నరక చతుర్దశి రోజున ఆచరించవలసిన ముఖ్య విధులు

P Madhav Kumar


🌸 *సత్సంగం* 🌸

🪷🪷🪷🪷🪷🪷

 *నరక చతుర్దశి రోజున ఆచరించవలసిన ముఖ్య విధులను*.... ఈ పర్వానికి 'నరక చతుర్దశి ' అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం..


🪔 నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందిన ఆశ్వయుజ బహుళ చతుర్దశిని *దీప రాత్రి* గా పేర్కొంటారు. దీపావళి అమావాస్య మహాపర్వంలో ఈ చతుర్దశి ప్రధానభాగం. శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించిన దినం ఈ చతుర్దశి అనీ, అటుపై వచ్చే అమావాస్య ఆ విజయోత్సవహేల అని ప్రసిద్ధిగా అందరూ చెప్పుకునే గాథ. 


🪔 కానీ, ఇది శ్రీకృష్ణుడికి పూర్వమే భారతీయ సనాతన ధర్మంలో ప్రశస్తి వహించిన పర్వదినం. ఈ పర్వమే అటుపై కృష్ణ విజయలీలతో, నరక సంహార గాథతో మరో కొత్త విశిష్టతను సాధించిందని సమన్వయించుకోవచ్చు.


🪔 ఆశ్వయుజ మాసారంభమే నవరాత్ర పర్వంతో ప్రారంభమవుతుంది. రాత్రి శక్తిపూజకు ప్రధానమైనది. _*'రుద్రోదివ ఉమారాత్రిః...'*_ అని చెప్పినట్లుగా దేవీ ఆరాధనకు ముఖ్యమైన రాత్రి ఉత్సవాలు, దీపావళి రాత్రితో ముగియడం ఒక విశేషం. ఆశ్వయుజ పూర్ణిమకు కూడా ప్రాముఖ్యముంది. అలాగే అమావాస్యకు కూడా ప్రాధాన్యం.


🪔 నరక చతుర్దశికి *"నరకభయాన్ని పోగొట్టే చతుర్దశి"* అనే అర్థాన్ని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. దుఃఖమయమైన నరక బాధలను నివారించే శక్తి ఈ పర్వానికి ఉందని స్పష్టమవుతోంది. ఈ చతుర్దశినాటి రాత్రిని *'కాలరాత్రి'* అంటారు.


_*దీపోత్సవ చతుర్దశ్యాం కాలరాత్రిస్తు పర్వ సా|*_

_*మహారాత్రిర్మహేశాని యద్యమావాస్యయాయుతా॥*_

           - అని 'శక్తి సంగమతంత్రం' చెబుతున్నది. 


🪔 నరక చతుర్దశి, దీపోత్సవంలో ప్రధానరాత్రి అని ఉపాసనా గ్రంథాలు కొన్ని స్పష్టపరుస్తున్నాయి. ఉత్కళ, వంగ రాష్ట్రాలలో కొన్ని చోట్ల ఈ రోజున మహాకాళీ పూజలను పెద్దస్థాయిలో నేటికీ నిర్వహిస్తుంటారు. కాలస్వరూపిణి అయిన జగదంబను ఆరాధించి, కాలుని (యముని) భయాన్ని పోగొట్టుకొని, కాలమంతా అనుకూలంగా ఆనందంగా గడవాలని ఉపాసించే పర్వమిది. 


🪔 ఈ నరక చతుర్దశి ప్రాతఃకాలాన నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసినవారికి నరక భయముండదని పురాణ వచనం. యముని స్మరించడం, నమస్కరించడం ఈ రోజున శ్రేష్ఠ కృత్యం. కొందరు 'యమతర్పణం' పేరుతో యమునికి ప్రీతిగా తర్పణలు విడుస్తారు. 


🪔 ఈ విశ్వనిర్వహణలో ఒకే పరమేశ్వరుణ్ని అనేక విధాలుగా వ్యవహరిస్తుంటారు. కాలస్వరూప శక్తిగా యముడు ఆరాధ్యుడు. అవధులు లేని కాలశక్తి మహాకాలుడు. ఆ కాలుడే జగతిలో ప్రతి అణువునీ నియమించువాడు. ఈ కాలశక్తి సర్వజీవుల కర్మలకు సాక్షి. ఆయా జీవులకు తగిన సమయంలో తగిన గతులనిచ్చే కాలమే అంతటినీ 'యమి'స్తున్నది. 'యమము' అనే మాట నిగ్రహానికీ, నియామకత్వానికీ సూచకం. 


🪔 'అన్నిటినీ నియమించే ఈశ్వరుని కాలశక్తి విశేషమే యముడు." కర్మానుగుణ ఫలాలను నియతం చేసే ఈ కాలస్వరూపం పుణ్యాత్ములకు పవిత్ర సుందరంగాను, పాపాత్ములకు భీషణాకరంగాను గోచరిస్తుందని పురాణాలు వచిస్తున్నాయి.


🪔 సూర్యుని పుత్రుడు యముడు. శనికి సోదరుడు. శని గ్రహానికి అధిదేవత. ఇందులో సంకేతం - సౌరశక్తిలోని కాల నియమక చైతన్యమే యముడని తేటపరుస్తుంది. ఈ యముని భక్తిగా నమస్కరించేవారికి కాలప్రతికూలాలు కలుగవని తాత్పర్యం. 


🪔 నరక చతుర్దశిని 'కాలరాత్రి' అనీ, దీపావళీ అమావాస్యకు 'మహారాత్రి' అనీ శాస్త్రం పేర్కొంటున్నది. 


 🪔 ఈ రెండు రాత్రులలోను దీపాలను వెలిగించడం, కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాల కర్రలను మండించి ఆకాశానికి చూపించడం సంప్రదాయం.


🪔 ఇవి పితరులకు సద్గతిని కల్పిస్తాయని ప్రాచీన శాస్త్ర వచనం. కాలరూపుడైన యముని పూజించడం, నరక బాధలను నివారింపజేసుకోవడం, పితరులకు సద్గతులు కలగాలని సంభావించడం... ఈ మూడు అంశాలు... కాలశక్తినే సూచిస్తున్నాయి. 


🪔 నరక చతుర్దశి నాటి ప్రదోష సమయంలో (రాత్రి ప్రారంభ వేళ) దీపాలను వెలిగించాలనీ, ఈ రోజుతో మొదలు పెట్టి పరుసగా మరో రెండు రోజుల పాటు ఇళ్లలో, దేవాలయాల్లో, మఠాల్లో, ప్రాకారాల్లో, ఉద్యానవనాల్లో, గృహద్వారాల వద్ద, గోశాలల్లో, గుర్రపుశాలల్లో, గజశాలల్లో దీపాలు వెలిగించాలని పెద్దల మాట. అంటే మూడు రోజులపాటు దీపోత్సవం జరపాలని తెలుస్తున్నది. 


🪔 _*ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తికశుద్ధ పాడ్యమి... ఈ మూడూ కలిసి దీపోత్సవ రాత్రులు.*_


_*తతః ప్రదోష సమయే దీపాన్ దద్యాన్ మనోరమాన్!*_

_*దేవాలయే మఠేవాపి ప్రాకారోద్యానవీధిషు!*_

_*గోవాజి హస్తశాలాయాం ఏవం ఘస్రత్రయేపీచ!!*_


అని ధర్మశాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. 


🪔 కాలాధారమైన వైషమ్యాలను తొలగించే కాలరాత్రితో పాటు, అలక్ష్మిని (దరిద్రాన్ని) పరిహరించే మహారాత్రి (దీపావళి)నాడు జగదంబను ఆరాధించి ఆయువునీ, ఐశ్వర్యాన్నీ పొందాలని పెద్దల ఆకాంక్ష.


🪔 ఈ కాలస్వరూపమైన పరమాత్ముని అవతారమే శ్రీకృష్ణుడు. కృష్ణ శబ్దానికి కాలరూపమని కూడా అర్థం. _*'కాలః యమః నియమః'*_ అనే నామాలు విష్ణు సహస్రనామంలో గోచరిస్తున్నాయి.


🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat