Part - 50
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రాభవాన్ని లోకానికి చాటిన భక్తుల్లో శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య తరువాత చెప్పుకోదగిన వారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. ఈమె జీవితం మొత్తాన్ని స్వామివారి సేవలోనే గడిపారు. వివాహం జరిగి వైధవ్యం పొందినా శ్రీవారినే తన భర్తగా ప్రకటించి ముత్తయిదువుగా ఉండేవారు. యోగినిగా, భక్త కవయిత్రిగా వెంగమాంబ చరిత్రలో సాహితీ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
తరిగొండ వెంగమాంబకు సుమారుగా 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి కొలువుకు చేరినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అంతవరకు ఎన్నో ఒడిదుడుకులకు లోనైన వెంగమాంబకు తిరుమల వాతావరణం మరో లోకంలా అనిపించింది. ఊహ తెలిసినప్పటి నుండి శ్రీ వేంకటేశ్వరస్వామివారినే సర్వస్వంగా భావించిన ఆమెకు స్వామివారి సన్నిధికి చేరడం పరమానందం కలిగించింది. అప్పటికే వెంగమాంబకు బాల్య వివాహమైంది. ఆమె భర్త ఇంజేటి వేంకటాచలపతి మానసిక వ్యధతో అప్పటికే మరణించారు.
తిరుమలకు చేరుకున్న వెంగమాంబ ప్రతిరోజూ మొదట వరాహస్వామివారి దర్శనం చేసుకుని తరువాత శ్రీవారి దర్శనానికి వెళ్లి ప్రార్థన చేసేవారు. రోజంతా ఆలయం వద్దే ఉండేవారు. సాయంత్రం అయ్యేసరికి అప్పట్లో ఉన్న వెయ్యి కాళ్ల మండపానికి చేరుకునేవారు. అక్కడ యోగం చేస్తూ, స్వామివారిపై పాటలు పాడుతూ ఉండేవారు. ఒకసారి యోగనిద్రలో ఉండగా ”అలమేలుమంగ అనుమతి..” అంటూ ఆమె చెవుల్లో మారుమోగింది. సాక్షాత్తు స్వామివారే ఈ పలుకులు పలికారని ఆమె గ్రహించారు. వెంటనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థించి ఆశీస్సులు అందుకున్నారు.
అమ్మవారి ప్రోద్బలంతోనే అప్పట్లో హథీరాంజీ మఠాధిపతిగా ఉన్న ఆత్మారాం దాస్జి శ్రీవారి భక్తురాలైన వెంగమాంబకు తిరుమలలో ఆశ్రయం కల్పించారు. రాంభగీచా తోటల్లోని ఒక పూరిల్లును వెంగమాంబకు కేటాయించారు. వరవెచ్చం(ఒకరికి నెలకు సరిపడా బియ్యం, పప్పు, ఇతర వంటదినుసులు) పంపేవారు. ఇంటికి ఎదురుగా ఒక చింత చెట్టు ఉండేది. ఇంటి పరిసరాల్లో తులసి మొక్కలను పెంచి ప్రతిరోజూ స్వామివారికి తులసిమాలలు సమర్పించేవారు. హయగ్రీవ ఆలయానికి వెళ్లి ధ్యానం చేసేవారు. ఈ పూరిల్లు ఉన్న స్థానంలోనే ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద కేంద్రాన్ని తితిదే నిర్మించింది.
ఆ తరువాత అన్నమాచార్య వంశీయుల ఆహ్వానం మేరకు వారి మిద్దె ఇంటికి చేరారు. అక్కడ అన్నమయ్య వంశీయుల సాహిత్యాన్ని పూర్తిగా చదివి అవగాహన చేసుకున్నారు. కాగా అన్నమయ్య వంశీకుల ఇంటి పక్కన బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ నియమించిన సర్కారు అర్చకుడు అక్కారాం వెంకటరామ దీక్షితులు ఉండేవారు. ఈయన వెంగమాంబను సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురి చేసేవారు. ఈ క్రమంలో వెంగమాంబ ఎవ్వరికీ కనిపించకుండా శేషాచల అభయారణ్యంలోని తుంబురుకోనకు వెళ్లిపోయారు. అక్కడ వెంగమాంబ గవి అనే ప్రాంతంలో ఐదేళ్లు తపస్సు చేశారు. తిరుమలలో వెంగమాంబ కనిపించకపోవడంతో అందరూ ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోయిందని భావించారు.
అనంతరం జరిగిన పరిణామాల తరువాత అప్పటి మహంతు తుంబురుకోనకు చేరుకుని వెంగమాంబను తిరిగి తిరుమలకు ఆహ్వానించాడు. ఇది స్వామివారి అనుగ్రహంగానే భావించిన వెంగమాంబ తిరిగి వచ్చేశారు. తాళ్లపాక వంశీయుల ఇంటి పక్కనే వెంగమాంబకు మహంతు ఇల్లు కేటాయించారు. అప్పటికే వెంగమాంబ యోగినిగా, భక్త కవయిత్రిగా ప్రసిద్ధి చెందారు. అప్పటికి కొన్ని గ్రంథాలను కూడా రచించారు.
ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నృసింహ జయంతిని పురస్కరించుకుని పది రోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ అన్నదానం చేసేవారు. అప్పటి గోల్కొండ నుండి తమిళనాడులోని దిండిగల్ వరకు ఉన్న ఆంధ్రులు తిరుమల సందర్శనకు వచ్చినపుడు అన్నదానం నిమిత్తం వెంగమాంబకు దానపత్రాలు రాసిచ్చారు. ఇప్పటికీ 30 నుండి 40 వరకు దానపత్రాలున్నాయి. అంతేగాక అప్పటి సంస్థానాధీశులు, జమిందార్లు, పాళెగాళ్లు, సామాన్య ముస్లిం సోదరులు అన్నదానానికి విరాళాలు ఇచ్చేవారు. ఈ విధంగా నిరంతరం శ్రీవారి భక్తులకు అన్నదానం చేయడం వల్ల వెంగమాంబ ”మాతృశ్రీ” అయ్యారు.
ఇక స్వామివారి సన్నిధిలో వెంగమాంబ ప్రవేశపెట్టిన ముత్యాలహారతికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతిరోజు శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవలో ఈమె హారతి ఇచ్చేవారు. ఇందుకు అభ్యంతరం ఎదురుకావడంతో ఒకరోజు ఇంటి వద్దనే స్వామివారికి హారతి ఇచ్చి తృప్తి చెందారు. మరుసటి రోజు శ్రీవారికి రథోత్సవం నిర్వహించగా వెంగమాంబ ఇంటి వద్దకు వచ్చేసరికి రథం ఆగిపోయింది. విషయాన్ని గుర్తించిన మహంతు హారతి ఇవ్వాలని వెంగమాంబను ప్రార్థించాడు. ఆమె హారతి ఇవ్వడంతో అక్కడినుండి రథం కదిలింది. అప్పటినుండి శ్రీవారి ఆలయంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ తదితర అవతారాలను పళ్లెంలో వెండి ముత్యాలతో తీర్చిదిద్ది హారతి ఇచ్చేవారు. అనంతరం ”తాళ్లపాకవారి లాలిపాట.. వెంగమాంబ ముత్యాలహారతి” అని ప్రసిద్ధి చెందింది.