*భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ*" - 5వ భాగము.

P Madhav Kumar


- తాము చేస్తున్న కర్మలవలన మనుజుల గుణము బయటపడుతుంది. వ్యక్తిలో దాగివున్న సత్వ, రజో, తమో గుణములు కర్మలరూపంలో తేటతెల్లమవుతాయి. ఎంత కపటమును ప్రదర్శించినా కూడా అవి ఒకానాకప్పుడు బయటపడితీరుతాయి. అందుకే భగవతార్పణబుద్ధితో కర్మలనాచరించమని భగవద్గీత చెబుతుంది. ఎందుకంటే ఏదైనా భగవంతునికి అర్పించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటాము కాబట్టి. ఇలా చేయడంవలన మానవులు చేయు దుష్కర్మలు కొన్నాళ్ళకు సత్కర్మలుగా మారతాయి. 


సత్కర్మల వలన శాంతి కలుగుతుంది. ఆపిమ్మట సత్కర్మలను, నిష్కామకర్మలుగా(ఫలితమును ఆశింపక) చేయడం ద్వారా చిత్తశుద్ధి కలిగి జ్ఞానముదయిస్తుంది. చూడటానికి మాత్రం జ్ఞాని, అజ్ఞాని చేయుకర్మలు ఒకేలా వుంటాయి.


అజ్ఞాని, నేను చేస్తున్నానని భావించి(కర్తృత్యము), ఫలితముల యందు ఆసక్తితో కర్మలను చేసి, వాటి ఫలితాన్ని అనుభవించుటకు ఈ జన్మ చాలకపోతే ఇంకొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. దానినే ప్రారబ్ధకర్మ అంటారు. కర్మఫలితాలతో బంధము ఏర్పడుతుంది. 


జ్ఞాని, ఆత్మస్థితి యందుండి, ఎటువంటి ఫలితములను ఆశింపకా దైవబుద్ధితో కర్మలు చేస్తాడు. అది యజ్ఞంగా, యోగంగా మారి బంధమును కలిగించదు. సాధనతో ఆత్మజ్ఞానము పొంది బంధంనుండి విముక్తి పొందుతాడు. 


ఈ కర్తృత్యమును మానవుడు అనవసరంగా తన నెత్తినవేసుకొని బాధపడుతున్నాడు. తను తెచ్చింది లేదు, వెంట తీసుకుపోతున్నది లేదు. ఈ అనంతకోటిబ్రహ్మాండమున మనుజుని ఉనికి యెంత! ఆయువు యెంత! తానూ పుట్టక మునుపు, మరణము పిమ్మట ఇది ఎవరిదో? అది ఎవరో తెలుసుకొనుటకు సాధనచేయాలి. అప్పుడు బ్రహ్మాండమును నడుపువాడు దైవమని తెలుస్తుంది. 


అతడినే పరమాత్మ అన్నారు విజ్ఞులు. అతని ప్రమేయంతోనే విశ్వముదయించిది. అతని అంశయే ఈ చరాచర జగత్తు. మానవుడు కేవలం నిమిత్తమాత్రుడు. మనతో పనులు చేయుంచునదియు అతడే. అతడే సూత్రధారి. అనంత కాలమును, అనంత సృష్టిని అతడే నడుపుతున్నాడు. ఇక అరవై, డబై యేళ్లు జీవించే మానవుడు తానె అంతా చేస్తున్నానని అనుకోవడము హాస్యాస్పదము. 


కావునా "నా ఆత్మయే నీవు", "నాచే చేయిస్తున్నది నీవు" అన్న సంకల్పంతో యుద్ధము చేయమని అర్జునునికి బోధించాడు శ్రీకృష్ణపరమాత్మ. 


ఎవరి కర్మ శుద్ధముగా, పాపరహితముగా వుంటుందో అతడు ఎవరికీ భయపడ నవసరంలేదు. అందుకే మానవుడు ముందుగా నమస్కరించవలసినది కర్మకే (తస్మై నమః కర్మణే). 


అంత అర్జునుడు, కృష్ణా! నాదొక సంశయము. బలవంతముగా మానవునిచేత కర్మలను చేయించేది ఏది? అని అడిగేడు. 


అర్జునా! కామమే (కోరికలు) మనుజులచేత బలవంతంగా కర్మలను చేయిస్తుంది. కామము తీరకపోతే క్రోధంగా(కోపంగా) మారుతుంది. కామాన్నే క్రోధమని చెప్పవచ్చు. ఇదే మానవునికి మహాశత్రువు, మహాపాపకారి. ధూళి అద్దమును కప్పేసినటులు కోపము మనుజుని జ్ఞానాన్ని కమ్మేస్తుంది.కామానికి ఆధారములు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. ఇంద్రియముల కంటే బలీయమైనది మనస్సు. మనస్సు కంటే అత్యంత బలమైనది బుద్ధి. 


కనుక అర్జునా! ఇంద్రియములను, మనస్సును అదుపులో పెట్టుకొని, బుద్ధితో ఆత్మను కనుగొని, జ్ఞానంతో పరమాత్మను చేరుకోవాలని బోధించాడు జగద్గురువు.

✍️శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

తదుపరి భాగంలో కలుసుకుందాము.

                                                        🪷⚛️✡️🕉️🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat