*తృతీయ స్కంధము - 11*
*లలితా సహస్రనామ శ్లోకం - 32*
*కరాంగుళినఖోత్పన్న నారాయణదశాకృతిః!*
*మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసురసైనికా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*నిన్నటి భాగములో.........*
*"సుదర్శనుడి కథ"* రెండవభాగం చదువుకున్నాము.
*అమ్మ దయతో......*
ఈ రోజు తృతీయ స్కంధములోని
*శశికళా సుదర్శనుల పరిచయం* రెండవ భాగం
చదువుకుందాం......
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
🌈 *శశికళా సుదర్శనుల పరిచయం* 🌈
కాశీనరేశ్వరుడికి శశికళ అనే అమ్మాయి ఉంది. రూప యౌవన సంపన్న. గుణవతి. శుచిస్మిత. సుదర్శనుణ్ణి గురించి వందిజనులవల్ల కర్ణాకర్ణికగా వింది. మనస్సులో అనురాగం అంకురించింది పరిణయం ఆడాలని నిశ్చయించుకుంది. అదేరోజు రాత్రి, కలలో జగదంబ కనిపించింది. సుదర్శనుడు నా భక్తుడు. అతణ్ణి నువ్వు వరించడం సమంజసమే. వివాహం చేసుకో. నీకు సకల మనోభీష్టాలు తీరతాయి. ఇది నా వరం - అని చెప్పి అదృశ్యమయ్యింది.
శశికళ ఆనందానికి అవధులు లేవు. నిద్రలేచి గంతులు వేసింది. ఈ సంబడానికి కారణమేమిటని సఖీజనం అడిగినా కన్నతల్లి అడిగినా కిలా కిలా నవ్విందే తప్ప, సిగ్గుతో ముడుచుకొందే తప్ప ఎవ్వరికీ అసలు సంగతి చెప్పలేదు.
ఒకరోజున అత్యంత ఆప్తురాలైన ఇష్టసఖిని తీసుకుని వనవిహారానికి బయలుదేరింది. ఆ పువ్వులూ ఈ పువ్వులూ కోస్తూ మెల్లమెల్లగా స్వప్నవృత్తాంతం చెప్పింది. అంతలోకీ అటువైపు వస్తూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. శశికళ ఎదురువెళ్ళి భక్తిప్రపత్తులతో పాదాభివందనం చేసింది. మధురంగా సంభాషించింది.
విప్రోత్తమా! ఎక్కడనుంచి రాక?
కల్యాణీ! భరద్వాజాశ్రమం నుంచి. ఏం అడుగుతున్నావు, నీకేం పని?
అహఁ! ఏమీ లేదు. ఊరికే తెలుసుకుందామని అడిగాను - అంతే.
అలాగా, ఆయితే నే వెళ్ళిరానా?
వెడుదురుగాని, ఒక్క నిమిషం. ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయంటారు కదా, మరిమీ భరద్వాజాశ్రమంలో వింతలూ విడ్డూరాలూ, లోకాతీతమైన విశేషాలూ చూసితీరవలసిన సుందర.......
ఉన్నాయి, ఉన్నాయి. బోలెడున్నాయి. ఏం వెళ్ళి చూస్తావా?
ఆహఁ! వెడదామనీ కాదు, చూద్దామని కాదు. ఊరికే తెలుసుకుందామని. బోలెడున్నా యన్నారుగదా! ఏదీ, ఒక్కటంటే ఒక్కటి, లోకాతీత విశేషం, చూసితీరవలసిన సుందర సన్నివేశం కాస్త వీనులవిందు చెయ్యండి.
ఓ దానికేమి! మా భరద్వాజాశ్రమంలో చూసి తీరవలసిన సుందరాంగుడు ఒక్కడే ఒక్కడున్నాడు. పేరు సుదర్శనుడు. సార్థక నామధేయుడు. అయోధ్యాధీశ్వరులు ధ్రువసంధి నామధేయుల కుమారుడు. అతణ్ణి చూసితీరవలసిందే. చూడనివాళ్ళ కళ్ళు నిష్ఫలం. అన్ని సద్గుణాలనూ ఒక్కచోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబోలు సృష్టికర్త, అతణ్ణి సృష్టించి తృప్తి చెందాడు. అమ్మాయీ! మనసులో మాట చెబుతున్నాను. మరోలా అనుకోకు. నీకు అన్ని విధాలా అతడు యోగ్యుడు. నువ్వూ అలాగే అతనికి తగుదువు. మీ ఇద్దరి వివాహమూ మణి కాంచన సంయోగంలా అందగిస్తుంది. శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు - అంటూ ఆ బ్రాహ్మణుడు చకచకా వెళ్ళిపోయాడు.
*(అధ్యాయం-17, శ్లోకాలు - 62)*
జనమేజయా! బ్రాహ్మణవచనంతో శశికళ మనస్సులోని అనురాగం మారాకు తొడిగింది. అతణ్ణే తలుచుకుంటూ అంతఃపురం చేరుకుంది. మన్మథుడు విల్లంబులకు పనిచెప్పాడు. చెలికత్తెలు శీతలోపచారాలు చేశారు. కానీ అవి ఏవీ శశికళకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి. విరహంలో వేగిపోతోంది.
చెలీ! ఇది చందనం కాదే, విషం తెచ్చి నాకు తనువంతా పులిమారు. ఇవి పూలదండలు కావే, పాములు తెచ్చి వేశారు. ఇది వెండివెన్నెలకాదే, మండుటగ్ని. సౌధంలో సుఖం లేదు. దిగుడు బావిలో చల్లదనం లేదు. ఉద్యానవనంలో ప్రశాంతి లేదు. పగలు గడవడం లేదు. రాత్రి నడవడం లేదు. పడకమీద కూర్చోలేకపోతున్నాను. నేలమీద నిలవలేకపోతున్నాను. తాంబూలం రుచించడం లేదు. సంగీతం వినాలనిపించడం లేదు. కళ్ళకు ఏదో అసంతృప్తి. అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి. ఆ మోసగాణ్ణి (శఠుణ్ణి) చూడాలి. వెడదామంటే, అస్వతంత్రురాలిని. తండ్రి ఒద్దికలో ఉన్నదానిని. కులాచారం అడ్డు వస్తోంది. సిగ్గేమో ముంచుకు వస్తోంది. పోనీ అంటే తండ్రి స్వయంవరం ప్రకటించడు. ఏం చెయ్యను? ఆ రాకుమారుడు సుదర్శనుడికి నన్ను నేను సమర్పించుకుంటాను. ఎంతమంది లేరు ఈ భూలోకంలో రాకుమారులు. వందలూ వేలూ ఉన్నారు. ఎంతెంతో సంపన్నులున్నారు. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చరు. రాజ్యహీనుడైనా సుదర్శనుడికే నా మనస్సు అంకితం - ఇలా పరితపిస్తోంది శశికళ.
జనమేజయా! పరివారంలేక, సంపదలులేక, సైన్యంలేక, రాజ్యంలేక ఒంటరివాడై వనవాసం చేస్తూ, కందమూల ఫలాలు తింటున్న సుదర్శనుడు ఆ రాకుమారి మనస్సులో తిష్ఠవేశాడు. ఇదంతా బీజాక్షర జపఫలమే. అతడు మాత్రం జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వమాతను విష్ణుమాయా మండితను సర్వసంపత్కరను రోజూ స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నాడు.
ఒకరోజున శృంగబేరపురాధిపతి నిషాదరాజు దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి సర్వాలంకారశోభితమైన రథాన్ని- పతాకావరమండితమైన జైత్రరథాన్ని- చతురశ్వసమన్వితంగా బహూకరించాడు. మిత్రుడు ఇస్తున్నాడుకదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు. కందమూలఫలాలతో ఆతిథ్యం ఇచ్చి పంపించాడు. ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడ్డారు. రాకుమారా! నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది. తప్పదు. అనతికాలంలోనే నువ్వు సింహాసనం అధిష్ఠిస్తావు. జగదంబిక ప్రసన్నురాలయ్యింది. వరాలు కురిపిస్తోంది. ఇక నిశ్చింతగా ఉండు - అంటూ ఆశీర్వదించారు. తల్లిని అలాగే ఊరడించారు.
మనోరమ సంతోషించిందే కానీ మనస్సులో శంక ఉండిపోయింది. మహర్షులారా! మీమాట నిజమవ్వాలి. అంతకంటే కావలసింది ఏముంది! వీడు మీ దాసుడు. సజ్జనులను సేవించిన ఫలం ఊరికే పోతుందా? అమోఘాలు సృష్టిస్తుంది. ఆశ్చర్యమేముంది. కానీ, ఒక సైన్యం లేదు, మంత్రిలేడు, కోశం (ధనం) లేదు, సహాయకుడు లేడు. మరి ఏ యోగంతో నా కుమారుడు సింహాసనం అధిష్ఠిస్తాడో! కేవలం మీ ఆశీర్వాదాలవల్లనే ఇది జరగాలి. జరుగుతుంది. సందేహం లేదు. మీరంతా మంత్రవేత్తలు - అని నమస్కరించింది.
రథారూఢుడై సుదర్శనుడు ఎటువెళ్ళినా అక్షౌహిణీ సేనా సమాయుక్తుడై ఉన్నట్టు వెలిగి పోతున్నాడు. ఇదంతా మంత్రబీజాక్షర ప్రతాపం. జనమేజయా! ఆ కామరాజ బీజాక్షరాన్ని శుచిగా శాంతచిత్తంతో ఎవరు జపించినా ఇలాగే ఉంటుంది. సకలవాంఛలు నెరవేరతాయి. భూలోకంలో కానీ పైలోకాలలో కానీ అతడికి దుర్లభమనేది ఉండదు. అప్రాప్యమనేది ఉండదు. అంతా *శక్తి* అనుగ్రహం, అమ్మవారిపట్ల విశ్వాసంలేని మందభాగ్యులు అన్నింటా నష్టాలనూ కష్టాలనూ ఎదుర్కొంటారు. రోగ పీడితులవుతారు. సర్వదేవతలకూ జననిగా ఆదిమాతగా కీర్తింపబడే పరాశక్తి దయచూస్తే బుద్ధి కీర్తి ధృతి లక్ష్మి శక్తి శ్రద్ధ మతి స్మృతి అన్నీ సమకూడుతాయి. అందరికీ ప్రత్యక్షదైవం ఆదిపరాశక్తి. మూడులు మాయావృతులై ఈ రహస్యం తెలుసుకోలేరు. కుతర్కాలు చేస్తారు. బ్రహ్మవిష్ణుమహేశ్వరులూ అష్టదిక్పాలకులు సూర్యచంద్రులూ అష్టవసువులూ విశ్వేదేవతలూ నిరంతరం సృష్టిస్థితిలయకారిణిని ధ్యానిస్తూనే ఉంటారు. అటువంటిది, తెలివైనవాణ్ణి అనుకుంటున్న మానవుడు ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏమైనా ఉందా! సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు. అర్చించాడు. సాక్షాత్పరబ్రహ్మ ఆ విద్యావిద్యా స్వరూపిణి, యోగగమ్య, ముముక్షువులకు దిక్కు.
అఖిలాత్ముడైన పరమాత్మకే ఈ త్రివిధసృష్టినీ చేసి చూపించే మహాదేవిని ధ్యానించుకుంటూ, రాజ్యలాభంకంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నాడు. శశికళ మాత్రం విరహంలో వేగిపోతోంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలం కనిపించడం లేదు. దుఃఖిస్తోంది.
తండ్రి సుబాహుడికి (కాశీ నరేశ్వరుడు) విషయం తెలిసింది. వెంటనే స్వయంవరం ప్రకటించాడు. రాజవంశాలకు మూడురకాల స్వయంవరాలను పెద్దలు చెప్పారు. ఒకటి *ఇచ్ఛాస్వయంవరం.* కోరినవాడిని స్వయంగా వరించి మెడలో దండ వెయ్యడం. రెండవది *పణస్వయంవరం.* శివధనుస్సును ఎక్కు పెట్టిన రాముణ్ణి సీత వరించడం. మూడవది *శౌర్యశుల్క స్వయంవరం.* ఇది కేవలం శూరులకే. వచ్చిన మహావీరులనందరినీ జయించి రాకుమారిని చేపట్టడం. వీటిలో సుబాహుడు *ఇచ్ఛాస్వయంవరం* ప్రకటించాడు.
శిల్పులు వచ్చి వివిధాకారాలలో సభ్యమండపాలను నిర్మించారు. అందంగా వేదికలను తీర్చిదిద్దారు. మిగతా ఏర్పాట్లు అన్నీ చురుకుగా సాగుతున్నాయి. రాజపుత్రులకు ఆహ్వానాలు వెడుతున్నాయి. శశికళ గ్రహించింది. మనసులోమాట తల్లిదండ్రులకు చెప్పవలసిన తరుణం ఇదే అనుకొంది. ఆంతరంగికురాలైన ఇష్టసఖిని పిలిచింది. సఖీ! నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే. ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పు. నేను ధ్రువసంధి మహారాజుగారి అబ్బాయి సుదర్శనుడికి మనసు ఇచ్చాననీ, అతణ్ణి తప్ప మరెవ్వరినీ వరించననీ, ఇది ఆదిపరాశక్తి సంకల్పమనీ చెప్పిరా.
ఇష్టసఖి వెళ్ళి చెప్పింది. వైదర్భి (తల్లి పేరు) తన భర్తకు చెప్పింది. కాశీ నరేశ్వరుడు సుబాహుడు పకపకా నవ్వాడు. రాజ్యహీనుడు, ఏకాకి, తల్లితో భరద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్న నిర్ధనుడు ఆ సుదర్శనుడా మన అమ్మాయికి నచ్చినవాడు. వీలులేదు. నాకు అల్లుడు కావడానికి అతడికి ఏ యోగ్యతలూ లేవు. ఇది అప్రియమే కావచ్చు. కానీ ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు. ఆహ్వానాలందుకుని అప్పుడే రాకుమారులు - స్థితిమంతులు - స్వయంవరానికి వస్తున్నారు. తెలుసా?
*(అధ్యాయం - 18, శ్లోకాలు - 55)*
శౌనకాది మహామునులారా! శ్రద్ధగా వింటున్నారుగదా! కథ మంచి రసకందాయంలో పడింది. సుదర్శనుడే కావాలంటోంది అమ్మాయిగారు. కుదరదంటున్నారు తండ్రిగారు. వ్యాసుడు కథ కొనసాగించాడు. జనమేజయుడు ఆసక్తిగా వింటున్నాడు.
*(రేపు కూడా "శశికళా సుదర్శనుల పరిచయ కథ")*
*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*
*...శ్రీదేవీ భాగవతము... సశేషం...*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది.
🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏