*శ్రీదేవీభాగవతము - 43*

P Madhav Kumar


*చతుర్థ స్కంధము - 03*

                      

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 43*


*శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్రనిభాననా!*

*శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 

 

*దేవకీ వసుదేవుల జన్మవృత్తాంతము*

*జనమేజయుని సందేహాలు*

*అందరికందరే - వ్యాసుడు* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*  ఈ రోజు  

*"నరనారాయణుల తపస్సు"*

*'అప్సరసలకు గత్వభంగము:'*

చదువుకుందాం.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


 🙏 *నరనారాయణుల తపస్సు* 🌹


ధర్మ సంస్థితికి పూర్వజన్మ వాసన ప్రధానకారణం. అది మలినమైతే ధర్మమూ మలినమవుతుంది. ఇక్కడొక వృత్తాంతం చెబుతాను. విను మరి.


పూర్వకాలంలో ధర్ముడు బ్రహ్మమానసపుత్రుడై జన్మించాడు. సత్యసంపన్నుడై వేదధర్మ నిరతుడై జీవిస్తున్నాడు. దక్షప్రజాపతి కూతుళ్ళను పదిమందిని వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. వారికి - హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు అని నలుగురు కుమారులు జన్మించారు. వీరిలో హరి, కృష్ణులిద్దరూ నిత్యం యోగాభ్యాసపరాయణులై కాలం గడుపుతున్నారు. నరనారాయణులు తపః పరాయణులయ్యారు.


హిమాలయాల్లో బదరికాశ్రమంలో తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. వెయ్యేళ్ళకు పైగా గడిచింది. తపస్వులలో కెల్లా అగ్రగణ్యు లయ్యారు.  వీరి తపస్సుల తీవ్రత ముల్లోకాలకూ వ్యాపించింది. దేవేంద్రుడికి దడపుట్టింది. ఎలా భగ్నం చెయ్యడమా అని చాలా రోజులు తీవ్రంగా ఆలోచించాడు. కట్టకడపటికి తానే రంగంలోకి దిగాడు. అతిదారుణమైన కామక్రోధలోభమోహాదులను వెంటబెట్టుకుని (గంధమాదనంపై ఉన్న) ఐరావతం ఎక్కి బదరికాశ్రమం చేరుకున్నాడు. ప్రత్యక్షమైన బ్రహ్మ విష్ణువుల్లాగా, అప్పుడే ఉదయించిన సూర్యబింబాల్లాగా తపస్తేజస్సుతో విరాజిల్లుతున్న నరనారాయణులను చూశాడు. ఏమిటి వీళ్ళ పట్టుదల, తపస్సుతో ఏం చేద్దామనుకుంటున్నారు అని ఆలోచిస్తూ దగ్గరికి వెళ్ళాడు. 


*మహానుభావులారా !* ధర్మసుతులుకదా మీరు.  చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. ఏమిటి మీ ఉద్దేశం, ఏమిటి మీ ఆకాంక్ష ?


ఉత్తమోత్తమమైన వరం ఇద్దామని వచ్చాను. ఇవ్వకూడనిదే అయినా ఇస్తాను. అంతగా సంతోషించాను ఏ తపస్సుకి.  కోరుకోండి - అన్నాడు. 


నరనారాయణులు ఉలకలేదు పలకలేదు. ఇంద్రుడు మళ్ళీ మళ్ళీ అదే ప్రకటించాడు. స్థిరచిత్తులై ధ్యానంలో మునిగిపోయిన ఆ జంటమునులలో చలనం లేదు.  ఇంద్రుడికి రోషం వచ్చింది. మాయామోహినిని సృష్టించాడు. వారి పైకి ఉసిగొల్పాడు. ప్రయోజనం లేకపోయింది. సింహాలూ పులులూ తోడేళ్ళను సృష్టించాడు. భయ పెట్టాలని ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. ఇక ఏమి చెయ్యడానికి తోచలేదు. వరదానానికి లుబ్ధులు కాలేదు. సింహశార్దూలాలకి భీతులు కాలేదు. మాయామోహినికి మోహితులు కాలేదు. వీరి తపస్సుని భంగపరచడం ఎలాగ చెప్మా అనుకుంటూ తిరిగి తన మందిరానికి వెళ్ళిపోయాడు. బాగా యోచన చేశాడు.


*జనమేజయా !* ఆదిశక్తి సనాతని సర్వలోకేశ్వరి పరాప్రకృతి అయిన మహావిద్యను నిష్ఠతో ఉపాసించేవారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. దేవాసురుల మాయలన్నీ ఆ మహామాయముందు ఓడిపోవలసిందే. చినమాయలు పెదమాయను ఏం చేస్తాయి ! మహామాయను ఉపాసించే వారికి ఎవ్వరూ ఏ విఘ్నాలూ కల్పించలేరు. వాగ్బీజ, కామబీజ, మాయాబీజ మంత్రాలను జపించేవారిని ఎవ్వరూ బాధించలేరు.


అయినా దేవేంద్రుడు మోహితుడై మరొక ప్రయత్నం చేశాడు. మన్మథుణ్ణి వసంతుణ్ణి పిలిపించాడు. రతిదేవితో అప్సరసలతో బదరికాశ్రమానికి వెళ్ళి నరనారాయణులను కామాతురులను చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. సుగంధ పరిమళాలతో పూలబాణాలతో ఒంపుసొంపుల ఒయ్యారాలతో వారి మనస్సులను సమ్మోహితం చేసి లొంగదియ్యండి. ఇది దేవకార్యం. మన్మథా ! ఈ ప్రపంచంలో దేవదానవ మానవ జాతులలో నీ బాణాల తాకిడికి లొంగిరానివాడు ఎవడు ? నీ శక్తి అమోఘం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు నీ అందానికి సాటివచ్చే చంద్రుడు కూడా నీకూ నీ పూలబాణాలకూ ఓడిపోయినవాడే. ఇక ఈ నరనారాయణులు ఒక లెక్కా ? పైగా ఇంతమంది అప్సరసలు నీవెంట వస్తున్నారు. నిజానికి ఒక రంభ, ఒక తిలోత్తమ చాలు. అసలు నువ్వు ఒక్కడివే సరిపోతావు. అటువంటిది ఇంతమందితో కలిపి వెడుతున్నావంటే ఇక చెప్పేది ఏముంది !  జయం మనదే. వెళ్ళిరా. కార్యం నెరవేర్చు. నువ్వు కోరినదల్లా నీకు బహుమతిగా ఇస్తాను. నేను స్వయంగా వెళ్ళి ప్రయత్నం చేశాను. ఫలితం లేకపోయింది. శ్రమ మిగిలింది. అసలు మొదటే మిమ్మల్ని పంపించి ఉండాల్సింది. అయినా ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు. వెళ్ళండి - అని పంపించాడు. వెళ్ళబోతూ మన్మథుడు ఒకమాట చెప్పాడు.


*దేవేంద్రా !* నీ ఆజ్ఞ ఇప్పుడే నెరవేరుస్తాను. ఆ నరనారాయణులు త్రిమూర్తులలో ఒకరినిగానీ ముగ్గురినీగానీ సూర్యుణ్ణిగానీ లేదా మరింక ఏ దేవతనైనాగానీ ధ్యానిస్తూ ఉంటే, చిటికెలో వారిని మోహపరచి తపోభంగం చేసివస్తాను. నందేహం లేదు. అలా కాక, వారు గనక దేవీ భక్తులైతే మాత్రం నేను చెయ్యగలిగింది ఏమీ లేదు.


కామరాజ మహాబీజమంత్రాన్ని జపించేవారిమీద నా బాణాలు పనిచెయ్యవు.


మన్మథుడు ఇలా చెప్పినా దేవేంద్రుడు వినిపించుకోలేదు. వెళ్ళమని తరిమాడు. ఇది దుస్సాధ్యమైన కార్యం. నువ్వే సాధించాలి. వాకు హితం చెయ్యాలి అని పంపించాడు. సరే అని మన్మథుడు బయలుదేరాడు.


*(అధ్యాయం - 5, శ్లోకాలు - 51)*


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


🌈 *అప్సరసలకు గర్వభంగం* 🌈


*జనమేజయా !* ముందుగా వసంతుడు బదరికాశ్రమంలోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా పచ్చదనం వెల్లివిరిసింది. కొమ్మ కొమ్మా రెమ్మ రెమ్మా చిగురించింది. పుష్పించింది. తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఆడుతూ పాడుతూ ఎగురుతున్నాయి. తరువు తరువునా చిగురుగుబురులు కోకిలలై యుగళ గీతికలు ఆలపిస్తున్నాయి. పుష్పించిన లతలు అందుబాటులో ఉన్న తరువులను పెనవేసుకుంటున్నాయి.  ఆశ్రమంలో ప్రతిజీవీ వయస్సుతో నిమిత్తం లేకుండా రాగరంజితమయ్యింది. తన సహచరిని కౌగిలించుకుంది. అది ఏదో తెలియని మత్తు ఆవరించి క్రీడాసక్తమయ్యింది.


పరిమళవాయు వీచికలు దక్షిణ దిశనుంచి ఏతెంచి తనువులను పులకింపజేశాయి. మునీశ్వరులకు సయితం ఇంద్రియాలు అదుపుతప్పి ఉద్రేకాలు ఉరకలు వేశాయి.


రతీమన్మథులు రంగప్రవేశం చేశారు. అయిదు బాణాలనూ ఒకేసారి ఎక్కు పెట్టి గురిచూసి కొడుతూ విచ్చలవిడిగా ఆశ్రమమంతటా కలయదిరిగారు. అంతలోకీ రంభా తిలోత్తమాద్యప్సరసలు వచ్చారు. బృందాలు బృందాలుగా చెట్లనీడల్లో కూర్చుని స్వరతానసమన్వితంగా మధురగీతాలను ఆలపించారు. వీరి గీతాలూ కోకిలల కలకూజితాలూ తుమ్మెదల ఝుంకారాలూ - బదరికాశ్రమమంతా మారుమ్రోగింది.


నరనారాయణులకు ధ్యాననిష్ఠ చెదిరింది. చూపులను క్రమంగా బయటకు మళ్ళించారు. ఎటు చూసినా వసంత శోభ. అకాలంలో ఏమిటి ఈ వింత ? ప్రాణికోటి అంతా మన్మథవివశమై కనపడుతోంది. ఋతు ధర్మంలో క్రమంలో ఈ విపర్యాసం ఎలా వచ్చింది ? అని నరుడు నారాయణుడిని అడిగాడు. ఆశ్చర్యంతో విప్పారిన కన్నులతో ప్రకృతిని తిలకిస్తున్న నారాయణుడు బదులుపలికాడు.


*సోదరా !* చెట్లు చూశావా, నిలువునా పుష్పించాయి. కోకిలాలాపాలనూ భ్రమరనాదాలనూ వినిపిస్తున్నాయి. శిశిరం అనే భీతమాతంగాన్ని (భయపడిన ఏనుగుని) మోదుగుపువ్వుల వాడి గోళ్ళతో చీల్చి చెండాడి వసంతకేసరి (సింహం) ఆశ్రమంలోకి ప్రవేశించింది.


*బ్రహ్మన్ !* మన బదరికాశ్రమంలోకి వసంతలక్ష్మి వచ్చిందయ్యా. అరుణాశోక హస్త. కింశుకపాద. నీలాశోకకచ. వికసిత కమలానన, నీలేందీవరనేత్ర. బిల్వఫలస్తని. కుందరదన. మంజరీకర్ణ. బంధుజీవాధర. సింధువారనఖ. పుంస్కోకిలస్వర. కదంజవసన. బర్హిబర్హ కలాప. సారసస్వననూపుర. వాసంతీబద్దరశన. మత్తమరాళగమన. పుత్రజీవాంశుకన్యస్త రోమరాజివిరాజిత. 


*తమ్ముడూ !* అకాలంలో వచ్చింది. ఈ వసంతలక్ష్మి. అంటే మన తపస్సుని భంగపరచడంకోసమే అని మనం గ్రహించాలి. అప్సరసల గానం వినపడుతోంది గదా ! మన ధ్యాన్యాన్ని నాశనం చేసింది. ఇదంతా దేవేంద్రుడి పన్నాగం. లేకపోతే ఏమిటి ఈ ప్రకృతి వైపరీత్యం. మన తపస్సుకి భయపడి ఇంద్రుడు ఈ పని చేసిఉంటాడు. సందేహం లేదు. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ సుఖస్పర్శంగా వీతెంచుతూ మలయానిలుడు తనువులను పులకింపజేస్తున్నాడు. గమనించావా ? ఇంకా సందేహమా ? ఇది నిశ్చయంగా శతక్రతుడి దుశ్చర్యయే.


నారాయణుడు ఇలా పలుకుతుండగా, బండారం బయటపడిందని గ్రహించిన మన్మథుడు ససైన్యంగా కన్నులకు కనిపించాడు. మేనక, రంభ, తిలోత్తమ, పుష్పగంధ, సుకేశి, మహాశ్వేత, మనోరమ, ప్రమద్వర, ఘృతాచి, గీతజ్ఞ, చారుహాసిని, చంద్రప్రభ, సోమ, విద్యున్మాల, అంబుజాక్షి, కాంచనమాల - ఇంకా అప్పరసలు మొత్తం పదహారువేలయాభైమంది కళకళలాడుతూ కిలకిలలాడుతూ కనిపించారు. అద్భుతమైన సంగీతంతో మానవలోకదుర్లభమైన ఆనందాన్ని పంచి పెట్టారు. నరనారాయణులు ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి ఆట్టే సమయం పట్టలేదు.


ఇంతటి సంగీత మాధుర్యాన్ని చవిచూపించిన మీకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి సముచితరీతిని సత్కరించడం మర్యాద. ఈ పూటకు మీరంతా దయచేసి ఇక్కడే ఉండండి. స్వర్గం నుంచి శ్రమపడి వచ్చారుగదా, కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది. ఉండిపోండి - అన్నాడు నారాయణుడు. సరే అన్నారు. వారందరూ. వారాయణుడికి స్వాభిమానం పొంగిపొర్లింది.


తపస్సులను భగ్నం చెయ్యమని పంపిన ఇంద్రుడికి, చేద్దామని వచ్చిన వీరికీ తగిన గుణపాఠం నేర్పాలి, తపశ్శక్తి చూపించాలి అనుకున్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండి తొడపై మెల్లగా చరుచుకున్నాడు. ఒక పర్వాంగసుందరి ఆవిర్భవించింది. రంభాదులను మించిన అందగత్తె. ఊరువు నుంచి పుట్టింది కనక ఊర్వశి అన్నాడు నారాయణుడు. మన్మథుడే కాదు అప్పరసలందరూ ఆశ్చర్యచకితలై కళ్ళప్పగించి చూస్తున్నారు. ఒక్కొక్క అప్సరసకు సేవ చెయ్యడానికి ఒక్కొక్క పరిచారికగా పదాహారువేలయాభైమంది సుందరాంగులను క్షణంలో సృష్టించాడు.  వారంతా నవ్వుతూ ఆడుతూ పాడుతూ రకరకాల బహుమతులను అందిస్తూ అతిథులందరికీ అద్భుతమైన మర్యాదలు చేశారు. విందు ముగిసింది. నరనారాయణుల ముందు వినయంగా నమస్కరించి నిలబడ్డారు. మరింకేమిటి

ఆజ్ఞ అన్నట్టు.


తమ కన్నులను తామే నమ్మలేక ఆశ్చర్యం నుంచి తేరుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న రంభాద్యప్సరసలు నారాయణుడి తపశ్శక్తికి సమ్మోహితులు అయ్యారు. అందరి కన్నులలోనూ అనురాగం మిలమిలలాడింది. అందరి తనువులూ పులకితమయ్యాయి. ముక్తకంఠంగా పలికారు.


మహానుభావా! నీ తపశ్శక్తి అమోఘం. నీ ధైర్యం అనన్యసామాన్యం. ఏమని స్తుతించాలో ఎలా స్తుతించాలో తెలియడం లేదు. నిజానికి మా చూపులు విషం పులిమిన తూపులు. ఇవి సోకి ఇలా నీలా ధైర్యంగా నిలబడినవాడు ఈ సృష్టిలో ఇంతవరకూ ఎక్కడా ఎవరూ తారసపడలేదు. మీ ఇద్దరి మనస్సులనూ మాత్రం కదిలించలేకపోయాం. మీరు దేవాంశ సంభూతులు. అంతర్బహిరింద్రియ నిగ్రహానికి నిధులు. దేవేంద్రుడి ఆజ్ఞను కాదనలేక మీ తపస్సులను భగ్నం చెయ్యడానికి ఇటు వచ్చాం. ఇది మా తప్పే. కాని మా సౌందర్యగర్వం పటాపంచలయ్యింది. నీకు ఓడిపోయాం. అయితే అదే అదృష్టమై మాకు మీ దివ్య దర్శనం లభించింది. మీకు అపకారం తల పెట్టిన మమ్మల్ని క్షమించి మీరు సత్కరించారు. ఇది కేవలం మీ ఔదార్యం. నిజమే మీవంటి మహానుభావులు చిన్న చిన్న అపరాధాలకు అలిగి శాపాలు ఇచ్చి తపశ్శక్తిని వృధాగా వ్యయపరచుకోరు.


అప్సరసలు వినయవినమితగాత్రలై నమస్కరించి నిలబడి ఇలా పలుకుతూంటే నరనారయణులు చాలా సంతోషించారు. కామక్రోధాలను జయించిన ధర్మాత్ములు కనక ప్రసన్నవదనులు అయ్యారు.


సుందరాంగులారా! మీ వినయానికి మేము సంతృప్తి చెందాం. మీకేమి వరం కావాలో కోరుకోండి. అనుగ్రహిస్తాం. ఇదిగో ఈ ఊర్వశిని మీతోపాటు స్వర్గానికి తీసుకువెళ్ళండి. మా కానుకగా మీ దేవేంద్రుడికి సమర్పించండి. మీకు మీ నాయకునికీ శుభమగుగాక! మీరింక బయలుదేరవచ్చు. ఇటు పైని ఇంకెప్పుడూ ఎవరికీ తపోభంగం చెయ్యకండి.  *న కస్యాపి తపో విఘ్నం ప్రకర్తవ్యమితఃపరమ్.* వెళ్ళిరండి.


నరనారాయణుల పలుకులు రంభాద్యప్సరసలకు ములుకుల్లా సోకాయి. వారిని విడిచి పెట్టి వెళ్ళడానికి మనసొప్పలేదు. నారాయణ మహర్షి! ఎక్కడికి వెడతాం! నీ పాదపద్మాలు ఆశ్రయించాం. ఇక్కడే నీకు సేవలు చేసుకుంటూ ఇలా ఉండిపోతాం. కోరినవరం ఇస్తానన్నావుకదా! ఇదే మేము కోరుకునేవరం. అనుగ్రహించు. మాకందరికీ నువ్వే భర్తవు. స్వీకరించు. మా ఆతిథ్యం కోసం నువ్వు సృష్టించిన పదహారువేల యాభైమంది వరాంగనలతో కలిసి . ఈ ఊర్వశి స్వర్గలోకానికి వెడుతుంది. మా బదులుగా అక్కడ ఇంద్రుడికి సేవలు చేస్తుంది. లెక్క సరిపోతుంది. మేము ఇక్కడ నీ సేవలు చేసి తరిస్తాం. మాట తప్పకు. మాకు ఆశాభంగం కలిగించకు. అది స్త్రీలను మరీ హింసిస్తుంది. కామారలై వచ్చిన వారిని తిరస్కరించి హింసించడం నీవంటి ధర్మజ్ఞులు చెయ్యవలసిన పనికాదు. భాగ్యవశంవల్ల స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని విడిచి పెట్టడం నీకు భావ్యం కాదు. నువ్వు సమర్థుడివి. తపశ్శక్తిసంపన్నుడివి. దయచేసి మా అభ్యర్థన అంగీకరించి, స్వీకరించు.


*సుందరాంగులారా!* వెయ్యేళ్ళకు పైగా తపస్సు చేస్తున్నాను. జితేంద్రియుడనయ్యాను. ఇప్పుడు నాకు నేనే తపోభంగం చేసుకోనా? ధర్మవినాశకాలైన తుచ్ఛసుఖాలమీద, కామోపభోగాల మీద నాకు ఇచ్ఛ లేదు. బుద్ధిమంతుడెవడూ పశుధర్మాన్ని కోరుకోడు.


*నారాయణ మహర్షీ!* శబ్దస్పర్శరూపరసగంధాలు అయిదింటా స్పర్శ సుఖమే ఉత్తమోత్తమమైనదని పెద్దలు చెబుతున్నారు. అది ఆనందరసమూలం. అంతకుమించిన సుఖం మరొకటి లేదు. కాబట్టి మాకు అదే ప్రసాదించు. వరం ఇస్తానన్నావు. మాట నిలబెట్టుకో. మాతో కలిసి నిర్భరసుఖాలను అనుభవిస్తూ ఈ గంధమాదనపర్వతం మీద స్వేచ్ఛగా విహరించు. ఒకవేళ తపస్సుతో స్వర్గలోకాన్ని పొందుదామను కుంటున్నావేమో! అది ఈ గంధమాదనం కన్నా అందమైనదీ అధికసుఖదాయకమైనదీ కానేకాదు. అందరం కలిసి ఇక్కడే క్రీడిద్దాం.


*(అధ్యాయం - 6, శ్లోకాలు - 58)*


అప్సరసలు వేసిన ఈ మెలికకు నారాయణుడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఏమిటి చెయ్యడమా అని ఆలోచనలో పడ్డాడు. వీరిని అంగీకరిస్తే తపస్సు అంతా గంగపాలవుతుంది. సాటి మునిబృందంలో అపహాస్యం ఎదురవుతుంది. ఇంద్రుడికీ వీళ్ళకీ బుద్ధి చెబుదామని అహంకరించి, వరం కోరుకోమని ఇలా కష్టాల్లో ఇరుక్కున్నాను. ధర్మవినాశనానికి అహంకారమే మొదటి కారణం. సంసారవృక్షానికి అదే మూలం. పెదవికదపకుండా అలా మౌనంగా ఉండిపోయినా బాగుండేది. పాడి ఆడీ అలసిపోయి వీళ్ళదారిన వీళ్లు వెళ్ళిపోయుండేవారు. బోలెడు తపస్సు వ్యయపరచి వరాంగనలను సృష్టించాను. ఊర్వశిని సృష్టించాను. విందు జరిపించాను. ఇప్పుడు ఇదిగో ఇలా ఇరుక్కున్నాను. వీళ్ళంతా కామారలైనన్ను పెళ్ళాడమంటున్నారు. హతవిధీ! సాలెపురుగులా నా వలలో నేనే చిక్కుకున్నాను. ఎలాగోలా వీరిని వదిలించుకోవాలి. తిరస్కరిస్తే అలిగి శపిస్తారు. పైగా మాట తప్పినవాడను అవుతాను. పోనీ క్రోధం వహిద్దామా అంటే అది కామంకంటే ప్రమాదకరం. లోభంకంటే దారుణం. గోధంవల్ల హింప జరుగుతుంది. అది సర్వప్రాణికోటినీ దుఃఖ పెడుతుంది. క్రుద్ధుడు అవ్వడమంటే  నరకారామంలో (నరకంలోని ఉద్యానవనంలో) దిగుడుబావి తవ్వుకోవడం. కొమ్మల రాపిడితో పుట్టిన అగ్ని ముందుగా ఆ కొమ్మలను ఆచెట్టునూ దహించివేసినట్టుగా, క్రోధం మునుముందుగా క్రుద్ధుడినే నాశనం చేస్తుంది. ఈ చిక్కునుంచి ఎలా బయటపడాలో తెలియక దీనుడై లోలోపల మల్లగుల్లాలు పడుతున్న అన్నగారి మానసికపరిస్థితిని గ్రహించాడు నరుడు. మెల్లగా ఆలోచనలో పాలుపంచుకున్నాడు.


*అగ్రజా! నారాయణా!* శాంతస్వభావుడివై ఆలోచించు. అహంకారం విడిచి పెట్టు.


పూర్వం ఒకప్పుడు అహంకారం కారణంగానే మనం చాలా తపస్సును నష్టపోయాం. ప్రహ్లాదుడితో ఘోరసంగ్రామం జరిగింది కూడా. ఒకసారి గుర్తు తెచ్చుకో. అప్పుడు ఎంతగా దుఃఖించామో ఇంత తొందరగా మరిచిపోతే ఎలా? అందుచేత క్రోధం జోలికి పోవద్దు. శాంతచిత్తుడవై వీరికి సమాధానం చెప్పు. తపస్సులకు అన్నింటికీ శాంతస్వభావమే మూలమని మునీశ్వరులందరూ చెబుతున్నమాట. *శాంతత్వం తపసో మూలం మునిభిః పరికీర్తితమ్.*


*జనమేజయా!* నరుడు ఇలా ఉపదేశించే సరికి నారాయణుడు తేరుకున్నాడు. క్రోధం జోలికి పోకూడదంటే పోకూడదు అని నిశ్చయించుకున్నాడు.


*(రేపు.... "అహంకారం సృష్టిబీజం)*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏



 

🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat