*శనీశ్వరుని శాసించిన శ్రీ మహాశాస్తా*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
మహమ్మదీయులు - క్రైస్తవులు మత సామరస్యంతో హైందవులతో కలసి భస్మధారణ చేసుకొని *'ఈశ్వరఅల్లాతేరే నాం'* అను మహాత్ముని వచనములను ఋజువుచేస్తూ హిందూ ఆలయాన్ని ప్రదక్షిణం చేసే అత్యద్భుత దృశ్యమును తమిళనాడులోని కాడంతేత్తి యనుశాస్తా వారి దివ్యక్షేత్రమున కానవచ్చును. తారుకావనములోని మునీశ్వరుల మదమణచుటకు భిక్షాటన మూర్తి అవతారమెత్తిన ఈశ్వరుడు మాయామోహిని రూపం దాల్చిన శ్రీమహావిష్ణువులు - కలయికలో శ్రీమహాశాస్తా ఆవిర్భవించినారని పురాణములలో చెప్పబడియున్నది. ఆ మహాశాస్తావారే నేపాళదేశ రాజుకుమార్తె పుష్కళాదేవిని , కొచ్చిదేశ రాకుమారి పూర్ణాదేవిని వివాహమాడి నారనియు , తదుపరి కాశీరాజు కుమార్తెయను ప్రభావతిదేవిని గాంధర్వ వివాహమాడి , వీర ధీరపరాక్రమశాలియైన సత్యకన్ పుత్రుని ఆవిర్భవింప జేసారనియు కాడంతేత్తి స్థలపురాణములో చెప్పబడియున్నది.
ధర్మసంస్థాపనార్థం శ్రీమన్నారాయణుడు పది అవతారంబులు దాల్చినట్లు వారిసుతుడైన శ్రీ శాస్తావారుగూడ కలిలో ధర్మాన్ని శాసించుటకు 8 అవతారములు దాల్చినట్లు అందురు. అవి *విశ్వశాస్తా - కాలశాస్తా - సమ్మోహనశాస్తా - యోగశాస్తా - మహాశాస్తా - విద్యాశాస్తా - ప్రభావతి నాయక శాస్తా - ధర్మశాస్తా* అనునవి యగును. చిదంబర క్షేత్ర సంరక్షణార్థం ఆ ఆలయానికి ఎనిమిది దిక్కుల యందు ఈ శాస్తావారు రక్షణామూర్తిగా వెలసినట్లు *శిల్పరత్నం* అను గ్రంథమున చెప్పబడి యున్నది. ఇందులో శ్రీధర్మశాస్తా లేక అయ్యప్ప లేక మణికంఠ మూర్తి యొక్క అవతార విశేషములు మిక్కిలిగా చెప్పబడియున్నను ఆలయలాలలో ఆరాధనలు చేయుటకు పూర్ణా పుష్కళా సమేత శ్రీమహాశాస్తా వారినే అధికసంఖ్యలో ప్రతిష్ఠ చేసి ఆరాధించి యున్నారు.
అట్టి ఆలయం మిక్కిలి కీర్తిఘటించి , నేటికిని త్రికాలపూజలందు కొనుచున్నది. తమిళనాడు తిరుతురై పూండి నుండి 16 కిలోమీటరు దూరాన గల వేదారణ్యం తాలూకా కాడంతేత్తి ఒక ఆలయమే అయ్యప్ప ఆలయం గ్రామమున వెలసి ధర్మాన్ని శాసించి , రక్షించి , నేర్పించు చున్నాడు ఆ దీనమయ అయ్యనారగు మహాశాస్తావారు అని ఇచ్చట స్థల పురాణములో చెప్పబడియున్నది. *శ్రీ మహాశాస్తా వారిని తమిళులు అయ్యనార్ అని మర్యాదగా పిలిచి మ్రొక్కెదరు.* పూర్వము ఇచ్చట బిల్వ వృక్షము క్రింది భాగాన శ్రీ మహాశాస్తా స్వయంభుగా ఆవిర్భవించినారనియు అది తెలిసిన సత్యపూర్ణుడనబడు మహర్షి ఆ స్వయంభు మూర్తిని ఆరాధించి వారికిచట బ్రహ్మాండమైన ఆలయం నిర్మించి , పలుకాలాలు ఆరాధనలు చేసి వెళ్లేవారనియు తెలియనొస్తున్నది. ఈ క్షేత్రమున ఎల్లవేళల మహర్షులనేకులు ఎడతెగక వేదఘోష చేయుచుండి నందు వలన దీనికి జాష్యేశ్వరం అను సార్థక నామం ఏర్పడిన దనియు అందురు. పూర్వ మొకానొకపుడు సృష్టికర్తయగు చతుర్ముఖ బ్రహ్మ తాను చేసిన చిన్న పొరబాటు వలన సృష్టికర్తత్వ శక్తిని పోగొట్టుకొని దుఃఖించు చుండువేళ పరమేశ్వరుడు ఈ క్షేత్రమహత్వమును తెలిపి ఆరాధించమని ఆదేశించగా బ్రహ్మ ఇచ్చటికి వచ్చి కొంతకాలముండి , శ్రీ శాస్తావారిని కొలిచి వారి అనుగ్రహంచే సృష్టిచేసే ప్రతిభను మరల పొందినాడనియు , వారు శాస్తా ఆరాధన నిమిత్తం నివశించిన ప్రదేశాన్ని వారిపేరుతోనే 'విరించు మూల' అని పిలువబడు చున్నట్టుగాను చెప్పుకొంటున్నారు.
శ్రీమహాశాస్తా వారిని గూర్చి కఠిన తపమొనర్చు చుండిన వ్యోమాసురిని అమరాధిపతి యగు ఇంద్రుడు వంచించి , హతమార్చి నందువలన శ్రీ శాస్తావారి ఆగ్రహానికి గురై వికార రూపము పొందెను. పిదవ బృహస్పతుల ఆదేశానుసారం ఈ స్థలమునకు విచ్చేసి , పశ్చిమోత్తర దిక్కున బసచేసి , చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తముగా మండలకాలం శ్రీమహాశాస్తా వారిని పూజించి , మెప్పించి యథారూపం పొందినాడనియు , ఇంద్రుడు అమరి పూజచేసిన ప్రదేశము గనుక దీన్ని 'అమరర్ కోన్ మూలై' యని పిలువబడు చున్నట్లు గాను తెలిపిరి. ఈ రేడు పదునాలుగు లోకాలను ఆక్రమించి వరబలముతో సర్వులను గడగడలాడిస్తుండిన కాటాసురునితో ఈ స్థలమునందే శ్రీశాస్తావారు యుద్ధముచేసి , గెలిచి అతన్ని సరిదిద్ది అంగరక్షకునిగా చేసికొనిన స్థలము గనుక 'కాడర్ తిరుత్తి' యను సార్థక నామము పొందిన దనియు ఈ నామ దేయమే తదుపరి కాలమగు నేడు 'కాడంతేత్తి' గా ప్రసిద్ధి నొందిన దనియు అందురు.
శాస్తావారి పుత్రుడగు సత్యకన్ *"చెల్లపిళ్ళె"* ఒకానొక సందర్భమున వజ్రమాలి అను రాక్షసుని సంహరించినందున *"వీరహత్తి"* దోషము వాటిల్లి బాధ పడుచుండెను. పిదప తండ్రియగు శాస్తావారి ఆదేశాను సారం ఈ క్షేత్రమున జేరి ఈశాన్య భాగమున ఒక కోనేరు నిర్మించి , అందున మండల కాలము స్నానమాడి క్షేత్ర నాథుడైన మహాశాస్తావారిని ఆరాధించి దోషనివారణ చెందినారనియు , కనుక ఈ కోనేటిని *'సత్యకతీర్థం'* అని పిలువబడు చున్నదనియు , కనుక ఈ పుణ్యతీర్ధమున స్నానమాడి ఇచ్చట క్షేత్రనాథుడుగా శ్రీ మహాశాస్తా వారిని ఆరాధించినట్టివారి సకల దోషములు తొలగడముతో బాటు శ్రేయస్సులనేకము ప్రాప్తించు ననియు తెలిపిరి.
లోకములన్నింటిని మోస్తే ఆదిశేషుడు ఒకానొకప్పుడు కారణాంతరాల వలన అట్టి దివ్యశక్తిని కోల్పోవలసి వచ్చినపుడు ఈ క్షేత్రమహాత్మ్యము తెలిసి ఇచ్చట స్వయంభువుగా ఆవిర్భవించినా శ్రీ మహాశాస్తావారిని ఆరాధించి , కోల్పోయిన ఆ దివ్యశక్తిని మరల పొందడముతో బాటు , ఈ స్థలమునందే నాగదేవతగా అమరి ఆరాధనలు అందుకొని భక్తులను అనుగ్రహించు చున్నారనియు చెప్పుకొనుచున్నారు. ఈ దివ్యస్థలమున 'మ్నుడయాన్' అను ఖ్యాతితో నెలకొని యుండు మరొక ప్రధాన దైవం 'వెళ్ళైయమ్మాళ్' 'బొమ్మియమ్మాళ్ ' సహిత 'శ్రీ మధురై వీరన్' స్వామివారలగును. భీమధరుడు అను అసురుని వద్ద అష్టదిక్పాలకులు ఓడిపోయి తమ సర్వస్వమును కోల్పోయిన వారై ఈ స్థలమునకు వచ్చి మధురై వీరునితో సాయమడుగగా వారు దిక్పాలకులతో దేవలోకమునకు వెళ్ళి భీమధరునితో యుద్ధముచేసి , సంహరించి , అష్టదిక్పాలకులు బాధను దీర్చినారట. అందులకు సంతసించిన ఇంద్రుడు మధురై వీరుని యొక్క ఖ్యాతిని వివరించు రీత్యా 1008 నామావళులతో వారికి అర్చన చేసి , ఆరాధించినట్లు చెప్పబడుచున్నది.
*మిగతా భాగం రేపు చదువుకుందాము*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*