*గురుగీత*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
శ్రీ క్రింది శ్లోకములు *"శ్రీ గురుగీత"* అనే గ్రంథమునుండి సేకరించబడినవి అగును. ఉమామహేశ్వరుల సంవాద రూపమున తెలియుచు శిష్టాచారసంప్రదాయమున శోభించుచున్నది. *ఈ గ్రంథము స్కాంద పురాణాంతర్గతము.* గురువు ఎవరు ? గురుదేవుని మహిమ ఎలాంటిది ? గురువు వద్ద ఎలా జీవించాలి. ఎలా చరించాలి ? ఎలా స్కరించాలి. అన్న విషయములు , గురువు యొక్క ఆవశ్యకత , ప్రాముఖ్యత గురించి ఎందరో మహాపురుషులు , మహర్షులు ఎన్నోరకాలుగా ఎన్నెన్నో గ్రంథాల రూపంగా సందేశములు ఇచ్చారు. అటువంటి గురువులు శిష్యులను తరింప జేయుటకు అనేక మార్గాలు చూపించారు.
శబరిమల యాత్రకు దీక్షతీసుకొనే స్వాములకు ధీమంతులైన గురువులు దీక్షనిచ్చి మోక్షమార్గాన్ని సుగమంచేస్తారు. అట్టి దీక్షాదక్షులైన గురువులకు 18వ శబరి పడియాత్రలు పూర్తి చేసిన గురుస్వాములకు వినమ్రముతో , భక్తితో , పాదాభివందనములతో , స్వామి శరణాలతో , *'ఈ గురుగీత'లో* ముఖ్యమైన 18 శ్లోకములు ప్రత్యేకంగా సేకరింపబడి సమర్పించబడినవి. ఈ నిత్య పఠనీయ శ్లోకములు సాధకులకు సానుకూలంగా సులువుగా వుండేటందుకు , భావార్థముతో అందించబడినాము. స్వామి శరణం.
1. గురురహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః |
గురువే బ్రహ్మదేవుడు , గురువే విష్ణు దేవుడు , గురువే దేవదేవుడైన మహేశ్వరుడు , గురువే అవ్యక్త పరబ్రహ్మము. అట్టి గురుదేవునకు నమస్కృతులు. అట్టి సద్గురు దేవునకు నమస్కారము.
2. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం , తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవేనమః ॥
అఖండమై , మండఆకారమైన చరాచర ప్రపంచము ఎవనిచే పరివ్యాపితమై యున్నదో అట్టి తత్పదము ఎవరిచేత దర్శింప బడెనో అట్టి సద్గురు దేవునకు నమస్కరించు చున్నాను.
3. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్త్వమస్వాది లక్ష్యం |
ఏకం నిత్యం విమల మచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణ రహితం సద్గురుం తం నమామి ॥
బ్రహ్మానందమయుడు , నిత్యసుఖ ప్రదాత కేవలం జ్ఞానమయుడు , ద్వంద్వాతీతుడు , ఆకాశసమానుడు , తత్త్వమస్యాది మహావాక్యముల లక్ష్యార్దరూపుడు , అద్వితీయుడు , నిత్యుడు , నిర్మలుడు , చలన రహితుడు , సర్వ భూతముల బుద్ధికి సాక్షియైనవాడు , భావాతీతుడు , గుణరహితుడైన సద్గురుదేవుని నమస్కరించు చున్నాను.
4. అజ్ఞాన తిమిరాన్దస్య జ్ఞానాంజన శలాకయా |
చక్షు రున్మీలితంయైన తస్మై శ్రీ గురవేనమః ॥
అవిద్యయనెడి చీకటిచే దృష్టిలోపించిన వానిని జ్ఞానమనెడి కాటుక పుల్లచే ఏ గురువునేత్రమును ప్రసాదించునో అట్టి గురు దేవునకు నమస్కారములు.
5. చైతన్యం శాశ్వతం వ్యోమాతీతం నిరంజనమ్ ।
నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవేనమః ॥
చైతన్య స్వరూపుడు , నిత్యుడు శాంతస్వరూపుడు గగనము నతిక్రమించినవాడు నిరంజనుడు , నాదబిందు కళాతీతుడు అగు గురు దేవునికి నమస్కారము.
6. జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషిణే |
భుక్తిముక్తి ప్రదాత్రేచ తస్మై శ్రీ గురవేనమః ॥
జ్ఞానశక్తితో కూడినవాడు , వేదాంతార్థము లనెడి మాలను ధరించిన వాడు, భుక్తి ముక్తులను ప్రసాదించువాడు అగు గురుమూర్తికి నమస్కృతులు.
7. అనేకజన్మ సంప్రాప్తం కర్మబంధ విదాహినే |
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురువేనమః ॥
అనేక జన్మార్జితమగు కర్మ బంధములు ఏజ్ఞానాగ్ని ప్రభావముచే దగ్గమగుచున్నవో అట్టి జ్ఞానానల స్వరూపుడగు గురుదేవునకు వందనములు.
8. గురోరధికం తత్త్వం న గురో రధికం తపః |
న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవేనమః ॥
గురుదేవుని కంటేను సత్యమగు వస్తువు మరొకటిలేదు - గురువునకు మించిన తపస్సులేదు. గురువుని మించిన జ్ఞానము లేదు. అట్టి గురుదేవునకు వందనములు.
9. గురురాది రనాదిశ్చ గురుం పరమదైవతమ్ |
గురుమంత్ర నమోనాస్తి తస్మై శ్రీ గురవేనమః ॥
సకలమునకు కారణమైన గురుమూర్తే తనకు ఏ కారణములేనివాడై యున్నాడు. గురువే పరమ దైవము. గురుమంత్రమునకు సమానమగు మంత్రములేదు. అట్టి గురుదేవునకు ప్రణామములు.
10. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం |
మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపా ॥
గురుదేవుడే ధ్యానమునందు ధ్యేరూపుడు. పూజయందు గురు దేవుని చరణములే అర్చనా మూర్తులు. గురు దేవుని వాక్యమే జపమునకు ఆలంబనము. గురు కృపయే మోక్షమునకు కారణమగుచున్నది.
11. వందేహం సచ్చిదానందం భావాతీత జగద్గురుమ్ |
నిత్యం పూర్ణం నిరాకారం నిర్గుణం స్వాత్మ సంస్థితమ్ ॥
సచ్చిదానంద స్వరూపుడు , భావాతీతుడు , నిత్యుడు , పరిపూర్ణుడు , నిరాకారుడు , నిర్గుణుడు ఆత్మస్థితుడు అగు గురుదేవునికి నమస్కరించుచున్నాను.
12. అంగుష్ట మాత్రం పురుషం ధ్యాయేత్ ఛిన్మయం హృతి |
తత్రస్పురతి యోభావః శృణు తత్కధీయామితే॥
హృదయ కమలమున అంగుష్ట మాత్రుడు , చిన్మయుడైన గురుదేవుని ధ్యానించవలెను. హృదయ పద్మమున ఏ పరమాత్మ జ్ఞానము ప్రకాశించునో దానిని గూర్చి చెప్పుచున్నాను.
13. గురుధ్యానే నైవనిత్యం దేహీ బ్రహ్మమయో భవేత్ |
స్థితశ్చ యత్రకుత్రాపి ముక్తో సేనాత్ర సంశయః ॥
సదాగురుధ్యానము చేయువాడు బ్రహ్మమయుడగు చున్నాడు. అతడు ఎచ్చట యుండినను ముక్తుడే. ఈ విషయములో సందేహములేదు.
14. గురుగీతా మిమాందేవి హృది నిత్యం విభావయ
మహావ్యాధి గత్తెర్ద్ ఖైర్వదా ప్రజపేన్ముదా||
పార్వతీ ! ఈ గురుగీతను మనస్సునందు సదాభావన చేయుము. దీనిని జపించుటచేత దీర్గవ్యాధులు , దుఃఖములు నశించును. కనుక సంతోషముతో జపించుము.
15. విద్యాధనం బలంచైవ తేషాం భాగ్యం నిరర్థకమ్ ।
యేషాం గురుకృపానాస్తి అధోగచ్ఛన్తి పార్వతి ||
బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ దేవాశ్చ పితృకిన్నరాః | సిద్ధచారణ యక్షాక్ష అన్యేచమునయేః జనాః ॥
హే పార్వతీ ! ఎవరికి గురుకృపలేదో అట్టివారి చదువు , ధనము , శక్తి , భాగ్యము నిరర్ధకములే యగుచున్నవి. వారు అధో లోకములను పొందుచున్నారు. గురు కృప తప్పినవారికి బ్రహ్మ , విష్ణు , రుద్ర మహేశ్వరులను , దేవతలు , పితృ దేవతలు , కిన్నెరులు , సిద్దులు , చారణులు , యక్షులు మరియు మహర్షులు కూడా దూరమగు చున్నారు.
16. సంసారసాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాది దేవ మునిపూజిత సిద్ధ మంత్రం |
దారిద్ర దుఃఖ భవరోగ వినాశ మంత్రం వందే మహాభయ హరం గురురాజ మంత్రం ॥
గురుమహా మంత్రము సంసార సాగరమునుండి ఉద్దరించును. బ్రహ్మ , దేవ , మహర్షులు పూజించు సిద్ధమంత్రము , దారిద్ర్యమును , దుఃఖమును , భావరోగమును , నశింపచేయు మంత్రము. మహా భయము నుండి రక్షించు 'గురు' అనెడి మంత్ర రాజమునకు నమస్కారము.
17. శ్రీ మత్సరం బ్రహ్మ గురుం స్మరామి
శ్రీ మత్పరం బ్రహ్మ గురుం భజామి |
శ్రీమత్పరం బ్రహ్మ గురుం వదామి శ్రీ మత్పరం బ్రహ్మ గురుం నమామి ॥
జ్ఞానరూపుడు , పరబ్రహ్మమగు గురుదేవుని స్మరించుచున్నాను. దివ్యరూపుడు. పరబ్రహ్మమగు గురువర్యుని భజించుచున్నాను , చైతన్యరూపుడు , పరబ్రహ్మమగు గురుమూర్తిని చెప్పుచున్నాను. అద్వయ స్వరూపుడు , పరబ్రహ్మమగు గురుచంద్రుని సమస్కరించు చున్నాను.
18. సప్తకోటి మహా మంత్రాః చిత్త విభ్రమకారకాః |
ఏక ఏక మహామంత్రో గురురిత్యక్షర ద్వయం |
ఏడుకోట్ల మహా మంత్రములు చిత్త చాపల్యమునకు కారణమగు చున్నవి. 'గురు' అనెడి రెండు అక్షరముల మంత్రమే
శాంతిని ప్రసాదించుచున్నది. - *ఓం గురుం గురుభ్యోనమః*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*