_*అయ్యప్ప సర్వస్వం - 80*_అచ్చన్ కోవిల్ అరసే ...! అచ్చన్ కోవిల్ కరుప్పస్వామి - 1*

P Madhav Kumar



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*అచ్చన్ కోవిల్ అరసే ...! అచ్చన్ కోవిల్ కరుప్పస్వామి - 1*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


పంచ అయ్యప్ప స్థానములలో ఒకటియగు అచ్చన్ కోవిల్ ఆలయం ముంగిట క్యూలైను షెడ్ క్రిందిభాగమున మిక్కిలి మహిమలు గల స్వామి వారి పరివారదేవతలగు శ్రీ కరుప్ప స్వామి శ్రీ కరుపాయమ్మల సన్నిధి గలదు. ఇచ్చటి పూజారి అనునిత్యం భక్తులకు రక్షాదారం ప్రసాదిస్తారు. ఈ కరుప్పస్వామి మిక్కిలి చైతన్యం కలవారనుట ప్రతీతి. ఇటీవల అచ్చన్ కోయిల్ ఆలయమున స్వర్ణ ధ్వజస్తంబము నిర్మించియున్నారు. చూడ చాలా అందముగా నున్నది. ఈ ఆలయమున రేయింబవళ్ళు ఏ వేళలోనయినా విష క్రిమికీటకాల కాటుకు గురైన వారికి గర్భాలయము తెరచి తీర్థ ప్రసాదం ఇచ్చి విషకాటునుండి విముక్తి కలిగించుట ప్రత్యేకత అగును. ఈ ఆలయం వెనకాల సర్పతర అనబడు నాగేంద్రుల సన్నిధి గలదు. ఇచ్చట శ్రీ ధర్మశాస్తావారు పూర్ణ పుష్కళ యను దేవేర్లతో కొలువుతీరి వున్నారు. ఈ ఆలయంలో చందన చార్త్ మిక్కిలి విశేషమైన ఆరాధన యగును. శబరిమల తెరచియుండు దినములలో ఈ ఆలయాన రద్దీ ఎక్కువగా కనబడుచున్నది. భక్తులు తమయాత్రలో యొక భాగంగా అచ్చన్ కోవిల్ శ్రీధర్మశాస్తావారిని శ్రీ కరుప్పస్వామి కరుప్పాయమ్మలను దర్శించుకోగలందులకు మనవి.


కలియుగ వరదుడు , కరుణాసాగరుడు , హరిహరపుత్రుడు అయిన శ్రీ ధర్మశాస్తావారు కలిలో ధర్మరక్షణ మూర్తిగా , అయ్యప్పగా అవతరించిన కాలములో , భువిలో అయిదు ప్రధాన క్షేత్రములను కొలువుగా గొనియుండి నారనునది ప్రతీతి. అవి *అచ్చన్ కోవిల్ , ఆర్యంకావు , కుళతుపుళై , ఎరుమేలి , శబరిమల* అను ఐదు ఆధారస్థలములే అవి. పురాణ ప్రసిద్ధము గాంచిన ఆరవ ఆధార స్థలమగు కాంతగిరి మనమనోవాక్కాయములకతీతముగా అమరియున్నది. మానవ శరీరములోని వెన్నెముక మధ్యలోని యోగమార్గమున ఆరు ఆధారచక్రములు కలవు. ముక్తినంద తలచినవారు ధ్యానముచేత (తపస్సు) కుండలినీ శక్తిని ఉసిగొలిపి ఆరు ఆధారములను దాటి సహస్రారపద్మము ద్వారా ముక్తి నొందుటకు గైకొనే ప్రయత్నము వంటిదే మన శబరిమల పయనము గూడా ఆరు ఆధార స్థలములను దాటవలసినదేయగును. మూలా ధారము , స్వాధిష్టానము , మణిపూరకము , అనాహతము , విశుద్ది (ఆజ్ఞ) భ్రమరంధ్రము అను ఆరు స్థితులను , ఆరు ఆధారస్థలముగా గొని స్వామి అయ్యప్ప అమరియున్నారు. *కుళత్తుపుళై యందు బాలునిగాను , ఆర్యంకావు నందు కళ్యాణమూర్తిగాను , అచ్చన్ కోవిళ్ నందు గృహస్థునిగాను , ఎరిమేలియందు కిరాతపురుషమూర్తిగాను , శబరిగిరి యందు యోగీశ్వరునిగాను* అమరియున్నారనియు , ఇవి మానవుని బాల్యం యవ్వనం , కౌమారం , వార్థక్య , వానప్రస్తం అను ఐదుస్థితులను సూచించేటిదగును.


వీటిలో అచ్చన్ కోవిళ్ మధురై తెన్ కాశి మార్గముగా వెళ్ళేందుకు బస్సు వసతిగలదు. దట్టమైన అడవి ప్రాంతము. వన్యమృగములు , విషజంతువులు సహజముగా తిరుగులాడే ప్రదేశము. జనవాసము గూడా అతిస్వల్పమే. కొండచేరుకొనుటకు గల రహదారి మిక్కిలి చిన్నదిగాను , ఎదురొచ్చే బండికి దారిచ్చేపనిలో ఏమాత్రము ఆజాగ్రత్త చూపిన అపాయము ముంచుకొస్తుందన్న భీతితోనే వాహనాలను నడిపించుస్థితిలో యున్న సింగిల్ ట్రాక్ తారు రోడ్డు మాత్రమే గలదు. అందులో సుమారు డెబ్భైకి పైగా హేయిర్ పిన్ బెండ్స్ 'యు' ఆకారపు మలుపులు గలవు. కావున పొడుగైన బస్సులు ఆదారిలో వెళ్ళుట అసాధ్యము. కారు , జీపు , వ్యానుల ద్వారా మాత్రమే వెళ్ళగలము. దారిలో అనేకులకు ఏనుగు అడ్డుపడి ఇబ్బందులు పెట్టుట , చెట్లు విరిగి రోడ్డుపై బడి ఆటంకము కల్గుట. రోడ్డుమీద మట్టికూలిపడి అడ్డగించుట మొదలగు అనుభవాలు ఏర్పడి యున్నాయి. ఇవన్నిటిని దాటి శ్రీస్వామివారి దయవలన అచ్చన్ కోవిక్ చేరుకొంటే అచ్చట ఆ ఆనందరూపుడైన శ్రీ ధర్మశాస్తావారి దివ్యాలయము కనిపించి మనోహ్లాదము కల్గించును. ఘోరాడవి మధ్యన కొన్ని శతాబ్దాలకు ముందు నిర్మించబడి బహుగంభీరముగా కనిపించే ఆ దేవాలయమును ప్రక్కనే ప్రవహించు నదియు భక్తులను యొక అలౌకిక ప్రపంచములోనికి కొనిపోగలదని చెప్పవచ్చును. నదిలో స్నానముచేసి ఆలయములో ప్రవేశించి పూర్ణాపుష్కళా సమేతుడై వేంచేసియున్న శ్రీధర్మశాస్తా వారిని దర్శించుకొనే ఆ ఆనంద అనుభూతిని మాటలతో వర్ణింపజాలము.


శ్రీధర్మశాస్తావారి స్థలపురాణములో చైత్రమాసము విషుక్కణి దర్శనము కుళత్తుపుళైలోను , మండలాభిషేక దర్శనము ఆర్యంగావు లోను , మండలమునకు రెండు దినములముందు రథోత్సవదర్శనము అచ్చన్ కోవిల్ నందును , ధనుర్మాసము చివర ఎరిమేలి శాస్తా దర్శనమును , మకరజ్యోతి దర్శనము శబరిమల యందును చేసుకొనవలయు ననియు విధించబడియున్నది. ఇవిగాక అచ్చన్ కోవిల్ నందు పుష్పాంజలి ఉత్సవము మిక్కిలి వైభవో పేతముగా జరుపబడు చున్నది. అచ్చన్ కోవిల్ అయ్యప్పమీద ఎనలేని భక్తిప్రపత్తులు నిండిన సిద్ధపురుషులొక్కరు ఈ స్థలమున చిత్ సమాధి అయినారట. ఆ భాగవతోత్తముని గుర్తుగా ఈ పుష్పాంజలి ఉత్సవము ఏటేటవారి శిష్యులచే నిర్వహింప బడుతున్నది. ఈ క్షేత్రమున వేంచేసియున్న శ్రీధర్మశాస్తావారు మిక్కిలి శక్తివంతమైన వారనియు అందురు. వీరిని అభిషేకించిన దివ్యతీర్ధము ఎట్టికఠిన విషమునైన ఖండించగలదని చెప్పెదరు. ఈ ప్రదేశము చుట్టూ నివసించే వారికి ఏర్పడు విషకాటుకు ఔషధముగా స్వామి దివ్యతీర్థమును రేయిపగలనక ఏవేళ వచ్చిన సన్నిధి తలపులుతీసి తీర్థమిచ్చి , కాటుకు గురియైన ప్రాణిని రక్షించేదరు.


ఈ దేవాలయమున చందనాభిషేకము , చందనక్కాపు , విశేష పూజగ ఎంచి జరుపబడుతున్నది. అచ్చన్ కోవిల్ ను గూర్చి కర్ణపాఠం పర్యముగా చెప్పబడు పలుకథలలో యొకటి. మిక్కిలి వింతగాను , అతిశయోక్తిగాను యున్నది. భువి నుండి దివికి శరీరముతో వెల్లదలచిన త్రిశంకు కథలాగనే యున్నది. వినసొంపుగా యున్న ఆకథ ఏమిటంటే...... 


ముందొక కాలమున అచ్చన్ కోయిల్ స్వామి వారిమీద అపారభక్తినిండిన పూజారి యొకరు అచ్చట నివసిస్తూ యుండేవారు. ప్రతినిత్యము పూలుకోసి రంగు రంగు మాలలు అల్లి శ్రీస్వామివారికిను , ఇతర దేవతా మూర్తులకును సమర్పించేదే వీరిపని , భక్తినిండిన హృదయముతో శ్రీస్వామివారికి పుష్పాంజలి తో బాటు , భాష్పాంజలి గూడా సాష్టాంగపడి సమర్పించు కొనేవారాయన. అంతటి భక్తుని భక్తికి శ్రీస్వామివారు సంతసించి అతనికి పరీక్ష పెట్టదలచినారేమో అన్నట్టు ఆపూజారి మనసున ఒకవింత కోర్కె చెలరేగెను. అది జరగదని పూజారి మనసుకే తెలిసినను , శ్రీస్వామివారి మీదనున్న అతీతదేవతా విశ్వాసము చేత శ్రీస్వామివారు అనుకొంటే జరగనిపని గలదా అను భావనలో కలిగిన కోర్కె ఏమనగా అజ్ఞానుల కంటపడని రీతిగా , ఋషులచేత నిర్మించబడి , అనునిత్యం దేవతలందరిచే పూజలందు కొని కాంతగిరి పొన్నంబలమున యోగబట్టముతో అష్టాదశ సోపానములపై తేజోమూర్తిగా అమరియున్న ఆ జ్ఞానమూర్తిని తనువుతో వెడలి దర్శించు కోవాలన్నదే. ఇది జరగదు అని ధృడముగా తెలిసిగూడా ఆకోర్కె అతన్ని వీడక దిన దిన ప్రవర్ధమానము చెంది , జీవితలక్ష్యముగా మారెను. అదియే అతని అనుక్షణ ప్రార్థనగాను మారినది. రేయి పగలనక ఈ ప్రార్ధనతోనే గడుపుచుండిన పూజారి దీనినొక తథముగానే గైకొని నిద్రాహారములుమాని కూర్చుండిపోయెను. పరీక్షకు భక్తుడు తయారైనాడని తెలుసుకొన్న స్వామివారు ఒకదినం రాత్రి ఆతని కలలో కనిపించి ఇట్లనెను.


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat