శివకేశవుల మాసం కార్తీక మాసం*

P Madhav Kumar


*విష్ణుదేవుడితో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని మహర్షులు చెపుతున్నారు.*


*కార్తీకమాసం శివకేశవులకు ఇష్టమైంది ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం, మహిమాన్వితమైనది.*


*శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీకం నెల రోజులూ ఎంతో పవిత్రమైనవి. కార్తీకమాసంలో వచ్చే పాడ్యమి నుండి కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి వరకు ఎంతో పవిత్రంగా వ్రతాలను చేస్తుంటారు  కార్తీకమాసంలో వచ్చే పాడ్యమి రోజున బలిపాడ్యమి, విదియనాడు వచ్చే భగనీహస్త భోజనం ఆధ్యాత్మిక సాధనకు అనువైన పండుగలు అని అంటారు. కార్తీకమాసంలో చేసే దీప దానం చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది.*


*కార్తీకమాసంలో దానాలు, జపం, ఉపవాసం, వనభోజనం చాలా శుభప్రదం.*


*కార్తీకమాసంలోని మొదటి రోజు నుండీ సూర్యోదయానికి ముందే నదీస్నానం చేయడం శ్రేష్టమైనది. కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీళ్ళతో స్నానం చేసిన తరువాత సూర్యాస్తమయం తరువాత సంధ్యాదీపం పెట్టడం, తులసి పూజ, గౌరీపూజ చేయడం ఈ మాసంలోని ప్రత్యేకతలు.*


*కార్తీకమాసంలో కార్తీక శుద్ధ నవమిని అక్షయ నవమిగా, తరువాత వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ద్వాదశి రోజును క్షీరాబ్ధిద్వాదశి అని, కార్తీక శుద్ధ త్రయోదశి రోజున స్వాయంభువ మన్వంతరం ప్రారంభమయిందని అంటారు. కార్తీక శుద్ధ చతుర్థశిని మహాకార్తి అని కూడా అంటారు.*


*అలాగే కార్తీకపౌర్ణమి రోజున గౌరీవ్రతం, కార్తికేయ దర్శనాలు చేసుకుంటారు. కార్తీక బహుళ ఏకాదశి రోజున బోధనా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. కార్తీకమాసంలో ఎటువంటి మంచి పనిచేసినా 'కార్తిక దామోదర ప్రీత్యర్థం' అని ఆచరించాలని శాస్త్రోక్తి.*


*శరదృతువులో నదీప్రవాహంలో ఔషధాల సారం ఉంటుంది, అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువులోని పవిత్ర జలాన్ని 'హంసోదకం' అని అంటారు.*


*కార్తీకమాసంలో మానసిక శారీరక రుగ్మతులను తొలగించి ఆయుష్షు, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం ప్రముఖమైనది, పైత్య ప్రకోపాలను తగ్గించడానికే హంసోదక స్నానం. సూర్యోదయానికి ముందే నదిలో ఉదరభాగం మునిగేలా స్నానం ఆచరిస్తే ఉదర సంబంధమైన వ్యాధులు నయమవుతాయని పండితులు చెబుతున్నారు.*


*అలాగే కార్తీకమాసం సూర్యోదయానికి పూర్వమే విష్ణు సన్నిధిలో విష్ణు కీర్తనలు గానం చేస్తే వేలగోవుల దానఫలం, కీర్తనలకు వాయిద్యం వాయించేవానికి వాహపేయ యజ్ఞఫలం, నాట్యం చేసేవానికి సర్వతీర్థ స్నానఫాలం, అర్చనా ద్రవ్యాలను సమర్పించి వానికి అన్ని ఫలాలూ, దర్శనాదులు చేసేవారికి ఈ ఫలాలలో ఆరవవంతు ఫలం లభిస్తుంది. సూర్యోదయకాలంలో నిద్ర మేల్కొని విష్ణు, శివాలయాలలో భగవంతుణ్ణి ధ్యానం, స్తోత్రం, జపం చేయడం వల్ల వేల గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది. విష్ణు, శివాలయాలు లేని ప్రదేశాలలో ఇతర దేవాలయాలలో లేకపొతే రావిచెట్టు మొదట్లో గాని, తులసీవనంలో గాని ఉండి భాగవత్ స్మరణ చేయాలి.*


*ముఖ్యమైన సూచన ఏమిటంటే తడిబట్టలతో దీపారాధన చేయకూడదు అలాగే శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో స్త్రీలు తులసిచెట్టు ముందు ప్రతిరోజూ దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి. తులసిలో సర్వతీర్థాలు ఉన్నాయని అంటారు.*


*యన్మూలే సర్వతీర్థాని*

*యన్మధ్యే సర్వదేవతా।*


*యదగ్రే సర్వవేదాశ్చ*

*తులసి త్వాం నమామ్యహమ్॥*


*అని శ్లోకం చదువుతూ భక్తితో తులసికి నమస్కరించాలి.*


*కార్తీకమాసంలో కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి చంద్రని అనుగ్రహం పొందడానికి అభిషేక ప్రియుడు అయిన పరమేశ్వరుని ఆరాధించాలి.*


*కార్తీకమాస సోమవారాలు ...*


*శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు యిష్టమైన కార్తీకమాసంలోని సోమవారాలలో స్నాన, జపాలు ఆచరించేవారు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతారు. కార్తీకమాస సోమవారాల్లో ఆరు రకాల వ్రత విధి ఉంది. అవి*


*ఉపవాసం: ~*


*శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలంతా ఉపవాసంతో (అభోజనం) గడిపి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తరువాత తులసితీర్థం మాత్రమే సేవించాలి.*


*ఏకభుక్తం:~*


*ఏకభుక్తం అంటే ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలన్నమాట. ఉదయం స్నానం చేసి దాన, తపం, జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి, రాత్రి శైవతీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.*


*నక్తం:~*


*పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ, ఉపాహారం కానీ స్వీకరించాలి.*


*అయాచితం: -*


*భోజనం కోసం తాము ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం.*


*స్నానం :~*


*పైవాటికి వేటికీ శక్తిలేని వాళ్ళు సమంతరం స్నానం, జపాలు చేసినా చాలు.*


*తిలదానం: ~*


*మంత్ర, జపవిధులు కూడా తెలియనివాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది.*


*పైన పేర్కొనబడిన వాటిల్లో ఏది చేసినా సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది అని పురాణాల ద్వారా తెలుస్తోంది.*


*పరమశివుడి కుమారుడైన కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతొ ఉన్న కార్తీకమాసం అంటే పరమశివుడికి మహాప్రీతి.*


*ధర్మో రక్షతి రక్షితః ।*

*సర్వే జన: సుఖినో భవన్తు।*

*లోకా: సమస్తా: సుఖినో భవంతు।*


*కార్తీక దామోదరాయ నమః।*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat