తుదకు దేవతలు కూడ ఆగ్రహించె దరనుటకు శ్రీ వెంకన్నా చార్యుని జీవితములో సంభవించిన ఈయద్భుత సంఘటనమే భావితర ముల వారికి తార్కాణము.


మహాభాష్యాచార్యులు:


భగవంతుని దివ్యచరణార విందముల నాశ్రయించిన భక్తులకు సుఖదుఃఖములు సమానములు. అగ్నితప్త ము జేసి సమ్మెట వేటులు బడనిదే  సువర్ణము కాంతి బహిర్గతము కాదు; అట్లే కష్టములలోనే మహా పురుషులు తమ మహాత్మ్యములను ప్రక టించెదరు. శ్రీ వెంకన్నా చార్యులు జమీందారుచే అనేక విధముల సత్కరింప బడి సతీపుత్రసమేతముగ  స్వస్థలము జేరిరి.


నిష్కామభక్తుడు కావున శ్రీఆచార్యులు యధావిధిగ ప్రాపంచిక విషయము లందు నిర్లిప్తుడై అహర్నిశ ములు శ్రీహరి కైంకర్య మున నిమగ్నుడయ్యెను. దారిద్ర్యము     ఆచార్యుని గృహము నావరించెను. జితేంద్రియులైన యీ దంపతులు మాత్రము ఆకలిదప్పులను సహిత ము లెక్కింపక వారముల పర్యంతము శ్రీకృష్ణ ధ్యానములోనే  కాలము గడుపుచుండిరి. కాని వారి కుమారుడు ఈ లేమిని  తాళలేక పరితపింప సాగెను. కుమారుని ఆక్రందనముల నాలకించి శ్రీ వెంకన్నాచార్యులు చింతామగ్నుడై  ఉదర పోషణార్థము ఏ కార్యము నైనను ఒనరింప సంసిద్ధుడయ్యెను. కాని ఆ కుగ్రామములో సంపాదన కెట్టి అవకాశములు లేకపోయెను. తన భార్యా బిడ్డలు ఎట్టిక్లేశములు లేక జీవింపవలెనన్న, శ్రీసుధీంద్ర తీర్థుల ఆశ్రమము సరియైన ప్రదేశమని నిర్ణయించుకొని శ్రీ వెంకన్నాచార్యులు దారా పుత్రసహితముగ గురు దేవుల ఆశ్రమమును చేరెను.


తనప్రియశిష్యుని గాంచి శ్రీతీర్థులవారు పరమానంద భరితులై శ్రీ వెంకన్నా చార్యుని శ్రీమతి సరస్వతీ దేవిని ఆదరముగ ఆహ్వానించి చిరంజీవిని ఆశీర్వదించెను. ఈ మఠములోనే కుటుంబ సహితముగ నివసింప వలసినదిగ శ్రీ వెంకన్నా చార్యునాదేశించిరి.


గురుదేవుని  ఆజ్ఞానుసార ముగ శ్రీ వెంకన్నాచార్యులు ఆశ్రమావరణములో ఒక పర్ణశాలను నిర్మించుకొని నివృత్తి మార్గ సాధన యందు సంలగ్నుడై శ్రీహరి నారాధించుచు పాఠశాల నిర్వహణలో గురుదేవు లకు తోడుగ నివసింప సాగెను.


కొన్ని దినముల పిమ్మట శ్రీసుధీంద్రతీర్థులవారు తీర్థయాత్రలకు బయలు దేరిరి. శ్రీస్వాములవారితో శ్రీ వెంకన్నా చార్యులు, మఠ పరివారముకూడ బయలు దేరెను. ఆకాల ములో పీఠాధిపతులు ప్రయాణము చేయుచు ఏ గ్రామమందైనను నగర మందైనను మజిలీచేసిన ఆప్రాంతమునగల విద్వాంసులు పీఠాధిపతు లను శాస్త్రార్థమై ఆహ్వానించెడివారు. ఓడినవారు విజయము పొందినవారికి శిష్యు లయ్యెడివారు. శ్రీసుధీంద్ర తీర్థులవారు తన పరివార ముతో తీర్థయాత్రలను సల్పుచు 'మన్నారుగుడి' యనునగరములో మజిలీ చేసిరి. ఆనగరమున వ్యాకరణములో అసమాన ప్రతిభావంతుడగు అద్వైత సిద్ధాంత విద్వాంసుడు కలడు. ఆ మహాపండితు డు శ్రీసుధీంద్రతీర్థులవారిని మహాభాష్యముపై శాస్త్రార్థమున కాహ్వానిం చెను. శ్రీస్వాములవారు ఆందుల కంగీకరించిరి. ఆనగరములోని యొక దేవాలయ ప్రాంగణమున ఈ మహాపండితుల శాస్త్రచర్చకు సమావేశము ఏర్పాటు చేయబడెను. వేలకొలది శ్రోతలు సమావేశమునకు చేరిరి. వేదికపై ఒక పార్శ్వమున శ్రీసుధీంద్ర తీర్థులవారు తమ పరివారముతో  నలంకరించిరి. వారికభి ముఖముగ అద్వైతమహా పండితుడు పండిత సముదాయముతో ఆసీను డయ్యెను. మహా భాష్య ముపై శాస్త్రచర్చ ఆరంభ మయ్యెను. 


ఒకరివాదములను మఱి యొకరు తీక్షణముగ ఖండించుచు తమవాదమే యథార్థమని ప్రతిపాదింప నారంభించిరి. ప్రప్రథమము గ శ్రీ వెంకన్నా చార్యులు తన గురుదేవుని పక్షమున వాదమును ప్రారంభిం చెను. శ్రీఆచార్యులు తన వాదములను ఎంతో సహేతుకముగ ప్రతిపాదన  చేసి యెదుటివారి వాదములను ఆహూతు లైన పండితుల సమ్మతితో ఖండించి కొన్ని గడియల లోనే ప్రతివాదియైన అద్వైత మహాపండితుని నేర్పుతో నోడించెను. ఆ వైయ్యాకరణి మహాభాష్య మందు ద్వైత సిద్ధాంతమే యథార్థమని ఆమహాసభ లో అంగీకరించి శ్రీ సుధీంద్రతీర్థుల వారికి శిష్యునిగా మారిపోయెను. అసభలో సమావేశమైన మహాపండితులు, ప్రజలు శ్రీవెంకన్నాచార్యుని విద్వత్తును శాస్త్రచర్చా పటిమను వేనోళ్ళ కొని యాడిరి. తన ప్రియ శిష్యు నకు గలిగిన యీయఖండ విజయమునకు స్వాముల వారు పరమానంద భరితులై శ్రీ వెంకన్నా చార్యుని హృదయపూర్వక ముగ ఆశీర్వదించుచు 'మహాభాష్యాచార్య' యను బిరుదు నొసంగి ఘనముగ సన్మానించెను.



ఈసంఘటనతో శ్రీ వెంకన్నాచార్యుని ప్రతిభ ఆర్యావర్తమంతయు వ్యాపించెను. పండితు లందఱు ఈ మహావిద్వాం సుని విద్యాపటిమను ఘనముగ ప్రశంసించిరి.


శ్రీ గురు రాఘవేంద్ర

*****

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము

5 వ భాగము  

సమాప్తము**

💥💥💥💥💥💥


🙏 ఓం నమో రాఘవేంద్రాయ నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat