శ్రీ మహాశాస్తా చరితము - 18 *భువి అంతయు ప్రశంసించు భూతనాధుడు*

P Madhav Kumar

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*భువి అంతయు ప్రశంసించు భూతనాధుడు*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*


*“సో అభితనుజాసభ పిశాచముని సిద్ధాః ,* *చారణ మహారగ శకుంత సుర యక్షైః*
*పూజిత పదః ప్రవర యోగి గణవంధ్యో మార ఇన తత్ర విరరాజ కిల శాస్తా.*

రాక్షసి , పైశాచ , ముని , సిద్ధ , చారణ , నాగ , దేవ , గరుడ , యక్ష , యోగిగణములచే నుతింపబడు

శ్రీ శాస్తా అపర మన్మధుని వలె ప్రకాశించుచుండెను. (పద్మపురాణం)

భువనేశ్వర పట్టాభిషేకం
శాస్తా అను నామమునకు తగిన విధముగానే ముల్లోకములను కాపాడి రక్షించు బాధ్యతను
పరమశివుడు శాస్తాకు ప్రసాదించెను. స్థితి , సంహార , మూర్తుల ఏకరూప శక్తియై ముల్లోకములను
పరిపాలించు భువనేశ్వర బిరుదమును పరమశివుడు ప్రసాదించెను.

తన తండ్రి ఆదేశానుసారము సకల లోకములకు అధిపతియై పరిపాలన చేయుచూ దుష్టసంహారణ , శిక్ష రక్షణ చేయుచూ పరిపాలించుచుండెను.

అనంతరము స్వామి తన తల్లిదండ్రులకు నమస్కరించి భూలోక విజయమునకై బయలుదేరెను. అలా భూలోక సంచారము చేయుచూ కాంచి మహాపట్టణము చేరుకొనెను. ఒకమారు సతీదేవి ఈశ్వరుని పరిణయమాడగోరినప్పుడు కంచిలో తపమాచరించి నన్ను చేరుకొనుము' అని శివుడు పలికెను.

*'నగరేషు కాంచి'* అని ప్రసిద్ధిగాంచిన ఆ పుణ్యక్షేత్రంలో ఈశ్వరుని కొలుచుటకై ఉద్యక్తుడైనాడు శాస్తా. పరమశివుడు , శ్రీ చక్రనాయకియైన కామాక్షులు పరిపాలించు స్థలము మరియు పరమపావని
శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి ఈశ్వరుని కొలిచిన పుణ్యక్షేత్రమైనందువలన శాస్తా ఈశ్వరుని
లింగరూపినిగా పూజించసాగెను. అతడికి సోదరుడైన సుబ్రహ్మణ్యస్వామి తోడుగా నుండెను.

తనకై తపమాచరించుచున్న దేవేరిని పరీక్షించుటకై నదీ ప్రవాహము ఉధృతం చేసి నటించిన పరమశివుడు తన బిడ్డ విషయంలో మటుకూ ఏ పరీక్షలూ చేయలేదు. తన శరీరములోని ఒక
స్వరూపమే కదా తన బిడ్డ అనేమో ? తనయుని భక్తికి పరవశించి అతడి ఎదుట సాక్షాత్కరించెను.

సకల భూతగణ సేవితుడైన పరమశివుడు , తన అనుంగుపుత్రుని మీది ప్రేమతో భూతగణములకెల్ల
అధిపతియను పదవిని ప్రసాదించెను.

ఇటుల తండ్రి యొక్క ఆశీర్వాదమువలన భూతగణ అధిపతియను పదవిని పొందిన స్వామి
పరమేశ్వరి యొక్క కామకోటిని చేరుకొనెను.

పాలకడలిని చిలుకువేళ , అసురుల దృష్టి నాకర్షించుటకై మోహిని అవతారము దాల్చినపుడు ,
ఆదిశక్తియైన లలితా పరమేశ్వరిని ధ్యానించిన పిమ్మట కదా మహావిష్ణువు జగన్మోహిని అవతారము దాల్చినది.

అందువలననే నారాయణమూర్తి దాల్చిన మోహిని అవతారము , పరాశక్తి యొక్క మరొక
అవతారముగానే కొనియాడబడుచున్నది. ఈ మోహిని యొక్క మోహన రూపము చూసియే కదా పార్వతీపతి అయిన పరమశివుడు మోహిని మూలముగా శాస్తా అను పుత్రుని కన్నది. (లలితోపాఖ్యానం).

అందువలన మోహినీ సుతుడైన శాస్తా , మోహినిగా రూపుదాల్చిన పరాశక్తికి కూడా పుత్రుడైన
కారణముచే *'అంబాసుతుడని'* పిలువబడెను. ఈమె స్తన్యము గ్రోలియే కదా శాస్తా ఆ తల్లి యొక్క
ప్రేమకు పాత్రుడైనాడు. అందుచేతనే ఆ తల్లి పట్ల అతడికి మక్కువ ఎక్కువ.

ఈశ్వరుని అనుగ్రహము వలననే , పార్వతీదేవి భండానురుడను రాక్షసుడు తక్కిన రాక్షసులందరిలోనూ అతిబలశాలియను పేరుగాంచి , అమిత కర్కసు పరిపాలన చేయునప్పుడు
చిదగ్ని కుండములో శ్రీమాతా లలితా పరమేశ్వరిగా ఉద్భవించినది. శ్రీపురమను నగరిలో పట్టాభిషిక్తయై కామేశ్వరుని ప్రాణనాయకిగా మహారాణిగా పరిపాలన చేయు లలితా పరమేశ్వరిని ఆమె అనుంగు పుత్రుడు శాస్తా పలుతెరగుల స్తుతించి , నుతించి ఆమె ఆశీర్వాదము పొందెను.

లోకమాత అయిన పార్వతీ దేవి కూడా , తన శక్తి సేనకు ఒక గణపతిగా శాస్తాని నియమించి
తన శ్రీవిద్యా సామ్రాజ్యమునందు గురుస్థానమును అలంకరింపజేసెను.

కంచిలో కామాక్షి రూపమున కొలువైయున్న తన తల్లియైన లలితాంబిక యొక్క అనుంగు పుత్రునిగానూ , దేవతలను రక్షించుటకై పరివేష్టింపబడి యున్న తల్లి నివాస స్థలమునకు సమీపంలో , తన వాహన , పరివార గణములు సేవించుచుండగా , కామకోటి నాయకికి కాపలాదారునిగా
పరిపాలించసాగెను. శివశక్తి పుత్రునిగా , భువనేశ్వర బిరుదాంకితుడై స్వామి అచట కొలువై యుండెను.

ఈశ్వరుని మహాశాస్తా కొలిచిన స్థలము మహాశాస్తేశ్వరం , *'మాసాత్తనాట్ర ?'* అను పేరుతో కాంచి
మహాపట్టణమున ప్రసిద్ధిగాంచినది.




*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat