కృష్ణం వందే జగద్గురుం"
సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్మ ద్వారా వ్యక్తమైన శ్రీ మద్ భగవద్ గీతలు ఇహమునకు, పరమునకు అత్యంత ఉపయుక్తమైనవి,
గీతాచార్యుని ఉపదేశములు అమృతోపమానములు.
ఈ జీవామృతాన్ని మనసారా గ్రోలుదాం ! అందరికీ పంచుదాం !!!
=======================
చతుర్ధోధ్యాయము : 4వ అధ్యాయము: జ్ఞాన యోగము
3వ శ్లోకమునకు అనుబంధము-2:
వాల్మీకి మహాముని ఈ నవ విధ భక్తి మార్గముల గురించి శ్రీ రామచంద్రుడు లక్ష్మణునికి వివరించినట్లు వ్రాసారు.
“ధన్యో రామకథా శ్రుతౌ చ హనుమాన్, వల్మీక భూః కీర్తనే
సీతా సంస్మరణే తథైవ భరతః శ్రీ పాదుకా సేవనే
పూజాయాం శబరీ, ప్రణామ కరణే లంకాధిపో, లక్ష్మణే
దాస్యే, సఖ్య కృతేర్కజః తనూ పరిత్యాగే జటాయుర్నవ ||”
శ్రీమద్ రామాయణం లోని ఈ శ్లోకం లో తొమ్మిది మంది భక్తులను పేర్కొన్నారు.
హనుమంతుడు, - శ్రవణభక్తుడు. శ్రీరాముని చరితామృతాన్ని, రామనామాన్ని వినడంయందే ఆయనకు ఆసక్తి. లోకంలో శ్రీరామ కథ వ్యాపించి ఉన్నంతవరకూ తాను కూడా జీవించి ఉండేట్లు వరాన్ని పొందాడు. అందుకే ఇప్పటికీ ఎక్కడ రామనామ జపం జరిగినా అక్కడికి హనుమ ఏదో ఒక రూపంలో వస్తాడంటారు. ఎక్కడెక్కడ రఘునాథుని చరితం కీర్తింపబడుతుందో అక్కడికి చేరుకుని రెండు చేతులనూ జోడించి, శిరస్సు పైకి చేర్చి ఆనందాశ్రునయనాలతో రామకథను వింటాడని ప్రసిద్ధి.
వాల్మీకి మహర్షి- కీర్తన భక్తుడు. నారదుని ఉపదేశంతో, బ్రహ్మదేవుని వరంతో.. తానెరిగిన శ్రీరామ తత్వాన్ని 24 వేల శ్లోకాల్లో శ్రీరామాయణంగా ఆ మహర్షి లోకానికి అందించాడు. రామాయణాన్ని కుశలవులకు ఉపదేశించి, వారిచే అశ్వమేధ యాగ సందర్భంలో పాడించి లోకంలో శ్రీరామయణాన్ని విస్తరింపజేసి కీర్తన భక్తుడిగా వాల్మీకి మహర్షి ప్రసిద్ధుడయ్యాడు.,
సీతమ్మ తల్లి- స్మరణ భక్తురాలు. శ్రీరామునికి దూరమైన ఆ తల్లి లంకలోని అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నా నిరంతరం రామనామ స్మరణతోనే కాలాన్ని గడిపింది.
భరతుడు- శ్రీరాముని సోదరుడైన భరతుడు పాదుకాసేవన భక్తుడు. కైకేయి, కులగురువైన వశిష్ఠుడు.. ఇలా ఎంత మంది చెప్పినా సింహాసనాన్ని తాను అధిరోహించలేదు. శ్రీరామపాదుకలకే పట్టాభిషేకం చేసి, భక్తితో ఆ పాదుకలను సేవించిన ఘనచరితుడు. ,
శబరి- మతంగ మహర్షి శిష్యుల ఆదేశాన్ని అనుసరించి 13 సంవత్సరాలపాటు శ్రీరాముని రాకకై ఎదురుచూసి... ఆ స్వామిని భక్తితో పూజించి, అతిథి సత్కారాలను నిర్వర్తించి ముక్తినొందిన ధన్యురాలు శబరి.,
విభీషణుడు-ప్రణామ భక్తుడు. అందుకే, యుద్ధానంతరం శ్రీరాముడు అతణ్ని లంకాధిపతిని చేశాడు. ,
లక్ష్మణుడు-దాస్యభక్తుడు. శ్రీరాముని పాదాలను గట్టిగా పట్టుకొని ఆయన వెంటే అడవికి వెళ్లి, రాత్రింబవళ్లూ సేవలు చేసిన ధన్యచరితుడు సౌమిత్రి.
సుగ్రీవుడు-శ్రీరాముని సుఖమే తన సుఖంగా, శ్రీరాముని దుఃఖమే తన దుఃఖంగా భావించి సీతాన్వేషణలో సాయం చేసి గొప్ప మిత్రుడనిపించుకున్న సుగ్రీవుడిది సఖ్య భక్తి.,
జటాయువు- సీతాదేవిని ఎత్తుకుపోతున్న రావణుని ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన జటాయువు. శరీర పరిత్యాగ భక్తుడు. రావణునితో పోరులో తీవ్రంగా గాయపడినా.. రామలక్ష్మణులు వచ్చేంతవరకూ తన ప్రాణాలను బిగబట్టుకొని సీతమ్మకు కలిగిన కష్టాన్ని గురించి తెలిపాకే అసువులు బాసిన భక్తుడు. శ్రీరాముడు స్వయంగా తన చేతులతో జటాయువుకు శ్రద్ధాభక్తులతో అంత్యక్రియలను నిర్వహించాడు.
శ్రీమద్రామాయణం లోని ఈ నవవిధ భక్తులు లోకానికంతటికీ ఆదర్శం.
శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి "నీవు నా సఖుడవు, భక్తుడవు, అంతరంగికుడవు" కనుక రహస్యమైన ఈ యోగ విద్యను నీకు ఉపదేశిస్తున్నాను అన్నారు.
ఏ విధంగా అర్జునుడు భగవానునికి ఇంత దగ్గరయ్యాడు అని తెలుసుకోవటానికి ఈ నవవిధ భక్తిమార్గాలు, నవ విధ భక్తుల గురించిన వివరాలు ఉపయోగపడతాయనే భావనతో ఇంతగా విశదీకరించబడినది.
పాఠకులు సహృదయతతో స్వీకరిస్తారని నా విశ్వాసం.
- కిరణ్ కుమార్ నిడుమోలు