భగవద్గీత - 18 వ అధ్యాయము - మోక్షసన్యాస యోగము

P Madhav Kumar


మోక్షసన్యాస యోగము, భగవద్గీతలో పద్ధెనిమిదవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

అథాష్టాదశోధ్యాయః - మోక్షసంన్యాసయోగః

|| 18-1 ||
అర్జున ఉవాచ|
సంన్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్|
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన

అర్జునుడన్నాడు:ఓ హృషీకేశా! కేశి సంహారా! సన్యాసం యొక్క తత్వాన్ని వేరువేరుగా తెలుసుకోవాలని కోరుతున్నాను.

|| 18-2 ||
శ్రీభగవానువాచ|
కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః|
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః

శ్రీ భగవానుడన్నాడు :కామ్య కర్మలని వదిలి పెట్టడం సన్యాసమని ఋషులంటారు. అన్ని కర్మల ఫలాన్ని త్యజించడం త్యాగమని వివేకులు అంటారు.

|| 18-3 ||
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః|
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే

దోషం కల కర్మలని వదలాలని కొందరు పండితులంటారు. యజ్ఞ దాన తపః కర్మలని వదలరాదని కొందరు అంటారు.

|| 18-4 ||
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ|
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సమ్ప్రకీర్తితః

భరత శ్రేష్టుడా! ఈ విషయంలో నా నిర్ణయాన్ని విను. పురుష వ్యాఘ్రమా! త్యాగం మూడు విధాలని చెప్ప బడుతుంది.

|| 18-5 ||
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్|
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్

యజ్ఞ దాన తపః కర్మలను మానరాదు. చేయవలసినదే. వివేకులను శుద్ధం చేసేది యజ్ఞ దాన తపస్సులే.

|| 18-6 ||
ఏతాన్యపి తు కర్మాణి సఙ్గం త్యక్త్వా ఫలాని చ|
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్

అర్జునా! ఈ కర్మలను కూడా సంగాన్ని, ఫలాన్ని వదిలి చెయ్యాలని నా నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయం.

|| 18-7 ||
నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే|
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః

నియత కర్మలను సన్యసించకూడదు. భ్రాంతితో వానిని సన్యసించడం తామసిక త్యాగం అనిపించుకుంటుంది.

|| 18-8 ||
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్|
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్

శరీరానికి కష్టం కలుగుతుందనే భయంతోనూ, బాధాకరమని కర్మని వదిలేస్తే అది రాజసిక త్యాగం అవుతుంది. దానివలన త్యాగఫలం లభించదు.

|| 18-9 ||
కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే
ర్జున|
సఙ్గం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః

కర్తవ్య బుద్ధితో సంగభావం, ఫలాపేక్ష వదిలి నియత కర్మని చేసినపుడు అది సాత్విక త్యాగం అవుతుందని నా అభిప్రాయం.

|| 18-10 ||
న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే|
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః

సత్వగుణంతో నిండిన మేధావి సంశయ రహితుడై ప్రతికూల కర్మని ద్వేషించడు.

|| 18-11 ||
న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః|
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే

దేహధారికి కర్మలన్నింటిని త్యజించడం సాధ్యం కాదు. కర్మ ఫలాన్ని త్యజించిన వాడే త్యాగి అనిపించుకుంటాడు.

|| 18-12 ||
అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్|
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సంన్యాసినాం క్వచిత్

కర్మ ఫలం దుష్టమైనవి, మంచివి, మిశ్రమమైనవి అని మూడు విధాలైన కర్మ ఫలాలు త్యాగులు కాని వారికి మరనణానంతరం లనభిస్తాయి. అవి సన్యాసులకి కొంచం కూడా రాదు.

|| 18-13 ||
పఞ్చైతాని మహాబాహో కారణాని నిబోధ మే|
సాఙ్ఖ్యే కృతాన్తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్

ఓ మహానుభావా సాంఖ్య సిద్ధాంతంలో ఏ కర్మలైనా సరే సిద్ధించడానికి ఈఅయిదు కారణాలు కావాలని చెప్ప బడినాయి. వాటిని గురించి విను.

|| 18-14 ||
అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్|
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పఞ్చమమ్

అధిష్టానమైన శరీరం, కర్మ చేసే వాడు, వేర్వేరు ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రారబ్ధం ఈ అయిదూ(సర్వ కర్మ సిద్ధికి కారణాలు)

|| 18-15 ||
శరీరవాఙ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః|
న్యాయ్యం వా విపరీతం వా పఞ్చైతే తస్య హేతవః

మంచిది కాని, చెడ్డది కాని మానవుడు మనో వాక్కాయములతో ఏ కర్మ చేసినా దానికి ఈ అయిదు కారణమౌతాయి

|| 18-16 ||
తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః|
పశ్యత్యకృతబుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతిః

విషయం ఇలా ఉండగా, అపరిపక్వమైన బుద్ధితో కేవలం తానే కర్తననుకునే మూర్ఖుడు తెలివి తక్కువ తనం వలన సరిగా గ్రహించడు.

|| 18-17 ||
యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే|
హత్వా
పి స ఇమాఁల్లోకాన్న హన్తి న నిబధ్యతే

ఎవరిలో అహంకారం లేదో, ఎవరి బుద్ధి కర్మలో తగుల్కోదో, అతడు ఈ లోకులను చంపినా, చంపినవాడు కాదు. బంధనంలో చిక్కుకోడు.

|| 18-18 ||
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా|
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః

జ్ఞానమూ, తెలుసుకోవలసిన విషయమూ, తెలుసుకునే వాడూ, ఈ మూడూ కర్మని ప్రేరేపించేవి. ఇంద్రియం, కర్మ, కర్మ చేసినవాడు, ఈ మూడూ కర్మని నిర్వహించేవి.

|| 18-19 ||
జ్ఞానం కర్మ చ కర్తాచ త్రిధైవ గుణభేదతః|
ప్రోచ్యతే గుణసఙ్ఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి

జ్ఞానం, కర్మ, కర్త-ఈ మూడూ గుణ భేధాలని బట్టి మూడేసి విధాలని, గుణాలకు సంబంధించిన సౌఖ్యంలో చెప్పబడినది. అందులో ఉన్నదానిని విను.

|| 18-20 ||
సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే|
అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్త్వికమ్

అన్ని ప్రాణులలోనూ నాశనం లేని ఒకే సత్తు ఉన్నదనీ, భిన్నమైన వాటిలో అది అవిభక్తంగా ఉన్నదనీ గ్రహించేది సాత్విక జ్ఞానమని తెలుసుకో.

|| 18-21 ||
పృథక్త్వేన తు యజ్జ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్|
వేత్తి సర్వేషు భూతేషు తజ్జ్ఞానం విద్ధి రాజసమ్

వేరు వేరు కనబడే రూపాలలో వేరువేరు జీవుళ్ళు ఉన్నారని గ్రహించేది రాజసిక జ్ఞానమని తెలుసుకో.

|| 18-22 ||
యత్తు కృత్స్నవదేకస్మిన్కార్యే సక్తమహైతుకమ్|
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్

ఒక వస్తువే సర్వమూ అని, యుక్తికి విరుద్ధంగా, అసంబద్ధంగా, అల్పత్వంతో పట్టుకు కూర్చునేది తామసిక జ్ఞానమని అనబడుతుంది.

|| 18-23 ||
నియతం సఙ్గరహితమరాగద్వేషతః కృతమ్|
అఫలప్రేప్సునా కర్మ యత్తత్సాత్త్వికముచ్యతే

సంగభావం లేక, ఫలం మీద ఆశ లేక, రాగ ద్వేషాలు లేక చేసిన నిత్య కర్మ సాత్విక కర్మ.

|| 18-24 ||
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః|
క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతమ్

కోరికతో అహంకారంతో బహు శ్రమతో చేసే కర్మ రాజసిక కర్మ.

|| 18-25 ||
అనుబన్ధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్|
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే

బంధనంలో ఇరికించేది, నాశనాన్ని హింసని కలుగచేసేది శక్తి సామర్ధ్యాలు లెక్కించకుండా చేసేది, మోహంతో ఆరంభించబడినదీ అయిన కర్మ తామసిక కర్మ అని చెప్ప బడుతుంది.

|| 18-26 ||
ముక్తసఙ్గోనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః|
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే

సంగభావం నుండి ముక్తుడైన వాడు, అహంకారం లేని వాడు, పట్టుదల ఉత్సాహం ఉన్నవాడు, జయాపజయాల వలన చలించని వాడు అయిన కర్త సాత్వికుడని చెప్పబడతాడు.

|| 18-27 ||
రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో
శుచిః|
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః

రాగంతో కూడి ఫలం కోరుతూ, పిసినిగొట్టు తనమూ, హింసా స్వభావం కలిగి, అశుచి అయి, సుఖదుఃఖాలకు లోనయ్యే కర్త --రాజసికుడని చెప్ప బడుతుంది.

|| 18-28 ||
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికో
లసః|
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే

ఎలాటి నిగ్రహం లేని వాడు, పామరుడు, సంకుచిత స్వభావం కలవాడు, మొండివాడు, మోసగాడు బద్ధకస్తుడు, విషాదంలో ఉండి ప్రతి దానికి కాలయాపన చేసే కర్త, తామసికుడని చెప్ప బడతాడు.

|| 18-29 ||
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు|
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనఞ్జయ

ధనంజయా! గుణాలనిబట్టి మూడేసి విధాలుగా ఉండే బుద్ధినీ, ధృతినీ గురించి వేరువేరుగా, పూర్తిగా చెబుతాను విను.

|| 18-30 ||
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే|
బన్ధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ

అర్జునా! ప్రవృత్తి-నివృత్తులు, కార్యాకార్యాలు, భయాభయాలు, బంధ మోక్షాలు---వీటిని వివరంగా చెబుతాను విను.

|| 18-31 ||
యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ|
అయథావత్ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ

పార్ధా! ధర్మాధర్మాలని, కార్యాకార్యాలని సరిగా నిర్ణయించ లేని బుద్ధి రాజసికమైనది.

|| 18-32 ||
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా|
సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ

అజ్ఞానంతో కప్పబడి అధర్మాన్ని ధర్మంగా, అన్ని విషయాలను విపరీతంగా ఎంచే బుద్ధి తామసిక మైనది.

|| 18-33 ||
ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేన్ద్రియక్రియాః|
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ

చలించని యోగంలో మనస్సు, ప్రాణ, ఇంద్రియాల చేష్టలను నిగ్రహించి ఉంచే ధృతి సాత్విక మైనది.

|| 18-34 ||
యయా తు ధర్మకామార్థాన్ధృత్యా ధారయతే
ర్జున|
ప్రసఙ్గేన ఫలాకాఙ్క్షీ ధృతిః సా పార్థ రాజసీ

అర్జునా! ఏ పట్టుదల ధర్మ కామార్ధాలనే లౌకిక పురుషార్ధాలని మమకారంతో, ఫలాశతో నిలబెట్టి ఉంచుతుందో అది రాజసిక ధృతి.

|| 18-35 ||
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ|
న విముఞ్చతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ

పార్ధా! మూర్ఖుడు ఏ ధృతితో స్వప్నాలనీ, భయాన్నీ, శోకాన్నీ, విషాదాన్నీ, మదాన్నీ వదలకుండా పట్టుకుంటాడో అది తామసికము అయిన పట్టుదల.

|| 18-36 ||
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ|
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి

భరతశ్రేష్టుడా! అభ్యాసం వలన దేనిలో మానవుడు దుఃఖాన్ని అంతమొందించి సుఖపడ కలుగుతాడో ఆ మూడు విధాలైన సుఖాలని గురించి విను.

|| 18-37 ||
యత్తదగ్రే విషమివ పరిణామే
మృతోపమమ్|
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజమ్

ఏ సుఖమైతే మొదట విషంగా తోచి, చివరకు ఏది అమృతమౌతుందో, ఏది శాంతించిన బుద్ధి వలన లభిస్తుందో అది సాత్విక సుఖం.

|| 18-38 ||
విషయేన్ద్రియసంయోగాద్యత్తదగ్రే
మృతోపమమ్|
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్

విషయాలు ఇంద్రియాలు సంయోగం వలన మొదట అమృతప్రాయంగా ఉండి, చివరికి విషంలా తయారయ్యేది రాజసిక సుఖం.

|| 18-39 ||
యదగ్రే చానుబన్ధే చ సుఖం మోహనమాత్మనః|
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్

నిద్ర, బద్ధకం, ఏమరుపాటుల నుండి జనించి ముందు నుండి చివరకు భ్రాంతిలో పడేసి ఉంచే సుఖం తామసికం.

|| 18-40 ||
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః|
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్త్రిభిర్గుణైః

భూమిపైనగాని, స్వర్గంలోని దేవతలలో కాని ప్రకృతి వలన పుట్టిన ఈ మూడు గుణాల నుండి విడిపడి ఉన్నప్రాణి ఏదీ లేదు.

|| 18-41 ||
బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరన్తప|
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః

పరంతపా! బ్రాహ్మణ , క్షత్రియ, వైశ్య, శూద్రుల కర్మలు వాళ్ళ స్వభావం నుండి జనించిన లక్షణలను బట్టి విభజింప పడినాయి.

|| 18-42 ||
శమో దమస్తపః శౌచం క్షాన్తిరార్జవమేవ చ|
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్

శమము, దమము, తపస్సు, శౌచము, ఓర్మి, ఋజుత్వము, జ్ఞాన విజ్ఞానాలు, ఆస్థిక భావము---ఇవి బ్రాహ్మణులకు స్వభావ సిద్ధమైన కర్మలు.

|| 18-43 ||
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్|
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్

శౌర్యం, తేజం, పట్టుదల, సమర్ధత, యుద్ధంలో వెన్ను చూపక పోవడం, దానగుణం, ఈశ్వర లక్షణం---ఇవి స్వభావ సిద్ధమైన క్షత్రియ కర్మలు.

|| 18-44 ||
కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్|
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్

వ్యవసాయం, గోసంరక్షణ, వాణిజ్యం స్వభావ సిద్ధమైన వైశ్య కర్మలు. పరిచర్య భావంతో కూడినవి శూద్రులకు స్వభావ సిద్ధమైన కర్మలు.

|| 18-45 ||
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః|
స్వకర్మనిరతః సిద్ధిం యథా విన్దతి తచ్ఛృణు

తన తన కర్మలలోనిమజ్ఞుడైన మానవుడు , తన కర్మలో నిరతుడైన వాడు సిద్ధిని ఎలా పొందుతాడో చెబుతాను విను.

|| 18-46 ||
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్|
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః

ఎవరినుండి జీవుళ్ళు పుట్టుకొస్తారో, ఎవరి వలన ఇది యావత్తు వ్యాపించబడి ఉన్నదో ఆయన్ని తన కర్మ చేత ఆరాధించే మానవుడు సిద్ధిని పొందుతాడు.

|| 18-47 ||
శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్|
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్

బాగా అనుష్టించిన పరధర్మంకన్నా, హీనమైన స్వధర్మం మేలు. స్వభావం చేత ప్రేరేపించబడిన కర్మని చేయడం వలన పాపాన్ని పొందడు.

|| 18-48 ||
సహజం కర్మ కౌన్తేయ సదోషమపి న త్యజేత్|
సర్వారమ్భా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః

కౌంతేయా! సహజమైన కర్మ దోషంతో కూడినను వదలరాదు. పొగ చేత కప్పబడిన అగ్ని లాగా అన్ని కర్మలూ దోషంతోనే మొదలౌతాయి.

|| 18-49 ||
అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః|
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సంన్యాసేనాధిగచ్ఛతి

సర్వత్రా దేనికీ తగుల్కొనని బుద్ధితో, మనస్సుని జయించి, కోరికలలు వదిలి సన్యసించడం ద్వారా కర్మల నుండి విడుదల పొందే ఉత్తమోత్తమమైన స్థితిని పొందుతాడు.

|| 18-50 ||
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే|
సమాసేనైవ కౌన్తేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా

నైష్కర్మ్య సిద్ధిని పొందిన వాడు బ్రహ్మ పదార్ధాన్ని ఎలా చేరుకుంటాడో క్లుపంగా చెబుతాను విను. అర్జునా ఇది పరమమైన జ్ఞానాభ్యాసం.

|| 18-51 ||
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ|
శబ్దాదీన్విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ

విశుద్ధమైన బుద్ధితో కూడుకొని, పట్టుదలతో మనస్సుని నియమించి, శబ్ధాది విషయాలని త్యజించి, రాగద్వేషాలను వదిలి,

|| 18-52 ||
వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః|
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః

ఏకాంత ప్రదేశంలో వసిస్తూ, ఆహారాన్ని స్వల్పంగా మాత్రమే స్వీకరిస్తూ, మనోవాక్కాయాలను నియత్రిస్తూ, నిత్యమూ ధ్యాన యోగంలో నిమజ్ఞుడై వైరాగ్యంలో నిలిచి,

|| 18-53 ||
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్|
విముచ్య నిర్మమః శాన్తో బ్రహ్మభూయాయ కల్పతే

అహంకారాన్ని, బల దర్పాన్ని, కామ క్రోధాలను, పరిగ్రహ బుద్ధిని వదిలి, మమకారాన్ని త్యజించి, శాంతుడై బ్రహ్మ స్వరూపుడు అవడానికి అర్హుడౌతాడు.

|| 18-54 ||
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాఙ్క్షతి|
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్

బ్రహ్మ భూతుడై ప్రసన్న చిత్తుడైన వాడు దేనికీ శోకించడు. దేనినీ కోరడు. ప్రాణులందరి యందు సమభావం కలిగి నాయందు పరమ భక్తిని పొందుతాడు.

|| 18-55 ||
భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః|
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనన్తరమ్

భక్తి ద్వారా నేనెవరినో, ఎలాంటి వాడినో నా పూర్తి తత్వాన్ని గుర్తెరుగుతాడు. నా తత్వాన్ని గ్రహించినందు వలన తరవాత నాలోనే ప్రవేసిస్తాడు.

|| 18-56 ||
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః|
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్

అన్ని కర్మలను సదా చేస్తూనే, నన్ను శరణు పొందిన వాడు నా అనుగ్రహం వలన శాశ్వతమైన అవ్యయమైన పదాన్ని పొందుతాడు.

|| 18-57 ||
చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః|
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ

(అర్జునా)మానసికంగా కర్మలన్నింటినీ నాకు సమర్పించి నన్నే గమ్యంగా పెట్టుకొని జ్ఞాన యోగాన్ని ఆశ్రయించి నన్ను నీ చిత్తంలో నిలుపుకో.

|| 18-58 ||
మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి|
అథ చేత్త్వమహంకారాన్న శ్రోష్యసి వినఙ్క్ష్యసి

మనస్సు నాలో ఉంచితే నా అనుగ్రహం వలన అన్ని అడ్డంకులనూ దాటుతావు. అహమ్కారం వలన వినక పోయావా నశిస్తావు.

|| 18-59 ||
యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే|
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి

అహంకారంతో యుద్ధం చేయనని నిర్ణయించుకున్నా, నీ యీ ప్రయత్నం దండుగ అవుతుంది. నీ స్వభావమే నిన్ను యుద్ధంలో నియోగిస్తుంది.

|| 18-60 ||
స్వభావజేన కౌన్తేయ నిబద్ధః స్వేన కర్మణా|
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్కరిష్యస్యవశోపి తత్

అర్జునా! నీ స్వభావ సిద్ధమైన కర్మలకు నీవు బద్ధుడివి. భ్రంతి వలన కర్మ చేయడానికి ఇష్ట పడకపోయినా తప్పని సరిగా చేసి తీరుతావు.

|| 18-61 ||
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే
ర్జున తిష్ఠతి|
భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా

అర్జునా! ఈశ్వరుడు ప్రాణులందరి హృదయాలలోను కూర్చుని, యంత్రం ఉన్న(బొమ్మల వలె)జీవుళ్ళని మాయచేత త్రిప్పుతూ ఉన్నాడు.

|| 18-62 ||
తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత|
తత్ప్రసాదాత్పరాం శాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్

అన్ని విధాల ఆయన్నేశరణు పొందు. ఆయన అనుగ్రహం వలన పరమ శాంతిని శాశ్వతమైన స్థానాన్ని పొందుతావు.

|| 18-63 ||
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా|
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు

ఈ వధంగా నీకు అతి రహస్యమైన జ్ఞానం చెప్పాను. దానిని క్షున్నంగా విమర్శించి తెలుసుకొని, నీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యి.

|| 18-64 ||
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః|
ఇష్టో
సి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్

అన్నిటికన్నా ఎక్కువైన రహస్యాన్ని మళ్ళీ నాపరమ వాక్కు ద్వారా విను. నాకు చాలా ఇష్టమైన వాడివని నీ హితంకోరి చెబుతున్నాను.

|| 18-65 ||
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు|
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే

మనస్సు నాలో ఉంచు, నా భక్తుడివికా నన్ను ఆరాధించు. నాకు నమస్కరించు నన్నే పొందుతావూ. ఇది సత్యం. నీవు నాకు ప్రియుడివి. నీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను.

|| 18-66 ||
సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ|
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః

అన్ని ధర్మాలను పరిత్యజించి నన్ను మాత్రమే శరణూ పొందు. అన్ని పాపాలనుండి నీకు నేను మోక్షమిస్తాను. విచారించకు.

|| 18-67 ||
ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన|
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి

ఈ జ్ఞానాన్ని తపస్సు చేయని వానికి, భక్తుడు కాని వానికి, నన్ను ద్వేషించే వానికీ , ఏ సందర్భంలోనూ చెప్ప కూడదు.

|| 18-68 ||
య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి|
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః

పరమ రహస్యమైన ఈ జ్ఞానాన్ని నా భక్తులకు చెప్పిన వాడు , నాలో పరమమైన భక్తిని పొంది నన్నే చేరతాడు. ఇందులో అనుమానము లేదు.

|| 18-69 ||
న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః|
భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి

మనుష్యులందరిలో అతడికన్నా నాకు ప్రియమైన పని చేసేవాళ్ళు లేరు, అతడికన్నా నాకు బాగా ఇష్టులుండరు.

|| 18-70 ||
అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః|
జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః

ధార్మికమైన మన ఈ సంవాదాన్ని జ్ఞాన యజ్ఞంద్వారా ఎవరు అధ్యయనం చేస్తారో వారికి దాని వలన నేను ఇష్టుడిని ఔతాను.

|| 18-71 ||
శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః|
సోపి ముక్తః శుభాఁల్లోకాన్ప్రాప్నుయాత్పుణ్యకర్మణామ్

అసూయ లేకుండా శ్రద్ధతో (ఈ గీతను)వినినప్పటికీ ఆ మానవుడు ముక్తుడై పుణ్యాత్ములకు లభించే శుభలోకాలని పొందుతాడు.

|| 18-72 ||
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా|
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనఞ్జయ

అర్జునా! నా ఈ మాతటలను(గీత)ఏకాగ్ర చిత్తంతో విన్నావా?ధనంజయా! నీ అజ్ఞానం నశించిందా.

|| 18-73 ||
అర్జున ఉవాచ|
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత|
స్థితో
స్మి గతసన్దేహః కరిష్యే వచనం తవ

అర్జునుడన్నాడు:అచ్యుతా! నీ అనుగ్రహం వలన నాకు మోహం నశించింది. స్మృతి లభించింది. సందేహాలు తీరాయి. నీవు చెప్పినట్లు చేస్తాను.

|| 18-74 ||
సఞ్జయ ఉవాచ|
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః|
సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణమ్

సంజయుడు ఇలా పలికాడు:- ఇలా వాసుదేవునికీ, మహాత్ముడైన అర్జునుడికీ మధ్య, పులకరింతలు పుట్టించే విధంగా జరిగిన అద్భుతమైన సంవాదాన్ని నేను విన్నాను.

|| 18-75 ||
వ్యాసప్రసాదాచ్ఛ్రుతవానేతద్గుహ్యమహం పరమ్|
యోగం యోగేశ్వరాత్కృష్ణాత్సాక్షాత్కథయతః స్వయమ్

పరమ రహస్యమైన ఈ యోగాన్ని, సాక్షాత్తు యోగేశ్వరుడైన కృష్ణుడే స్వయంగా చెబుతూ ఉండగా వ్యాస మహర్షి అనుగ్రహం వలన నేను వినగలిగాను.

|| 18-76 ||
రాజన్సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్|
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః

రాజా! కృష్ణార్జునుల ఈ అద్భుతమైన పవిత్రమైన సంవాదాన్ని తలచుకొని తలచుకొని క్షణ క్షణం ఆనందంతో పొంగిపోతున్నాను.

|| 18-77 ||
తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః|
విస్మయో మే మహాన్ రాజన్హృష్యామి చ పునః పునః

రాజా హరియొక్క ఆ అద్భుతమైన రూపాన్ని తలచుకొని తలచుకొని నాకు అమితమైన విస్మయం కలుగుతోంది. మళ్ళీమళ్ళీ ఆనందం కలుగుతుంది.

|| 18-78 ||
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః|
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ

యోగేశ్వరుడైన కృష్ణుడూ ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ, సంపద, గొప్పతనం, విజయం, స్థిరమైన నీతి ఉంటాయని నానిశ్చయం.

|| 18 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
మోక్షసంన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయః

ఓం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్|
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాఙ్గమ్|
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యమ్|
వన్దే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్||

ఆధ్యాయ సంగ్రహం:
అర్జునుడు:
కృష్ణా! సన్యాసము, త్యాగము అంటే ఏమిటి? వివరంగా చెప్పు?

కృష్ణుడు:
కోరికచే చేయు కర్మలను మానడం సన్యాసమనీ, కర్మ ఫలితాలు విడిచిపెట్టడమే త్యాగమని పండితులు అంటారు. కర్మలన్నీ బంధ కారణాలే కనుక చేయకపోవడమే మంచిదని కొందరు, యజ్ఞ, దాన తపస్సులను విడవకూడదని కొందరు అంటారు. త్యాగ విషయంలో నా అభిప్రాయం ఏమంటే చిత్తశుద్దిని కల్గించు యాగ, దాన, తపస్సులను మూడు కర్మలు ఎన్నడూ విడవరాదు. వాటిని కూడా మమకారం లేక, ఫలాపేక్ష లేక చెయ్యలని నా అభిప్రాయం. కర్తవ్యాలను విడిచిపెట్టడం న్యాయం కాదు. అలా విడవడం తామస త్యాగం. శరీరకశ్టానికి భయపడి కర్మలు మానడం రాజస త్యాగం. ఫలితం శూన్యం. శాస్త్రకర్మలు చేస్తూనే ఆసక్తినీ, కర్మఫలాన్నీ విడిస్తే అది సాత్విక త్యాగం. ఇలా చేయువాడు, సందేహాలు లేనివాడు ఆత్మజ్ఞాని దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషింపడు. సుఖాన్నిచ్చే కర్మలను ఆనందింపడు. శరీరం కలిగినవారు కర్మలను వదలడం అసాధ్యం. కాబట్టి కర్మ ఫలితాన్ని వదిలేవాడే త్యాగి. ఇష్టము, అనిష్టము, మిశ్రమము అని కర్మఫలాలు మూడు రకాలు. కోరిక కలిగిన వారికి ఆ ఫలితాలు పరలోకంలో కలుగును. కర్మఫలత్యాగులకు ఆ ఫలితాలు అందవు. శరీరం, అహంకారం, ఇంద్రియాలు, ప్రక్రియా పరమైన వివిధ కార్యాలు, పరమాత్మ అను ఈ ఐదే అన్ని కర్మలకూ కారణమని సాంఖ్య శాస్త్రం చెప్తోంది. మనస్సు, మాట, శరీరాలతో చేసే అన్ని మంచి, చెడు కర్మలకూ ఈ ఐదే కారణము. ఈ విషయాలు తెలియనివారు, చెడ్డ భావల వారు మాత్రం తమే చేస్తున్నట్టూ అహంకారంతో తిరుగుతారు. తను పని చేస్తున్నానన్న అహంకారం లేనివాడు,అజ్ఞానం లేనివాడు ఈ లోకం లో అందరినీ చంపినా సరే - ఆ పాపం వారికి ఏ మాత్రమూ అంటదు. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత అని మూడు కర్మ ప్రోత్సాహకాలు. అలాగే కర్త, కర్మ, సాధనం అని కర్మ సంగ్రహం మూడు రకాలు. జ్ఞానం, కర్మ, కర్త అనేవి సాంఖ్యశాస్త్రం ప్రకారం మూడేసి విధాలుగా ఉన్నాయి. వాటిని విను. విభిన్నంగా కనపడే అన్ని జీవులలో అవినాశమై, మార్పు లేని, ఒక్కటిగా ఉన్న ఆత్మను గ్రహించే జ్ఞానమే సాత్విక జ్ఞానం. ఎన్ని జీవులుంటే అన్ని ఆత్మలు ఉన్నాయనడం రాజస జ్ఞానం. ఏది చూస్తే అదే సర్వమని అనుకొనే జ్ఞానం తామస జ్ఞానం. అభిమాన, మమకార, ద్వేషం లేక ఫలాపేక్ష లేక చేయు విధిపూర్వక కర్మలు సాత్వికం. ఫలితం పైన ఆసక్తితో, అహంకార అభిమానాలతో, చాలా కష్టంతో చేయునవి రాజస కర్మలు. మంచిచెడ్డలను,కష్టనిష్ఠూరాలను గమనింపక మూర్ఖంగా చేయు పని తామస కర్మ. ఫలితం పైన ఆశ పెట్టుకోకుండా, నిరహంకారియై, ఫలితం లోని మంచిచెడ్డలకు ప్రభావితం కాక ధైర్యోత్సాహాలతో పని చేయువాడు సాత్విక కర్త. ఫలితం పైన ఆశతో, అభిమానంతో, లోభగుణంతో, హింసతో, అశుచిగా, సుఖదుఃఖాలకు చలిస్తూ పని చేయువాడు రాజస కర్త. ధైర్యం పోగొట్టుకొని, మూర్ఖత్వంతో, మోసంతో, దీనమనస్సు తో, వృథా కాలయాపంతో పనిచేయువాడు తామస కర్త. బుద్ధి, ధృతి అనే ఈ రెండూ గుణబేధాలచే మూడు విధాలు. ధర్మాధర్మములందు ప్రవృత్తి నివృత్తులను-కర్తవ్యాకర్తవ్యాలను-భయాభయాలను-బంధనమోక్షాలను స్పష్టంగా తెలుసుకోగలిగినదే సాత్విక బుద్ధి. ధర్మాధర్మాలు, కార్యాకార్యాలు నిజజ్ఞానాన్ని కాక పొరపాటుగా గ్రహించేది రాజస బుద్ధి. ప్రతిదాన్ని వ్యతిరేకంగా గ్రహించేది తామస బుద్ధి. మనసు, ప్రాణం, ఇంద్రియాల వృత్తులను నిగ్రహించి చెదిరిపోకుండా నిలిపే పట్టుదలను సాత్విక ధృతి అంటారు. ఫలితంపై అధిక ఆసక్తి, ధర్మ, అర్థ, కామాలందు చూపే అధిక పట్టూదలే రాజస ధృతి. కల, భయం, బాధ, విషాదం, గర్వం వీటికి లోనవుతూ కూడా మూర్ఖపు పట్టుదలను వీడనిది తామసిక ధృతి. సుఖాలు మూడు విధాలు. మొదట దుఃఖకరమైనా సాధన చేస్తున్నకొద్దీ సులవు అనిపించి, ఇబ్బందులు తొలగి చివరికి ఎనలేని ఆనందం ఇస్తుందో-ఆ అమృతమయ బుద్ధితో జన్మించేదే సాత్విక సుఖం. ఇంద్రియ సంయోగం వలన పుట్టేదీ,మొదట అమృతంగా ఉన్నా చివరికి విషం అయ్యేది రాజస సుఖం. ఎప్పుడూ మోహింప చేస్తూ, నిద్ర, ఆలస్య, ప్రమాదాలతో కూడినది తామస సుఖం. త్రిగుణాలకు అతీతమైనది ఏదీ భూ, స్వర్గ లోకాలలో, దేవతలలో ఎక్కడా ఉండదు. స్వభావ గుణాలను అనుసరించి నాలుగు వర్ణాలవారికీ కర్మలు వేర్వేరుగా విభజింపబడ్డాయి. బాహ్య, అంతర ఇంద్రియనిగ్రహం, తపస్సు, శౌచం, క్షమ, సూటిస్వభావం,శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం మొదలగునవి స్వభావంచే బ్రాహ్మణ కర్మలు. శౌర్యం, తేజస్సు, ధైర్యం, వెన్ను చూపనితనం, సపాత్రదానం, ఉత్సాహశక్తులు క్షత్రియ కర్మలు. వ్యవసాయం, గోరక్షణ, వ్యాపారం వైశ్యులకు-సేవావృత్తి శూద్రులకు స్వభావ కర్మలు. తన స్వభావకర్మలను శ్రద్ధాసక్తులు కలిగి ప్రవర్తించేవాడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుతాడు. పరమాత్మను తనకు విధింపబడిన కర్మలచే ఆరాధించేవాడు చిత్తశుద్ధిని పొందుతాడు. బాగా చేసే పరధర్మం కన్నా దోషం చే చేసే స్వధర్మం చేయడమే మంచిది. స్వధర్మం దోషంతో ఉన్నా విడవరాదు. అగ్నిని పొగ ఆవరించి ఉన్నట్టూ అన్ని ధర్మాలూ ఏదో ఒక దోషం కలిగి ఉంటాయి. విషయాసక్తి లేనివాడు, ఇంద్రియనిగ్రహీ, చలించనివాడూ జ్ఞానమార్గం చే నైష్కర్మ్యసిద్ధిని పొందుతాడు. నిష్కామ కర్మచే జ్ఞానసిద్ధిని పొందినవాడు పరమాత్మను పొందేవిధానం చెపుతాను విను. మాయ లేని నిశ్చలజ్ఞానంతో మనసును నిగ్రహించి, శబ్దాది విషయాలను వదిలి, రాగద్వేష రహితుడై, నిత్యమూ విరాగియై, యేకాంత వాసంతో, అల్పాహారియై, మనస్సు, మాట, శరీరాలల్ను నియమబద్దం చేసి, ధ్యానయోగియై, అహంకార, అభిమాన, కామ, క్రోధాలను వదిలి, విషయ స్వీకారం విడిచి, మమకారం లేనివాడై, శాంత చిత్తం కలిగినవాడే బ్రహ్మభావానికి అర్హుడు. బ్రహ్మజ్ఞాని దేనినీ కోరడు. దేనికీ దుఃఖించడు. అన్ని భూతాలందూ సమదృష్టి కల్గి నా భక్తిని పొందుతాడు. ఆ భక్తిని పొందినవాడు నన్ను పూర్తిగా గ్రహించి ఆ భక్తితోనే నాలో ఐక్యం అవుతాడు. అన్ని పనులు చేస్తున్నా, నన్నే నమ్మిన కర్మయోగి నా పరమపదమే పొందుతాడు. అన్ని కర్మలూ నాకే అర్పించి సమబుద్దిరూపమైన యోగం చెయ్యి. నేనే పరమగతినని తెలుసుకొని నీ మనసును నాలోనే లగ్నం చేయి. నన్ను శరణు కోరితే నా అనుగ్రహంతో సంసారాన్ని తరిస్తావు. కాదని అహంకరిస్తే నాశనమవుతావు. యుద్దం చేయకూదదని నీవనుకున్నా నీ నిర్ణయం వృథానే. ఎందుకంటే నీ క్షత్రియధర్మమే నిన్ను యుద్దానికి ప్రేరేపిస్తుంది. సర్వభూతాలనూ తన మాయచే కీలుబొమ్మలలా ఆడిస్తూన్న ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉన్నాడు. అతడినే అన్నివిధాలా శరణు వేడు. అతని దయచే శాంతి, మోక్షం పొందుతావు. అతిరహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్పాను. బాగా ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నా యందు మనసు కలిగి, నన్నే భక్తితో సేవించు. నన్నే పూజించు. నమస్కరించు. నీవు నాకు ఇష్టం కావున నీతీ ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. నిశ్చయంగా నువ్వు నన్నే పొందుతావు. అన్ని ధర్మాలనూ వదిలి నన్నే శరణువేడు. నిన్ను అన్ని పాపాలనుండి బయటపడవేస్తాను. తపస్సులేని వాడికీ, భక్తుడు కాని వాడికీ, సేవ చేయని వాడికీ, నన్ను అసూయతో చూసేవాడికీ ఈ శాస్త్రాన్ని చెప్పరాదు. అతిరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు అందించేవాడు, నిశ్చయంగా నా పరమాత్మ భావాన్ని పొందుతాడు. ఈ గీతాశాస్త్ర ప్రచారకుడికన్నా ఎక్కువైన భక్తుడు కానీ,ప్రియుడుకానీ, ఈ లోకంలో నాకు మరొకడు లేడు. మన సంవాదరూపమైన ఈ గీతను ఎవడు పారాయణ చేస్తాడో వాడివలన నేను జ్ఞానయజ్ఞంచే ఆరాధింపబడినవాడిని అవుతున్నాను. శ్రద్దాసక్తి తో, అసూయలేక దీనిని విన్నవారు గొప్పగొప్ప పుణ్యాలు చేసినవారు పొందే లోకాలను తేలికగా పొందుతారు. ఇంతవరకూ నేను చెప్పినది మనసు లగ్నం చేసి విన్నవా?నీ మోహం నశించినదా?

అర్జునుడు:
నీ దయవలన నా అజ్ఞానం తీరింది. సందేహం పోయింది. ఆత్మజ్ఞానం కల్గింది. నువ్వేమి చెప్తే అది చేయడానికి సిద్దంగా ఉన్నాను.

సంజయుడు:
ధృతరాష్ట్ర మహారాజా! మహాత్ములైన శ్రీకృష్ణార్జునుల సంవాదం నేను విన్నాను. పులకించాను. శ్రీవ్యాసుల దయచేత యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన యోగశాస్త్రాన్ని ప్రత్యక్షంగా వినే భాగ్యం నాకు కలిగింది. ఆ సంవాదం మాటిమాటికీ మా మనస్సును ఉప్పొంగిస్తోంది. ఆ అద్భుత విశ్వరూపం తలుచుకుంటుంటే నా ఆనందం అధికమవుతోంది. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి ఐన అర్జునుడూ ఎక్కడ ఉంటారో అక్కడే లక్ష్మీదేవి, విజయమూ, ఐశ్వర్యమూ ఉంటాయనేది నా దృఢనిశ్చయము.






#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat