*శ్రీదేవీభాగవతము - 33*

P Madhav Kumar

తృతీయ స్కంధము - 12*

                      

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 33*


*కామేశ్వరాస్త్రనిర్ధగ్ధ సభండాసురశూన్యకా!*

*బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవసంస్తుతవైభవా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 


*శశికళా సుదర్శనుల పరిచయం*  చదువుకున్నాము.


*అమ్మ దయతో......*

ఈ రోజు  తృతీయ స్కంధములోని

*శశికళా సుదర్శనుల పరిచయం* 

 రెండవ భాగం (కొనసాగింపు)

 చదువుకుందాం......

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🌈 *శశికళా సుదర్శనుల పరిచయం* 🌈


*శౌనకాది మహామునులారా!* శ్రద్ధగా వింటున్నారుగదా! కథ మంచి రసకందాయంలో పడింది. సుదర్శనుడే కావాలంటోంది అమ్మాయిగారు. కుదరదంటున్నారు తండ్రిగారు. వ్యాసుడు కథ కొనసాగించాడు. జనమేజయుడు ఆసక్తిగా వింటున్నాడు.


వైదర్భి తన కూతురిని పిలిపించింది. ఒడిలో కూర్చోబెట్టుకుంది. ప్రేమగా తలనిమురుతూ ఓదార్చింది. ఏమిటమ్మా! ఈ విరహాలూ తాపాలూను. ఎలా చిక్కిపోయావో చూడు. నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. దయచేసి మీ నాన్నగారి మనస్సు నొప్పించకు. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడుట. అతడికి సైన్యం లేదు.  కోశం లేదు. రాజ్యం లేదు. బంధుమిత్రులు అందరూ , వదిలేశారుట. ఏకాకిట. కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లీ తానూ తలదాచుకుంటున్నారుట. అతడు నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా? ప్రతిభావంతులూ రూపవంతులూ సంపన్నులూ రాకుమారులు ఎంతో మంది ఉన్నారు. వారు నీకు యోగ్యులు. పోనీ - అంతగా అనుకుంటే, సుదర్శనుడి సోదరుడు ఉన్నాడుట. అయోధ్యా సింహాసనం అధిష్టించి రాజ్యం చేస్తున్నాడుట. శత్రుజిత్తు అని అతడి పేరుట. రూపయౌవన సంపన్నుడూ సర్వలక్షణ సంయుతుడూ అని అందరూ చెప్పుకుంటున్నారుట. అతడూ వస్తాడు స్వయంవరానికి. నచ్చుతాడేమో చూడు.


*శశీ!* మరొక ముఖ్య విషయం చెబుతాను విను. ఉజ్జయినీ పురాధీశ్వరుడు యుధాజన్నరేంద్రుడున్నాడే బహుచండశాసనుడు. సుదర్శనుడి తాతగారు శూరసేనుణ్ణి చంపి తన మనుమడు శత్రుజిత్తుకు అయోధ్యా పట్టం కట్టబెట్టింది ఇతడే. ఇప్పుడేమో సుదర్శనుణ్ణి పరిమార్చడానికి కాపువేసి కూర్చున్నాడు. రవ్వంత అవకాశం దొరికితే చాలు వేసేస్తాడు. ఆ మధ్యన ఆశ్రమానికి కూడా వచ్చాడుట. భరద్వాజుడు తరిమేస్తే ఏ కళనున్నాడోగానీ కిమ్మనకుండా వెళ్ళిపోయాడుట. అందరూ ఆదమరిచిన వేళ అతగాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. సంకల్పం నెరవేర్చుకోవచ్చు. తన మనుమడికి శత్రుపీడ వదిలించాలని అతడి దీక్ష. ఎందుకమ్మా! కోరి కష్టాలు తెచ్చుకోవడం. నా మాట విను. మరింక ఏ రాకుమరుణ్ణైనా సరే వరించు. హాయిగా వివాహం జరిపిస్తాను.


*మాతా!* అడవులపాలైనా సరే సుదర్శనుడే నాకు ఇష్టం. అతడే నా 

వరుడు. సుకన్యా చ్యవనుల్లాగా కలిసిమెలిసి ఉంటాం. కష్టాలు రానీ కడగండ్లు రానీ, పతికి సేవ చెయ్యడాన్ని మించి సతికి ధర్మం లేదు. అదే స్వర్గప్రదం. అదే మోక్షప్రదం. పైగా ఇది దేవీ సంకల్పం. కలలో కనిపించి ఆదేశించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతణ్ణి చేసుకో, సకలవాంఛలూ సిద్ధిస్తాయని జగదీశ్వరి ఆజ్ఞాపించింది. నా చిత్త భిత్తికమీద అతడి రూపాన్ని చిత్రించింది. అతడు తప్ప మరొకరిని భర్తగా అంగీకరించలేను. ఏ ఒత్తిడి లేకుండా, ఏ లౌక్యమూ లేకుండా (అకైతవకృతం) ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకం.


శశికళ ఇంత స్పష్టంగా కచ్చితంగా చెప్పింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. వైదర్భీదేవి పూసగుచ్చినట్టు విషయమంతా భర్తకు నివేదించింది. ఏమి చెయ్యడమా అని ఆలోచనలో పడ్డాడు సుబాహుడు.


రేపు స్వయంవరమనగా, శశికళ ఒక వేదపండితుణ్ణి పిలిచి పాదపూజలు జరిపించింది. మహారాజుకు తెలియకుండా తమరు భరద్వాజాశ్రమానికి వెళ్ళిరావాలి అంది. అక్కడ సుదర్శనుడికి ఈ స్వయంవరం సంగతి చెప్పండి. రేపటికి బయలుదేరి రమ్మనండి. నేను అతణ్ణి తప్ప మరెవ్వరినీ వరించను. అతడికే మనస్సు మీదుకట్టాను. ఇది దేవీ సంకల్పం. స్వప్నంలో కనిపించి చెప్పింది. అప్పటినుంచీ అతడికోసం ఎదురుచూస్తున్నాను. అతడు రాకపోతే ఇంత విషం మింగి అగ్నిలో దూకుతాను. అంతే. ఆదిపరాశక్తి సంకల్పానికి తిరుగుండదు. ఆ దైవబలాన్నే నమ్ముకుని రేపు స్వయంవర సమయానికల్లా వేదికకు దయచెయ్యమని నా మాటగా చెప్పిరండి. ఇంకా ఏమేమి చెబుతారో, ఎలా చెబుతారో మీ ఇష్టం. రేపు ఆతడు రావాలి అంతే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి.


విప్రుడు వెళ్ళి చెప్పి వచ్చాడు. సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. భరద్వాజుడు ఆమోదించి ఆశీర్వదించాడు. బయలుదేరుతున్న కొడుకుని చూసి మనోరమ కంగారుపడింది.


నాయనా *సుదర్శనా!* ఎక్కడికీ ప్రయాణం? రాజమండలిలోకా? అక్కడికి యుధాజిత్తు కూడా వస్తాడు. తెలుసా? ఏకాకిగా దొరుకుతావు. నీ వెంట ఒక్కడంటే ఒక్కడు సహాయకుడు లేడు. వద్దు, నాయనా వద్దు. వెళ్ళకు. నన్ను దిక్కులేనిదాన్ని చెయ్యకు. నీ మీదనే పంచప్రాణాలు పెట్టుకుని ఉన్నాను. నువ్వే నాకు ఆధారం. నువ్వు పెరిగి పెద్దవాడవై కళ్ళయెదుట కదలాడుతూంటే - అంతేచాలు. దయచేసి నన్ను హతాశురాలిని చెయ్యకు. నా తండ్రిని చంపిన ఆ క్రూరుడి చేతికి నువ్వు చిక్కకు.


*అమ్మా!* భయపడకు. జరగవలసింది జరుగుతుంది. దానికి విచారమెందుకు? అదీకాక, జగన్మాత ఆదేశం మీద వెడుతున్నాను. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. మనకేమీ భయం లేదు. క్షత్రియాంగనవైయుండి నువ్వు ఇలా బెంబేలు పడటం సముచితం కాదు.


సుదర్శనుడి కంఠంలో వినిపించిన విశ్వాసం మనోరమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. సరేనని ఆమోదించి ఆశీర్వదించింది. పుత్రకా! ముందుండి నిన్ను జగదంబిక రక్షించుగాక! వెనక నిలబడి పార్వతి కాపాడుగాక! కుడియెడమల శివుడు కాచుగాక! మార్గమధ్యంలో వారాహి, దుర్గమ దుర్గాలలో దుర్గమ్మ కలహరంగంలో కాళిక, స్వయంవర మండపంలో సౌమ్యస్వరూప మాతంగి, రాజమండలిలో భవాని, గిరిదుర్గాలలో గిరిజ, చత్వరాలలో (కూడలిస్థలాలు) చాముండేశ్వరి, కాననాలలో కామేశ్వరి, వివాదాలలో వైష్ణవి, శత్రువ్యూహంలో భైరవి, సర్వప్రదేశాలలోనూ సర్వదా భువనేశ్వరి - నిన్ను కాపాడుదురుగాక! ధైర్యం కూడగట్టుకుని దీవించింది. తీరా రథం కదలబోయేసరికి మళ్ళీ బావురుమంది. కుమారా! సూర్యవంశోద్భవా! నేనుకూడా నీతో వస్తానయ్యా! తీసుకువెళ్ళు. ఇప్పటివరకూ నిన్ను విడిచి ఒక్కక్షణమైనా నేనున్నది లేదు. ఉండలేను. ఆగు. నిమిషంలో వస్తాను - అంటూ పర్ణకుటిలోకి వెళ్ళి ధాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది. భరద్వాజాదులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు. జయం పలికారు.


జైత్రరథం వారణాసి చేరుకుంది. కాశీనరేశ్వరుడు సుబాహుడు సాదరంగా స్వాగతం పలికాడు. రఘూద్వహుడిని విడిదిలో దింపాడు. పరిచర్యలకు సేవకులను నియోగించాడు.


వివిధ దేశాల నుంచి రాకుమారులు చాలామంది వచ్చారు. మనుమడు శత్రుజిత్తును వెంటబెట్టుకు యుధాజిత్తు వచ్చాడు. కురు, మద్ర, సింధు, మాహిష్మతీ, పాంచాల, పర్వతీయ, కామరూప, కర్ణాట, చోళ, వైదర్భ, దేశాల రాజపుత్రులు అక్షౌహిణీ సేనలతో తరలి వచ్చారు. నగరంలో ఎక్కడ చూసినా సైనికులే. విడిది  గృహాలన్నీ నిండిపోయాయి. స్వయం వరాన్ని చూడటానికి వచ్చిన దేశవిదేశాల ప్రేక్షకులకు అంతే లేదు. రాకుమారులు కలుసుకుని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారు.


కాకుత్సుడు సుదర్శనుడు వచ్చాడుట. ఏకాకిగా వచ్చాడుట. అమ్మను వెంటబెట్టుకు వచ్చాడుట. ఇంతమందిమి మహాసంపన్నులు ఉండగా మనల్ని అందరినీ వదిలేసి రాకుమారి శశికళ ఇతణ్ణి వరిస్తుంది కాబోలు. ఆశ పాపం! అని నవ్వుకున్నారు.


యుధాజిత్తు కల్పించుకుని - ఇవ్వేళ ఈ స్వయంవరంలో వీణ్ణి నేను చంపి తీరతాను అన్నాడు. ఈ మాటకు నీతికోవిదుడైన కేరళాధిపతి అభ్యంతరం చెప్పాడు. ఇది ఇచ్ఛా స్వయంవరం. శుల్క స్వయంవరం కాదు. కాబట్టి బలప్రదర్శనలూ యుద్ధాలూ ఉండవు. ఉండకూడదు. పెళ్ళికూతురు ఇష్టాన్ని బట్టి ఎవరినో ఒకరిని వరిస్తుంది. అంతే. వివాదానికి తావులేదు. అదీకాక ఇంతకుముందు నువ్వు ఈ సుడర్శనుణ్ణి అన్యాయంగా తరిమేశావు. రాజ్య హీనుణ్ణి చేశావు. బలం ఉంది అని రాజ్యం మనవడికి కట్టబెట్టావు. ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కదా అని ఏ పాపమూ ఎరుగని రాకుమారుణ్ణి చంపుతానంటావా? పాపానికి ఫలం అనుభవిస్తావు. ఈ జగత్తుని శాసించడానికి ఒక జగత్పతి ఉన్నాడు. వాడూ అన్నీ గమనిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు. ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది. అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది. అసత్యం గెలవదు. అందుచేత ఓయుధాజిన్నరేంద్రా! అన్యాయానికి పాల్పడకు. దుష్టాలోచనలూ పాపిష్టి బుద్ధులూ వదిలిపెట్టు. నీ మనుమడు శత్రుజిత్తు వచ్చాడుగదా! అతడు రూపయౌవన సంపన్నుడేగా. రాజ్యం ఉంది. సంపద ఉంది. ఏమో, శశికళ అతణే వరిస్తుందేమో! అప్పుడూ కలహం పెట్టుకుంటావా మరి? ఇంకా చాలామంది రాకుమారులున్నారు. ఒకరిని మించిన వారొకరు. ఎవరిని వరిస్తుందో. వరించనివ్వండి. స్వీకరించనివ్వండి. అంతా కన్యామణి ఇష్టం. ఇందులో వాదవివాదాలకి చోటులేదు. పరస్పర విరోధాలూ కలహాలూ ఇప్పుడు ఇక్కడ జరగటానికి వీలులేదు. నేను అంగీకరించను.


*(అధ్యాయం - 19, శ్లోకాలు-62)* 


కేరళాధిపతి మాటలకు యుధాజిత్తు క్రుద్ధుడయ్యాడు. నీతులు చెబుతున్నావు. బాగానే ఉంది. మాకెవ్వరికీ ఆమాత్రం తెలీదనుకోకు. యోగ్యులు ఇంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యామణి ఒక ఆయోగ్యుణి వరిస్తే చూస్తూ ఊరుకోమంటావా? అది న్యాయమేనా? నీకు రుచిస్తుందేమోకానీ, మేము సహించం. సింహానికి దక్కవలసిన భాగాన్ని నక్క ఎత్తుకు పోడానికి వీల్లేదు. ఈ కన్యారత్నానికి సుదర్శనుడు అర్హుడు కాదు. విప్రులకు వేదం - బలం, క్షత్రియులకు ధనుర్నాదం - బలం ఇది నీతి. ఇందులో అన్యాయం ఏమీలేదు. మరొక్కమాట చెబుతున్నాను. మీరంతా వినండి.


క్షత్రియులకి బలమే శుల్కం కనక బలవంతుడే గ్రహించాలి గానీ, కన్యామణిని బలహీనుడు గ్రహించడానికి వీలులేదు. కాబట్టి సుబాహుడు పుత్రికారత్నాన్ని పణంగా పెట్టి స్వయంవరం జరపవలసిందే. మరోలా జరిగితే యుద్ధం తప్పదు.


ఈ గర్వోక్తులతో రాకుమారులలో కలకలం బయలుదేరింది. వాదవివాదాలు చెలరేగాయి. కత్తులు దూశారు. అంతలోనే శాంతించారు. కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చారు. సభామధ్యంలోకి సుబాహుణ్ణి పిలిపించారు.


*హేరాజన్!* మేమంతా స్వయంవరానికని వచ్చాం. ఇచ్ఛాస్వయంవరమని ప్రకటించావు. నీతి తప్పడానికి వీలులేదు. నువ్వు అసలు ఏమి చెయ్యదలచుకున్నావో చెప్పు. సమాహిత చిత్తంతో స్పష్టంగా చెప్పు.  దాపరికం వద్దు. మీ అమ్మాయిని ఎవరికి ఇవ్వదలుచుకున్నావు? నీ మనస్సుకి నచ్చినవాడెవడు? స్పష్టంగా చెప్పి మా కలహాన్ని వారించు.  ముక్త కంఠంగా రాకుమారులందరూ ఇలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయం ప్రకటించాడు. 


*రాజపుత్రులారా!* మా అమ్మాయి సుదర్శనుణ్ణి మనసా వరించింది. నేను ఎంతగానో వారించాను. ప్రయోజనం లేకపోయింది. నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాక తెలిసింది. ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాను. ఏం చెయ్యను. మా అమ్మాయి నామాట వినడం లేదు. సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు. చీకూ చింతా లేకుండా (నిరాకులుడై) విడిదిలో కూర్చున్నాడు. నేనై అతడికి ఆహ్వానం పంపలేదు. ఏదేశానికి రాజని పంపుతాను?


సుబాహుడి అభిప్రాయం విన్నాక రాకుమారులు మళ్ళీ సమాలోచనలు జరిపారు. ఈసారి మదర్శనుణ్ణి పిలిపించారు. ఒంటరిగా వచ్చాడు. శాంతంగా సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు, రాకుమారులు, ప్రశ్నించారు.


*(రేపు సుదర్శన-రాజపుత్ర సంవాదము)*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏



🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat