#గురు ఉపదేశం పొందుటకు కావలసిన అర్హతలు - 2*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*"స్వామి నాకు సరిగ్గా అర్థం కాలేదు"* అని జనకుడు అడుగగా....... ఏది నీ ప్రశ్నను మరోసారి అడుగు అనెను మునీశ్వరుడు. జనకుడు తన కొచ్చిన కలను వివరించి ఏది నిజం అని అడిగెను. అష్టా వక్రులు ఇప్పుడు తన సమాధానాన్ని వివరించెను. అది ఎలా నిజము కాదో ఇదియు అలాంటిదే. మెలకువ రాగానే కలచెదరి పోయినది. అలాగే జీవితము గూడ శాశ్వత మైనది కాదు. ఒక నాటికి లేక పోవును. కల ఎలా నిజము కాదో అలాగే ఈ ఇహ జీవితములోని సుఖములన్నియు ఒకనాటికి కలలాగ మాయమైపోవును. కలలోని అస్థిరత్వము త్వరగా తేలిపోవును. కాని జీవితములో అస్థిరత్వము గోచరించుట కొంతకాలము పట్టును. ఈ ప్రపంచము యొక్క అస్థిరత్వమును తెలుపుట కొరకే స్వప్నలోకాన్ని భగవంతుడు సృష్టించియున్నాడు. అనెను. ఆమాటలు వలన సందేహము తొలగిన జనకమహారాజు మునీశ్వరుని పాదాల మీదపడి *"మీరు మహాజ్ఞానియని తెలుసుకొన్నాను. మిమ్మల్ని నాగురువుగా స్వీకరిస్తున్నాను. బ్రహ్మజ్ఞానము బడయుటకు మార్గము ఉపదేశింపవలయును" అని వేడుకొనెను. అందులకు అష్టావక్రులు అలాగే కానిద్దాం "అయితేనాకు గురుదక్షిణగా ఏమిస్తావు" అని ప్రశ్నించగా జనకుడు సమీపముననున్న మంత్రి వర్యులతో సైగ చేయగా మంత్రి ఖజానాలోని ధన రాసు లన్నిటిని ముని ముంగిట కొండలాపోసెను. అదిగాంచిన అష్టావక్రులు అల్పమైన సిరిసంపదల మీద నాకెన్నడూ మక్కువ లేదు. నిజమైన భక్తియుండినచో నీ సర్వస్వమును , మనః ప్రాణేంద్రియము లను అర్పించుమా"* అని అడిగెను. క్షణకాలము గూడ ఆలోచించక జనకుడు తననే వారి పాదమున అర్పించి సాష్టాంగ పడెను. అప్పుడు రాజు కొలువులోనికి యొక పేద బ్రాహ్మణుడు తన కుమారుని ఉపనయన ఖర్చు నిమిత్తం జనకమహారాజుతో యాచకము పొంద గోరివచ్చెను. రాజుకు నమ స్కరించి యాచకము అడిగెను.
రాజు ఏమియు పలుకక ఊరకుండెను. కళ్ల ఎదుట కొండలాపడియున్న ధనాన్ని మౌనము వహించే రాజును చూసిన బ్రాహ్మణునికి , రాజు ఇంతసిరిసంపదలను పెట్టుకొని ఉపనయనానికి యాచకము అడిగితే ఇవ్వడేమిటాయని కోపము తలకెక్కి రాజును పలురీత్యా నిందింపసాగెను. సభలోనున్న మంత్రివర్యులు , సైనికులు యాచకుని దండించదలచి రాజు ఆజ్ఞకొరకై వేచియుండిరి. ముంగిట యుండే ధనము నుండి కాస్త ఈ బ్రాహ్మణుని కి ఇస్తామా ? అని ఒకక్షణం రాజుఆలోచించెను. అలాయిస్తే ఈ బ్రాహ్మణుడు కొన్ని మాటలతో తనను స్తుతించి వెళ్ళిపోతాడు. నిందనో స్తుతినో లెక్కించడానికిప్పుడు నాకు అధికారము ఎక్కడుంది ? ఋషికి దక్షిణగా ఇచ్చిన సొమ్ము నుండి దానము చేసే హక్కు మాత్ర మెక్కడుంది. సర్వము గురువశమైనది. ఒక వేళనేను యాచక మివ్వలేదని కోపించిన ఆ బ్రాహ్మణుడు నన్ను శపించినా అది నన్ను అంట జాలదు. సర్వమును గురుదేవులు చూసుకొంటారు. ఇచ్చట నేను నిమిత్తమాత్రుడనే అనితలచి ఊరకుండి పోయాడు.
ఇంకనూ కాస్త పరీక్షించదలచినముని *"జనకా ! ఇవన్నియు నీ సొమ్మే కావాలంటే ఇందుండి నీకిష్టం వచ్చినంత బ్రాహ్మణునికి ఇచ్చి పంపడంలో నాకెట్టి ఆక్షేపణయులేదు"* అనెను. అందులకు జనకుడు *" స్వామి ! ఈ భూమిలో ఇక నాది అంటూ ఏమియులేదు. సర్వము మీదే. మీరు నన్నెలా నడిపిస్తే అలానేను నడుస్తాను. నన్ను అనుగ్రహించండి"* అని గురుపదముల పట్టెను. సంతసించిన అష్టా వక్రులు *" జనకా ! బ్రహ్మజ్ఞానము బడయదలచిన వానికి కావలసిన అర్హతలన్నియు నీలోయున్నవి. నిన్నునా శిష్యునిగా అంగీకరిస్తు న్నాను"* అనిచెప్పి యాచకుడుగా వచ్చిన ఆ బ్రాహ్మణునికి కావలసినంత ధనమిచ్చి అతని కుమారుని ఉపనయనాన్ని దగ్గరుండి జరిపించిరి. వినయముతోను , పట్టుదలతోను , గురుసేవ చేసి నిందలను , పొగడ్తలను లెక్క చేయక పరిపూర్ణముగా శరణాగతి పొందువారికి గురువనుగ్రహము సంపూర్ణముగా లభించును అనుదాన్ని పై ఉదాహరణ చక్కగా ప్రబోధిస్తున్నది. సద్గురునింద చేసినవారు , ఊర కుక్కగా జన్మించి ఒక యుగ కాలం గమ్యంలేక తిరుగులాడి పిదప భూమిలో పురుగై పుడుతారన్నది పెద్దల హెచ్చరిక. తనకు లభించిన గురువు స్వల్పజ్ఞానసంపన్నుడైనను అతనిలో యుండు లోపములను వేలెత్తి చూపించి కించపరచక అతనిలో తనకు కావలసినదై యుండు సద్విషయములను మాత్రము హంసక్షీర న్యాయములా గ్రహించుకొనుటయే ఉత్తమ శిష్యుని లక్షణము. ఇక తనదరిచేరిన శిష్యులకు గురువు దీక్షను ఎలాప్రసాదిస్తాడో చూద్దాము. ఈ ఉపదేశము ఎనిమిది అంచెలుగా ఉపదేశించ బడును. దీక్షా బేధములు అను గ్రంథములో శివపార్వతి సంవాదంగా చెప్పబడియున్నది.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*🌹🙏