- దేవవ్రతుడు శాంతి పొందిన విషయం తెలుకున్న ధృతరాష్ట్రుడు ఏమి చేసాడు? వివరించండి అని జనమేజయుడు వైశంపాయన మహర్షిని అడిగాడు. వైశంపాయనుడు భారత కథను ఈ విధంగా చెప్పసాగాడు . భీష్ముడు పడి పోయిన విషయం ధృతరాష్ట్రుని ఖిన్నుడిని చేసింది. " సంజయా | నీవు యుద్ధభూమికి వెళ్ళి తరువాత జరిగిన యుద్ధవిశేషాలు తెలుసుకుని రా " అని చెప్పి సుయోధనుని విజయాన్ని ఆకాంక్షిస్తున్న ధృతరాష్ట్రుడు చెప్పాడు. కొన్ని దినములు గడిచిన పిదప వ్యాసుని మహిమ వలన ఉభయ సైన్యాల విశేషాలు ప్రత్యక్షంగా చూసిన సంజయుడు ఒక అర్ధరాత్రి సమయమున హస్థినకు తిరిగి వచ్చాడు. వెంటనే ధృతరాష్ట్రుని మందిరముకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు అతడికి ఉచితాసనము ఇచ్చి సత్కరించి " సంజయా ! మా తండ్రిగారైన భీష్ముడు యుద్ధరంగమున పడి పోయిన తరువాత నాకుమారులైన కౌరవులు ఎవరి సాయంతో పాండవుల మీద యుద్ధం సాగించారు. ఉభయుల మధ్య యుద్ధం ఎలా జరిగింది " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! భీష్ముడు దేవభావం పొందడం. శాంతనవుడు చెప్పిన హితవాక్యాలకు కోపము తెచ్చుకుని నీ కుమారుడు అక్కడ నుండి వెళ్ళి పోయాడు. నేను నీ వద్ద నుండి వెళ్ళిన తరువాత రోజు వేకువ ఝామున యుద్ధ రంగముకు వెళ్ళాను. కురు సైన్యాలు మరునాటి యుద్ధానికి సిద్ధం ఔతున్నాయి. కాని కురు వీరుల ముఖాలు వివర్ణమై ఉన్నాయి. భీష్ముడు లేక పోవడంతో కౌరవ సేనలు కాంతులు కోల్పోయి కళావిహీనంగా ఉన్నాయి. అందరూ కర్ణుని రాక కొరకు ఎదురు చూస్తున్నారు. రధికులు సుయోధనుని వద్దకు వెళ్ళి " సుయోధనా ! భీష్ముడు లేని కురుసేనలు పతిని కోల్పోయిన సతిలా, పంటలు లేని భూదేవిలా కళావిహీనమై ఉన్నాయి. భీష్ముడు లేక పోవడంతో పాండవ సేనలు ఉత్సాహంగా విజృంభిస్తాయి. కనుక కర్ణుడే ఈ సమయానికి మనలను ఆదుకోగలడు. భీష్ముని మీద అలిగి కర్ణుడు యుద్ధరంగముకు రాలేదు. కనుక ఇప్పుడు మనవారంతా కర్ణుని కొరకు ఎదురు చూస్తున్నారు " అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! తరువాత ఏమైంది కర్ణుడు వచ్చాడా ! పాండవులను ఓడించాడా ! మన వారి మనోరథం నెరవేరిందా ! " అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్ప సాగాడు " మహారాజా ! ఆ సమయంలో కర్ణుడు అక్కడకు వచ్చాడు. సుయోధనుడు కర్ణుని సాదరంగా ఆహ్వానించాడు. కర్ణుడు అక్కడి రాజులను చూసి " దమము, సత్వగుణము, తపము, దానగుణము, శీలము, అస్త్రవిద్యా నైపుణ్యం, వీరము శౌర్యము ఆభరణముగా కలిగిన భీష్ముడు రణరంగమున పడిపోయిన తరువాత ఆయన నాయకత్వం లేని ఈ అక్షౌహినుల సైన్యం ఉండీ ఏమి ప్రయోజనం సుయోధనుని సమస్త సంపదలు సమసి పోయినట్లే " అని దుఃఖించాడు. అక్కడ ఉన్న రాజులు కూడా అందుకు దుఃఖించారు. కర్ణుడు ఉపశమనం పొంది " భీష్ముడు మేరుపర్వతంలా పడి పోయిన సమయంలో నేను అతడి స్థానంలో ఉండి కౌరవ సేనలను రక్షిస్తాను. అర్జునిని మదం అణుస్తాను. కృష్ణుని అండ చూసుకుని విర్రవీగుతున్న పాండవులను నా శరపరంపరతో హతమారుస్తాను. భీష్మునిలా చెలరేగి శత్రు సేనలను చీల్చి చెండాడి ఈ సువిశాల సామ్రాజ్యానికి సుయోధనుని పట్టాభిషిక్తుని చేస్తాను. అలా కాని పక్షంలో కౌరవులను రక్షిస్తూ, పాండవులను నిర్జిస్తూ కీర్తి గడిస్తూ స్వర్గంలో భీష్ముని కలుసుకుంటాను " అని సగర్వంగా చెప్పగానే సుయోధనుడు సంతోషించాడు.
కర్ణుడు భీష్ముడిని కలుసుకొనుట
తరువాత కర్ణుడు రథమును అధిరోహించి భీష్ముని వద్దకు వెళ్ళి కన్నీటితో పాదములకు నమస్కరించి " పితామహా ! రాధేయుడు తమ దర్శనార్ధం వచ్చాడు. కళ్ళు తెరవండి తమరు ఇలా అంపశయ్య మీద ఉండటం విధి విలాసం కాక మరేమిటి. నేను ఈ రోజు నుండి పాండవుల మీద యుద్ధానికి పోతున్నాను. పరమ పావనమైన మీ పలుకులతో నన్ను ఆశీర్వదించండి " అని పలికాడు. భీష్ముడు కళ్ళు తెరవగానే కర్ణుడు నమస్కరించి " అనఘా ! అర్జునుని అహంకారం నేను ఒక్కడినే అణుస్తాను. పాండవులను గడ్డిగరిపిస్తాను నన్ను ఆశీర్వదించండి " అన్నాడు. భీష్ముడు " కర్ణా ! సుయోధనుడు నీ అండ చూసుకునే ఉన్నాడు. కౌరవులకు సుయోధనుడు నువ్వూ అంతే జన్మతః వచ్చిన బంధుత్వం కంటే స్నేహమే గొప్పది కదా ! కౌరవ సేన భారం వహించి సుయోధనునికి మేలు చెయ్యి. అంబష్ట, పౌండ్రాది దేశములు జయించి సుయోధనుని ఆధీనము కావించిన నీకు చెప్పవలసిన పని ఏమి ? కౌరవ సేనను నడిపించి అతడికి విజయం చేకూర్చు. నాకు సుయోధనుడు ఎంతో నువ్వూ అంతే " అన్నాడు. కర్ణుడు మరొక్క సారి భీష్ముని పాదములకు నమస్కరించి అక్కడి నుండి యుద్ధరంగముకు వెళ్ళాడు. రథ, గజ, తురంగ, పదాతి దళాలను సమీకరించి వారికి ఉత్సాహం కలిగించాడు. అంతలో సుయోధనుడు అక్కడకు వచ్చి " కర్ణా ! నీ రాకతో కౌరవ సేనలు ఉత్సాహాన్ని పుంజుకున్నాయి. మన సేనలు యుద్ధానికి ఉరకలు వేస్తున్నాయి. మన ప్రస్థుత కర్తవ్యం ఏమిటి " అన్నాడు. కర్ణుడు " సుయోధనా ! రారాజువైన నీ ఆజ్ఞ మాకు శిరోధార్యము. నీవే కర్తవ్యాన్ని నిర్ణయించు " అన్నాడు. సుయోధనుడు " కర్ణా ! భీష్ముని నాయకత్వంలో ఈ పది రోజులు మన సేనలు నడిచాయి. ప్రస్థుతం మనకు ఒక సేనా నాయకుడు కావాలి. కౌరవ సేనలకు నాయకత్వం వహించుటకు ఎవరు అర్హులో నీవే నిర్ణయించాలి " అన్నాడు . కర్ణుడు " సుయోధనా ! మన యోధులందరూ నాయత్వ అర్హత ఉన్న వారే ఒకరిని నియమించిన వేరొకరికి మత్సరం కలుగుతుంది. కనుక ద్రోణుని సైన్యాధ్యక్షుని చేసిన అందరికీ అమోద యోగ్యముగా ఉంటుంది. ఆచార్యుడు, వివిధ రణతంత్ర కోవిదుడు, పూజ్యుడు , శూరుడు, వయోవృద్ధుడైనా వీరుడు అతడిని సైన్యాద్యక్షునిగా అభిషేకించండి " అన్నాడు.
ద్రోణుని సైన్యాధ్యక్షుని చేయుట
కర్ణుని మాటలు విన్న సుయోధనుడు తన తమ్ములను, మిత్రరాజులను వెంట పెట్టుకుని ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఆయనతో సవినయంగా " ఆచార్యా ! కురుసైన్యంలో అస్త్రవిద్యా ప్రావీణ్యంలోను, శౌర్య ప్రతాపాలలోను మీరు అగ్రగణ్యులు. ఇప్పటివరకు పితామహుని నాయకత్వంలో నడిచిన కురుసైన్యాలకు నేటి నుండి మీరు నాయత్వం చేసి నడిపించండి. మేమంతా మీ ఆజ్ఞానువర్తులమై ప్రవర్తిస్తాము. దేవ సేనను నడిపించిన కుమారస్వామి వలె మన సైనాలను మీరు నడిపించండి " అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన ద్రోణుడు " సుయోధనా ! నేను బ్రాహ్మణుడను వేద వేదాంగములను అభ్యసించిన వాడిని. నాలో క్షత్రియోచిత లక్షణములైన ధైర్యము పరాక్రమము లేవు. అయినను నన్ను మీరందరూ ఇంతగా ఆదరిస్తున్నారు కనుక మీ కోరిక మన్నించి స్వర్వసైన్యాధిపత్యం వహిస్తాను. చెదిరి పోయిన మన సైన్యాలను సమీకరించి పాండవులతో పోరాడి మనకు విజయం చేకూర్చెదను " అన్నాడు. ద్రోణాచార్యుని మాటలకు సంతసించిన సుయోధనుడు వెంటనే సువర్ణ కలశంతో గంగాజలాలను తెప్పించి పుణ్యాహవాచన కార్యక్రమములు కావించి, పుణ్యాంగనల ఆశీర్వాదములతో వంధి మాగధుల స్త్రోత్రపాఠముల మధ్య ద్రోణునికి సైన్యాధ్యక్షునిగా అభిషేకం చేసాడు. కౌరవ ప్రముఖుల శంఖారావములు, భేరిమృదంగ నాదములు మిన్నంటగా ద్రోణుడు సైన్యాధ్యక్షుడుగా ముందు నిలువగా కౌరవ సేనలు యుద్ధ సన్నద్ధమై ముందుకు నడిచాయి. ద్రోణా చార్యుడు అయిదు రోజులు పాండవ సైన్యముతో హోరా హోరి పోరాడి ఒక అక్షౌహిని పాండవ సైన్యాలను సంహరించాడు. ఆ మహావీరుని ధాటికి ఎందరో వీరులు వీరస్వర్గం అధిరోహించారు. ఆ మహా యోధుడు అయిదు దినములు నిరంతర వీర విహారం చేసి వీర స్వర్గం అలంకరించాడు " అని సంజయుడు పలికాడు.
ద్రోణుని మరణవార్త విని ధృతరాష్ట్రుడు దుఃఖించుట
ద్రోణుని మరణ వార్త విన్న ధృతరాష్ట్రుడు ఎంతో దుఃఖించాడు. " సంజయా ! అస్త్రశత్రవిద్యా ప్రవీణ్యుడు, మహా పరాక్రమవంతుడు అయిన ద్రోణుడు పాండవుల చేతిలో ఎలా మరణించాడు ? పాంచాలురు అతని విల్లు విరిచారా, రథాశ్వములను చంపారా, రథము విరిచిచారా, సారథిని లేక ద్రోణుడు అలసి ఉన్న తరుణంలో ఆ పాపాత్ముడైన నీచ ధృష్టద్యుమ్నుడు అతి క్రూరంగా వధించాడా. అంతటి మహావీరుని మరణ వార్త నా గుండెను ముక్కలు చేయలేదేమి, నాది గుండె కాదు పాషాణము అని పరి పరి విధముల దుఃఖించి మూర్చిల్లాడు. మరలా తెలివి తెచ్చుకుని " సంజయా ! నరనారాయణులు రధికుడు సారధి అయినప్పుడు ఆ రధము ఎప్పుడూ సిద్ధ మనోరధము ఔతుంది కదా! అమిత ప్రాక్రమవంతులైన నకుల సహదేవులు, ఉత్తమౌజుడు, సాత్యకి, ధృష్టకేతువు, శిఖండి, రెండవ రుద్రుడైన అభిమన్యుడు, మానధనుడు చేకితానుడు, అజేయులైన ద్రౌపదీ సుతులు,బలాఢ్యులైన కేకయరాజులు, యుయుధాముడు, ద్రోణుని చంపడానికే జన్మించిన ధృష్టద్యుమ్నుడు, అత్యంత బలశాలి అయిన ఘటోత్కచుడు, అతి లోక వీరులు యాదవులు, జయింప శక్యముకాని భీముడు, దేవతలకు కూడా గెలువ శక్యము కాని సత్యానిత్యా గరిష్టుడు, ధర్మాత్ముడు ఉన్న పాండవ సైన్యం సాధించ లేని ఏమున్నది. సంజయా ! లోక రక్షణారథం యదుకులంలో జన్మించి, వ్రేపల్లెలో బాల్యక్రీడలను సాగిస్తూనే రాక్షస సంహారం చేసి కంసుని వధించి, పారిజాత వృక్షాన్ని దేవలోకం నుండి భూలోకం తీసుకు వచ్చి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుని ప్రాపు సంపాదించిన పాండవులను జయించ కలిగిన వారెవ్వరు. హరికి ఆత్మ అర్జునుడు అర్జునునికి ఆత్మ హరి శరీరాలు వేరైనా ఆత్మలు ఒక్కటైన వారిరువురిని రెండు కళ్ళుగా చేసుకున్న పుణ్యమూర్తి ధర్మరాజు యుద్ధముకు ఎందుకు భయపడతాడు. కౌరవులకు చేటుకాలం దాపురించింది కనుకనే సుయోధనుడు ఈ యుద్ధాన్ని కోరుకున్నాడు " అని పరి పరి విధముల దుఃఖించాడు. " సంజయా ! జరిగినది తలచి ప్రయోజన మేమి ద్రోణుడు యుద్ధం చేసిన విధము వినవలెనని నా మనసు కుతూహల పడుచున్నది " అన్నాడు.
ద్రోణుని సుయోధనుని ఒక కోరిక కోరుకొమ్మని చెప్పుట
ద్రోణుని పరాక్రమవంతమైన యుద్ధం గురించి సంజయుడు వివరించసాగాడు. " మహారాజా ! సర్వసన్యాధిపత్యం వహించిన ద్రోణుడు చాలా సంతోషించి అందరూ వింటూ ఉండగా సుయోధనా ! నన్ను ఇంతగా గౌరవించినందుకు ప్రతి ఫలంగా నీవు ఏదైనా ఒకటి కోరుకో నెరవేర్చెదను " అన్నాడు. సుయోధనుడు కర్ణ, దుశ్శాసనులతో " ఆచార్యా ! మీరు కోరుకోమన్నారు కనుక కోరుకుంటున్నాను . ధర్మరాజును ప్రాణముతో పట్టి నాకు తెచ్చివ్వండి " అని కోరాడు. ద్రోణుడు అందుకు విస్మయపడి " సుయోధనా ! అజాతశత్రువైన ధర్మరాజును చంపమని కోరక ప్రాణములతో పట్టి ఇవ్వమని కోరడంలో ఆంతర్యం ఏమిటి ? వారికి అర్ధరాజ్యం కట్టబెడతావా! ధర్మరాజును ప్రాణములతో పట్టి తెస్తే ఏమి చేస్తావు ? " అన్నాడు. అందుకు సుయోధనుడు " గురువర్యా ! ధర్మరాజును యుద్ధంలో చంపిన ఎన్నో అనర్ధములు జరుగుతాయి. అర్జునుడు తన గాడీవంతో సమస్త కురు సైన్యాలను వధించి తన పగ తీర్చుకుంటాడు. ఒక వేళ మేము పాండవులను అందరను చంపినా కృష్ణుడు సుదర్శన చక్రంతో కురు వంశాన్ని అంతమొందించి కుంతీదేవికైనా రాజ్యాన్ని కట్టబెడతాడు. అలా కాక మీరు ధర్మరాజును అప్పగించిన జ్యూద ప్రియుడైన ధర్మరాజును అతడిని అతని తమ్ములు, భార్యా, బిడ్డలతో జీవితాంతం అరణ్యములకు పంపి నేను సమస్త కురు సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుకుంటాను " అన్నాడు. సుయోధనుని కుటిల బుద్ధికి మనసులోనే అసహ్యపడి ఆనాలోచితంగా తాను ఇచ్చిన వరముకు విఘాతం కలిగించ తలచి " సుయోధనా ! నీ కోరిక సమంజసమే ఇందులో చిన్న చిక్కు ఉన్నది ధర్మరాజు పక్కన అర్జునుడు ఉన్నంత కాలం దేవతలు సైతం అర్జునుని కన్నెత్తి చూడలేరు. ఇది జగమెరిగిన సత్యము కనుక అర్జునుని ఎలాగైనా ధర్మరాజుకు దూరముగా తీసుకు వెళితే నేను నీకు ధర్మరాజును ప్రాణములతో పట్టి ఇవ్వగలను " అన్నాడు ద్రోణుడు. ఆమాటలకు సుయోధనుడు పొంగి పోయాడు. అప్పుడే ధర్మరాజును ప్రాణములతో పట్టి ఇచ్చినట్లు పొంగి పోయి ఈ విషయాన్ని కౌరవప్రముఖు లందరికి చెప్పాడు. కౌరవవీరులు ఆనందోత్సాహాలతో సింహనాదం చేసారు. భేరి మృదంగ నాదాలు మిన్నంటాయి.
ధర్మరాజు ద్రోణుని నుండి తనను కాపాడమని అర్జునునికి చెప్పుట
ఈ విషయాలు చారులద్వారా ధర్మరాజు తెలుసుకుని తమ్ములతో సమావాశమైయ్యాడు. ధర్మరాజు అర్జునుని చూసి అర్జునా " ద్రోణాచార్యుల ప్రతిజ్ఞ వింటివి కదా నన్ను ప్రాణములతో పట్టి సుయోధనునికి ఇస్తానని మాట ఇచ్చాడట. నీవు సదా నా ప్రక్కన ఉండి దానిని వమ్ము చేయవలెను " అన్నాడు. ఆ మాటలు విన్న అర్జునుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! నేను యుద్ధరంగంలో నిన్ను ఒంటరిగా వదిలి నేను వేరే చోట యుద్ధం చేయుట అసంభవం. అది గురువును వధించినంత పాపం అంత పాపం నేను చెయ్యను. సదా నీ ప్రక్కన ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను. అయినా కౌరవుల దురాశ కాని నేను నీ పక్కన ఉండగా ఆ ద్రోణుడే కాదు ముల్లోకాలు ఒక్కటైనా నిన్ను ఏమి చెయ్య లేరు " అని అన్నాడు. అర్జునుని మాటలకు ధర్మరాజు ఎంతో సంతోషించాడు. మంగళ వాధ్యాలు భేరి మృదంగాలు తూర్య నాదాలు మ్రోగుచుండగా పాండవులు యుద్ధరంగానికి బయలు దేరారు.
యుద్ధారంభం
పాండవులు ఆ రోజు క్రౌంచ వ్యూహం పన్నారు. వ్యూహం ముందు భాగమున అర్జునుడు నిలబడ్డాడు. అర్జునుని ప్రక్కన ధృష్టద్యుమ్నుడు నిలిచాడు. భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీ సుతులు, అభిమన్యుడు వారి వారి స్థానములలో నిలబడ్డారు. యుధిష్టరుడు వ్యూహం మధ్యభాగంలో నిలబడ్డాడు. నీ కుమారులు అంధుకు దీటుగా శకటవ్యూహం పన్నారు. సింధురాజు, కళింగభూపతి, వికర్ణుడు, దక్షిణ భాగమున నిలిచారు. వారి ప్రక్కన శకుని దక్షిణ భాగమున ససైన్యంగా నిలిచాడు . కృతవర్మ, విశంతి, చిత్రసేనుడు, దుశ్శాసనుడు ఉత్తర భాగంలో నిలిచారు. కాంభోజ, శక, యవన రాజులు తమ తమ స్థానాలలో నిలిచారు. త్రిగర్త, మద్ర, శూరసేన దేశాధీశులు తమ తమ సేనావాహినితో సుయోధనునికి రక్షగా నిలిచారు. వారి అందరికి ముందు అంగరాజు కర్ణుడు తన సేనలతో సుయోధనునికి అండగా నిలిచాడు. కురు సేనలకు తిలకంగా నిలిచిన కర్ణుని కౌరవ సేనలు సంతోషపడి " ఇన్ని రోజులు భీష్ముడు పక్షపాత బుద్ధితో పాండవులను ఉపేక్షించాడు. కర్ణుడు పాండవుల ఉధృతికి అడ్డుకట్ట వేస్తాడు. కర్ణుడు అర్జునునికి సరి జోడు " అని తమలో తాము అనుకున్నారు. ద్రోణుని నాయకత్వంలో యుద్ధముకు బయలు దేరిన మనసేనలకు అనేక దుశ్శకునములు గోచరించాయి. సుయోధనుడు వాటిని లక్ష్యపెట్ట లేదు. అర్జునుడు కర్ణుడు యుద్ధం చేస్తుంటే చూడాలన్న కోరికతో ఇరు పక్షములు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి.
యుద్ధారంభం
యుద్ధం ఆరంభం అయింది రథములు, ఏనుగులు, గుర్రముల పదఘట్టనలతో రేగిన ధూళి ఆకాశం అంతా దట్టంగా కమ్మింది. శరములతో శరములు ఖడ్గములతో ఖడ్గములు అస్త్రములతో అస్త్రములు ఢీకొని వాటి నుండి చెలరేగిన మంటలు సూర్యకాంతిని తలపింప చేస్తున్నాయి. పగిలిన ఏనుగుల కుంభస్థలములు, తెగిపడిన హయముల అవయవములు, విరిగిన రథములు వివిధ కాల్బలముల కళేబరములు, ఏరులై పారుతున్న రక్తముతో రణరంగం బీభత్సంగా తయారైంది. ద్రోణా చార్యుడు తన రథమును చిత్రవిచిత్ర రీతుల నడిపిస్తూ ఎక్కడ చూసినా తానే అయి పాండవ సేనలపై శరవర్షం కురిపిస్తున్నాడు. గజములను చంపుతున్నాడు, గుర్రముల కళేబరములు తేలు తున్నాయి, రథములు విరుగుతున్నాయి. ద్రోణుని ధాటికి తాళలేని పాండవసేనలు పారిపోసాగాయి. అది చూసిన ధర్మరాజు కలవర పడి అర్జునుడిని, ధృష్టద్యుమ్నుడిని పిలిచి ద్రోణాచార్యుని ఉధృతి ఆపమని ఆదేశించాడు. ధృష్టద్యుమ్నుడు తమ సేనలతో ద్రోణుని ఎదుర్కొన్నాడు. అర్జునుడు పారి పోతున్న పాండవ సేనకు ధైర్యవచనములు చెప్పి యుద్ధోన్ముఖులను చేసాడు. అందరూ ద్రోణుని నలువైపులా ఎదుర్కొన్నారు. ద్రోణుడు వృద్ధుడైనా అవక్ర పరాక్రమంతో ఎదుర్కొని పాండవ సేనపై విజృంభించాడు. అయినా పాండవ సైన్యాలు ద్రోణుని ధైర్యంగా ఎదుర్కొన్నాయి. ద్రోణునిని కొట్టి, హయములను గాయపరిచాయి, ద్రోణుని శరములను మధ్యలోనే త్రుంచి ద్రోణుని సేనలపై అనేక అస్త్రసస్త్రములు ప్రయోగించాయి. ద్రోణ ధృష్టద్యుమ్నుల మధ్య పోరు వృధృతంగా సాగింది. వారిరువురు ఒకరిపై ఒకరు వేసుకున్న బాణములతో గగనతలము నిండి పోయింది. ఇది చూసిన ధర్మరాజు తన సైన్యంతో ద్రోణునిపై శరవర్షం కురిపించాడు. శకుని సహదేవునితో యుద్ధం సాగిస్తున్నాడు. శకుని సహదేవుని కేతనము కొట్టి, గుర్రములను చంపాడు సహదేవుడు కోపించి శకుని కేతనం విరుగకొట్టాడు. శకుని తన గధ తీసుకుని క్రిందికి దిగి సహదేవుని రథమును విరుగ కొట్టాడు. సహదేవుడు కూడా క్రిందికి దిగి గధతో శకునితో తలపడ్డాడు. భీమసేనుడు వివిశంతి మీద శరవర్షం కురిపించాడు. వివిశంతి బెదరక భీమసేనుని విల్లు రెండు ముక్కలు చేసాడు. భీమసేనుడు క్రిందకు దిగి వివిశంతి రథాశ్వములను చంపాడు. భూరిశ్రవసుడు అన్నాడు " ధృష్టద్యుమ్నుని ఎదుర్కొని అతడి శరీరం అంతా శరములు నాటాడు. అన్నయ్య పరిష్తితి చూసిన శిఖండి అతడిని ఎదుర్కొని భూరిశ్రవసుని తరమి తరిమి కొట్టాడు. ఘటోత్కచుడు అలంబసుడు మాయా యుద్ధం చేతున్నారు. క్షత్రదేవుడు లక్ష్మణునితో యుద్ధం చేస్తున్నాడు. చేకితానుడు అనువిందునితో యుద్ధం చేస్తున్నాడు. శల్యుడు నకులునితో యుద్ధం చేస్తున్నాడు. నకులుడు శల్యుని కేతనమును విరిచి, రథమును విరుగకొట్టాడు. ద్రుపదుడు త్రిగర్తాధిపతి ఒకరి బలాబలములు ఒకరు పరీక్షిస్తున్నారు. పౌరవరాజు అభిమన్యునితో తలపడ్డాడు.
అభిమన్య ప్రతాపం
అభిమన్యుడు పౌరవరాజు కేతనమును ధనస్సును విరిచి అయిదు బాణములతో రథాశ్వములను చంపి మరొక బాణంతో శిరస్సు ఖండించబోగా కృతవర్మ అడ్డుపడి రెండు బాణములతో అభిమన్యుని విల్లు ఖండించాడు. అభిమన్యుడు కత్తి, డాలు తీసుకుని పౌరవరాజు రథము విరిచి సారథిని క్రిందికి లాగాడు. పౌరవ రాజును చంపడానికి అతడి మెడ పట్టుకున్నాడు. అంతలో సైంధవుడు అభిమన్యుని కత్తితో ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు పౌరుని వదిలి సైంధవుని ఎదుర్కొని అతడి డాలు కత్తి విరుగకొట్టాడు. అభిమన్యుని ధాటికి తట్టుకోలేక సైంధవుడు పారిపోయాడు. అభిమన్యుడు సైంధవుని సేనలపై పడి వారిని నరుకుతున్నాడు. పారి పోతున్న సైధవుని చూసి రాజులు ఒక్కుమ్మడిగా అభిమన్యుని మీద పడ్డారు. శల్యుడు అభిమన్యునిపై భీకర శక్తిఆయుధం ప్రయోగించాడు. అభిమన్యుడు దానిని పట్టుకుని తిరిగి శల్యునిపై విసిరాడు. అది శల్యుని రథ సారథి శిరస్సును ఖండించింది. అప్పుడు విరాటుడు, ద్రుపదుడు, ధృష్టకేతు, యుధిష్టరుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకయరాజులు, భీమసేనుడు, నకులసహదేవులు, ద్రౌపదీ సుతులు, శిఖండి అభిమన్యునికి సాయం వచ్చి రక్షణగా నిలబడి శత్రుసేనలను తనుమాడసాగారు. ఇది చూసిన నీ కుమారులు అభిమన్యునిపై శరములు, భల్లబాణములు కురిపించారు. తన సారథి చనిపోవడంతో శల్యుడు రథం దిగి గధతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు కూడా రథం దిగి శల్యుని ఎదుర్కొన్నాడు. అది చూసిన భీమసేనుడు శల్యుని చేయి పట్టి లాగి తనతో గధాయుద్ధం చేయమని ఘర్జించాడు. శల్యుడు అభిమన్యుని వదిలి భీమసేనునితో గధాయుద్ధం చేస్తున్నాడు. ఒకరి చుట్టు ఒకరు తిరుగుతూ చిత్రవిచిత్ర గతులతో యుద్ధం చేస్తున్నాడు. సమాన బలాఢ్యులైన వారిద్దరూ ఒకరి గదాఘాతాలకు ఒకరు తట్టుకోలేక ఇద్దరూ మూర్ఛ పోయారు. ఇది చూసిన కృతవర్మ శల్యుని రథంపై ఎక్కించుకుని దూరంగా తీసుకు వెళ్ళాడు. అంతలో మూర్చ నుండి తేరుకున్న భీమసేనుడు శల్యుడు కనపడక కౌరవ సేనపై పడి నిర్మూలించసాగాడు. అది చూసిన నీ కుమారులు భీముని చుట్టుముట్టి అతడిపై అనేక అస్త్రశస్త్రములు ప్రయోగించారు. అంతలో నకుల సహదేవులు భీమునకు సాయం వచ్చారు. ఆ మువ్వురూ నీకుమారులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు.
అపహార్ణము తరువాత యుద్ధము
అపహార్ణం అయ్యే సమయానికి ఆ రోజు యుద్ధంలో పాండవులదే పై చేయి అయింది. పాండవ సేనలో జయజయధ్వానాలు మిన్నంటాయి. కర్ణుని కుమారుడు వృషసేనుడు సింహనాదం చేస్తూ పాండవ సేనలో జొరబడి ఊచకోతకోయసాగాడు. అతడి పరాక్రమానికి పాండవ సేనలు తట్టుకోలేక పోయాయి. హయములు, ఏనుగులు తెగిపడుతున్నాయి. సారధులు చనిపోతున్నారు, రథములు విరుగుతున్నాయి, కాల్బలము నశించి పోతుంది, రక్తం ఏరులై ప్రవహిస్తుంది. వృషసేనుని పరాక్రమానికి పాండవ సేన తట్టుకోలేక పోతుంది. ఇది చూసిన నకులుని కుమారుడు శతానీకుడు వృషసేనునిపై లంఘించి అతడి పైన పది బాణాలు గుప్పించాడు. వృషసేనుడు శతానీకుని కేతనం విరిచి, విల్లు త్రుంచాడు. ఇది చూసిన మిగిలిన ద్రౌపదీ పుత్రులు శతానీకునకు సాయంగా నిలిచి అనేక అస్త్రశస్త్రాలను అతడి మీద ప్రయోగించారు. అశ్వత్థామ తన సైన్యాలతో పాండవసేనను ఎదుర్కొన్నాడు. ద్రుపదుడు, ధర్మరాజు, కేకయరాజులు, విరాటుడు వారి వారి సేనలతో అశ్వత్థామను, వృషశేనుని ఎదుర్కొన్నారు. ఉభయ పక్షాల మధ్య పోరు ఘోరమైంది. భీముడు కర్ణుని, కృపాచార్య, ద్రోణ అశ్వత్థామలను ధృష్టద్యుమ్నుడు, విరాటుడు ఎదుర్కొన్నారు. కొంతసేపటికి పాండవ సేనల ఉధృతికి తాళ లేక మన సైన్యాలు పారిపోసాగాయి. ఇది చూసిన ద్రోణుడు నిలువమని ఎంత చెప్పినా నిలువక కౌరవ పారిపోసాగాయి.
ద్రోణుడి విజృంభణ
అది చూసి ద్రోణుడు " సారధీ ! చూసావా ! మనసేనలన్నీ పారిపోతున్నాయి. ధర్మజుని ముఖం గర్వంతో వెలిగి పోతుంది. నేను పాండవుల మీద విజృంభించకపోతే సేనలను ఆపలేము. ధర్మజుడు, భీముడు, ద్రుపదుడు, విరాటుడు వారి కుమారులు, నా ముందు నిలువలేరు అర్జునునికి విద్య నేర్పింది నేనే నీ చాతుర్యము చూపించి రధము నడుపుము నా చేతుల దురద తీరేవరకు ఒళ్ళు దాచుకొనక యుద్ధం చేస్తాను " అన్నాడు. ఆ మాటలకు పొంగిపోయిన ద్రోణుని సారథి చిత్రవిచిత్ర రీతుల రథం నడుపుతుండగా ద్రోణుడు పాండవసేనలో ప్రవేశించి చీల్చి చెండాడసాగాడు. పొంగుతున్న సముద్రంలా విజృంభించిన ద్రోణుని ధర్మనందనుని చక్రరక్షకుడు సుకుమారుడు చెలియలి కట్టలా అడ్డుకున్నారు. ద్రోణుడు ఒకే బాణంతో సుకుమారుని తల తెగనరికాడు. అది చూసిన పాండవ యోధులంతా ద్రోణుని చుట్టుముట్టారు. ద్రోణుడు అయిదు బాణములతో నకులుని, అయిదు బాణములతో సహదేవుని తిమ్మిది బాణములతో విరాటుని, ఏడు బాణములతో సాత్యకిని, మూడేసి బాణములతో ద్రౌపదీ సుతులను ఇరవై బాణములతో విశంతిని, పన్నెండు బాణాలతో ధర్మజును శిఖండిని కట్టడి చేసాడు. ఎదురు వచ్చిన రథికులు ఎవ్వరూ ప్రాణాలతో పోలేదు. యుగంధరుడు ధర్మరాజు ద్రోణులకు మధ్యకు వచ్చి ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు కోపించి ఒకే బాణంతో యుగంధరుని చంపాడు. అది చూసి కేకయరాజులు, ద్రుపదుడు, సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు, మొదలైన యోధులు ద్రోణునిపై తలపడ్డారు. సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు ద్రోణునిపై అస్త్రశస్త్రములు ప్రయోగించాడు. వారిపై కన్నెర్ర చేసిన ద్రోణుడు వారిపై రెండు వాడి అయిన అమ్ములు వేసి వారి శిరస్సులు ఖండించాడు. ఇది చూసిన మిగిలిన రథికులు పక్కకు తొలిగారు. ద్రోణుడు సింహనాదం చేసాడు. ఈ అలజడి చూసిన పాండవ సేనలో కలకలం రేగింది వారు " ద్రోణుడు ధర్మరాజును పట్టుకుని సుయోధనుని సముఖముకు తీసుకు వెళుతున్నాడు " అని ఆక్రోశించారు. అది కార్చిచ్చులా వ్యాపించి పాండవసేనలు కంపించాయి. ఇది విని అర్జునుడు ద్రోణునుని ముందుకు రథం పోనిచ్చాడు. అది చూసిన కౌరవ సేనలు ద్రోణునికి అండగా నిలిచాయి. అర్జునుడు తన గాండీవం సంధించి కౌరవ సేనలపై శరవర్షం కురిపించాడు. కౌరవ సేనలు తలలు తెగిపడుతున్నాయి రక్తం ఏరులై ప్రవహిస్తుంది. మొండెములు నేలకూలుతున్నాయి. అర్జునిని ధాటికి కౌరవ సేనలు తట్టుకోలేక పారిపోసాగాయి. ఇంతలో సూర్యుడు అస్తమించగానే ఆ రోజు యుద్ధం ముగించారు.
ద్రోణుని సారధ్యంలో రెండవ రోజు యుద్ధం
ద్రోణ సారథ్యంలో రెండవ రోజు యుద్ధానికి కౌరవ సైన్యం సిద్ధం అయింది. ద్రోణుడు సుయోధనునితో " సుయోధనా ! నిన్నటి రోజు నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోనలేక పోయాను. అర్జునుడు ధర్మజుని ఒక్కక్షణం కూడా విడువ లేదు. ఆఖరిక్షణంలో కూడా మన సేనలను తనుమాడాడు. అర్జునుడిని దూరంగా తీసుకు వెళ్ళకుండా ధర్మజుని పట్టుట సాధ్యం కాదు. అర్జునుడు లేకున్న ధర్మజుడు నన్ను చూసి పారిపోతాడు. అప్పుడు నేను వెన్నంటి ధర్మజుని పట్టగలను " అన్నాడు. ఆ మాటలు విన్న సుశర్మ " ఆ మాటలువిన్న సుశర్మ " సుయోధనా ! అర్జునుడు ఎప్పుడూ మమ్ము అవమానిస్తుంటాడు. మాకు అతడి మీద కోపంగా ఉంది. ఈ రోజు అర్జునుడైనా ఉండాలి లేక సుశర్మ అయినా ఉండాలి. అర్జునుడికి మేము ఏవిధంగా తీసిపోము " అని ప్రగల్భములు పలికి సుశర్మ తన తమ్ములను తీసుకుని అర్జునుడితో యుద్ధానికి సన్నద్ధమయ్యారు. సుశుశర్మతో అతడి తమ్ములు సత్యవర్ముడు, సత్యవ్రతుడు, సత్యకర్ముడు చేరగా కేరళ, మాళవ, శిలీంద్ర, మగధాధీసులు చేరగా పదిహేను మంది యోధులను తీసుకుని జయజయ ధ్వానములు చేస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యారు. అది చూసి సుయోధనుడు ఆనందభరితుడయ్యాడు. వారు స్నానాధికములు చేసి అగ్ని రగిల్చి అగ్ని సాక్షిగా " మేమంతా ఈ రోజు రణరంగమున అర్జునుడిని చంపుతాము. లేని ఎడల మేము గోవధ, స్త్రీ వధ, బ్రాహ్మణవధ, బ్రాహ్మణ ధనం దోచుకొనుట, ఇతరుల ధనం అపహరించుట, గురువుకు అపకారం చేయుట, శరణు వేడిన వారిని రక్షించక పోవడం, అబద్ధం పలుకుట, మద్యపానం చేయుట, దేహీ అన్నవారికి లేదనుట, గృహదహనం చేయుట, ఇతరుల భార్యలతో వ్యభిచరించుట మొదలైన పాపములు చేసిన వారు ఏలోకాలకు వెళతారో ఆ లోకాలు మాకు సంప్రాప్తిస్తాయి మేము అర్జునుడి చేతిలో మరణించిన మాకు మాకు వీరస్వర్గం లభించగలదు " అని ప్రమాణాలు చేసి రణరంగ ప్రవాశం చేసారు.
యుద్ధారంభం
రెండవ రోజుయుద్ధానికి ద్రోణుడు కౌరవ సైన్యాలను గరుడవ్యూహంలో నిలిపాడు. గరుడపక్షి ముక్కు స్థానమున ద్రోణుడు ముక్కు స్థానమున నిలిచాడు. సుయోధనుడు అతడి తమ్ములు తలవపు నిలిచారు. కృపాచార్యుడు కృతవర్మ నేత్రష్తానాలలో నిలిచారు. సింహళ అభీర, శూరసేన రాజులు మెడ భాగమున నిలిచారు, బాహ్లిక, భూరిశ్రవస, సోమదత్త, శలుడు, శల్యుడు కుడి రెక్క వైపున, అశ్వత్థామ, సుదక్షిణుడు, విందుడు, అనువిందుడు ఎడమ రెక్క వైపున నిలిచారు. శకుని, పౌండక, అంబష్ట , శకుని, కళింగుడు, మగధరాజు వెన్ను భాగమున నిలిచారు. కర్ణుడు తన సైన్యముతో తోకభాగమున నిలిచాడు. సైంధవుడు మొదలైన రాజులు అక్కడక్కడా తమ సైన్యాలతో నిలచారు. భగదత్తుడు తన గజము మీద ఎక్కి మధ్యభాగమున నిలిచాడు.
త్రిగర్తదేశాధీశులు అర్జునుడిని యుద్ధముకు పిలుచుట
త్రిగర్త దేశాధీసులు వ్యూహముతో కలవక విడిగా దక్షిణమున నిలిచారు. వారు అర్జునిని పిలిచి యుద్ధముకు రా అని కవ్వించారు. అర్జునుడు అది చూసి " త్రిగర్తాధీశుడు అతడి తమ్ములతో నన్ను యుద్ధముకు రమ్మని పిలుస్తున్నాడు. యుద్ధానికి పిలిచినపుడు పోవడం ధర్మం . నేను పోయి వారిని ఓడించి విజయుడినై తిరిగి వస్తాను అనుజ్ఞ ఇవ్వండి. ఈ కొంచం సేపట్లో నీకు ఏమీ కాదు అన్నాడు " అని నమస్కరించి అనుమతి కోరాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు అర్జునుడితో " అర్జునా ! ద్రోణుని శౌర్యప్రతాపములు నీకు తెలియనివి కాదు. నన్ను పట్టి సుయోధనునికి ఇస్తానని ద్రోణుడు ప్రతిజ్ఞ చేసాడు. మనమా ప్రతిజ్ఞ భంగపరచ వలెను. నీకు ఏది మంచిది అనిపించిన అది చేయి " అన్నాడు. ఆ మాటలకు అర్జునుడు " అన్నయ్యా ! యుద్ధానికి పిలిచినపుడు పోకున్న లోకం నన్ను పిరికి వాడు అని గేలిచేస్తుంది. కనుక నేను త్రిగర్తలతో యుద్ధానికి పోక తప్పుదు. ఇతడి పేరు సత్యజిత్తు. ఇతడు నీ పక్కన ఉండగా ఏమీ భయపడవలసిన పని లేదు. ఒకవేళ ఇతడు మరణిస్తే యుద్ధము నుండి తొలగి పోవడం మంచిది. అంతకంటే వేరు మార్గం లేదు " అన్నాడు. ధర్మరాజు చేసేది లేక అర్జునుడు సంశక్తులతో యుద్ధానికి వెళ్ళడానికి అనుమతించాడు. అర్జునుడు సంశక్తులతో యుద్ధానికి వెళ్ళడం చూసిన కౌరవ సైన్యంలో ఆనందోత్సాహాలు వెల్లి విరిసాయి. జయ జయ ధ్వానాలు చేసారు.
ద్రోణ సారధ్యంలో రెండవ రోజు సమరం
ధర్మరాజు ధృష్టద్యుమ్నుని చూసి " ద్రోణుడు గరుడ వ్యూహము పన్నాడు అందుకు ప్రతిగా మన సేనలను నీవు మండలార్ధ వ్యూహమున నిలుపు " అన్నాడు. ధృష్టద్యుమ్నుడు సేనలను మండలార్ధ వ్యూహమున నిలిపాడు. ఉభయ సైన్యములలో భేరి, మృదంగ నాదాలు మిన్నంటాయి. ధర్మరాజు ధృష్టద్యుమ్నుని చూసి " నేను ద్రోణునికి చిక్కకుండా ఉండాలంటే " నేను ద్రోణుని చేతికి చిక్కకుండా ఉండాలంటే మీరంతా నన్ను అతి జాగరూకతతో వెన్నంటి ఉండాలి మీ శౌర్య ప్రతాపములు చూపి కౌరవ సేనలను ఒక్క అడుగు ముందుకు రానీయక చూడవలసిన బాధ్యత మీదే " అన్నాడు. ధృష్టద్యుమ్నుడు ధర్మనందనా నేను ఉండగా ద్రోణుడు నీ దరిదాపులకు కూడా రాలేడు. ద్రోణుడు ఎన్నటికీ నన్ను గెలువ లేడు " అన్నాడు. యుద్ధం ప్రారంభం అయింది ధృష్టద్యుమ్నుడు పాండవ సేనకు ముందు నిలిచి తన రధమును ద్రోణుని ముందు నిలిపాడు. యుద్ధ ప్రాంరంభంలో ధృష్టద్యుమ్నుని చూడటం అరిష్టమని తలచిన ద్రోణుడు పక్కకు తిరిగి పాంచాలసేనతో యుద్ధం చేయసాగాడు.
సంశక్తులతో అర్జునుడి యుద్ధం
అర్జునుడు ఆకలిగొన్న సింహమువలె సంశక్తులను ఎదుర్కొన్నాడు. వారు అర్ధచంద్రాకారంలో మొహరించి అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు దేవదత్తఘోష విన్న సంశక్తుల హృదయాలు దద్ధరిల్లాయి అంతలోనే తేరుకుని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడిని చుట్టిముట్టి వాడి అయిన శరములు అర్జునిపై ప్రయోగించారు. అర్జునుడు వాటిని మధ్యలో త్రుంచి తన వాడి అయిన బాణములతో పది వేలమంది రధికులను చంపాడు. తన మీద పది శరములను ప్రయోగించిన వారిని కేవలం అయిదుబాణాలతో యమసదనానికి పంపాడు. సుశర్మ, సుభాహుడు, సుధన్వుడు, సురధుడు అర్జునితో పోరాడుతున్నారు. అర్జునుడు వారి కేతనములు విరుగకొట్టాడు. సుధన్వుని హయములను చంపి , విల్లువిరిచి, ఒకేఒక బాణంతో అతడి తల నరికి విజయ సూచకంగా శంఖారావం చేసాడు. అర్జునుడు సంశక్తుల సైన్యంపై పడి వారి రధములను విరుగకొట్టాడు. అర్జునిని ధాటికి సంశక్తుల సేన చెల్లాచెదురు అయ్యాయి. అది చూసి సుశర్మ కలవర పడి " భయపడకండి వెనక్కు రండి అర్జునిని పరాక్రమం మనకు తెలియనిదా ! చేసిన ప్రతిజ్ఞ మరిచారా ! సుయోధనుని ముందు తల ఎత్తుకుని ఎలా తిరుగగలము " అని బిగ్గరగా అరిచాడు. అతడి మాటాలకు సైన్యం వెనుతిరిగి వచ్చి అర్జునుడితో తలపడింది. అర్జునుడు " కృష్ణా ! త్రిగర్తులు ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతుంటారు. రథమును వెనుకకు మరల్చి వీరిని యమసదనముకు పంపినగాని మన పని పూర్తి కాదు " అన్నాడు.
నారాయణాభిదాసుల సమరం
కృష్ణుడు రధమును వెనుకకు మరల్చాడు ఆ సమయంలో నారాయణాభిదాసులు పదివేల మంది వారిని ఎదుర్కొన్నారు. వారందరికి కృష్ణార్జునుల మీద కోపంగా ఉంది. యుద్ధానికి ముందు ద్వారకకు వచ్చి అర్జునుడు, సుయోధనుడు సహాయం కోరిన సమయంలో అర్జునుడు తమను కృష్ణుని నుండి వేరు చేసి సుయోధనుడి పరం చేసినందుకు వారికి కృషార్జునుల ఇరువురి పైన కసిగాను కోపంగాను ఉంది. వారు కృష్ణార్జునులపై శరవర్షం కురిపించాడు. వారిని చంపనిచ్చగించని అర్జునుడు తనకు త్వష్ట ప్రజాపతి ప్రసాదించిన దివ్యాస్త్రమును వారిపై ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావంతో నారాయణాభిదాసులలో ప్రతి వారికి తన ఎదుటి వాడు అర్జుడిలా కనిపించసాగాడు. ఆ అస్త్ర ప్రభావంతో ఒకరిని ఒకరు నరుక్కుని అనేక మంది చని పోయారు. ఇంతలో అస్త్ర ప్రభావం తగ్గి పోయింది. మిగిలిన నారాయణాభిదాసులు మగధ, కేరళ మొదలగు రాజులతో కలిసి మహోగ్రంగా కృష్ణాంజ్ఞులను చుట్టుముట్టి అర్జునుడిపై శక్తి వంతములైన అస్త్రశస్త్రములు వేసారు. అర్జునుడు వారి అస్త్రములను త్రుంచి వారి శిరములను తన వాడి బాణములతో ఖండించాడు. వారి సైన్యములోని హయములు, ఏనుగులు, కాల్బలము అర్జునుడి బాణములకు ఆహుతి అయ్యాయి.
అర్జునుని సంశక్తులు తిరుగి ఎదుర్కొనుట
ఇంతలో సంశక్తులు తమ సైన్యాలను సమీకరించి అర్జునుడిని ఎదుర్కొని అర్జునుడి మీద శరవృష్టి కురిపించారు. వారిలో కొంత మంది రధములు దిగి అర్జునుడి రధము మీద హయముల మీద దాడి చేసారు. అన్ని దిక్కుల నుండి శరప్రయోగం చేయడంతో పాండవ సేనకు అర్జునుడి రథం కనిపించ లేదు. కృష్ణార్జునులు సంశక్తుల చేతిలో మరణించారు అనుకుని ఆందోళన పడ్డారు. వారి ఆందోళన గమనించి సంశక్తులు సింహనాదాలు చేసి శంఖారావములు చేసారు. నొగల మీద కూర్చున్న కృష్ణునికి అర్జునుడు కనిపించక కలవర పడి " అర్జునా! అర్జునా ! " అని ఎలుగెత్తి అరిచాడు. పరిస్థితి అర్ధం చేసుకున్న అర్జునుడు వాయవ్యాస్త్రం ప్రయోగించి సంశక్తుల సైన్యాలను చెదుమదురు చేసాడు. కృష్ణార్జునులు కనిపించగానే పాండవ సైన్యం ఊపిరి తీసుకుని హర్షధ్వానాలు చేసారు. సంశక్తులు తిరిగి సైన్యములను కూడగట్టుకుని ఒక్కుమ్మడుగా అర్జుడి మీద దాడి చేసారు. అర్జునుడు వారు వేసిన శరములు మధ్యలో త్రుంచి వారిపై అతి క్రూర నారాచములు వేసి వారి సైనికుల శిరస్సులను త్రెంచాడు. ఏనుగులు, హయములు, రథములు తునాతునకలు ఔతున్నాయి. మొండెములు ఇతర అవయవములు ఎగిసి పడుతున్నాయి. అయినా బెదరక సంశక్తులు అర్జునుడిపై శరపరంప కురిపించారు. తీవ్రంగా పోరు సాగుతుంది.
ద్రోణుడు పాండవసైన్యమును ఎదుర్కొనుట
ద్రోణుడు ఎలాగైనా ధర్మరాజును పట్టుకోవాలని ప్రయత్నంతో పాండవ సైన్యాలను తరిమి తరిమి కొట్టి ధర్మజుని సమీపించాలను చూస్తున్నాడు. దుర్ముఖుడు ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నాడు. ద్రోణుని ధాటికి పాండవ సన్యాలు వెనక్కు తగ్గాయి. ధర్మరాజు తనసేనను ప్రోత్సహిస్తూ యుద్ధోన్ముఖులను చేస్తున్నాడు. ద్రోణుని చేతిలో వేలకు వేలు సైనికులు వీరస్వర్గం చేరుకున్నారు. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. రథముల క్రింద కొందరు, ఏనుగుల పాదముల క్రింద కొందరు మరణిస్తున్నారు. మదపుటేనుగులు తమ తొండముతో సైనికులను పైకెత్తి నేలకేసి కొడుతున్నాయి. యుద్ధభూమి భయానకంగా ఉంది. ద్రోణుడు తన సైన్యంతో ధర్మరాజు మీదకు వెళ్ళాడు. అతడిని ధర్మరాజు ఎదుర్కొన్నాడు. ద్రోణుడు సత్యజిత్తు విల్లు విరిచాడు. సత్యజిత్తు వేరు విల్లు తీసుకుని క్రూర భల్ల బాణాలు ముప్పది ద్రోణుని మీద వేసాడు. పాంచాల రాకుమారుడు వృకుడు సత్యజిత్తుతో కలిసి అరవై బాణములు ద్రోణునిపై ప్రయోగించాడు. అది చూసి పాండవసేన హర్షధ్వానాలు చేసాడు. ద్రోణుడు కోపించి సత్యజిత్తుని, వృకుని తన బాణపరంపరతో ముంచెత్తాడు. వారిరువురు వెరువక ద్రోణుని సారథిని, హయములను, కేతనములను కొట్టారు. ద్రోణుడు సత్యజిత్తు శరీరంపై పది నారాచములు వేసాడు. సత్యజిత్తు మరొక విల్లు తీసుకుని ద్రోణునిపై శిలీఖములు వేసాడు. ద్రోణుడు సత్యజిత్తు విల్లు విరిచి వృకుని తల నరికి సత్యజిత్తు రథమును విరిచి, హయమును, సారథిని చంపాడు. సత్యజిత్తు వేరొక విల్లు తీసుకుని ద్రోణునిపై శరవర్షం కురిపించాడు. ద్రోణుడు సత్యజిత్తు విల్లు విరిచాడు సత్యజిత్తు తీసుకుంటున్న ప్రతి విల్లు విరుస్తూ అతడి శిరస్సుని ఒక అర్ధ చంద్ర బాణంతో ఖండించాడు. సత్యజిత్తు మరణం చూసిన ధర్మరాజు అర్జునుడి మాటలు గుర్తుకు వచ్చి కలవరపడి ద్రోణునికి పట్టుబడక అక్కడి మెల్లగా నుండి తప్పుకున్నాడు. తనకు ఎదురు వచ్చిన వారినందరిని చంపుతూ ధర్మజుని కొరకు వెతుకుతున్నాడు. అంతలో విరాటుని తమ్ముడు సూర్యదత్తు ద్రోణుని ఎదుర్కొని అతడిపై కరకుటమ్ములు ప్రయోగించాడు. చిరాకు పడ్డ ద్రోణుడు ఒకే బాణంతో అతడి శిరస్సు ఖండించాడు. అది చూసి విరాటుని సేనలు పారిపోయాయి. ద్రోణునికి ఎదురు నిలిచేవారు లేక పోయారు. ఆ రోజు అలాగైనా ధర్మజును పట్టుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాడు. అప్పుడు యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుదాసుడు, శిఖండి ఒక్కుమ్మడిగా ద్రోణుడిని ఎదుర్కొని ఒక్కొక్కరు అయిదేసి బాణములు ద్రోణునిపై ప్రయోగించారు. సాత్యకి పన్నెండు బాణములు, క్షాత్రధర్ముడు పది బాణములు ద్రోణునిపై ప్రయోగించారు. యుధిష్టరుని కాపాడుతూ ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు ద్రోణుని ఎదుర్కొని ద్రోణుని మీద ఒక్క సారిగా మూడు వందల బాణములు వేసారు. వారి అండతో ధైర్యం తెచ్చుకుని ధర్మరాజు ద్రోణునికి ఎదురుగా వచ్చి ద్రోణునిపై పన్నెండు బాణములు ప్రయోగించాడు. ధర్మజుని చూసి రెచ్చి పోయిన ద్రోణుడు ఒకే శరముతో వసుదాసుని శిరస్సు ఖండించాడు. ఉత్తమౌజుడు, సాత్యకి, శిఖండి మీద కరకుటమ్ములు వేసాడు. ధర్మరాజు వైపు ద్రోణుడు రావడం గ్రహించి ధర్మరాజు అక్కడి నుండి నిష్క్రమించాడు. చేతికి చిక్కిన ధర్మజుడు కనపడక ద్రోణుడు చిరాకు పడ్డాడి పాండవ సేనను చెండాడ సాగాడు. రథములు, కేతనములు విరిగి పడుతున్నాయి, హయములు, గజములు నేల పడుతున్నాయి. కౌరవ సేనలు ఉత్సాహంగా పాండవ సేనలను తరుముతున్నాయి. ఇంతలో వార్ధక్షేమి, చిత్రసేనుడు, సేనాబిందుడు, సువర్చనుడు, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు, సుమిత్రుడు, సాత్యకి, శిఖండి తమ సేనలతో ఒక్కుమ్మడిగా ద్రోణుని ఎదుర్కొన్నారు. ద్రోణుడు రథమును వేగంగా త్రిప్పితూ అనేక రూపములు ధరించాడా అన్నట్లు శరవర్షం కురిపిస్తూ సుమిత్రుని చంపాడు. ఇది చూసిన కేకయరాజులు, మత్స్య రాజులు తమ సేనలతో పారిపోయారు. ధృష్టద్యుమ్నుడు, సేనాబిందుడు, సాత్యకి మొదలగు ప్రముఖులు నిశ్చేష్టులై ద్రోణుని యుద్ధ వైఖరిని చూడ సాగారు. ఇది చూసిన సుయోధనుడు " కర్ణా ! చూసావా పెను గాలికి కూలి పోయిన వృక్షములవలె పాండవ సేన కూలి పోయింది. ద్రోణుని ఎదిరించగలిగిన వాడు పాండవ సేనలో లేడు. భీముడు ఒంటరిగా నిస్సహాయం నిలబడి ఉన్నాడు చూడు అన్నాడు. ద్రోణుని అస్త్రధాటికి నిలువ లేక రాజ్యకాంక్ష వీడి పారి పోతున్నాడు చూడు " అని ఆనందంగా అన్నాడు. కర్ణుడు " సుయోధనా ! పాండవులను అంత తేలికగా తీసి వేయకు. వారు మహావీరులు. అంతా కలిసి భీముని ముందు నిలిపి ద్రోణుని ఎదుర్కొంటారు. మనం ద్రోణుని రక్షణకు వెళ్ళాలి " అన్నాడు.
కురు పాండవసేనల ఘోర సమరం
కర్ణుడి ఊహ నిజం చేస్తూ ధర్మరాజు నకులసహదేవులను పిలిచి భీమునికి ఇరువైపులా నిలిపి ద్రుపద, మత్స్య, యాదవ ప్రముఖులను మొహరించి విరాటుని, ద్రుపదుని, సాత్యకి వంటి ప్రముఖులను వెనుక నిలిపి ఒక్కుమ్మడిగా ద్రోణుని ముట్టడించారు. పాండవ సైన్యము మేఘములు కొండ శిఖరమును ఆవహించినట్లు ద్రోణుని చుట్టుముట్టగా ద్రోణుని రథం కనిపించకుండా పోయింది. ద్రోణుడు పాండవుల చేతులో మరణించాడని కౌరవ సేనలు కలవర పడ్డాయి. సుయోధనుడు తన సేనలను వెంటబెట్టుకుని పాండవ సేనపై విరుచుకు పడ్డాడు. సాత్యకితో కృతవర్మ, క్షత్రధర్ముని సైంధవుడు, యుయుత్సుని సుబాహుడు, నకులుని దుశ్శాసనుడు, సహదేవుని చిత్రవర్ముడు, ధర్మనందనుని శల్యుడు, ద్రుపదుని బాహ్లికుడు, విరాటుని విందానువిందులు, శృతకీర్తిని వివిశంతి, శ్రుత సేనుని సాల్వుడు, శ్రుత సోముని చిత్రసేనుడు, శతానీకుని శ్ర్తతవర్మ, ప్రతివింధ్యుని అశ్వత్థామ, అభిమన్యుని లక్ష్మణుడు, శిఖండిని వికర్ణుడు, కుంతి భోజుని దుర్ముఖుడు, కేకయరాజులను కర్ణుడు, కాశీరాజును జయుడు, పాండ్యరాజును జయత్సేనుడు, వార్ధక్షేమిని కృపాచార్యుడు, మణిమంతుని భూరిశ్రవసుడు, ఘటోత్కచుని అలంబసుడు ఎదుర్కొన్నారు. అలా ద్రోణుని చంపడానికి పాండవసేనలు ప్రయత్నించాయి. ఇరుపక్షముల పోరు సంకులమైంది. ఒకరి కేతనములు ఒకరు వుగకొడుతున్నారు. హయములను చపుతున్నారు, సారధుల తలలు ఎగిరి పడ్తున్నాయి. రథములు విరుగుతున్నాయి. రక్తం వరదలై పారుతుంది . ఇలా మధ్యహ్న సమయం అయింది. తన మీదకు వస్తున్న ధృష్టద్యుమ్నుని ద్రోణుడు తన బాణ పరంపరతో కట్టడి చేస్తున్నాడు. సుయోధనుడు తన గజబలంతో భీముని ఎదుర్కొన్నాడు. భీముడు క్రూర బాణములతో సుయోధనుని గజబలమును నాశనం చేస్తున్నాడు. వంగ దేశాధిపతి ఏనుగు ఎక్కి భీమునిపై అస్త్రప్రయోగం చేసాడు. భీముడు కోపించి వంగదేశాధీశుని ఒకే బాణంతో చంపాడు. అది చూసి వంగసేన పారిపోయింది.
భగదత్తుడు సుప్రీతకముతో వచ్చి పోరు సల్పుట
ఆ సమయంలో భగదత్తుడు సుప్రీతకం అనే తన ఏనుగును ఎక్కి పాండవ సేనతో యుద్ధానికి దిగాడు. సుప్రీతకం మొదట ఇంద్రుని వాహనం. దానిని ఎక్కి ఇంద్రుడు దానవసంహారం చేసాడు. నరకాసురుడు ఇంద్రలోకం నుండి నరకాసురుడు తీసుకు వెళ్ళాడు. నరకాసుర వధానంతరం అది భగదత్తుని చేరింది. అలాంటి సుప్రీతకం ఎక్కి భగదత్తుడు పాండవసేనలను చిన్నాభిన్నం చేసాడు. సుప్రీతకం భీముని మీదకు అత్యంత వేగంగా వెళ్ళడంతో పాండవసేనలో సుప్రీతకం భీముని చంపివేసిందనే కలకలం రేగింది. ధర్మరాజు భీమసేనుడు క్షేమంగా ఉన్నాడని అరచి సేనను యుద్ధోన్ముఖులను చేసాడు. భగదత్తుని సుప్రీతకం పాండవసేనను నుగ్గు నుగ్గు చేస్తుంది. రథములను, హయములను, ఏనుగులను తోండంతో ఎత్తి నేలకేసి బాది విసిరేస్తుంది. వందలకొద్ది సైన్యాలను కాళ్ళ క్రింద తొక్కి చంపింది. ఇది చూసిన దశార్ణ భూపతి తన గజము ఎక్కి వచ్చి భగదత్తుని ఎదుర్కొన్నాడు. సుప్రీతకం కోపించి దశార్ణ భూపతి ఏనుగును తొక్కింది. దశార్ణ భూపతి క్రింద పడ్డాడు. భగదత్తుడు దశార్ణభూపతిని పది తోమరములు వేసి చంపాడు. అది చూసిన పాండవసేనలో భయాందోళనలు మొదలైయ్యాయి. సాత్యకి భగదత్తుని ఎదుర్కొని సుప్రీతకంపై శరవర్షం కురిపించాడు. సుప్రీతకం గిర్రున తిరిగి శరముల నుండి తప్పించుకుని సాత్యకి రథమును ఎత్తి పారేసింది. సాత్యకి లాఘవంగా క్రిందకు దూకి తప్పించుకున్నాడు. సారథి రథం దెబ్బ తినక పోవడం చూసి తిరిగి సాత్యకిని ఎక్కించుకున్నాడు. భీముడు భదత్తుని ఎదుర్కొన్నాడు. కాని సుప్రీతకం ధాటికి తట్టుకోలేక రథాశ్వములు భీముని పక్కకు లాగుకుని వెళ్ళాడు. ఆ సమయంలో సుపర్ణుడు సుప్రీతకమును ఎదుర్కొని దాని కాళ్ళ క్రింద పడి నలిగి పోయాడు. అది చూసిన అభిమన్యుడు, ద్రౌపదీ సుతులు, చేకితానుడు, ధృష్టకేతుడు, యుయుత్సుడు ఒక్కుమ్ముడిగా సుప్రీతకమును ఏదుర్కొని శరవర్షం కురిపించాడు. కాని అవన్నీ వ్యర్ధం అయ్యాయి. సుప్రీతకం కోపించి వారి రథాలను కాళ్ళతో తొక్కి విరిచింది. యుయుత్సుని సారథిని చంపింది. యుయుత్సుడు అభిమన్యుని రథం ఎక్కాడు. అభిమన్యుడు మొదలైన వారు వేసిన అస్త్రాలన్ని సుప్రీతం శరీరానికి తాకి ముక్కలైనాయి. భగదత్తుడు సుప్రీతకమును నలుదెసలా పరుగెత్తిస్తూ పాండవ సేనలోని పదాతి రథ, గజ, తురగ, దళాలను నాశనం చేస్తున్నాడు.
సుప్రీతకంను ఆపాలని వెళుతున్న అర్జునుని సంశక్తులు అడ్డగించుట
దూరం నుండి సుప్రీతకం చేస్తున్న విధ్వసాన్ని చూసిన అర్జునుడు కృష్ణునితో " కృష్ణా ! భగదత్తుని గజము సుప్రీతకం పాండవ సేనను చిన్నాభిన్నం చేస్తుంది. ఎవరూ ఎదుర్కోలేక పోతున్నాడు. మనం లేక పోవడంతో ధర్మరాజాదులు ఎన్ని కష్టాలు పడుతున్నారో కదా ! మన రధమును వెంటనే భగదత్తుని వైపు మళ్ళింపుము " అన్నాడు. కృష్ణుడు రథమును భగదత్తుని వైపు మళ్ళించాడు. ఇంతలో సంశక్తులు వీరాలాపములు పలుకుతూ పదునాలుగు వందలమంది కృష్ణార్జునులను చుట్టుముట్టి శరవర్షం కురిపించారు. అర్జునుడు " కృష్ణా ! మన బలమును తరువాత చూసుకోవచ్చు ముందు సంశక్తులను వధించాలి " అన్నాడు. శ్రీకృష్ణుడు రథమును సంశక్తుల వైపు మళ్ళించాడు. అర్జునుడు గాండీవం సంధించి దేవదత్తము పూరించి దివ్యమైన బాణములను సంశక్తులపై ప్రయోగించాడు. అర్జునుడి అస్త్రధాటికి రథ, గజ, తురగములు నాశనం ఔతున్నాయి. పదాతి దళముల తలలు ఎగిరి పడుతున్నాయి. కాళ్ళు చేతులు తెగిపడుతున్నాయి. అర్జునుడి విజృంభణ చూసి కృష్ణుడు ప్రశంసించాడు. కృష్ణుని ప్రంశలకు పొంగి పోయిన అర్జునుడు మరింత ఉత్సాహంతో విజృంభించి సంశక్తుల సేనను సర్వ నాశనం చేసాడు. అర్జునుడు కృష్ణునితో " ఇక్కడ సంహారం పూర్తి అయింది. రధమును మనసేన వైపు మళ్ళించు " అన్నాడు. కృష్ణుడు రథమును మళ్ళించగానే సంశక్తులు వెనుక నుండి " అదేమిటయ్యా ! మేము యుద్ధానికి పిలుస్తుంటే పారిపోతున్నావు " అని అరిచారు. " కృష్ణా ! యుద్ధానికి పిలుస్తుంటే మరలి పోవడం వీరుల లక్షణం కాదు. మన సైన్యం దైన్య స్థిలో ఉంది. నాకు సరి అయిన మార్గం తోచడం లేదు. నీవే తగు నిర్ణయం తీసుకో " అన్నాడు. కృష్ణుడు మారు మాటాడక సంశక్తుల వైపు రథాన్ని మళ్ళించాడు. అర్జునుడు మహోగ్రంతో త్రిగర్తుని విల్లు త్రుంచి కేతనము విరిచాడు. త్రిగర్తుని సోదరులను చంపాడు త్రిగర్తుడు మూర్చపోయాడు.
అర్జునుడు సుప్రీతకమును భగదత్తును ఖండించుట
ఇంతలో పాండవ సేనలు పారిపోవడం చూసిన అర్జునుడు " కృష్ణా ! అటు చూడు సుప్రీతకం ధాటికి ఆగలేని మన సేనలు పారిపోతున్నాయి . రధమును అటు మళ్ళించు " అన్నాడు. శ్రీకృష్ణుడు అమిత వేగంతో రథమును పాండవ సేన వైపు పరుగెత్తించాడు. అర్జునుడు దేవదత్తము పూరించి భగదత్తుని మీద కరకుటమ్ములు ప్రయోగించి సుప్రీతకముకు ఎదురుగా నిలిచాడు. భగదత్తుడు అర్జునుడిపై ఉగ్రమైన బాణములు ప్రయోగించాడు. అర్జునుడు చిరునవ్వుతో వాటిని ముక్కలు చేసి భగదత్తుని మీద సుప్రీతకం మీద అతి దృఢమైన బాణ ప్రయోగం చేసాడు. ఆ బాణములు సుప్రీతకమును నొప్పించడంతో కృష్ణార్జునుల వైపు అతి వేగంగా దూకింది. సుప్రీతము ధాటికి కృష్ణార్జునులు ప్రాణాలు కోల్పోయారన్న వార్తతో పాండవ సేనలో హాహాకారాలు చెలరేగాయి. అప్పుడు కృష్ణుడు రథమును పక్కకు తప్పించంతో అది సేనలో దూసుకు పోయి వందల కొద్ది సైనికులను కాళ్ళతో తొక్కి చంపింది. ఇది చూసిన అర్జునుడికి కోపం వచ్చినా మనసులోనే అణచుకుని " కృష్ణా ! మన రధమును సుప్రీకం ఎదురుగా నిలుపుము " అన్నాడు. కృష్ణుడు రథమును భగదత్తుడికి ఎదురుగా నిలపగా భగదత్తుడు తండ్రిని చంపిన కృష్ణుని మీద కోపంతో కృష్ణునిపై అతి క్రూర బాణములు ప్రయోగించాడు. అర్జునుడు వాటిని ఖండించి, భగదత్తుని విల్లు విరిచి, భదత్తుడిపై శరీరంలో వాడి అయిన బాణములు నాటాడు. భగదత్తుడు అమిత కోపంతో అర్జునుడిపై పదునాలుగు తోమరములు అర్జుడిపై ప్రయోగించాడు. అర్జునుడు వాట్ని మధ్యలో త్రుంచి సుప్రీతకం కవచమును భేదించాడు. సుప్రీతకం మేఘములు తొలగిన కొండవలె ప్రకాశించింది. భగదత్తుడు ప్రయోగించిన శక్తి బాణమును అర్జునుడు నిర్వీర్యం చేసాడు. భగదత్తుడు అర్జునుడి కిరీటంపై తోమరం వేయగా అర్జునుడు కోపించి భగదత్తుని పై ఏడు బాణములు ప్రయోగం చేయగా భగదత్తుడు తన చేతిలో ఉన్న అంకుశాన్ని వైష్ణవాస్త్రంగా మంత్రించి అర్జునుడిపై ప్రయోగించాడు. అర్జునుడి వైపు అమిత రౌద్రంగా వస్తున్న వైష్ణవాస్త్రానికి కృష్ణుడు నొగల మీదనుండి లేచి నిలబడి తన వక్షస్థలాన్ని చూపాడు. రౌద్రంగా వచ్చిన వైష్ణవాస్త్త్రం శ్రీకృష్ణుని వక్షస్థలం తాకి పూవు వలె క్రింద పడింది. అర్జునుడు కోపం పట్ట లేక " కృష్ణా ! నా మీద దయ వలన నాకు సారధ్యం చేయడానికి ఒప్పుకున్నావు. కాని యుద్ధం చేయనని మాట ఇచ్చావు. ఈ విధంగా యుద్ధంలో పాలు పంచుకోవడం భావ్యంగా ఉందా ! చూసిన వారు అర్జునుడు చేతగాని వాడిని అనుకోరా ! ఇక మాటలెంకులే రధమును పోనిమ్ము " అన్నాడు నిష్టూరంగా. కృష్ణుడు అర్జునుడిని చూసి " అర్జునా ! రధ సారధిగా నిన్ను కాపాడు కోవడం నా ధర్మం . నీకో విషయం చెప్పాలి. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచిన సమయమున భూదేవి అతడిని కోరుకుంది. మహావిష్ణువు ఆమె కోరికను మన్నించి తరువాత ఆమెకు వైష్ణవాస్త్రాన్ని ప్రసాదించాడు. వారి సంగమ ఫలితంగా వారికి నరకాశురుడు జన్మించాడు. భూదేవి ఆ అస్త్రమును నరకాశురుడికి ఇచ్చింది . నరకాశురును నుండి అది భ్గదత్తుడికి సంక్రమించింది. ఆ వైష్ణవాస్త్రము అత్యంత మహిమాన్వితము. విష్ణాంశతో జన్మించిన నా వలన మాత్రమే అది నిర్వీర్యం ఔతుంది. అందూకే నా గుండెను అడ్డు పెట్టి దానిని నిర్వీర్యం చేసాను. అంతే కాని నీవు వీరుడివి కాదు అని కాదు. నీ పరాక్రమం శంకించి కాదు. తాను ప్రయోగించిన వైష్ణవాస్త్రం నిర్వీర్యం అయినందుకు భగదత్తుడు నిరాశతో ఉన్నాడు. కనుక ఇది మంచి తరుణం నేను నరకారుశుని చంపినట్లు నీవు భగదత్తుని సంహరించు " అన్నాడు. అర్జునుడు గండీవమును సంధించి ఒక క్రూర నారాచమును సంధించి సుప్రీతకం కుంభస్థలముకు గురిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు సుప్రీతకం కుంభస్థలం పగిలి క్రిందికి ఒరిగింది. దాని మీద నుండి భగదత్తుడు కింద పడ్డాడు. వెంటనే అర్జునుడు ఒక అర్ధచంద్రాకార బాణమును ప్రయోగించి భగదత్తుని శిరస్సు ఖండించాడు.
అర్జునుని ఎదుర్కొన్న శకుని భంగపాటు
భగదత్తుని మరణం చూసిన నీ కుమారుడు శకుని అతడి తమ్ములు వృషకుడు అచలుడు కలిసి అర్జునుడి మీదకు దూకారు. అప్పుడు అర్జునుడు వృషకుని హయములు, రథమును, కేతనమును ఖండించాడు. వృషకుడు తన సోదరుని రథం ఎక్కాడు. అర్జునుడు తనకు అడ్డుపడిన గాంధార రథికులు అయిదు వందల మందిని చంపాడు. ఒకే రథం మీద ఉన్న వృషకుని, అచలుని అర్జునుడు ఒకే ఒక్క బాణంతో చంపాడు. వారి మరణం కళ్ళార చూసిన నీ కుమారుడు సంతాపం చెందాడు. శకుని కోపంతో రగిలి పోయి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. శకుని తన మాయా శక్తితో అనేక మాయలు కల్పించాడు. రాళ్ళ వర్షం పడుతున్నట్లు, సరీసృపాలు, పెద్ద పులులు మీద పడుతున్నట్లు భ్రమ కల్పించాడు. అర్జునుడు దివ్యాస్త్ర ప్రయోగం చేసి ఆ మాయను పటాపంచలు చేసాడు. అర్జునుడు " శకుని చూసి మామా ! నీ మాయలన్నీ మాయా ద్యూతముతోనే అంత మొందాయి. ఇది యుద్ధ రంగము ఇక్కడ నీ పాచిక పారదు . ఇక్కడ తీవ్రమైన శరములు మాట్లాడతాయి వెళ్ళు " అంటూ శకుని మీద అతి క్రూరమైన శరములు వేసాడు. ఆ బాణ ధాటికి తట్టుకోలేని శకుని తన సైన్యంతో పారిపోయాడు. అప్పుడు సాత్యకి భీమసేనుడు అర్జునుడికి చెరి ఒక వైపు నిలిచారు. వారు ముగ్గురు అమిత పరాక్రమంతో సుయోధనుడి వైపు రథమును మళ్ళించాడు. వారి బాణధాటికి తట్టుకోలేని కురుసేన రెండు పాయలుగా విడిపోయి సుయోధనుని వెనుక ద్రోణుని వెనుక దాక్కున్నారు. పాండవ సేనలు ఉత్సాహంతో " ద్రోణుని నరకండి చంపండి " అంటూ కౌరవ సేన మీదికి లంఘించారు. కౌరవ సేన ద్రోణుని చుట్టూ చేరి అతడికి రక్షణ కవచంగా నిలిచారు. ఇరు పక్షములకు పోరు గోరంగా సాగుతుంది. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడికి ఎటు పోతే అటు ఎదురు నిలిచి అతడితో యుద్ధానికి తలపడుతున్నాడు. ఒక పక్క ధర్మరాజు మరోపక్క సుయోధనుడు తమ సేనలను ప్రోత్సహిస్తున్నారు. ఇంతలో నీలుడు అనే రాజు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ ఒకే బాణంతో అతడి తల ఖండించాడు. అతడి సేనలు పారి పోయాయి. ఇది చూసిన పాండవ సేన కలత పడింది. ధృష్టద్యుమ్నుడు వారిని ప్రోత్సహిస్తూ యుద్ధోన్ముఖులను చేసాడు. ఇంతలో అర్జునుడు చంపగా మిగిలిన సంశక్తులు తమ సైన్యాలను కూడగట్టు కుని " అర్జునా ! మేమేమన్నా ! ఓడిపోయామా పారిపోయామా మమ్మలిని వదిలేసి వచ్చావు. ఏడీ అర్జునుడు మాతో సమరం మానితే విజయం చేకూరుతుందా ? మాకు భయపడి దాక్కున్నావా రా బయటికి రా " అని కవ్వించారు. ఆ మాటలకు రోషం తెచ్చుకున్న అర్జునుడు తమ రథాన్ని దక్షిణం వైపు మళ్ళించాడు. కౌరవసేన శరవర్షానికి పాండవ సేన చెదిరిపోయింది. భీముడు పాండవ సేనను ప్రోత్సహిస్తూ బాక్లికునిపై క్రూర బాణాలు ప్రయీగించాడు. అది చూసిన సుయోధనుడు, కర్ణుడు, ద్రోణుడు, అశ్వత్థామ భీమునిపై శరవర్షం కురిపించారు. అది చూసిన ధర్మరాజు సాత్యకిని, అభిమన్యుని, నకుల సహదేవులను భీమునకు సాయంగా పంపాడు.
అపహార్ణ సమయానంతర సమరం
అప్పటి వరకు జరిగిన భీకర సమరానికి గుర్తుగా యుద్ధభూమిలో రథములు విరిగి పడుతున్నాయి, తలలు తెగిపోతున్నాయి, మొండెముల నుండి ప్రేవులు బయట పడుతున్నాయి, కాళ్ళు చేతులు తెగిపదుతున్నాయి, కుంభస్థలములు పగిలి ఏనుగులు కింద పడి దొర్లుతున్నాయి, ఏనుగుల మీది వీరులు అంకుశములతో సహా కింద పడి మరణిస్తున్నారు. ఏనుగుల కాళ్ళ కింద పడి మరణిస్తున్నా సైనికులు తమ చేతిలోని కరవాలములు వీడకున్నారు, తల తెగిన తరువాత కూడా వీరులు కరవాలమును కొంతసేపు ఝుళిపించి తరువాత కింద పడుతున్నారు. రణరంగము పీనుగుల పెంటగా మారింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని చంపుటకు తగిన సమయం వచ్చిందని తన సైన్యంతో ద్రోణుని ఎదుర్కొని అనేక దివ్యాస్త్రములు సంధించాడు. ఇంతలో సంశక్తులను పూర్తిగా నిర్మూలించిన అర్జునుడు తిరిగి పాండవ సైన్యాలను చేరి భీమునికి తోడుగా నిలిచాడు. ముగ్గురి వీరుల ధాటికి తట్టుకోలేని కౌరవ సేన " కర్ణా ! మాకు నీవే దిక్కు " అని ఆక్రోశించాయి. కర్ణుడు నిలవండి పారిపోకండి. మీకేమి భయం లేదు " అని ధైర్యవచనాలు పలికి ఎదురుగా ఉన్న అర్జునుడిపై ఆగ్నేయాస్త్రం ప్ర్రయోగించాడు. అర్జునుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి ఆగ్నేయాస్త్రాన్ని నిర్యీర్యం చేసాడు. భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు కర్ణుని శరీరంలో మూడేసి బాణాలు నాటారు. కర్ణుడు అర్జునుడి బాణములను త్రుంచి భీమ, సాత్యకి, ధృష్టద్యుమ్నుల ధనస్సులను విరిచాడు. ఆ ముగ్గురు కర్ణునిపై శక్తి బాణములు ప్రయోగించాడు. కర్ణుడు వాటిని నిర్వీర్యం చేసాడు. అర్జునుడుఏడు బాణములతో కర్ణుని కొట్టి అతడి ముగ్గురు తమ్ముల తలలు నరికి భూదేవికి బలి ఇచ్చాడు. భీముడు రథం దిగి గధను భుజం మీద పెట్టుకుని కర్ణుని సైనికులను పదివేల మందిని సంహరించి తిరిగి రథం అధిరోహించాడు. మరొక విల్లు తీసుకుని వాడి అయిన బాణములతో కర్ణుని శరీరం అంతా కొట్టాడు. సాత్యకి, ధృష్టద్యుమ్నులు వేరు విల్లు తీసుకుని కర్ణుని సారధిని చంపి, విల్లు త్రుంచాడు. దుర్యోధనుడు, ద్రోణుడు, జయద్రధుడు వచ్చి కర్ణిడిని అక్కడ నుండి తప్పించారు. ఇరు పక్షములు ఘోర యుద్ధం చేస్తున్నారు. రధ, గజ, తురంగ, పదాతి దళాలు నేలకూలుతున్నాయి. కాలువలై ప్రవహిస్తున్న రక్తంలో శరీరాలు తేలియాడుతున్నాయి. రధ, గజ, తురగ, మానవుల ప్రేవులు మాంసపు ముద్దలు గుట్టలుగా పడుతున్నాయి. రణ భూమి భయానకంగాను, రౌద్రంగాను, భీభత్సంగాను కనపడుతుంది. అర్జునుడు, ద్రోణుడు భీకరంగా యుద్ధం చేస్తుండగా సూర్యుడు పశ్చిమాద్రి చేరుకున్నాడు. రణరంగంలో పడి ఉన్న శవములు తినుటకు గ్రద్దలు ఆకాశంలో తిరుగుతున్నాయి. ఇరు పక్షములు ఆ రోజు యుద్ధం ముగించారు. ఆనందోత్సాహంతో పాండవసేనలు, నిరుత్సాహంతో కురుసేనలు, తమశిబిరాలకు మళ్ళాయి. కురుసైన్యం లోని అందరూ ద్రోణుడు ఆరోజు కూడా తనశపధం నెరవేర్చుకోక పోవడం అర్జునుడి పరాక్రమం కృష్ణుడు తోడు నిలిచి అనుక్షణం కాపాడటం గురించి చర్చించుకోసాగారు.
సుయోధనుడు ద్రోణుని నిందించుట
ఆ సమయంలో సుయోధనుడు ద్రోణుని చూసి " ఆచార్యా ! ధర్మరాజును పట్టి బంధిస్తానని నాకు వరం ఇచ్చారు. రెండు రోజులైనా మీ మాట చెల్లించుకోలేక పోయారు. ధర్మజుడు చేజిక్కినా మీరు ఆ అవకాశం చేజార్చుకున్నారు. లోకుల దృష్టిలో మీరు నేను అసమర్ధులం అయ్యాము. ఈ విధంగా కుటిల వ్యర్ధమైన మాటలతో ప్రయోజనమేమిటి ? మీ వంటి ఆశ్రిత గుణశ్రేష్టుడు ఇలా వంచించ తగునా ? " అని కర్ణ కఠోరంగా పలికాడు. ద్రోణుడు సుయోధనుని మాటలకు నొచ్చుకున్నా అది బయట పడనీయక " సుయోధనా ! నరుని పరాక్రమము, నారాయణుని మహిమ తెలిసీ నీవు నన్ను నిందించ తగదు. నిన్న ఈ రోజు ధర్మజుని వదిలి అర్జునుడు ఒక్క క్షణమైనా ఉన్నారా! రేపటి రోజు అర్జునుడిని రణరంగం నుండి తీసుకు పోవుటకు ఎవరినైనా నియోగింపుము. నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చెదను. నవ్వునకైనా నా నోట అసత్యము రాదు. గుర్తు పెట్టుకో నేను నా ప్రతిజ్ఞ వెరవేర్చుకుంటాను " అన్నాడు ద్రోణుడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన సంశక్తులు "సుయోధనా ! అర్జునుడిని మరల్పగల ధైర్యం మాకు దక్క వేరెవరికి ఉంది " అని ప్రగల్భములు పలికారు.