శ్రీ రాఘవేంద్ర కల్పవృక్షము 6వ భాగము

P Madhav Kumar


శ్రీసుధీంద్రతీర్థులు మన్నారుగుడిలో తమ విజయపతాక  మెగురవేసి తీర్థయాత్రల నొనరించుచు సపరివారముగ తంజా వూరు రాజ్యమును జేరిరి. తంజావూరు నగరములో నివసించుచున్న యజ్ఞ నారాయణ దీక్షితుడను అద్వైత మహా పండితుడు “తత్త్వమసి”యను సిద్ధాంతమును ద్వైత సిద్ధాంతపరముగ నిరూపింపవలసినదని శ్రీ స్వాములవారిని శాస్త్రార్థ మున కాహ్వానించెను. ఈ పండితపమావేశము తంజావూరు నగరాధీశుల సమక్షములో ఏర్పాటు అయ్యెను.


ఈ శాస్త్ర చర్చలోకూడ శ్రీ వెంకన్నా చార్యులు పాల్గొని అయ్యద్వైత మత్తేభమును సింహ కిశోరమువలె ఎదుర్కొనెను  ఆ ద్వైతమహాపండితుడు సామాన్యుడు  కాడు . అతడు శాస్త్ర చర్చలో పరాజయ మెఱుంగని సరస్వతీ ప్రసన్నుడు.


కానీ  శ్రీవెంకన్నాచార్యులు ద్వైత సిద్ధాంతములను ప్రతిపాదించి ఆవలిపక్షము వారి సిద్ధాంతములను పండిత రంజకముగ ఖండించుటలో మేటి. కొన్నిదినములు శాస్త్ర చర్చ జరిగిన యనంత రము తుదకు 'తత్వమసి' యను సూత్రమునకు ద్వైత సిద్ధాంత ప్రతిపాదక మైన అర్థమే యథార్థమని అద్వైతమహాపండితు తన పరాజయము నంగీకరిం చెను. నాటినుండీ శ్రీ మహా భాష్యాచార్యులు శ్రీసుధీంద్ర తీర్ణులవారి ఆశయమునకు వెలలేని రత్నమయ్యెను. శ్రీ వెంకన్నాచార్యు లెందఱో పండితుల నోడించి ఆర్యాపథములో ద్వైత సిద్ధాంత విజయధ్వజము నెగురవేసెను. ఆచార్యుని

విజయ పరంపరలచే ఆశ్రమమునకు ఎన్నియో బహుమతులు, ఆస్తులు సమకూరినవి. తానెంతో గౌరవమును, ధనమును పొందినను శ్రీవెంకన్నా చార్యుడు  గర్వము చెందక తన సర్వస్వమును ఆశ్రమమున కర్పించి విరాగియై సతతము శ్రీహరి ఆరాధనా సేవలందు సంలగ్నుడై తామరాకుపై నీటిబొట్టు వలె తన జీవితమును గడుపు చుండెను. శ్రీమతి సరస్వతీదేవి తన భర్త చేయు ఆరాధనకు సకల పరికరములను సిద్ధమొన రించుచు హరినామసం      కీర్తనము నొనరించుచు పతి సేవలో నిమగ్నురాలై యుండెను. ఈ దంపతుల కుమారుడు కూడ ఆజన్మ వైష్ణవుడై తండ్రివలె నివృత్తిమార్గమునే అను సరించుచుండెను. 


శ్రీ విద్యాలక్ష్మి:


దారా పుత్రాదులతో శ్రీ వెంకన్నాచార్యులు సుధీంద్ర తీర్థులవారి ఆశ్రమములో నివసించుచుండెను.    ఆశ్రమములోనే శ్రీ వెంకన్నాచార్యులు తన కుమారునకు ఉపనయన మహోత్సవమును శ్రీ తీర్థులవారి ఆశీర్వాదము లతో అత్యంత వైభవముగ నెరవేర్చెను.


ఆ కాలములో శ్రీ మూలరామ మూర్తులు సుధీంద్రతీర్థుల ఆశ్రమము లో కొలువు దీరియుండెను. ఆశ్రమాధిపతి నిత్యము శ్రీ మూలరామమూర్తులను ఆరాధించుట ఆశ్రమములో పరమ ధర్మమయ్యెను. కావున సుధీంద్రతీర్థులు క్రమము దప్పక నిత్యము మూల రామమూర్తి నారాధించెడివారు. దేని కైనను భంగము వాటిల్ల వచ్చునుగాని శ్రీ మూల రామ మూర్తి యారాధనకు భంగము వాటిల్లరాదు. అనాది కాలమునుండి ఆశ్రమములో మూలరామా రాధనము  అవిచ్ఛిన్న ముగ జరుగుచుండెను. శ్రీ వెంకన్నాచార్యులు మూల రాముని నిత్యము దర్శించుచు తదారాధనలో తన గురుదేవులైన శ్రీ సుధీంద్రతీర్థులకు సహాయ్య మొనరించుచు సాధ్వియైన భార్యామణి సాహచర్యముతో పూర్ణిమ చంద్రుని వలె దిన దినాభివృద్ధి గాంచుచు, పరమభక్తునిగ వెలుగొందు చున్న తన కుమారుని గాంచుచు కొంత కాలము సుఖముల ననుభవిం చెను. దినములు గడచి, సంవత్సరములు గతించెను. శ్రీ వెంకన్నా చార్యులవారి గృహస్థా శ్రమము సుధీంద్రతీర్థుల వారి యాశ్రయములో అత్యంత సౌఖ్యముగ జరిగిపోవు చుండెను.


కాలానుగుణముగ శ్రీ సుధీంద్రతీర్థులవారు వయో వృద్ధులైరి.

పరిణామము చెందుటయే యీపాంచభౌతిక దేహము యొక్క ధర్మముగదా! జీవుడు ప్రారబ్ధానుసార ముగ మాయకులోనై కర్మానుభవముకొఱకు దేహమును బొంది తల్లి గర్భమునందు ప్రవేశించును. తదనంతరము బాల్యమును యౌవనము ను బొంది వృద్ధుడై తుదకు జర్జర దేహమును త్యజించి మఱల జన్మనుబొందును.


ఈ జననమరణ చక్రములో జీవులందఱు అనాదికాల ము నుండి పరిభ్రమించు చుండిరి. ప్రారబ్ధానుసార ముగనె దేహధారికి మంచి విషయములలో, చెడ్డవిష యములలో రాగ ద్వేషము లుద్భవించును. ఈ రాగ ద్వేషము లంకురింప కుండగ యే దేహధారి యైనను నివారింపలేడు. ఈ యిష్టా యిష్టములనెడి రాగములే విష్ణుమాయా శక్తులు. అశాశ్వత ములైన ప్రాపంచిక విషయములపై అంకురించెడి రాగమును నిరోధించుటకు జీవునకు పరమాత్మ స్వాతంత్య్ర ము నొసంగెను. దివ్య లోకములనుండి పతితులై విష్ణుమాయచే ఆవరింప బడి రాగ ద్వేషములతో జనన మరణములతో జరావ్యాధులతో అరిషడ్వర్గములందు జిక్కి పరితపించు జీవులను కేవలము అసంగత్వము, శ్రీహరియందనన్య భక్తి, శ్రీకృష్ణనామసంకీర్తనము, సత్పురుషుల సేవ అనునవి మాత్రమే ముక్తిని ప్రసాదించి పరంధామ మును జేర్పగలవు. ఎంతటివారల కైనను సద్గురువుయొక్క అనుగ్రహము లభింపనిదే విష్ణుమాయ నధిగమిం చుట అసంభవము. 


వయోవృద్ధులైన శ్రీ సుధీంద్రతీర్ధులు అస్వస్థు లైరి. వారికి శ్రీమూల రామారాధనము  అత్యంత కఠిన మయ్యెను. ఏది యేమైనను శ్రీ రామచంద్ర మూర్తి నిత్యారాధనలకు భంగము వాటిల్లరాదు. కావున శ్రీ సుధీంద్రతీర్థులు ఆశ్రమాధి పత్యమును మఱియొక భాగవతోత్త మునకు నొసంగవలె నని సంకల్పించి  ఆ పదవికి అర్హుడు శ్రీ వెంకన్నా చార్యుడే యని నిర్ణయించెను.

ఒక శుభదినమున శ్రీ తీర్థులవారు శ్రీ వెంకన్నా చార్యుని పిలిపించి ఆశ్రమాధిపత్యమును వహింపవలసినదిగా కోరెను.


శ్రీ వెంకన్నా చార్యులు సాక్షాత్తుగ శంఖుకర్ణుడే యైనను మానవ దేహసాహచర్యమువలన విస్మృతి నొంది తన్ను దాను దెలిసికొనలేక విష్ణుమాయా శక్తికి లోనై ముకుళిత హస్తములతో తనగురుదేవుల యెదుట నిలుచుండి యిట్లు పల్కెను. “గురు దేవా! మీరేల నన్నిట్లాజ్ఞాపించు చున్నారు? నే నింకను నా దారాపుత్రుల ప్రేమయందు బద్ధుడనై యున్నాను. నావంటియల్పుడు ఈ అత్యున్నత పదవికి తగునా? నేను సుశీలవతి యైన నాభార్యను, పిన్న వయస్కుడైన పుత్రుని వీడి సన్యసింపలేను. కావున యీ శిష్యుని క్షమింప వలసినదిగ ప్రార్థించు చున్నాను.”


శ్రీ వెంకన్నాచార్యుని వంటి పరమభాగవతోత్తముడే మాయకు లోనగుట గాంచి శ్రీ సుధీంద్రతీర్థులు పరమాశ్చర్య చకితులై తన యంతరంగములోనే విష్ణుమాయ ననేక విధముల స్తుతించిరి. ఆసమయములోనే పూర్వాశ్రమములో శ్రీ తీర్థులవారికి బంధువైన ఒక సజ్జనుడు  ఆశ్రమ వాసిగ నుండెను. వెంకన్నా చార్యులు ఆశ్రమాధి పత్యమును నిరాకరింపగా శ్రీ తీర్ధులవారు దానిని ఆసజ్జనున కొసంగిరి. ఆయనకు సన్యాసాశ్రమ ము నొసంగి శ్రీయాద వేంద్రతీర్థు లని నామకరణ మొనరించి శ్రీసుధీంద్ర తీర్థులు తన బాధ్యతల నన్నింటినీ అప్పగించెను.


ఇట్లు కొంత కాలము గతింపగా శ్రీ సుధీంద్ర తీర్థులు పరిపూర్ణారోగ్య వంతులైరి. అపుడు  శ్రీ తీర్థులు శ్రీయాదవేంద్ర తీర్థుని దేశ సంచారము చేసి హరిభక్తిని ప్రచారము చేయవలసినదిగా ఆదే శించిరి. గురు దేవుని ఆజ్ఞానుసారముగ శ్రీయాద వేంద్ర తీర్థులు తీర్ధ యాత్రలకు బయలు దేరెను. ఇట్లు ఒక సంవత్సరము గతింపగా శ్రీసుధీంద్రతీర్థులు వార్ధక్యము వలన మరల అస్వస్థులయిరి. కాలమాసన్న మగుచున్న దని ఆయతీంద్రులు గ్రహించెను. శ్రీయాదవేంద్ర తీర్థుల కొఱకై పెక్కండ్రు శిష్యులు బయలు దేరిరి, కాని ఆ యతీశ్వరు డెక్క డుండెనో యెవ్వరికిని తెలియలేదు. శ్రీ మూల రామారాధన మవిచ్ఛిన్న ముగ కొనసాగవలెను. కావున పీఠమును శ్రీ వెంకన్నాచార్యున కొసంగ వలెనని శ్రీసుధీంద్రతీర్థులు మరి యొకసారి సంకల్పించి తన ప్రియశిష్యుని రావించి యిట్లు పల్కెను. “వత్సా! నాదరికి రమ్ము, వార్థక్యముచే అస్వస్థుడ నైన నేను శ్రీ మూల రామారాధన మొనరింప లేకున్నాను. ఎట్టి పరిస్థితులలోను శ్రీరామా రాధన మానరాదు. శ్రీయాదవేంద్ర తీర్థులెచ్చట నున్నారో తెలియకున్నది. ఆయన మఱలివచ్చు నంతవరకు ఈ భౌతిక కాయము నిలచునో లేదో కుమారా! దారాపుత్రులపై ఈ ప్రాపంచిక సుఖములపై మమకారమును వీడుము. నీవు కారణజన్ముడవు. ఆజన్మవైష్ణవుడవు. నీ పూర్వజన్మ వృత్తాంత ములను జ్ఞప్తికి దెచ్చు కొనుము. ధనమార్జించుచు కుటుంబమును పోషించు నంతకాలమే కుటుంబ సభ్యులు దేహధారుని ఆదరింపగలరు. వార్థక్య మావరింపగా కుటుంబ సభ్యులే ఆ జీవుని చులకన చేయగలరు.


దేహము శిధిలమైనను వ్యాధులావరించినను జీవుని ఆశా పాశము వీడదు. మానవుడు బాల్యావస్థ నంతయు క్రీడలతో, విద్యాభ్యాస ముతో గడపి యౌవన కాలములో తరుణియందు  ఆసక్తుడై కుటుంబమందలి మోహముతో బానిసవలె జీవితమును గడుపు చుండును.


వృద్ధావస్థలో చింతా మగ్నుడై తరించుమార్గము గానక పరితపించును. జీవుడు సచ్చిదానంద విగ్రహుడైన భగవంతుని ఒక యంశ. తాను స్వతంత్రుడనని భగవం తుని దాసుడను గానని సంకల్ప ముదయింపగనే జీవున కీభౌతిక దేహము లభించును. ఆతడు జనన మరణచక్రమున బడి 'అనంత కాలము మాతృగర్భ నరకము ననుభవించుచు పరి తపించును. వత్సా! నీవంటి మహాత్మునకు మోహము తగునా! శ్రీ విద్యాలక్ష్మి యనుగ్రహము లేనిదే ఈసంసార సాగరమును దాటుట అసంభవము. సర్వధర్మ ముల పరిత్యజించి శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదారవిందముల నాశ్రయించినవారినే ఆమె కరుణించును. కావున భార్యాపుత్రాదిమోహములను వీడి భగవతిని ప్రార్థింపుము. నీకు భగవంతునకు నడుమ అవరోధముగ మాయ యున్నది. భగవంతుని కరుణవలన అది తొలగిపోవును. అపుడు మేఘము తొలగి దివ్య ప్రభలతో ప్రకాశించు ప్రచండార్క దర్శనమువలె  అనంతకోటిసూర్య ప్రకాశ సమన్వితుడు సచ్చిదా నంద విగ్రహుడునగు శ్రీకృష్ణపరమాత్మ యొక్క దర్శనము నీకు లభించును. 


అహర్నిశములు భగవంతు నారాధించుటకు నీవు సన్యసింపక తప్పదు. వేంకటేశా! బ్రహ్మ మొదలు కీటక పర్యంతము గల ఈజగము లన్నియు అశాశ్వతములు. కేవలము భగద్భక్తి, భగవన్నామ సంకీర్తనలే సత్యములు, అక్షరములు నని తెలిసి కొనుము. సర్వము నశ్వర మని, భగవదారాధనయే నిత్యమని ప్రబోధించువారే గురువు, తల్లి, తండ్రి, బంధువు అనిగ్రహింపుము. నాయనా! ఈ శ్వాసలను విశ్వసింపకుము, ఎప్పుడవి ఆగిపోగలవో యెవరికి తెలియును? కావున సత్యమవగత మైనంతనే సర్వమును పరిత్యజించి భగవంతు నాశ్రయించుట అత్యుత్త మ ధర్మము. అఖండ సుఖప్రదాతయైన భగవంతుని సేవలు మరచి జీవులు పరులకు బానిసలై జీవితమంతయు వ్యర్థ పఱచుచున్నారు. ఆహా! ఏమిదుఃఖము. దారా పుత్రులన నేల? సర్వజగమును తృణము వలె విసర్జించి సర్వో త్తముడు, చిదానంద మయుడు, శుద్ధుడు, సచ్చిదానంద విగ్రహుడు నైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణముల నాశ్రయింపుము.


నీవు ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేయుటకు, శ్రీమూలరాముని సేవించు టకు, పీడితమానవుల నుద్ధరించుటకు, శ్రీహరి వాయువులను భక్తిని ప్రచారము చేయుటకు అవనిపై నవతరించిన శ్రీహరిపార్షద శ్రేష్ఠుడవు. నాయనా! నీవు మహా పండితుడవు, అమ్మను ప్రార్థించి ఆమె అనుగ్రహ మునకు పాత్రుడవై జీవుని ఆవరించియున్న మోహావరణములను అసంగఖడ్గముచే ఖండించి భగవద్దర్శనమును బొంది చరితార్థుడవుగమ్ము, లెమ్ము, భయమును వీడుము.


శ్రీ గురు రాఘవేంద్ర

*****

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము

6 వ భాగము  

సమాప్తము**

💥💥💥💥💥💥


🙏 ఓం శ్రీ గురు రాఘవేంద్ర య నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat