అయ్యప్ప సర్వస్వం - 36

P Madhav Kumar


*శరణధ్వని ఆవిర్భావం*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*సాక్షాత్ తారక ప్రభువైన శ్రీ ధర్మశాస్తావారు అయ్యప్ప స్వామివారుగా అవతరించి లీలలు సలిపి అవతారోద్దేశ్యము ముగిసిన పిదపవారు అంతర్ధానమయ్యే తరుణాన పందలరాజుగారైన శ్రీ రాజశేఖరపాండ్య మహారాజు.....*


శ్రీ మణికంఠస్వామివారి చరణములు పట్టుకొని శరణాగతికోరి తన కర్తవ్యమేమిటో అజ్ఞాపించమని వినమ్రుడై వేడినిలిచెను. లోకేశ్వరులైన హరిహరుల ప్రియపుత్రుడైన మణికంఠస్వామి తన పెంపుడు తండ్రితో *"మహారాజన్ ! మానవులై జన్మించిన ప్రతియొక్కరు కారణ జన్ములే. కాలము కలిసివచ్చినపుడు స్వజ్ఞానము పొందినపుడు కర్తవ్యము గోచరించును. లేనిచో ప్రకృతి అశరీరమూలాన కర్తవ్య బోధన బోధించును. తదుపరి తమ కర్తవ్యమును గ్రహించి ప్రవర్తించువారు ఉన్నతస్థాయికి ఎదిగి చరితార్థులై శాశ్వత స్థానమును పొందెదరు. మీరుగూడ చరిత్ర ప్రశంసించురీత్యా నాకు శబరిగిరిపై ఆలయ మొకటి నిర్మించుడు. నేను మీ పుత్రునిగా , మణికంఠ నామ ధేయునిగాయున్న సమయమున మీరు నాకు తొడగిన ఆభరణాలివిగో ! వీటి జాగ్రత్తగా కాపాడి మకర సంక్రాంతి పర్వదినమున మీచే నిర్మించబడిన శబరిగిరి కోవెలలో అమరియుండు నాకు అలంకరింపుడు. ఆ దినము కాంతగిరి శిఖరమునుండి , జ్యోతి స్వరూపముగా మీకు దర్శన మొసగి ఏలుకొందును.


*మీరు నాకు ఆలయము నిర్మించువేళ ప్రాణహాని కలిగించే ఆపద ఏదైన సంభవించిన యెడల ఈ క్షురికాయుధము నీకు సహాయపడును"* అని చెప్పుచూ తనకరమునందుండు క్షురికా యుధమును రాజుయొక్క శరీరమున గుప్తముగా ఇమిడ్చి అదృశ్యమయ్యెను. ఆలయ నిర్మాణ స్థలమును ముందుగానే అంబు వేసి బాణము) సూచించియున్నారు అయ్యప్ప. ఆ ప్రకారము దట్టమైన కాననమునకు మధ్య భాగమున పంబానదికి ఆవలి ఒడ్డున నీలిమల శిఖరముపై శబరి పీఠమునకు సమీపముగా ఒక రాగి వృక్షముపై స్వామి వారి శరము గుచ్చబడి యున్నది గాంచి అతి శీఘ్రముగా తన పరివార సమేతముగా ఆ స్థలమును చేరి స్వామివారి ఆలయమును నిర్మించుటకు ప్రారంభించెను పందళరాజు.


పందళ భూపతియైన రాజశేఖర పాండ్యుడు శ్రీ భూతనాథ స్వామి వారిని పరిశుద్ధ హృదయముతో పూజించినందువలన కాంతగిరి శిఖరమున యుండు స్వర్ణాలయమునకే (పొన్నంబలము) వెడలి శ్రీస్వామివారిని దర్శించి మరలినదియుగాంచి అసూయ చెందిన దేవేంద్రుడు తనకు స్వంతమైన ఐశ్వర్యములను , శ్రీ భూతనాధస్వామి భక్తుడన్న పక్షపాతముతో ఇవ్వక యుండడు. కనుక ఇతనికి అవకాశ మివ్వకూడదు. ఎలాగైనను ఇతనిని హతమార్చవలయును. అప్పుడే తాను , తన దేవతావర్గమును శాశ్వతముగా స్వామివారి స్వర్ణమందిరమున పూజించగలమని తలచి రాజుముంగిట ఒక బోయరూపముతో ప్రసన్నమై *"హేరాజన్ ! ఈ వనమంతయు నాకు స్వంతమైన ప్రదేశము. ఈ వనమునందు నా అనుమతి లేనిచో ప్రవేశించుటయే గాక వనమును ధ్వంసము చేయుటకు సాహసించితివి ? నీవు , ఎవరైనను సరే ! ఉద్దేశ్య ముండినచో తక్షణమే పరివార సహితముగా పారిపొమ్ము. లేదా ప్రాణము వదలుటకు సిద్ధముకమ్మ" నెను. శ్రీ భూతనాథస్వామివారి దర్శన , స్పర్శన , హితోపదేశములచే సంపూర్ణముగా జ్ఞానము పొందియున్న రాజశేఖరరాజు కించత్ గూడా ఆగ్రహించక శాంతచిత్తుడై ఆ బోయవానితో అయ్యా మహానుభావా ! నీవు ఎవరుగాయుండినను సరే ! నీకు మంగళములు కలుగనీ ! కలియుగ వరదుడైన సాక్షాత్ హరిహర సుతుడు అయ్యప్పస్వామివారి ఆజ్ఞమేరకు వారికి ఇచ్చట ఆలయమును నిర్మంచి సత్కార్యమును మొదలిడి యున్నాము. నీవుగూడ ఈ సత్కార్యములో భాగస్వామియై లోకవీరుడైన శ్రీ శాస్త్రావారికి ప్రీతిపాత్రుడుకమ్ము"* అనెను. రాజును హతమార్చియే తీరవలయునని ధృడ నిశ్చయముతో ఎదురైన ఇంద్రుడు ఆ మాటలను విని ఆక్రోశభరితుడై ఘర్జిస్తూ *"హే మతిహీనుడైన రాజన్ ! నేను ఇచ్చిన గడువుదాటిగూడ నాముందు నిలబడుతావా ? ఒక క్షణకాలము గూడా నీవు ఈ భువిపై యుండరాదు. కాచుకోయని"* వజ్రాయుధమును నిరాయుధపాణియైన పందళరాజుపై విసిరెను.


ప్రాణహాని కారియై తనపైకెగబడి వస్తున్న మారణాయుధము యొక్క బలమును గ్రహించిన రాజు చేయుట ఏమిటో తోచక రెండు కరములను పైకి జోడ్చి .... స్వామియే య్ శరమయ్యప్ప అని ఎలుగెత్తి ఘోషించెను. స్వామివారిని కాపాడుటకు రమ్మని దీనార్డిగ ప్రాధేయపడి పలురీత్యా శరణాలు పలుకసాగెను. అలా రాజు శరణాలు పలుకుటకు తన కరములనుజోడ్చి పైకెత్తువేళ అతని శరీరములో శ్రీ స్వామివారిచే గుప్తముగా ఇమిడ్చబడియున్న క్షురికాయుధమునకు అతనికుడిచేతి చిటికినవేలు తగిలెను. వెంటనేరివ్వున క్షురికా యుధము వెలుపలికి వచ్చి రాజుగారి ప్రాణమును హరించుటకు సిద్ధమైన వజ్రాయుధమును ముక్కలు చేసి పంపిన వారిపైకెగబడ సాగెను. మహాజ్వాలను విరజిమ్ముతూ వెడలిన క్షురికబోయవాని రూపము దాల్చియుండిన తనపైకి ఎగబడిరావడము గాంచిన దేవరాజు భయక్రాంతుడై పరుగిడసాగెను.


ఎచ్చటికి వెడలినను వదలక క్షురికయు వెంబడించెను. మొదట ఇంద్రుడు బ్రహ్మలోకము వెళ్ళి చతుర్ముఖుని శరణము కోరెను. వెంబడించుచున్నది శ్రీ భూతనాధస్వామి వారి క్షురికాయుధము. దానిని ఉపసంహరించే మార్గం తనకు తెలియదని బ్రహ్మ చేతులెత్తగా బెదరిపోయిన ఇంద్రుడు కైలాసమునకు వెడలి ఉమాపతిని శరణు జొచ్చెను. తనయుని ఆజ్ఞను పాటించే భక్తుని హింసించిన వానికి తనవద్ద ఆశ్రయము లేదని శంకరుడు చెప్పగా , మహాభీతి చెందిన ఇంద్రుడు వైకుంఠముచేరి శ్రీమన్నారాయణుని శరణువేడెను.


*"స్వర్ణమందిర వాసుడైన భూతనాధుని ఆయుధమును ఎదుర్కొనేశక్తి ఇచ్చట ఎవ్వరికీ లేదనియు , నీవు వారినే శరణాగతి నొందుము."* అని మహా విష్ణువు గూడ తెలిపి వేయగా ఆలస్యము చేయక ఇంద్రుడు కాంతగిరి చేరి స్వర్ణమందిర దేవుని శరణువేడి , తనను కాపాడమని ప్రాధేయపడెను. *"క్షురికాయుధము తనదైనను దానిని పందళ భూపాలునికి దానముగా యొసంగి యుండడము వలన దానిని ఉద్వాసనము చేయగల శక్తియు వారికే యొసంగబడినది. నీవు వారిని శరణువేడుము"* అని శ్రీ భూతనాథస్వామి ఆదేశించిన పిమ్మట నిర్గతి చెందిన ఇంద్రుడు అన్యశరణములేక తన నిజస్వరూపముతో పంబాతీరము చేరి రాజశేఖర పాండ్యుని పాదములపై బడి తన తప్పును క్షమించి తనను రక్షించమని ప్రార్థించెను. వజ్రాయుధము ప్రయోగించడముతో ఇక తనను రక్షించువాడు ఆ భూతనాథు డొక్కడే అను ధృఢవిశ్వాసముతో తనువు మరచిన స్థితిలో రాజు కనులు మూసుకొని అప్పటివరకు ప్రార్థన చేయుచునే యుండెను. అతనినోట నుండి స్వామియే శరణ మయ్యప్ప , హరిహరసుతుడే శరణమయ్యప్ప , ఆపద్భాందవుడే శరణమయ్యప్ప , అశ్రితవత్సలుడే శరణమయ్యప్పయను పలురీతి శరణ నామములు దీనార్థిగా వెలువడుచునే యుండెను.


ఇంద్రుడు తనకాళ్ళపై బడినవెంటనే ఆ స్పర్శనముచే కనులు తెరచి చూసినరాజు దేవేంద్రుని జూని ఉలిక్కిపడి అతని భుజస్కంధమును పట్టి పైకిలేపి *"స్వామి ! లెమ్ము మీ కొరకై ఏమి చేయవలెను ? అజ్ఞాపించుము".* అని వినమ్రుడై ఇంద్రుని అడిగెను. *"హే మహారాజ ! మీ యొక్కస్వామి భక్తిని గ్రహించుకొనలేక మీ పై దాడితీసిన బోయవాడైన దేవేంద్రుడను నేను. క్షమింపుము మీ ఆయుధమైన క్షురిక నన్ను హతమార్చుటకు వెంబడించి వచ్చుచున్నది. దయతో దానిని ఉద్వాసనముచేసి నన్ను రక్షింపవలెను."* అని ప్రాధేయపడి నిలబడెను. అందులకు పందళ భూపతి శ్రీ భూతనాధస్వామివారిని మనసున ధ్యానిస్తూ క్షురికను మరలిపొమ్మని ఆదేశించెను. ఆ మేరకు క్షురికాయుధము శాంతముచెంది రాజుగారి శరీరము నందే దాగెను. తదుపరి ఇంద్రుడు రాజశేఖరుని పలు రీత్యా ప్రశంసించి అమరశిల్పి విశ్వకర్మను పందళరాజు నిర్మింపబోవు ఆలయ నిర్మాణమునకు సహాయపడి రమ్మని అజ్ఞాపించి అచ్చటనుండి అదృశ్యమయ్యెను. పందళభూపాలుడగు రాజశేఖరపాండ్యుడు విశ్వకర్మతో కలసి నిర్మించిన ఆలయమే నేడు మన శబరిమల యాత్రీకులు సందర్శించుచున్న ప్రఖ్యాతిగాంచిన శబరిమల దేవాలయము. అలనాడు పందళరాజు తన ప్రాణ రక్షణకై తనను కాపాడమని శ్రీ భూతనాధునితో దీనార్థియై పిలిచిన శ్రీ స్వామివారి శరణములనే మనము నేడును శ్రీ స్వామివారి శరణ ఘోషములని ప్రతి దినము ఒక కర్తవ్యముగా యెంచి పిలిచి సత్ఫలితములు పొందుచున్నాము. అనాటి నుండియే ఈ శరణములు పిలిచే విధానము అలవాటైనట్లు అందురు.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat