శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం 🔆మెహబూబ్ నగర్ జిల్లా :"#మల్దకల్ "

P Madhav Kumar


💠 తిరుపతి తెలియని తెలుగువాడు, తిరుమలేశుని భక్తులులేని తెలుగువాడ, సుప్రభాతం వినని తెలుగు ఊరు... 'ఉండనే ఉండదు' అని ఢంకా భజాయించలేం ! 

"తిరుపతి వెళ్తే కీడు జరుగుతుంది "

అని గట్టిగా నమ్మే  ఊరు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది.  

ఇటువంటి విచిత్రమైన నమ్మకం కలిగిన ఆలయం గురించి తెలుసుకుందామా...


💠 సొంత ఇల్లు కడితే... పెళ్లి చేస్తే... బిడ్డ పుడితే... ఉద్యోగమొస్తే... కారు కొంటే... ప్రమోషనొస్తే.... ‘అది ఐతే... ఇది ఐతే’- ఇలా ఏదైనా సరే, 'నిన్ను దర్శించుకుంటాం. స్వామీ' వెంకన్నకి ముడుపులుకట్టే భక్తులు ఎందరో. 

ఏడు సముద్రాలు దాటి ఏడు ఖండాలూ దాటి... ఎక్కడో ఉన్నవారు సైతం వెంకన్న దర్శనానికి తిరుపతి వెళ్తారు.


💠 సూర్యోదయం అయ్యేసరికి తిరుమలేశుని సుప్రభాతంతో తెల్లారే తెలుగు లోగిళ్లు ఎన్నో, శనివారం వచ్చిందంటే గోత్రనామాలతోపాటూ గోవిందనామాలూ జపించే భక్తులూ కోట్లలోనే ఉన్నారు. 

‘తిరుపతికి వెళ్లడం' అనేది ఎంతో పవిత్ర కార్యంగా మనలో చాలామంది భావిస్తారు. దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి మల్దకల్ గ్రామంలో ఉంది. 


💠 'తిరుపతి వెళ్తే కీడు జరుగుతుంది' అని నమ్ముతారు మహబూబ్ నగర్ జిల్లాలోని మల్దకల్ గ్రామస్తులు! 

అలాగని వాళ్లకి వెంకన్న అంటే భక్తి లేక కాదు! వాళ్ల వెంకన్న వాళ్లకే సొంతం. 


💠 మల్దకల్లో స్వయంభూలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. శ్రీనివాసుడు తిరుమల కంటే ముందుగా ఈ గ్రామంలో అడుగుపెట్టాడని స్థానికులు నమ్ముతారు. 

రెండవ తిరుపతిగా వెలుగొందుతున్న మొదలకల్ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో ఆది శిలాక్షేత్రాన్ని గురించి వివరించారు. మొదలు అనగా 'ఆది' అని, కల్లు అనగా 'రాయి' అని అర్థము. 

బ్రహ్మదేవుడు ఒక శిలను సృష్టించి 'ఆదిశిల' అని పేరు పెట్టాడని, అక్కడే పరమ శివుడు తపస్సు నాచరించాడని, అట్టి శిలపై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, అనంతశయన మూర్తి, వరాహస్వామి, ఆంజనేయుడు, ఒకే శిలపై ఉద్భవించారు. 

క్షేత్ర పాలకుడు అయిన పరమేశ్వరుడు ఇచ్చట సతీసమేతంగా వెలిసియున్నాడు.


💠.ఇక్కడ స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని స్థానికులు, భక్తులు మల్దకల్ తిమ్మప్పగా కొలుస్తుంటారు. 

మల్దకల్ ప్రజలకు తిరుపతి వెళ్లే అలవాటు చాలాయేళ్లుగా లేదు. 

ఒకవేళ వెళ్తే ఆ కుటుంబానికి ఏదో కీడు జరుగుతుందని నమ్ముతారు. 

ఎప్పుడో తొంభైయేళ్ల కిందట ఎవరో ఈ నియమాన్ని కాదని తిరుపతి వెళ్లివచ్చారనీ తరువాత అనారోగ్యం పాలయ్యారని గ్రామస్తులు చెబుతారు. 

ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలా ఉన్నాయి. అందుకే వాళ్లెవ్వరూ తిరుపతి వెళ్లరు. 


💠 ఊరిలో వెంకటేశ్వరస్వామి ఆలయం ఉండగా మరో క్షేత్రానికి వెళ్లాల్సిన అవసరం లేదనీ కొందరు చెబుతారు.

ఏదేమైనా ఆ ఊరి ప్రజలకు తిరుపతి ఎలా ఉంటుందో తెలీదు. 

ఇంకో విశ్వాసమూ వెంకటేశునితో ముడిపడి ఉంది. 

అదేంటంటే... గ్రామంలో ఎవ్వరూ రెండంతస్తుల ఇల్లు కట్టకూడదు. ఊరిలో రోజూ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. 

ఆ ఊరేగింపును డాబాల మీద నుండి గానీ ఎత్తైన మరే ప్రదేశాల నుంచిగానీ చూడకూడదు. వెంకటేశ్వరుని కంటే ఆ ఊరిలో ఏదీ ఎత్తుగా ఉండకూడదు. మల్దకల్ పక్కనున్న పెదొడ్డి గ్రామంలో కూడా రెండంతస్తుల ఇళ్లు కనబడవు. తిరుపతి వెళ్లొచ్చినవారూ తారసపడరు. 

వాళ్లకి మల్దకల్లే తిరుపతి!


💠 సుమారు 400 సంవత్సరాల కిందట ఓ మూలనపడి ఉండేదట. అప్పట్లో గద్వాల సంస్థానాన్ని నలసోమ భూపాలుడు పాలించేవాడు. 

ఒక రోజు వేటలో అలిసిపోయి ఒక పుట్ట దగ్గర విశ్రమించాడు, ఆ పుట్టలో ఎదో విగ్రహం ఉంది అని ఒక పశువుల కాపరి చెప్పాడు.

ఒక రాత్రి  భూపాలుడికి కలలో వేంకటేశ్వర 

స్వామి కనిపించాడనీ ,పుట్టలో విగ్రహంతో తనకో ఆలయం నిర్మించమని కోరాడనీ మర్నాడే భూపాలుడు ఆలయ నిర్మాణం మొదలు పెట్టాడనీ స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం. 

అంతేకాదు, ఆ పశువుల కాపరినే అర్చకుడిగా భూపాలుడు నియమించాడనీ చెబుతారు. ప్రస్తుతం గుడిలో అర్చనలు చేస్తున్నవారు కూడా నాటి పశువుల కాపరి వారసులే! 


💠 ఇక్కడ స్వామి అనిరుద్ధ రూపంలో ఉన్నారని భక్తుల విశ్వాసం. ఒకచేతిలో కల్తీ మరో చేతిలో అభయహస్తమూ సుదర్శన చక్రంతో స్వామివారి విగ్రహం తేజోవంతంగా ఉంటుంది. కోర మీసాలు స్వామికి అదనపు అలంకరణ! 


💠 స్వామి పుష్కరిణి, విజయతీర్థం, రామతీర్థం, శేషదాసుల బృందావనం వంటివి ఈ ఊరిలో చూడదగ్గవి. సమీపంలోని ఆదిచింతలాముని ఆలయంలో ఒకే రాతితో చెక్కిన 18 అడుగుల విష్ణుమూర్తి విగ్రహమూ 16 అడుగుల లక్ష్మీదేవి విగ్రహమూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

ఏకశిలతో రూపొందిన అనంతశయనమూర్తి, శ్రీదేవి, భూదేవి, ఆంజనేయుడు, శివుడి విగ్రహాలూ చూడదగ్గవే.

 మల్దకల్లో సతీసమేత నవగ్రహాల విగ్రహాలూ ఉన్నాయి. అంతేకాదు, ఈ ఊరిలో ఓ వేదపాఠశాల కూడా ఉంది. 


💠 మల్దకల్లో ఏటా మార్గశిర మాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. 15రోజులపాటు జరిగే ఈ సంబరాల్లో స్వామివారి కల్యాణోత్సవంతోపాటూ రథోత్సవమూ తెప్పోత్సవమూ ఉంటాయి. వీటిని చూడ్డానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat