💠 మోపిదేవి లోని వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం దక్షిణ భారతదేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది.
మోపిదేవి తెలుగు వారికి అత్యంత ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రం.
💠 సంతానమూర్తిగా శివుడి రూపంలో కొలువుదీరిన ఏకైక శివక్షేత్రం ఇదే కావడం
శివుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకేచోట కొలువుతీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవ క్షేత్రం కృష్ణా జిల్లాలోని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం.
దీనికి మోహినిపురమని సర్పక్షేత్రమని పేరు. కాలక్రమేణ మోపిదేవిగా నామాంతరం చెందింది.
💠 స్థలపురాణం :
స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం ప్రకారం
ఓసారి సనకసనందులు పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారట.
అదే సమయంలో శచీ, స్వాహా మొదలైన దేవతా స్త్రీలూ లక్ష్మీ, సరస్వతులూ కూడా పార్వతీదేవి దర్శనానికి వచ్చారట.
ఇటు రుషులూ, ఆభరణాలు ధరించిన దేవతా స్త్రీలను చూసిన కుమారస్వామి నవ్వడం మొదలు పెట్టాడట. అది చూసిన పార్వతీదేవి కుమారుడిని సున్నితంగా మందలించడంతో కుమారస్వామి తల్లిని క్షమించమని కోరడంతోపాటు పాప పరిహారార్ధం తపస్సు. చేసేందుకు సిద్ధమయ్యాడట.
అలా ఈ ప్రాంతానికి వచ్చిన కుమారస్వామి పాము రూపంలోకి మారి ఓ పుట్టను ఏర్పరచుకుని తపస్సు ప్రారంభించాడట.
💠 అలాగే ఆగస్త్య మహర్షి ఉత్తర కాశీలో తపస్సు సాగిస్తుండగా, వింధ్య పర్వతం గర్వంతో ఎత్తు ఎదిగిపోయి సూర్య మండలాన్ని దాటిపోయింది. దానితో సూర్యగతి ఆగిపోయి ప్రకృతి స్తంభించి పోయింది.
ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించి బ్రహ్మాది దేవతలు కౌశికానగరానికి వచ్చి అగస్త్యుడ్ని ప్రార్థించి ఈ ప్రమాదాన్ని తప్పించమని కోరతారు.
💠 కాశీని విడిచి వెళ్ళడం అగస్త్యునికి ఇష్టం లేకపోయినా లోక శ్రేయస్సు దృష్ట్యా భార్య లోపాముద్రతో అక్కడి నుంచి దక్షిణానికి బయలుదేరాడు.
త్రోవలో వింధ్యుడు, అగస్త్యుడి రాక గురించి విని ఆయన ముందు సాష్టాంగపడి, ఆయనకు త్రోవ నిచ్చాడు. తను తిరిగి వచ్చే వరకు అలాగే వుండమని శాసించి ముందుకు సాగాడు అగస్త్యుడు.
💠 అలా ఆగస్త్యుడు కృష్ణానది తీరాన్ని సమీపించి ఒక చోట ఆగిపోయాడు.
అక్కడ కృష్ణానది ఉత్తర వాహినియై ప్రవహిస్తోంది. ఆ ప్రాంత మంతా పెద్ద పెద్ద పుట్టలతో నిండి వుంది. ఓ పెద్ద పుట్ట రంధ్రంలోంచి వెలుగు బయటకోస్తోంది.
ఆ వల్మీకంలో ఉన్నది శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి అని గ్రహించి ఇదే “సుబ్రమణ్య క్షేత్రమని ఇది భుక్తి ము క్తి ఫలప్రదమని “శిష్యులకు వివరించాడు అగస్త్యుడు.
మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగవలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు.
💠 కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టల తో నిండిపోయింది.ఈ ఆలయానికి దగ్గరలో 'వీరారపు పర్వతాలు' అనే కుమ్మరి మహాభక్తుడు ఉండేవాడు. అతను స్వామిని నమ్ముకొని జీవిస్తుండగా, అతని నిష్కల్మష భక్తికి సంతోషించి కలలో కనిపించి తానున్న పుట్టని చూపించి ఆలయాన్ని నిర్మించి అందులో ఆ పుట్టలోని ఆర్ లింగాన్ని తీసి ప్రతిష్ఠ చేయమని స్వామి ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన కల గురించి అందరికీ వివరంగా చెప్పి, తనకి కలలో కన్పించిన పుట్టని చూపించాడు. తరువాత పుట్టను త్రవ్వించి లింగాన్ని పైకి తీసి ఆ పుట్టమీదే ప్రతిష్టించాడు.
మట్టితో స్వామికి ఇష్టమైన నంది,గుర్రము మొదలైనవాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు.
💠 స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణమార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.
💠 ఇక్కడ స్వామివారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవగా భక్తులు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం,మనోవ్యాధి, చర్మ సంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకల సంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు.
💠 స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు.
💠 మోపిదేవి ఆలయం. విజయవాడకు 70 కిలోమీటర్ల మచిలీపట్నానికి 35 కిలోమీటర్లు, గుంటూరు జిల్లా రేపల్లెకు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది