కార్తీక శుద్ధ విదియ - భగినీ హస్త భోజనం - కార్తీక మాసం రెండవ రోజు - భగిని హస్త భోజనం వెనుక కథ

P Madhav Kumar


*సనాతన ధర్మంలోని పండుగలు, పర్వదినాలు సమైక్యతత్వాన్ని, సమష్టి భావాన్ని ఆకాంక్షిస్తాయి. కుటుంబంలోని జీవన మాధుర్యానికి, సంప్రదాయ సౌరభానికి ప్రతీక- యమద్వితీయ.*


*సహోదరుల మధ్య సదవగాహన, సౌమరస్య పూరిత ఆపేక్షల వృద్ధికి యమద్వితీయనాడు నిర్వహించే భగినీ హస్తభోజనం ఉపకరిస్తుంది.*


*కార్తికంలో రెండో రోజైన శుద్ధ విదియను యమద్వితీయగా, సహోదర ద్వితీయగా వ్యవహరిస్తారు.*


*సోదరసోదరీమణుల మధ్య ఉండే అపురూపమైన అనురాగ సరాగాల్ని ప్రకటించే వేడుక- భగినీ హస్తభోజనం.*


*‘భగిని’ అంటే సోదరి, భాగ్యవంతురాలని అర్థం. ‘భగిని’ చేతివంటను సోదరులు ప్రియమారా ఆరగించే పావన తరుణమే భగినీ హస్తభోజన పర్వదినం.*


*కార్తిక శుద్ధ విదియనాడు సోదరీమణుల సమాదరణం చేయాలని లింగపురాణం  ప్రస్తావించింది. అవ్యాజమైన అభిమానంతో సోదరుల్ని ఇంటికి పిలిచి తోబుట్టువులు వారికి సంతృప్తిగా భోజనాన్ని కొసరి కొసరి వడ్డించాలని, సోదరులు తమ అక్కాచెల్లెళ్లను ఘనంగా సత్కరించాలని భవిష్యపురాణం పేర్కొంది.*


*నరకాసుర వధ అనంతరం, శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర ఇంటికి వెళ్లాడంటారు. ఆయనకు సుభద్ర విజయ తిలకాన్ని దిద్ది, మంగళహారతి నిచ్చి, మధుర పదార్థాల్ని తినిపించి, రక్ష కట్టిందంటారు. ఆ మహత్తర సందర్భమే భ్రాతృ ద్వితీయగా స్థిరపడిందంటారు.*


*యమద్వితీయగా ఈ పర్వదినం ప్రశస్తి పొందడానికి ఎంతో నేపథ్యం ఉంది.*


*యమి(యమున) తన అన్న యమధర్మరాజును ఇంటికి ఆతిథ్యానికి రమ్మని ఎన్నోసార్లు ఆహ్వానించింది. అయితే ఆయనకు వీలు చిక్కలేదు. తన అన్న రాకకై యమున ఎదురుచూడసాగింది. అల్పాయుష్కుడైన మార్కండేయుడి ప్రాణాల్ని తన పాశంతో హరించడానికి యముడు వెళ్లాడు. పరమేశ్వరుణ్ని మార్కండేయుడు శరణు వేడాడు. భక్తవశంకరుడైన మహేశుడు త్రిశూలధారియై యముణ్ని వెంటాడాడు. శివాగ్రహానికి భీతిల్లిన యముడు తన సోదరి యమున ఇంటికి పరుగున వచ్చాడు.*


*తన పిలుపు మన్నించి, ఇన్నాళ్లకు తన అన్న వచ్చాడని యమున సంబరపడింది. ఎన్నో మర్యాదలు చేసి, షడ్రసోపేతమైన వంటకాల్ని సిద్ధంచేసి, అన్నగారికి వడ్డించింది.*


*అదే సమయంలో యముణ్ని అన్వేషిస్తూ శివుడు అక్కడికి వచ్చాడు. వంటకాల్ని వడ్డిస్తున్న యమునను, భోజనాన్ని ఆరగిస్తున్న యముణ్ని చూశాడు. వారి అనురాగ బంధాన్ని వీక్షించి ముగ్ధుడై, యముడికి అభయమిచ్చి నీలకంఠుడు నిష్క్రమించాడన్నది పురాణగాథ.*


*తన సోదరి ఇంట ఆతిథ్యాన్ని అందుకోవడం వల్ల, యముడికి ఈశ్వరుడి ఆగ్రహం బదులు, అనుగ్రహం లభించింది. మహాదేవుడి నుంచి తనను రక్షించినందుకు, మరపురాని వరం కోరుకొమ్మన్నాడు యముడు.*


*కార్తిక శుద్ధ విదియనాడు తమ సోదరీమణుల గృహాలకు వెళ్లి, వారి చేత భోజనం స్వీకరించే సోదరులకు సర్వదా అనేక శుభాలు చేకూరాలని, అపమృత్యు దోషాలు తొలగాలని యమున వరం అడిగింది. యముడు తథాస్తు అన్నాడు ఆనందంగా.*


*సమవర్తి అయిన యముడి దశనామాల్ని యమద్వితీయనాడు స్మరిస్తూ, అర్ఘ్య ప్రదానం చేయాలి.*


*దక్షిణ దిశాధిపతియైన యముడి ప్రీతి కోసం, దక్షిణ దిక్కున అరటి ఆకులో ఉప్పును కుప్పగా పోసి దానిపై ఆముదంతో యమదీపాన్ని వెలిగించాలి. పితృదేవతలకు సద్గతులు దక్కాలని ఆకాంక్షించాలి’- ఈ విధివిధానాల్ని భవిష్కపురాణం వివరించింది.*


*‘తల్లిదండ్రుల తరవాత ఆత్మీయులైనవారు తోబుట్టువులే! వారి మధ్య బంధాలు, ఆప్యాయతలు నిరంతరం గాఢంగా వర్ధిల్లాలి. జీవితాంతం ఒకరికొకరం తోడునీడగా, అండదండలతో సహోదరులు పురోగమించాలి’. ఈ శుభాకాంక్షల పరంపరకు సాకార దర్శనం- భగినీ హస్తభోజన పర్వదినం!*


*ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః।*

*ఓం నమః శివాయ।**

🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*యమ ద్వితీయ దాని విశేష కథాంశం*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


కార్తీక శుద్ధ విదియను భక్తులు విలక్షణ పర్వదినంగా భావిస్తారు. *ఈ రోజును యమ ద్వితీయ , పుష్ప ద్వితీయ , కాంతి ద్వితీయ , భ్రాతృ విదియ* వంటి అనేక పేర్లతో పిలుస్తారు. యముడి చెల్లెలు యమున. అన్నను ఆమె ఒకరోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. రోజుల తరబడి ఆయనకు వీలుపడదు.


ఓ రోజున అర్ధాయుష్కుడైన మార్కండేయుడి ప్రాణాన్ని హస్తగతం చేసుకునేందుకు యముడు పాశాలతో వెళ్తాడు. అప్పుడు ఆ బాల భక్తుడు మహాశివుణ్ని శరణు వేడుకుంటాడు. స్వామి త్రిశూలం తీసుకుని యముడి వెంటపడటంతో , ఆయన తన చెల్లెలి ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సకల మర్యాదలు చేస్తుంది. రుచికరమైన పిండివంటలతో విందు వడ్డిస్తుంది. భోజనం చేస్తున్నవారిని సంహరించరాదని శివుడు తిరిగి వెళ్లిపోతాడు.


భక్త మార్కండేయుడి ప్రాణ సంరక్షణ జరిగినట్లవుతుంది. మరోవైపు , అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది. శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణనూ కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు. ఆమెను ఏదైనా వరం కోరుకొమ్మంటాడు. ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్లి , ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా అపమృత్యు దోషం కలగరాదని యమున కోరుతుంది. ఆయన పరమానంద భరితుడవుతాడు. *ఏటా కార్తీక శుద్ధ విదియనాడు* ఇంటికి వచ్చి , ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయమూ ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు.

*‘నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను. అంతేకాదు , సోదరుడికి ఈరోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది’* అని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు పొంది యముడు తిరిగి వెళ్తాడు.


యమునకు , యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే *‘యమ ద్వితీయ’* పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేతి వంట కాబట్టి *‘భగినీ హస్తభోజనం’గా* ప్రాచుర్యంలోకి వచ్చింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు - సోదరుడు ఆమెకు చీర , పసుపు , కుంకుమ , పూలు , పండ్లు , ఇతర కానుకలిచ్చే సంప్రదాయమూ ఉంది. పలువురు నేడు చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేస్తారు. అంతకుముందు *(కార్తిక శుద్ధ పాడ్యమి)* పూజలందుకున్న బలి ఇప్పుడు వీడ్కోలు పొంది , పాతాళానికి వెళ్తాడనీ విశ్వసిస్తారు.

ఇదే పర్వదినాన యముడితో పాటు చిత్రగుప్తుడు కూడా మహిళల పూజలందుకుంటాడు. ఈ రోజు చేసే దానధర్మాల కారణంగా విశేష పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదిన ప్రత్యేకతను స్మృతి కౌస్తుభం , చతుర్వర్గ చింతామణి , భవిష్య పురాణం వంటి గ్రంథాలు విపులీకరించాయి.

ఈ యాంత్రిక యుగంలో కుటుంబసభ్యుల మధ్య పరస్పర అవగాహన , సంబంధ బాంధవ్యాలు క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి. వాటిని తిరిగి నెలకొల్పడానికి , పునరుద్ధరణ ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ వెలుగొందేలా చేయడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి. ఆర్థిక బంధాల్ని ఆర్ద్రపూరితంగా మార్చేవి , అందరూ ఒకరినొకరు ప్రేమపూర్వకంగా పలకరించుకోవడానికి వేదికగా నిలిచేవి ఇటువంటి పర్వదినాలే ! అనుబంధాలను గుర్తుచేసుకోవడమే కాక , రేపటి తరాలవారికి వీటి ప్రాధాన్యం తెలియజేయాల్సిన అవసరమూ ఎంతో ఉంది.

ఇవన్నీ పెద్దలు ఆశించి ఉపదేశించినవి. వీటిని తు.చ. తప్పక ఆచరణకు తెచ్చినప్పుడే సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ సుసాధ్యమవుతుంది !


అన్నా చెల్లెళ్ళ  పండగ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షాబంధనం. కానీ , ఇంతటి ప్రాముఖ్యత పొందిన మరో పర్వదినాన్ని కూడా అన్నా చెల్లెళ్ల పండగగా జరుపుకొంటాం… అదే *భగిని హస్త భోజనం.* ఈ రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి , వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తారు. అందుకే దీనిని భగిని హస్త భోజనం అంటారు.


*ఎప్పుడు జరుపుకొంటారు*

ఈ పండగను భారతదేశంతో పాటు నేపాల్‌లో కూడా జరుపుకొంటారు. దీపావళి అయిన రెండో రోజు దీనిని చేసుకుంటారు. ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి , హారతి ఇచ్చి , మిఠాయిలు తినిపించి అక్కాచెల్లెళ్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతారు. తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.


*భగిని హస్త భోజనం వెనుక కథ*

హిందూ పురాణాల ప్రకారం దీనిని యమ ద్వితీయ , భాయిదూజ్‌గా పిలుస్తారు. ఈ రోజున పురుషులు తమ సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయన్నది పురాణ ప్రవచనం. సూర్య భగవానుని కుమారుడు యముడు. ఆయన సోదరి యమి & యమున. ఈ ప్రత్యేక పర్వదినాన యముడు యమున ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో యమున తన సోదరునికి హారతి ఇచ్చి , నుదట తిలకం దిద్ది సాదరంగా లోనికి ఆహ్వానిస్తుంది. యమునికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ వండి అన్నకి ఎంతో ప్రేమతో తినిపిస్తుంది. దీనికెంతో సంతోషించిన యుముడు ఆమెను వరం కోరుకోమనగా , ఏటా ఇదే విధంగా వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరుతుంది. అలాగే అంటూ యముడు వరమిస్తాడు. ఆ పర్వదినాన సోదరి చేతి వంట తిన్న వారికి అపమృత్యు భయం ఉండదని అభయమిస్తాడు. ఈ విధంగా దీపావళి తరవాత వచ్చే రెండో రోజును భగిని హస్తభోజనం పర్వదినంగా జరుపుకొంటారు. దీనితో పాటు ,  మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శ్రీ కృష్ణుడు నరకాసురున్ని వధించిన తరువాత నేరుగా తన సోదరైన సుభద్ర ఇంటికి వస్తాడు. అప్పుడు సుభద్ర కృష్ణుడికి హారతి ఇచ్చి , తిలకం దిద్ది లోనికి ఆహ్వానిస్తుంది. యుద్ధంలో అలసి వచ్చిన అన్నకు ఆప్యాయంగా భోజనం వడ్డిస్తుంది.వైవియస్ఆర్


*ఎలా చేసుకుంటారు*

ఉదయాన్నే సోదరులను ఇంటికి పిలిచి వారితో కలిసి దేవుణ్ని ప్రార్థించి , వారి నుదుటన తిలకం దిద్ది , హారతి ఇచ్చి , వారికి సోదరిమణులు తమ చేతితో వండిన ఆహార పదార్థాలను తినిపిస్తారు. హరియాణా , మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సోదరులు లేని వారు చంద్రునికి హారతి ఇచ్చి దీనిని నిర్వహిస్తారు.

- మహారాష్ట్రలో ఈ పండుగను *‘భయ్యా - దుజ్’* అని పిలుస్తారు.

- నేపాల్ ప్రాంతం లో *భాయి - టికా* అని పిలుస్తారు.

- పంజాబ్ ప్రాంతం లో ఈపండుగను *‘టిక్కా’* అని పిలుస్తారు...

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat