ఈ విధంగా ఉపనిషత్తుల సారమంతా వడగొట్టి, ఓ గీతరూపంలో, మానవులందరి ప్రతినిధియైన అర్జునునికి బోధిచేడు జగద్గురువైన మాధవుడు. మానవుడు "తాను ఎవరో?" తెలుసుకునేందుకు ఉపయోగపడే అన్ని మార్గాలను, పద్దతులను, సాధనాలను ఒక గురువుగా సూచించేడు. తనపై ఎటువంటి పెద్దరికాన్ని, కర్తృత్యాన్ని వేసుకోకుండా, అర్జునా! ఇక నీకు ఏది ఆమోదయోగ్యమో, దానిని ఆచరించు, అని అతనికే వదిలేసాడు గీతాచార్యుడు.
కాబట్టీ భగవద్గీతలో బోధింపబడిన, కర్మషట్కము, భక్తిషట్కము, జ్ఞానషట్కముల అంతరార్ధమును పూర్తిగా అర్ధంచేసుకుని, ఆచరించాల్సిన బాధ్యత మనదే. గీతను అధ్యయనము చేయుట, అనుష్టానము చేయుట "జ్ఞానయజ్ఞము"గా పిలువబడింది. ఈ జ్ఞానయజ్ఞము అన్ని యజ్ఞములకంటే విశిష్టమైనది.
ఇందు మానవులు గ్రహించి, ఆచరించాల్సిన ముఖ్యాంశాలు :
1. ప్రతి జీవి కర్మ చేయాల్సిందే. ఏ కర్మ చేయకుండా జీవుడు ఒక్క క్షణం వుండలేడు.
2. చేసే ప్రతి కర్మ, నిష్కామంతో (ప్రతిఫలం ఆశించకుండా) చేయాలి.
3. ఆత్మజ్ఞానము పొందాలంటే కర్మలన్నీ నిష్కామంతోనే చెయ్యాలి. ఇదే కర్మయోగము.
4. కర్మయోగికైనా, జ్ఞానయోగికైనా ఈ నిష్కామకర్మాచరణ తప్పదు.
5. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడాలి.
6. కర్మయోగంతో చిత్తశుద్ధికలిగి జ్ఞానము ఉదయిస్తుంది.
7. జ్ఞానము కలిగిన తరువాత వైరాగ్యముతో కూడిన అభ్యాసము చేయాలి.
8. అన్ని జీవులయందు సమదృష్టి కలిగియుండాలి.
9. ధ్యానంతో ప్రాపంచిక విషయాలనుండి దృష్టి మరల్చాలి.
10. తనలో నిగూఢంగా వున్న ఆత్మను దర్శించాలి.
11. ఆత్మవిచారణతో పరమాత్మను అర్ధము చేసుకోవాలి.
12. పరమాత్మను తెలుసుకున్న వెంటనే బ్రహ్మానందం సిద్ధిస్తుంది. ఇదే జ్ఞానయోగము.
13. దీనితో మానవుడు అన్ని బంధాలనుండి విడిపడి జీవన్ముక్తుడవుతాడు.
14. జీవాత్మ పరమాత్మలో విలీనము అవుతుంది.
15. అంతటితో ఈ జననమరణ చట్రము నుండి బయటపడి, అవసరాన్ని బట్టి ఆత్మ తన ఇచ్చానుసారం లోకంలో అవతరించుట, లోకము వీడివెళ్ళుట జరుగుతుంది. వారే సత్పురుషులు లేదా సద్గురువులు. ఇదే జ్ఞానయజ్ఞము.
ఇది గ్రహించక జీవుడు కామ్యకర్మలను ఆచరిస్తూ, అశాశ్వతములగు ప్రాపంచిక వస్తువులపై బంధము పెంచుకుంటూ, ఇంద్రియముల వశుడై సుఖదుఃఖములు చవిచూస్తూ, మిగిలిన కర్మఫలితములు అనుభవించుటకు జననమరణములు పొందుతూ, ఆత్మవస్తువును విస్మరిస్తూ, సత్యమును తెలుసుకొనక పరమాత్మకు దూరం అవుతున్నాడు. తాను వచ్చిన చోటుకి చేరుకోలేక పోతున్నాడు.
ముగింపు భాగంలో మళ్ళీ కలుసుకుందాము...🪷 🪷⚛️✡️🕉️🌹