*స్వామి దర్శనమునకు అర్హతలు - 1*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
స్వామియే శరణం - శరణమయ్యప్ప అను పరమపావన మంత్రము సదా హృదయమునందు ధ్యానించుచూ సద్భుద్ధితో గూడి బ్రహ్మచర్య వ్రతము బూని అహంకార రహితులై , ఇతరుల యందు దయాదాక్షిణ్యాదులు గలవారై నాదనియూ , నీదనియూ మొదలగు బేధభావములను ఉపేక్షించి , సత్యధర్మాదులను సహచరులుగా యెంచి యాత్ర చేయుటకు ఎవరు సిద్ధమగుచున్నారో ఆతడే స్వామి దర్శనము చేయుటకు అర్హత పొందినవాడు. మనసావాచా కర్మణా అన్యులకు ఎటువంటి హాని చేయక సమచిత్త భావనతో గూడి దుశ్చింతలకునూ దుష్ప్రవర్తనలకును వశముగాక నిర్వికారుడై యాత్రచేయునటువంటి వాడే స్వామి వారి దర్శనమునకు అర్హుడు.
*శబరిగిరి ధర్మశాస్తాను పరబ్రహ్మమూర్తి అనియూ , చిదానందమూర్తి అనియూ ఓంకారమూర్తి అనియూ , తారకబ్రహ్మ మనియూ , హరిహర బ్రహ్మమనియూ భావించి సంబోధించి భక్తి శ్రద్ధలతో ధ్యాన పూజాదులు చేసి ఎవరైతే స్వామిని సేవించుచుందురో వారే స్వామివారి దర్శనమునకు అర్హులు. ఎవరికి ఈశ్వర భక్తి గలదు ? ఎవరి యందు ఈశ్వరుడు కోవెల గొనియున్నారు ? ఈశ్వరుడు ఎవరిని కటాక్షించును ? అను ప్రశ్నలను ఎవరైననూ ప్రశ్నించినచో వారికి మన ఆర్యులు చెప్పునదేమనగా ఎవరు పరిశుద్ధ మానసులై కాలము గడుపుచున్నారో , ఎవరి హృదయము ఈశ్వరభక్తితో నిండియుండి అన్యచింతనలేక ఆ ఈశ్వరుని శరణు వేడుచున్నదో అట్టివారి పైననే ఈశ్వర కారుణ్యము ప్రసరించును. ఆతనిలోనే ఈశ్వరుడు నెలకొని యుండును. ఆతడే ఈశ్వరుడు. ఈశ్వరుడే ఆతడు. అదియే ముక్తి. అదియే భక్తి. అదియే గమ్యము. కావున ముక్తి ప్రదాత అయిన పరమేశ్వరుడైన శ్రీ అయ్యప్పస్వామిని దర్శించుటకు , వారి కరుణాకటాక్షము పొంది సుఖముగా యాత్రచేసి ముక్తి కాంత సౌధము వైపుకు అడుగువేయుటకునూ ఆవశ్యకమైన , అభిలషణీయమైన నడవడికలను గూర్చి తెలుసుకొందాము.
*బ్రహ్మచర్యము*
శబరిగిరి యాత్ర చేయవలెనని నిశ్చయించిన వ్యక్తి ముందు ముఖ్యముగా అనుష్టించవలసినది బ్రహ్మచర్యమని ఎల్లరు చెప్పుదురు.
*బ్రహ్మచర్యమనగానేమి ?* స్త్రీ సంబంధము లేకపోవుటయే సూక్ష్మార్థము. సూక్ష్మ్యార్ధము ముందు చర్చించుకుని స్థూలార్థమును చూచెదను. బ్రహ్మ యందు చరించుటయే బ్రహ్మచర్యము. బ్రహ్మ మనగా ఆత్మ. బ్రహ్మమనగా పరమాత్మ. అట్టి ఆత్మ లేక పరమాత్మ ఆచరణలో లేక మార్గములో నడుచుటయే బ్రహ్మచర్యము. ముక్తి యొక్క రహస్యమంతయూ ఈ బ్రహ్మచర్యమందే దాగియున్నది. స్త్రీని చూడకుండా ఉన్నంత మాత్రముననే బ్రహ్మచారి కాదు. అది బ్రహ్మచర్యములో ఒక ముఖ్య అంగము మాత్రమే. ఋతుకాలమందు మాత్రము భార్యతో సంగమించని వాడు బ్రహ్మచర్య వ్రతము నవలంభించినవాడే అని మన శాస్త్రములు చెప్పుచున్నవి. అనగా ఏమి ? ఒక కట్టుబాటు కలిగియున్న స్త్రీ పురుషుల సంగమం బ్రహ్మచర్యముతో సమానమన్నమాట. కాని మాల ధరించిన అయ్యప్పస్వాములు మాల విసర్జన చేయునంత వరకు స్త్రీ సంభోగము కూడదు. మరి దీని అర్ధమేమి ? వీర్యస్ఖలనము వలన శక్తి కొరవడును.
ఊర్ధ్వ ముఖముగా వీర్యప్రవాహము జరిగినచో లేక వీర్య బంధన జరిగినచో అతనిలో బ్రహ్మతేజస్సు కలుగునని మన శాస్త్రములు సశాస్త్రీయముగా చెప్పు చున్నవి. అదియూగాక స్త్రీ ఆసక్తి అన్ని విషయాశక్తున్నింటికంటే బలమైనది. ఈ విషయాసక్తిలో మునిగి తేలెడి దీక్షాబద్ధునకు అత్యంత సహజంగా వరమాత్మయందు ఆసక్తి తగ్గిపోవును. కావుననే స్త్రీకి దూరంగా యుండుడని ఖచ్చితంగా ఒక నిబంధన ఏర్పర్చిరి. ఏ కొంచెము ఫరవాలేదులే అనిననూ , మానవులు కావలసినంత స్వేచ్ఛను పొందుదురు. అందుకే అంత కట్టుబాటు ఏర్పర్చిరి. కాబట్టి పెద్దలు అనుసరించిన మార్గముననే మనము నడవవలయుననిన ఒక్క విశ్వాసము పెట్టుకున్న చాలు.
ఇంత తర్క వితర్కములు మనకు రావు. స్వామి పూజ చేసుకొనుచూ , స్వామి సంకీర్తనమే చేయుచూ , స్వామి ఆలయమునకు వెళ్ళుచూ , స్వామి చరిత్రనే చదువుకొనుచూ సన్మార్గులై వర్తించుచూ బ్రహ్మచర్య వ్రత మవలంబించ వలయును. ఎవరికి వారు వారి వారి మనస్సును నిగ్రహించుట నేర్చుకొనవలెను. స్వామి దర్శనార్థము ముద్ర (మాల) ధరించిన క్షణము మొదలు స్వామియే శరణం - శరణం అయ్యప్ప అని సదా జపియించుటయూ , శరణుకోటిని లిఖించుచూ కామ సంకల్పములగు మాటలను పరిపూర్ణముగా త్యజించుటయూ దానికై అయ్యప్ప భక్తులైన సజ్జనులతో గూడి సమయము దొరికినపుడెల్ల స్వామివారి యొక్క నామకీర్తనలు పాడుటయునూ , వినుటయునూ చేయుచూ అందులో ఆనందము పొందగల రుచిని , శక్తిని , మనస్సునకు కలిగించవలెను.
ఇక స్థూలార్థమయిన స్త్రీల విషయమునకు దూరముగా యుండవలెనను విషయమును గూర్చి చర్చించెదము. అగ్ని దగ్గరకు పోయి ముట్టుకున్న కాలునని సామాన్యులెల్లరకూ తెలియును. అట్టి అగ్నిని ముట్టుకొన్ననూ కాలని సత్యసంధుల విషయము అటులుండ నిండు. సామాన్యులందరికీ అనుభవమయ్యెడిది కాలుటయే , అటువంటి అగ్ని దగ్గరకు పోయి కాలునో లేదో చూతును అనుట మూర్ఖత్వము , హాస్యాస్పదము. చేతులు కాలినాక ఆకులు పట్టుకొనుట కంటే ముందే జాగ్రత్తపడిన మంచిది కదా ! అట్లే *"నేను మహా నిగ్రహవంతుడును , ఎట్టి స్త్రీలైననూ నన్ను చలింపచేయజాలరు"* అని బీరములు పలుకుచూ స్త్రీలతో కలిసిమెలసి యుండెడి వాని సంగతి ఏ నాటికో ఒక నాటికి అధోగతి పాలు కాక తప్పదు. తప్పక అతడు విషయాసక్తుడు కాకమానడు.
కావున సోదరులారా ! సంఘమునందైననూ స్త్రీల విషయము పట్ల దూరముగా ఉండుడని పెద్దలు చెప్పుచుండ ఏకాంతముగా స్త్రీలకు దగ్గరగా ఉండవచ్చునా ? కూడదు. మనోవాక్కాయకర్మలా బ్రహ్మ చర్యమునే అవలంభించవలయునన్న స్వామి చరణములే శరణములు. కావున దీక్ష కాలమందు కామ సంకల్పములకు సహితముగా దూరముగా నుండి పరమేశ్వరుని యందు మనస్సును నిలిపియుంచుడు. అట్లని స్త్రీలను అసలు చూడకూడదనియూ , వారిని పూజాకార్యక్రమములయందు పాల్గొనకుండుడని శాసించుటయూ మూర్ఖత్వము. తల్లి లేనిదే నీవు లేవు.
దీక్షకాలమందు స్త్రీని తల్లిగా చూడటం నేర్చుకున్న మనస్సు ఎట్టి కామ సంకల్పములనూ ఇట్టి విషయమై శ్రీ రామకృష్ణ పరమహంసయే మనకు ఆదర్శము. తన భార్యయైన శ్రీ శారదామాతను తల్లిగా భావించి పూజించెడివారు. కావున అట్టి భావన కలుగజేసుకొను శక్తి మనస్సునకు మనము ముందునుంచే నేర్పవలయును. చేయవద్దని చెప్పిన పనిచేయుట మనస్సుకు మహా ఇష్టము. కావున జాగ్రత్త ! జాగ్రత్త ! *"అంతరాత్మను పరిశుభ్రపరచుకొని వెడలిన స్వామి కోపించునా ? పులిమ్రింగునా ? చచ్చేమీ పోము కదా !"* అనుచూ ఇంకనూ ఎన్నియో అహంకారపు ప్రశ్నలను సమాధానమిచ్చు అవసరమూ , అగత్యమూ లేదు.
అటువంటి వారితో సహవాసమూ వలదు. ఆతని విశ్వాసము అతనిది. మన విశ్వాసము మనది. *"పెద్దలు విధించిన కట్టుబాట్లను మీరక యుండుటయే , స్వామివారి అనుగ్రహమును పొందుటకు మార్గమనునదియే నా విశ్వాసము"* అని మరీ అత్యవసర పరిస్థితిలో సమాధానం ఇవ్వవలసిన ఇండు. మరియొక ముఖ్యవిషయము మనము జ్ఞప్తియందుంచుకొని మన దీక్షాకాలమును ముగించు కొనవలెను. మనము ప్రస్తుతము బ్రహ్మచారులమే కాని సన్యాసులంకానే కాము. మన ఇంట్లో ఉండెడి తల్లి , సోదరి , భార్య , చుట్టు ప్రక్కల మిత్రులందరితోనూ కలిసిమెలసి యుండియే మన దీక్షను జయప్రదముగా నిర్వహించు కొనవలెను. దీక్షా నిబంధనలను నేను ఎన్నడూ మీరనన్న దృడ నిశ్చయము ఉన్న భక్తుని మనస్సు తప్పక యాత్ర వైపే మరలును గాని సంసారము వైపుకు మరలదు. ఇది నిశ్చయము. కావున పెద్దలు విధించిన మార్గములోనే అడుగిడి ధన్యులు కండు.
*క్షమాశీలము*
ఎవరు శబరిగిరికి పోయి స్వామివారిని దర్శించవలెనని ఆశించుచున్నారో ఆతడు రెండవ సద్గుణమైన క్షమాశీలత అలవరచుకొని క్షమాశీలుడగుటకు యత్నించవలెను. క్షమ అనగా ఏమిటి ? క్షమ అనగా ఓర్పు. ఎదుటివారి తప్పును ఓర్పుతో క్షమించ గలుగుట. ఉదాహరణకు ఎవరైనా మనము వ్రతములోని వేషమును , (కట్టు , బొట్టును) చూసి పరిహాసముతో హాస్యముగా అధిక్షేపించు చున్నచో కోపము చెందక ఆ మాటలు విననట్లే ఓర్పుతో వుండ వలయును. అంతకన్నా మంచిది , ఓర్పుకు పరాకాష్ఠ చిరునవ్వు నవ్వి ఊరుకొనుట. మరి అట్లు చిరునవ్వు నవ్వవలయునన్న , మన ముఖ కళవళికలు మార్పులేక కోపము తెచ్చుకొనకుండునట్లు ఈ మనస్సుకు శిక్షణనీయవలసినదే. ఈ మనస్సు అను గుఱ్ఱమును ఏ సందర్భము నందు కూడా చేయకూడని పని చేయకుండునట్లు శిక్షించవలసిందే. అదియే మనయొక్క కర్తవ్యము. అందులకు *"క్షమ"* అత్యావశ్యకమగును.
క్షమకు మూలధారము మౌనము. మౌనము నవలంభించి నడుచు చున్న మరియొకడు అపహసించిననూ , మనము జవాబివ్వము అను దృఢత్వము మనకు అలవడిపోయి వుండును. కనుక ఇక కలహమునకు మార్గము లేక అది అంతటితో సమసిపోవును. ఇక ఏ దోషమూ మనకు అంటదుకదా ! అట్లుగాక అతడు క్షమాశీలుడు కాని పక్షమున అతనికి అనేక కష్టనష్టములు కలుగక మానవు. తప్పక కల్గును. *"కనకమును ఇత్తడి అనినచో కలుగదు దానికి హాని ఏమి ! నిన్ను దూషించిన నీ కది తక్కువ కాదు మారు పలకక మౌనము వహించు మనసా !!"* అను బ్రహ్మానందస్వామివారి యొక్క తత్త్వము ఎంతటి ఫలదాయకమో చింతించి ఇతరులు ఏమైననూ చెప్పనీ , ఏమైననూ అననీ ! అందువలన మనకు కలిగెడి హాని ఏమి. ఒక వేళ మనలను వాళ్ళు స్తుతించనీ ! అందువలన మనకు వచ్చు లాభమేమి. ఎవరైనా నిందించనీ ! దానివలన కలుగు నష్టమేమి ? రెండుయునూ లేవు. భూదేవి అంతటి క్షమ కలిగిన పురుషునికి సాధించలేని పురుషార్థ మేమి ? శారీరకంగా అశక్తులుగా నున్ననూ క్షమ అనెడి శక్తియే మానవులకి భూషణం (ఆభరణం) వంటిది అనెడి ఆప్తవాక్యము ఈ సందర్భమున స్మరించడము మనయొక్క క్షమాశీలతకు మెరుగులు దిద్దుకోనుటయే.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు🌹🙏