*శనీశ్వరుని శాసించిన శ్రీ మహాశాస్తా - 2*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఆ 1008 నామావళులతో ఇచ్చటి మధురై వీరన్ స్వామిని ఆరాధించినవార్లకు శత్రుభయం , పేదరికం , దీర్ఘవ్యాధి మున్నగు బాధలు తొలగు ననియు , ఈ స్థలమునందే నెలకొనియుండు పెరియాచ్చి అంబికను ఆరాధించినచో స్త్రీలకు శారీరకమైన సకల ఋగ్మదలు తొలగి పుత్రభాగ్యము కూడా లభిస్తుందన్నది ఇచ్చటి వారి విశ్వాసం.
అన్నిటికన్న మిన్నగా ఈశ్వరునే మెప్పించి , శనీశ్వరుడనే బిరుదు పొందిన శనీశ్వరునకు శ్రీమహాశాస్తావారు ఇచ్చటనే అను గ్రహ మొసంగి హితబోధ చేసి , నల్లబట్టలు కట్టి , శబరిమల దీక్ష తీసుకొనుచుండు భక్తలమీద ఏల్నాటిశని , గండశని , పాదశని , అష్టమశని , అర్ధాష్టమశని వంటి కాలమున కాఠిన్య వీక్షణములతో వారిని ఉపద్రవించరాదనియు శాసించినట్లు చెప్పబడుచున్నది. *'అయ్యప్ప - శనీశ్వరుల'* వాదప్రతి వాదములను కూడా విన్పిస్తున్నా రు. 'శనీశ్వరా ! నీవు మానవులను ఏడున్నర సం||లు ఎందుకు పట్టి పీడిస్తున్నావు ? ఇలా మానవులను పీడించుటకూడా ధర్మమేనా అని ధర్మాన్ని లోకులకు శాసించి , నేర్పించి , ఆచరింప చేయుటకై ఆవిర్భవించిన మూర్తియగు శ్రీధర్మశాస్తావారడుగగా అందులకు శ్రీ శనీశ్వరస్వామి *"త్రిమూర్తులకు సృష్టి - స్థితి - లయములు వారి ధర్మములు. అట్లే యమకు జీవుల ప్రాణములు తీయుట ధర్మము.*
అలాగే నేని నాకిచ్చిన విధిని నేను నిర్వహిస్తున్నాను. అదియు ధర్మమేనా అని అడిగితే ఏమి చెప్పగలను స్వామి" ! అని అడుగగా శాస్తావారు *"సృష్టిధర్మము పరపీడనము కాకూడదు. ప్రజల సుఖ సంతోషాలకు , ఆనందోత్సాహాలకే సృష్టి యేర్పడినది" అని అనగా అందులకు శని నరుల దురాగత కృత్యాలను అనుసరించి బ్రహ్మదేవుడు వారి వారి తలవ్రాతలు వ్రాయుచున్నాడు. ప్రజలు వారి వారికర్మలను అనుభవించక తప్పదుగదా స్వామి"* అని సమాధాన మిచ్చెను. అందులకు శ్రీశాస్తావారు *"శనీశ్వరా ! నరులు తమ దుష్కృతాల ఫలితాలను అనుభవించుటయే గదా నీ పీడనములోని పరమార్థము ! అందుకనే నా భక్తులు సంవత్సర కాలములో (48 దినములు) నీ ఏడున్నర ఏండ్ల కాలములో అనుభవించు కష్టములన్నియు దీక్షానియమాదుల పేర అనుభవిస్తున్నారు"* అని అనగా అందులకు శనీశ్వరుడు *"స్వామి ! ఏడున్నర సంవత్సర కాలములో నేను కలిగించే కష్టనష్టములు శతకోటి మధుర రసాలతో , మత్తుపానీయాలతో , రుచికరముగా భుజించేవారిని సైతం ఆకలితో అలమటించేటట్లు చేస్తాను.
*హంసతూలికా తల్పముపై పరుండేవారలను సైతం కటికనేలపై శయనింపచేస్తా. పన్నీటితో స్నానమాడ గలిగిన వారలను సైతం , కన్నీటితో స్నానమాడింపజేసి , కట్టుకొనుటకు గూడా బట్టలు లేక , నఖకేశ సంస్కారములు చేసుకొనుటకు వీలుకానివ్వక పాదరక్షలు గూడా లేక నడిపిస్తూ , తనను తానుగా చెప్పుకోలేని దుస్తితి కలుగునట్లుగా చేస్తాను. నాచూపులోకి అనురక్తులైన దంపతులు విరుక్తులౌతారు. ఇవన్నియు మీభక్తులు దీక్షాదినములలో అనుభవించిగలరా"?* అని అడుగగా అందులకు శ్రీమహాశాస్తావారు *"శనీశ్వరా నా దర్శన ప్రాప్తి కొరకై మాలధరించిన భక్తులు మండల కాలములో స్వల్పమైన ఆహారమును భిక్షగా స్వీకరింతురు. అన్నిసుఖములు అందుబాటులో యుండినను వాటన్నిటిని పరిత్యజించి , విరాగులై వ్యవహరింతురు. నఖశిఖలను గూడా సంస్కరించుకొనక కటిక నేలపై నిద్రింతురు. ఉభయ సంధ్యావేళలో పన్నీటికి బదులు నామీద భక్తితో గడగడలాడించే చన్నీటి స్నానమాచరింతురు. నీకు అత్యంత ప్రియమైన నలుపురంగు వస్త్రములనే ధరించి , పాదరక్షలు విడిచి , భార్యను సైతం మరచి దీక్షాబద్ధులై , స్వయం ఉనికి కోల్పోయి సర్వమునే నేనని తలచి కఠిన వ్రతమాచరిస్తూ 'స్వామియే శరణం అయ్యప్పా!' అని శరణఘోషలు చేయుచు , ఇల్లు విడిచి , స్వస్థలము మరచి , అడవులవెంబడి పాదచారులై నా దర్శనార్థము వచ్చెదరు.
అటువంటి నా భక్తులను నీవు ఎప్పుడు పట్టిపీడించక వారికి శుభ యోగములనే కలిగించాలి. ఇది నా ఆజ్ఞ" అని శాసించినారట. అందులకు శనీశ్వరస్వామి వారు *"ధర్మశాసితుడవైన నీ ఈ శాసనము నాకు శిరోధార్యము. ఇక ముందు నల్లబట్టలు కట్టిన నీ భక్తులయెడల నా కటిన ప్రభావితములను చూపను"* అని ఒప్పుకొనిన స్థలము ఇదియే అని అందురు. అట్టి ధర్మనిరతుడైన శనీశ్వరస్వామి వారిని అనుగ్రహించిన శ్రీమహాశాస్తా శనీశ్వరునకు ప్రీతిపాత్రమైన శనివారమున (స్థిరవారము) నే తనకు ఇష్టమైన దినముగా గొనియున్నారు. అలాంటి యొకస్థిరవారమున భక్తులు ఈ కాడనేత్తి దివ్యక్షేత్రమునకు విచ్చేసి , ఇచ్చటి సత్యకతీర్థమునందు స్నానమాడి శ్రీమహాశాస్తా వారి సన్నిధి ముంగిట నువ్వుల ముడుపులు కట్టి , నువ్వుల నూనెతో దీపము వెలిగించి , అర్చన చేయించి , ఈ ఆలయమును 12 పర్యాయములు ప్రదక్షిణముచేసి ఆరాధించుటను వదలక 7 శనివారములు ఆచరించువారికి శనీశ్వర బాధయేగాక నవగ్రహములన్నిటి మూలాన కలుగు బాధలన్నిటిని తొలగిస్తారా కాడన్ త్తి మహాశాస్తావారు అనునది ఇచ్చటి స్థలపురాణము. ఔను నిజమంతేగదా ! శ్రీస్వామివారి అనుగ్రహ ముంటే నవగ్రహములు అనుకూలిస్తాయి అనుమాట భక్తులందరికి తెలుసును కనుక ఓమారు కాడన్ తేత్తి వెళ్ళి , శ్రీమహాశాస్తా వారిని దర్శించుకొని గ్రహదోష నివారణ పొందవలయునని కోరుకొను చున్నాము.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*