*తృతీయ స్కంధము - 09*
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 30*
*విశుక్రప్రాణహరణ వారాహీవీర్యనందితా!*
*కామేశ్వరముఖాలోక కల్పితశ్రీగణేశ్వరా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*నిన్నటి భాగములో.........*
*విష్ణుకృత దేవీయజ్ఞం* చదువుకున్నాము.
*అమ్మ దయతో......*
ఈ రోజు తృతీయ స్కంధములోని
*"సుదర్శనుడి కథ"*
చదువుకుందాం......
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
*సుదర్శనుడి కథ - 1 వ భాగము*
ధ్రువసంధి అనే మహారాజు అయోధ్యరాజధానిగా కోసలదేశాలను పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశ సంభవుడు. పుష్పపుత్రుడు. ధర్మాత్ముడు. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతున్నాడు. ప్రజలంతా ఎవరి వృత్తులను వారు సమర్థంగా నిర్వహించుకుంటున్నారు. ధనధాన్య సమృద్ధులతో తులతూగుతున్నారు. చోరులుకానీ, ధూర్తులు కానీ, లోభులుకానీ, మోసగాళ్ళుకానీ (దంభాః), కృతఘ్నులుకానీ, మూర్ఖులు కానీ ఆతడి రాజ్యంలో లేరు. ఆంజనం వేసినా కనిపించరు.
ధ్రువసంధికి ఇద్దరు భార్యలు. ఇద్దరూ అందగత్తెలే. ఇద్దరూ విచక్షణలే. మొదటి భార్య మనోరమ - ధర్మపత్ని, పట్టమహిషి. రెండవ భార్య పేరు లీలావతి. ఇద్దరితోనూ కలిసి భోగభాగ్యాలు అనుభవిస్తూ, సౌధాలలో ఉద్యానవనాలలో క్రీడాపర్వతాలలో సరోవరాలలో దిగుడుబావులలో విహరిస్తూ ఆనందం అంచులు చూస్తున్నాడు. మనోరమకు సకలరాజలక్షణాలతోనూ పుత్రుడు ఉదయించాడు. అతడికి సుదర్శనుడని నామకరణం చేశారు. మరో నెలకు లీలావతి ప్రసవించింది. మూర్తీభవించిన సౌందర్యంగా మగబిడ్డ జన్మించాడు. శత్రుజిత్ అని పేరు పెట్టారు. రాజుగారు ఇద్దరినీ సమానాదరంతో ప్రేమతో చూసుకుంటున్నారు.
పిల్లలు ఆడుతూ పాడుతూ ఎదుగుతున్నారు. ఇద్దరికీ చూడాకర్మలు అయ్యాయి. విద్యాభ్యాసాలు సాగుతున్నాయి.
శత్రుజిత్తు మంచి మాటకారి. తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మంత్రులు దండనాయకులూ ప్రజలు అందరూ ఆకర్షితులై ఆనందిస్తున్నారు. తండ్రికి మరీ ప్రీతిపాత్రుడయ్యాడు. దురదృష్టవశాత్తు సుదర్శనుడు అంత చురుకైనవాడు కాదు. శాంతస్వభావుడు.
ఒక రోజున ధ్రువసంధి వినోదం కోసం వేటకు వెళ్ళాడు. గాఢారణ్యంలో ప్రవేశించాడు. క్రూరమృగాలను ఎన్నింటినో సంహరించాడు. వేట రంజుగా సాగుతోంది. అంతలోకీ - ఒక వెదురుపొదనుంచి చండసింహం ఒకటి జూలు దులిపి ఆవులించింది. లేచి నిలబడింది. దిక్కులు పగిలిపోయేట్టు విరగబడి గర్జించింది. రాజుగారు బాణం వేశారు. ఆ దెబ్బకు అది మరీ రెచ్చిపోయింది. తోక రిక్కించి రాజు పైకి లంఘించింది.
రాజుగారు, చర్మనిర్మితమైన డాలువంటిది ఎడమచేతిలో పట్టుకుని, కుడిచేత కత్తిదూసి, మరొక సింహంలా నిలబడ్డాడు. కసెక్కిన సింహం బంతిలా గాలిలోకి ఎగిరి, పంజా విప్పి, నోరు భీకరంగా తెరిచి, భీషణంగా గర్జిస్తూ రాజుగారిమీద పడుతోంది. చుట్టూ సైనికులు వందలబాణాలు వేశారు. గుచ్చుకున్నవి గుచ్చుకున్నాయి, తప్పుకున్నవి తప్పుకున్నాయి. సింహం మాత్రం రాజు పైకి దూకుతోంది. దగ్గరకు రాగానే రాజు కత్తితో పొడిచాడు. అది పంజా విసిరింది. ఇద్దరూ ఒకేసారి నేలకు ఒరిగిపోయారు, ప్రాణాలు విడిచారు. సైనికుల హాహాకారాలు మిన్నుముట్టాయి.
క్షణాలమీద ఈ దుర్వార్త రాజధానికి చేరింది. అంతఃపురం బావురుమంది. మంత్రి పురోహితులు హుటాహుటిని అడవికి వచ్చారు. వసిష్ఠుడి ఆజ్ఞమేరకు అక్కడే అంత్యక్రియలు జరిపారు. దిగులుగా రాజధానికి చేరుకున్నారు. పెద్దకొడుకు ధర్మపత్నీ సుతుడూ శాంతస్వభావుడూ కదా అని సుదర్శనుణ్ణి రాజును చెయ్యడానికి సమాలోచనలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు.
అల్లుడి మరణవార్త తెలిసి లీలావతి తండ్రి యుధాజిత్తు ఉజ్జయిని నుంచి సైన్యంతో ఆయోధ్యకు చేరుకున్నాడు. శత్రుజిత్తుకు బాసటగా నిలిచాడు. సుదర్శనుడికి అండగా నిలవడం కోసం మనోరమ తండ్రి శూరసేనుడు కళింగ దేశం నుంచి సైన్యంతో బయలుదేరి వచ్చాడు. ముఖ్యులైన మంత్రి పురోహితులను సమావేశపరిచి చర్చించారు.
జ్యేష్టుడూ ధర్మపతీ సుతుడూ కనక నా మనుమడు సుదర్శనుడికే పట్టాభిషేకం జరగాలి అన్నాడు శూరసేనుడు. గుణాలను బట్టి సమర్ధతను బట్టి అర్హత కనక నా మనుమడు శత్రుజిత్తుకే పట్టంకట్టాలి అన్నాడు మొండిగా అడ్డం తిరిగి యుధాజిత్తు. ఇలా వివాదం చెలరేగింది. తీర్చేవాడు లేడు మంత్రులెవరూ మాట్లాడలేదు.
యుధాజిత్తు సహనం కోల్పోయాడు. మంత్రులనందరినీ తిట్టిపోశాడు. మీరంతా స్వార్థపరులు చేతకాని సుదర్శనుణ్ణి రాజుగా కూచోబెట్టి ధనం భోంచేద్దామనుకుంటున్నారు. బలవంతుడూ సమర్థుడు కనక శత్రుజిత్తు రాజు అయితే మీ ఆటలు సాగవని భయం. ఇదిగో మీ అందరికీ ఇదే నా హెచ్చరిక. అన్ని అర్హతలూ ఉన్న శత్రుజిత్తును కాదని, జ్యేష్ఠుడుకదా అని సుదర్శనుడికి పట్టం కట్టారో జాగ్రత్త. మహా సంగ్రామం జరుగుతుంది. ఖడ్గధారతో భూగోళాన్ని చీల్చి రెండు ముక్కలు చేస్తాను. మీకు దిక్కున్నచోట చెప్పుకుందురుగాని. మీరెంత, మీ బలమెంత?
శూరసేనుడు వీరంగం వెయ్యలేదు. శాంతంగా నెమ్మదిగా మాట్లాడాడు. సుదర్శన, శత్రుజిత్తులు ఇద్దరూ సమర్థులే. సమాన ప్రజ్ఞావంతులే. తేడా లేదు. కాకపోతే శాస్త్ర ప్రకారం ధర్మపత్నీ సుతుడు సింహాసనార్హుడు కనక సుదర్శనుడికి పట్టం కట్టమని కోరుతున్నాను - అన్నాడు.
వివాదం చెలరేగిన సంగతి తెలిసి ప్రజలూ ఋషులూ ఉద్విగ్నులయ్యారు. ఏమి అలజడులు జరుగుతాయో అని భయపడ్డారు.
పరస్పర యుద్ధకాంక్షతో ఎప్పుడూ తగవులాడుకునే సామంతులు అందరూ రాజధానికి చేరుకున్నారు. ఆరాజకం ఏర్పడితే రాజధానిని కొల్లగొడదామని శృంగబేరం నుంచి నిషాదులు వచ్చారు. చుట్టుపక్కల దేశాలనుంచి చోరులు గుంపులు గుంపులుగా వచ్చారు. అవకాశం దొరికితే అల్లర్లు సృష్టించి ప్రజలను దోచుకుందామని పొంచి చూస్తున్నారు. అయోధ్య అంతా, ఎవరో ఏమిటో తెలియని కొత్త ముఖాలతో కిటకిటలాడుతోంది. సమ్మర్దం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది.
*(అధ్యాయం -14, శ్లోకాలు - 53)*
సేనలను మోహరించి యుధాజిత్తు ధనుర్ధారియై నిలబడ్డాడు. వీరసేనుడు క్షాత్రధర్మం పాటిస్తూ సేనా సమూహంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. పరస్పరం బాణసృష్టి కురిపించారు. రథగజ తురగ సైన్యాలు కలబడ్డాయి. ఘోర సంగ్రామం జరిగింది. సురముని సంఘాలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి. కాకులూ గ్రద్దలతో ఆకాశం నిండిపోయింది. తెగిపడిన తలలూ కాళ్ళూ చేతులూ మొండేలు గుర్రాలూ ఏనుగులతో నేల నిండిపోయింది. నదిలో కొట్టుకుపోతున్న సొరకాయ బుర్రల్లా రణరంగమంతటా సైనికుల శిరస్సులు. వాటిని తన్నుకుపోవడానికి మూగుతున్న గ్రద్దలూ రాబందులూ. శరీరం రాలిపోయినా, జీవుడు వీరావేశంతో ఆ తన శరీరంలో మళ్ళీ ప్రవేశించడానికి ఉవ్విళ్ళూరుతూ అక్కడే తచ్చాడుతున్నాడు. కొందరు వీరులు మరణించి దివ్య విమానాలను అధిరోహించి అందులో ఉన్న అప్సరసలకు, నేల పై పడి ఉన్న తమ కళేబరాల సొగసులను వర్ణించి చూపిస్తున్నారు. ఒక మహావీరుడు మరణించి అప్సరసను పొంది కామాగ్నిలో మళ్ళీ దగ్ధుడవుతున్నాడు. ఇద్దరు వీరులు ద్వంద్వ యుద్ధంలో ఒకేసారి మరణించి ఒకేసారి దివ్యవిమానం అధిరోహించి అప్సరసకోసం మళ్ళీ కత్తులు దూస్తున్నారు. మరొక యోధుడు మరణించి రూపవతి గుణవతి అయిన ఒక సురాంగనకు తన గుణగణాలను వివరించుకొంటూ ప్రేమభిక్ష అర్థిస్తున్నాడు. దివికేతెంచిన మరొక వీరుణ్ని చూసి మరొక దేవకాంత కన్నుకలిపి కౌగిలికి పిలిస్తే ఆ వీరుడు తిరస్కరిస్తున్నాడు. నాకు ప్రతభంగం అవుతుంది. రాజుగారికి అత్యంతమూ విశ్వాసపాత్రుణ్ణి అనుకూలుణ్ణి అనే నా బిరుదు మంటగలిసిపోతుంది అంటూ అతడు ఆమెను త్రోసిరాజంటున్నాడు.
రణరంగంలో లేచిన దుమ్ము ఆకాశమంతటా వ్యాపించి సూర్యుణ్ణి కప్పేసింది. హఠాత్తుగా చీకటులు వ్యాపించాయి. మరి కాసేపటికి అదే దుమ్ము మళ్ళీ నేలకు దిగి రక్తప్రవాహాలలో తడిసి ముద్దయి సూర్యమండలాన్ని రెట్టింపుగా ఎరుపెక్కించింది.
శూరసేన, యుధాజిత్తుల సంగ్రామం అరివీరభయంకరంగా సాగుతోంది. ఉన్నట్టుండి యుధాజిత్తు పది బాణాలను ఒకేసారి సంధించి విడిచి పెట్టాడు. శూరసేనుడు దారుణంగా నిహతుడయ్యాడు. రథం నుంచి నేలకు ఒరిగి పోయాడు. అతడి సైన్యం కకావికలైపోయింది. ఎటువారటే పారిపోయారు.
వార్త తెలిసి మనోరమ వలవలా విలపించింది. క్షణంలో తేరుకుంది. ఏమిటి భవిష్యత్తు - ఆలోచించే సరికి భయం ఆవరించింది. రాజ్యలోభంతో యుధాజిత్తు తన తండ్రిని చంపినట్టే తన కొడుకు సుదర్శనుణ్ణీ పొట్టన పెట్టుకుంటాడు అనిపించింది. ఏమి చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి? భర్త మరణించాడు. తండ్రి మరణించాడు. కొడుకు పసిబాలుడు. ఏం చెయ్యడానికి తోచలేదు. ఎంతటివారినైనా వశీకరించుకుంటుంది ఈ రాజ్యలోభం. ఎంత పాపిష్ఠిదో కదా! ఎన్ని దారుణాలైనా చేయిస్తుంది. ఎంతటి పాపానికైనా ఒడికట్టిస్తుంది. చీ చీ. తల్లి, తండ్రి, సోదరులు, గురువులు, స్వజనులు బంధువులు - ఎవరినైనా చంపిస్తుంది. *అభక్ష్య భక్షణం అగమ్యగమనం* - అన్నీ చేయిస్తుంది. ధర్మాన్ని తుంగలో తొక్కిస్తుంది.
ఈ అయోధ్యాపట్టణంలో నాకు సహకరించేవారు ఎవ్వరూ లేరు. ఎవరిని నమ్మి ఎవరి పంచను చేరి సుతుణ్ణి కాపాడుకోవాలన్నా ప్రమాదమే. వీణ్ణి కాస్తా యుధాజిత్తు చంపేస్తే ఇక ఈ లోకంలోనే నాకు దిక్కు ఉండదు. నా సోదరి (సవతి) లీలావతి ఇప్పటిదాకా స్నేహంగానే ఉంది. కానీ ఇప్పుడు ఆవిడకీ ఈ వైరవ్యాధి సోకి ఉంటుంది. నా పుత్రుడిపట్ల దయావతిగా ఉంటుందని నేను అనుకోను.
యుధాజిత్తు రణరంగం నుంచి నగరానికి వచ్చాడంటే ఇక నేను పారిపోవడానికి కూడా ఉండదు. నన్నూ నా కొడుకును పట్టి బంధించి కారాగారంలో పడవేయిస్తాడు. చరిత్రలో ఇటువంటి కథలు ఎన్ని వినలేదు. ఇంద్రుడంతటివాడే లోభానికి లోనై మాతృగర్భంలో ప్రవేశించి, పుట్టబోయే సోదరుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికివేశాడు.
ఈ ఇక్ష్వాకు వంశంలోనే వెనకటికి ఒకరాణి, తన సవతికి గర్భవిచ్ఛేదం కోరి విషం ఇచ్చింది. అదృష్టవశాత్తూ ఆవిడ బతికి బయటపడింది. పుట్టిన కొడుకు గరళం ముద్దతోసహా పుట్టాడు. సగరుడయ్యాడు. కైకేయి రాముణ్ణి అడవులకు పంపించింది. జ్యేష్ఠుడి విరహాన్ని భరించలేక దశరథుడు మరణించాడు.
కాబట్టి, యుధాజిత్తుగానీ లీలావతిగానీ నన్నూ నా కొడుకును క్షేమంగా చూస్తారనుకోవడం బతకనిస్తారనుకోవడం వట్టి వెర్రితనం. నా కుమారుడికి పట్టంకట్టాలని సమాలోచనలు జరిపిన మంత్రి పురోహితులైనా ఇప్పటి పరిస్థితులలో వా పక్షాన నిలుస్తారా ! అవశులు ఈ పాటికే యుధాజిత్తుకి వశులైపోయి ఉంటారు.
ఎంత దురదృష్టం నాది ! ఇటువంటి కష్టాలనుంచి గట్టెక్కించే సోదరుడు ఒక్కడయినా లేకపోయాడు నాకు. సరే, ఇలా దిగులుపడి ప్రయోజనం లేదు. మన ప్రయత్నం మనంచెయ్యాలి. సిద్ధించడం సిద్ధించకపోవడం అంతా దైవానుగ్రహం. త్వరగా కదలాలి. నన్నూ నా పుత్రుణ్ణి రక్షించుకోవాలి.
మనోరమ ఇలా ఒక నిర్ణయానికి వచ్చి విదల్లుణ్ణి పిలిపించింది. అతడు కార్యసాధన నిపుణుడు. ఆత్మాభిమానం ఉన్నవాడు. బహు సుకుమారుడు (ఆడంగి). మనోరమకు అత్యంత విశ్వాసపాత్రుడైన మంత్రి. ఆ ఆత్మీయుణ్ణి పిలిచి ఏకాంతంలో బోరుమంది - ఇప్పటి పరిస్థితిలో ఏమి చెయ్యాలో సలహా చెప్పమంది.
అవునమ్మా! ఇప్పుడు నువ్వింక ఇక్కడ ఉండటం క్షేమంకాదు. పారిపోదాం పద. నేనూ వస్తాను నీతోపాటు. అడవుల్లోకి పోయి అక్కడినుంచి వారణాసి చేరుకుందాం. అక్కడ సుబాహుడని మా మేనమామ ఉన్నాడు. శ్రీమంతుడూ, బలవంతుడూను. అతడి రక్షణలో ఉందాం. మాయదారి యుధాజిత్తును దర్శించడానికి జనమంతా కోలాహలంగా ఉన్నారు కనక మనల్ని ఎవరూ పట్టించుకోరు. అదే వంకతో ఇదే అదునుగా మనమూ అంతఃపురంనుంచీ రాజప్రాసాదంనుంచీ బయటపడవచ్చు. అక్కడినుంచి రథం ఎక్కి వెళ్ళిపోవచ్చు.
ఈ ఆలోచనకు మహారాణి సమ్మతించింది. లీలావతి దగ్గరకు వెళ్ళింది. రణరంగంలో ప్రాణాలు కోల్పోయిన నా తండ్రిని ఒకసారి దర్శించాలి, వెడుతున్నానని చెప్పి, విదల్లుడూ సైరంద్రీ వెంటరాగా, కొడుకుని తీసుకుని రథమెక్కి బయలుదేరింది.
రణరంగంలో తండ్రి కళేబరాన్ని చూసింది. ఓలు ఓలున విలపించింది. విదల్లుడూ సైరంద్రీ ఓదార్చారు. తేరుకుంది. భయంతో వొణికిపోతూ తండ్రి శరీరానికి త్వరత్వరగా అగ్ని సంస్కారం జరిపింది. వెంటనే బయలుదేరారు. రెండురోజుల ప్రయాణం. గంగాతీరం చేరుకున్నారు.
అక్కడ ఆటవికులు వీరిని ఆటకాయించారు. సొమ్ములన్నీ దోచుకున్నారు. రథం కూడా లాక్కున్నారు. పారిపోయారు. కొడుకును చంకనెత్తుకుని సైరంధ్రి చెయ్యి పట్టుకుని ఒక చిన్న తెప్ప ఎక్కి గంగానదిని దాటింది. ముగ్గురూ త్రికూట పర్వతం చేరుకున్నారు. అక్కడ భరద్వాజుడి ఆశ్రమం ఉందని తెలిసింది. త్వరత్వరగా ఆశ్రమానికి వెళ్ళారు. తాపసులను చూసేసరికి మనోరమకు ధైర్యం వచ్చింది. అందరికీ పాదాభివందనం చేసింది. భరద్వాజుడు అడిగాడు -
ఎవరమ్మా నువ్వు ? కష్టాలపాలై ఇటు వచ్చినట్టున్నావు. దేవతవా ? పసిబిడ్డతో వచ్చావు. రాజ్యం కోల్పోయిన ఏ మహారాజుకో ఇల్లాలివనిపిస్తున్నావు. ఏమిటి నీ వృత్తాంతం, చెప్పమ్మా !
ఈపలకరింపుతో మనోరమ దుఃఖం కట్టలు తెంపుకుంది. వెక్కి వెక్కి ఏడ్చింది. కాసేపటికి ఊపిరి తిప్పుకుంది. విదల్లుడివైపు చూసింది. అతడు భరద్వాజుడికి విషయమంతా చెప్పాడు. మా అమ్మగారిని తమరే కాపాడాలి. ఆర్తులనూ భీతులనూ రక్షిస్తే యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యమని తమవంటి పెద్దలు చెప్పగా విన్నాను. మహర్షి ! శరణు, శరణు అని కాళ్ళ మీద పడ్డాడు.
చిట్టితల్లీ ! నిర్భయంగా ఉండు. ఇక్కడ నీకు ఏ ఇబ్బందీ కలగదు. ఏ దుఃఖమూ ఉండదు. కొడుకును శ్రద్ధగా పెంచి పెద్దవాణ్ణి చెయ్యి. తప్పకుండా మహారాజు అవుతాడు - అని భరద్వాజుడు అనుజ్ఞతోపాటు ఆశీస్సులు అందించాడు. వారికోసం ఒక పర్ణశాలను చూపించాడు. ముగ్గురూ అందులో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
*(అధ్యాయం - 15, శ్లోకాలు - 61)*
*(రేపు సుదర్శనుడి కథ 2వ భాగం )*
*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*
*...శ్రీదేవీ భాగవతము... సశేషం...*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏
🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏