Part -17
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం 'ధ్వజారోహణం'.
ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాలసేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు.
ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు.
స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్త వస్త్రంమీద గరుడుడి బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీన్ని 'గరుడధ్వజపటం' అంటారు. దీన్ని ధ్వజస్తంభంమీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు.
గరుడధ్వజపటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో- గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు.
ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే- సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రం.
అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకూ ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు, వారివారి నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం, వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే.
వేంకటేశ్వర స్వామీ వార్లకు మొదటి రోజు కట్టేపంచెలను తెలంగాణా రాష్ట్రములోని " జోగులాంబ గద్వాల్ " జిల్లాకు చెందిన చేనేత కార్మికులు నెల రోజుల పాటు నియమనిష్టలతో నేసిన పంచెల్ని వేంకటేశ్వర స్వామీ వార్లకు కట్టించే సాంప్రదాయాన్ని గద్వాల రాజులు 350 ఏళ్ల క్రితం కొనసాగిస్తే, వారి వారసులు నేటీకి గద్వాల చేనేత కార్మికులతో పంచెలు నేయించి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానమునకు సమర్పిసున్నారు .
ఈ పంచెల్ని కట్టిన తర్వాత అర్చకులు స్వామి చెవిలో మూడు సార్లు " గద్వాల ఏరువాడ జోడు పంచెలు వచ్చాయి " అని చెపుతారు , ఆ తరువాత స్వామికి గద్వాల సంస్థానము వారితో హారతి ఇప్పించడము ఒక సాంప్రదాయముగా వస్తున్నది .
నడిగడ్డగా పిలిచే గద్వాల ప్రాంతము కృష్ణా , తుంగభద్ర నదుల మధ్యలో ఉండటము వలన ఏరువాడగా , రెండు పంచెలు కాబట్టి జోడు అనే పదము వచ్చినదని చేనేత కార్మికులు చెప్పుతారు . వీటిని నేయడానికి నాణ్యమైన పట్టును , మిగితా భాగము నూలును వాడతారు . దీనికి అనుగుణముగా పంచేల అంచులకు ఎక్కువ భాగం ఎరుపు, ఆ పైన ఆకుపచ్చ , బంగారు వర్ణముల పట్టు వాడతారు .
ఈ పంచెలు ఒక్కొకటి పది మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల వెడల్పుతో నేస్తారు.
అనాథరక్షక గోవిందా || ఆపధ్భాందవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా || కరుణాసాగర గోవిందా
గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా.
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️