అయ్యప్ప సర్వస్వం - 27

P Madhav Kumar


*మాలాధారణ మంత్ర వైశిష్ట్యము*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


హైందవ సంస్కృతి యందు విభిన్న విశ్వాసములతో భిన్న భిన్న మార్గముల ద్వార పరమేశ్వరుని ధ్యానించి , ఆరాధించుచు మన కామితార్ధములను బడయుచున్నారు. కొందరు వేద విహిత మార్గమున యజ్ఞ యాగాది క్రతువులు నొనరించి కామ్యముల నొందుచుండ కొందరు వేద ఉపనిషత్మార్గ బోధిత జ్ఞానమార్గము నవలంభించుచు ఈప్సితములనీడేర్చు కొనుచున్నారు. కొందరు యోగ మార్గము , మరికొందరు భక్తి , వైరాగ్య మార్గముల భగవానుని దర్శించుకొనుచు ఏ మార్గమున పయనించినను , భగవానుని దర్శించుటకు కఠిననియమాల ద్వారా సాధన చేయాలని వేదములు , ఉపనిషత్తులు , శ్రుతులు చెప్పుచున్న వని మన మహర్షులు తెలిపి యున్నారు. ఇట్టి కఠిన నియమముల నాచరించుచు నియమిత జీవనము సాగించుటనే దీక్షయని పెద్దలు తెలిపినారు. *"శ్రద్ధావాన్ లభతే జ్ఞానం"* అని భగవద్గీతో పనిషత్తు నందును , వశిష్ఠ రామాయణ మందును , శ్రుతుల యందును , ఉపనిషత్తుల యందును తెలిపినారు. దీక్షాయుతుడు శ్రద్ధాభక్తులతో పరమేశ్వరుని ఆరాధించిన కామితముల నొంద గలడు. దీక్షాకాలమున నిషేధించిన క్రియల నొనరించిన దీక్షితుని నుండి దీక్ష తొలగును. పాపము అతనికి సంభవించును. యజుర్వేదము నందును ఈ మంత్రము ఇలా స్పష్టము చేయుచున్నది.


*య దీక్షితో మేధ్వం పశ్యత్య పాప్మాదీక్షా క్రామతి నీలమస్య హరోవేత్య*


శ్రీ ధర్మశాస్తా వారి అనుగ్రహమును కాంక్షించు భక్తులు మండలకాలము దీక్షాబద్దులై కఠిన నియమముల నాచరించుచూ విబుధులైన గురుస్వాములచే బోధింపబడిన మార్గమున శ్రీస్వామివారిని సేవించి తరించుచున్నారు. ఈ దీక్షాకాలము సాధకునికి తొలుత నియమాచరణకై యొక మండలకాలముగా నిర్ణయించి నారు. కాని మోక్షగామి ఈ సాధనను నిరంతరము సాగించవలయును. లేనిచో పలురీతులా చరించు మనసు పంచేంద్రియములను అరిషడ్వర్గములు బారినపడి వేదన చెందును. భక్తులు దీక్షాకాలమైన మండలకాలము పిదవ కూడా నియమిత జీవనమును గడిపిన భగవానుని అనుగ్రహము పొందగలరు. ఈ దీక్షను ప్రారంభించుటకు మాలాధారణ చేయుదురు. మాల ధరించు సమయమున దీక్షా దక్షులు గురుముఖంగా మాలాధారణ మంత్రమును పఠింతురు. ఈమాల ఒక చిహ్నముగా భావించి కొందరు దీక్షాకాలమునకు ముందుగ వివిధ కారణములతో మాలను తీసివేసి దానిని అపవిత్రము చేయుచున్నారు. ఈ మాలాధారణ సమయమున సాధకునిచే చెప్పించబడు మంత్రార్ధములు తెలియక తమ మనోల్లాసమునకు వేసిన ఒక పూసల మాలగా భావించు చున్నారు. కాని దాని యర్ధ మిట్లున్నది.


*తాత్పర్యము*


సద్గురువు నాశ్రయించి , గురువును సేవించి సంతోష పరచి అతని అనుగ్రహమును పొంది శరణాగతి నొంది , నిత్యము , సత్యమునైన శబరియాశ్రమమందు సాక్షాత్కరించిన నీ శరణాగత ముద్రను నమస్కరించి ధరించు చున్నాను. ఈ మంత్రము సాధకుడు దీక్షనెట్లు గ్రహించ వలయును. సాధన నెట్లు చేయవలయును అను విషయము బహు విపులముగా గోచరించుచున్నది.


*గురుముద్ర , శాస్త్ర ముద్ర*


గురువును ఆశ్రయించి సేవించిన అతని అనుగ్రహముచే శాస్త్రాధ్యయనము అలవడును. వేద శృతి , శాస్త్ర పురాణ , ఉపనిషత్ లందు భగవానుని స్వరూప మెట్లు నిరూపించ బడినదియు. భగవత్సాక్షాత్కారమునకు సాధకుడు చేయవలసిన సాధన విధానమును పొందవచ్చును. ఇట్టి రహస్యము తెలుపుచున్నవి. గురుముద్ర , శాస్త్ర ముద్రలు.


*జ్ఞానముద్రాం*


గురువును ఆశ్రయించి పొందిన శాస్త్ర జ్ఞానము వలన బ్రహ్మమును (పరమేశ్వరుని) తెలిసికొను జ్ఞానము కలుగును.


*వనముద్రాం*


భగవత్సాక్షాత్కారము (బ్రహ్మ జ్ఞానము) పొందిన సాధకుడు జనన , మరణ , జరాభయ యుతము దుఃఖదాయకమైన సంసార కాననమును దాటి మోక్షము నొందగలడు.


*శుద్ద ముద్రాం*


నిరంతర సాధనచే బ్రహ్మజ్ఞాని శుద్ధ సత్వస్వరూపాత్మానంద చిత్తుడై చరించును.


*రుద్రముద్రాం*


స్వాత్వానంద చిత్తుడైన జ్ఞాని జనన , మరణ దుఃఖరహితుడై ముక్తి పదము నొందును.


*సత్యముద్ర , శాంతముద్ర , వ్రతముద్ర*


సాధకుడు నియమిత జీవన వ్రతమాచరించి , శాంత చిత్తుడై పరమేశ్వరుని ధర్మశాస్తా వారిని) ధ్యానించిన సత్యము నిత్యము అయిన ఆ భగవంతుని అనుగ్రహము పొందవచ్చును. నిరంతర సాధనచే పంచేంద్రియములు నిగ్రహించబడి కళ్ళెములేని గుర్రము విధమున పరుగిడు మనస్సు స్థిరత్వమునొందును. స్థిరచిత్తుడు అరిషడ్వర్గములను సాధించి , శుద్ధ సత్వము , నిత్యము సత్యము అయిన బ్రహ్మమును గాంచును.


*భద్రముద్ర*


స్థిర చిత్తుడైన సాధకుడు గురువు అనుగ్రహము నొందినచో జీవన కాలము నందు యాతనామయ జనన మరణముల నొందని శాశ్వత మార్గము గాంచి భద్ర చిత్తుడై చిత్తమున ఆత్మ సంధానము నొనర్చి  ఆనందమయుడు అగును.


*ఖేచరి ముద్ర*


ఈ ముద్ర సాధనచే కాకివలె ప్రాపంచిక విషయ లంపటములు చిక్కుపడిన మనస్సును , పంచేంద్రియములను నిలువరించి ఆత్మస్వరూప పరబ్రహ్మ (ధర్మశాస్త్రా) పరమేశ్వరుని సాధకుడు గాంచి తరించును.


*చిన్ముద్రాం*


స్థిర చిత్తుడై నిరంతర సాధనచేయు భక్తుడు త్రిగుణ (సత్వ రజస్తమో గుణములు) రహితుడై విశ్వము నంతయు నిండి యున్న పరమేశ్వరుని గాంచి అతని యందు లీనమై అద్వైత మయుడై ముక్తి పదము నొందును. ఇట్లు పవిత్ర , ఉత్కృష్ట , మహోన్నత నిగూఢార్ధములు గలిగిన మాలను ధరించు భక్తులు నిర్మల చిత్తులై , భక్తియుత మనస్కులై ధరించి స్వామివారి దీక్షాకాలమున మాత్రమే కాక నిరంతర సాధన చేసి , దర్శనము నొంది తరించవలయునే గాని , దీక్షాలోపము నొనరించుకొని ఆపదలను గొని తెచ్చుకోరాదు. (పై ముద్రల రహస్యము , స్వరూపము , స్వభావములను గురుసాన్నిధ్యము న సాధించ వలయును గాన వాటి వివరణలను తెలుపబడలేదు.)


*మౌనదీక్షకు యుండవలసిన నియమములు*


దేవుడు జీవుడు ఒక్కడే యను బ్రహ్మ రహస్యం ఎరింగిన వారందరూ మౌనదీక్షయే పుచ్చుకొంటారు. అది పరిపక్వత చెందిన స్థితి. అయ్యప్ప భక్తులు ఆకలికి అలమటించి పోయి రోదించే శిశువు వంటివారు. స్వామి అయ్యప్ప శరణ ఘోష ప్రియుడు. మన ఈతి బాధలను రోదిస్తూ శరణ ఘోషమూలాన వినిపిస్తే స్వామి అయ్యప్ప సంతుష్ఠుడై మన కోర్కెలను మన్నిస్తారు. కోర్కెలు లేని ముముక్షువులు మౌనదీక్ష వహిస్తారు. అలాంటి ఉన్నతస్థాయికి కొనిపోగల దీక్ష చేపట్టు వారికి చాలా చాలా ఓర్పు అవసరం. కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఈ మౌన దీక్షను స్వీకరించాలి. నియమం మనస్సులోని ఇతర ఆలోచనలకు తావివ్వక సదా భగవన్నామ స్మరణ మనస్సులో చేసుకొంటూ యుండడమే.


*ఉపవాస దీక్ష*


శబరిమల యాత్ర విధి విధానములలో నియమిత , పరిమిత ఆహారం భుజించమన్నారే తప్ప , ఎక్కడ ఉపవాస దీక్ష చెప్పబడలేదు. ఈ యాత్ర సుమారు 5 దినముల వరకు కొండలు , కోనలు , వాగులు , వంకల మధ్య కాలినడకగా నడచి వెళ్ళే యాత్ర గనుక ఆ ప్రదేశమందలి మన నోటికి రుచియైన ఆహార పదార్ధములు లభ్యముకాదు. కావున ఆహార నిబంధనలు ఏర్పరచుకొని ఆయా ప్రదేశములలో లభించే ఆహార పదార్థాలతో సర్దుకుపోవుటకు అలవరచుకొమ్మన్నారు. అంతేగాని ఉపవాస దీక్షయుండి శరీరాన్ని నీరసింప చేసుకొని యాత్ర మధ్యలో మానసిక , శారీరక బాధలకు గురికానవసరం లేదనియు తేల్చి చెప్పియున్నారు.


*శబరిమల దీక్ష తీసుకోవడంలోని పరమార్థం*


శబరిదీక్ష తీసుకోవడం వలన మనస్సు , శరీరం రెండు ఒక్కసారిగా ఓవర్ ఆయిల్ చేసినట్లు పరిశుభ్రమమతుంది. దీనివలన భగవంతుడు ప్రసాదించిన నిండు నూరేళ్ళ జీవితాన్ని ఆరోగ్య వంతముగా మలచుకొనవచ్చును. దుర్వ్యసనములకు దూరమగుటచే ఆర్థిక మెరుగు గూడా ఏర్పడును.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌸🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat