- ధృతరాష్ట్రుడు ఆరవరోజు యుద్ధంలో తనకుమారులు వెనుక పడినందుకు ఖేదపడి మిగిలిన విషయాలు చెప్పమని సంజయుని కోరాడు. సంజయుడు " మహారాజా ! నీ కుమారుడైన సుయోధనుడు పితామహుని వద్దకు వెళ్ళి " పితామహా ! పాండవ బలం రోజురోజుకు పెరిగి పోతుంది. ఈ రోజు నేను నీముందే భీముని చేతిలో భంగపడ్డాను. ఇంతకంటే అవమానం ఏమున్నది. కుంతీ తనయులను నీ సాయంతో గెలుస్తానని అనుకున్నాను. నీవేమో పాండుసుతులను అడ్డలేక పోతున్నావు. వారికింత బలం ఎలా వచ్చింది. భీష్ముడు " సుయోధనా! నన్నేల నిందించెదవు. నేను నా శాయశక్తులా యుద్ధం చేస్తూనే ఉన్నాను. నేను నీకు ముందే చెప్పాను పాండుసుతులను గెలవడం సులభ సాధ్యం కాదని అయినా నీవు నామాటను లక్ష్య పెట్ట లేదు. అయినా నేను నీకు విజయం కలిగేలా యుద్ధం చేస్తాను " ఆ మాటలకు సుయోధనుడు కొంత ఊరట చెందాడు. మరునాడు యుద్ధంలో కురు సైన్యాలు మండల వ్యూహంలో నిలిచాయి. నీ కుమారులంతా అతనికి ఇరువైపులా పుట్టారు. ఇది చూసిన యుధిష్టరుడు ధృష్టద్యుమ్నునితో చెప్పి తన సైన్యాలను వజ్రవ్యూహంలో నిలిపాడు. తూర్యనాదాల నడుమ ఏడవ రోజు యుద్ధం ఆరంభమైంది. ద్రోణుడు విరాటుని, అశ్వథ్థామ శిఖండిని, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుని, శల్యుడు నకుల సహదేవులను, విందాను విందులు యుధామన్యుని, పెక్కు మంది రాజులు అర్జునిని ఎదుర్కొన్నారు. భీమసేనుడు కృతవర్మను, అభిమన్యుడు చిత్రసేన, దుశ్శాసన, వికర్ణులను, అలంబసుడు సాత్యకిని, ధృష్ట కేతువు భూరిశ్రవుని, చేకితానుడు కృపాచార్యుని, ధర్మరాజు శ్రుతాయువును, పలువురు రాజులు భీష్ముని ఎదుర్కొన్నారు.
అర్జునిని ప్రతాపం
తన మీదకు వచ్చిన రాజులను అర్జునుడు రెండు చేతులతో గాండీవం నుండి బాణాలను వదులుతూ శరవర్షం కురిపిస్తున్నారు. వారంతా ఒక్క పెట్టున విజృంభించి కృష్ణార్జునులను తమ బాణాలతో ముంచెత్తారు. అది చూసిన నీ కుమారులు జయజయధ్వానాలు చేసారు. అప్పుడు అర్జునుడు కోపించి మహేంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం కౌరవ సేనలు ప్రయోగించిన అస్త్రములను చీల్చి చెండాడి, వార రథాశ్వాలను చంపి మంధరపర్వతం పాలసముద్రాన్ని చిలికినట్లు కౌరవ సేనలను కలచి వేసింది. మహేంద్రాస్త్రం ధాటికి తట్టుకోలేని కౌరవ సేన భీష్ముని వెనుకకు చేరింది. త్రిగర్తాధీశులు తమ సైన్య స్మేతంగా పక్కకు వెళ్ళారు. భీష్ముడు మాత్రమే అర్జునిని ముందుకు వెళ్ళి నిలిచాడు. ఇది చూసిన సుయోధనుడు " కౌరవ యోధులారా ! తాత భీష్ముని ఒంటరిగా వదిలి పారిపోతున్నారా మీ వంటి వారు ఎక్కడైనా ఉంటారా ! వెళ్ళండి భీష్మునకు తోడుగా ఉండండి " అని అరిచాడు. రోషం వచ్చి కౌరవ సేనలు భీష్మునికి సాయంగా నిలిచాయి.
ద్రోణ విరాటుల పోరు
ద్రోణుడు విరాటుని విల్లును, ధ్వజమును రెండు బాణాలతో విరిచాడు. విరాటుడు మరొక బాణముతో ద్రోణుని శరీరంలో శరములు దించాడు. ద్రోణుని రథసారథిని చంపాడు, మరొక నాలుగు బాణములను వేసి ద్రోణుని విల్లు విరిచాడు. ద్రోణుడు కోపించి ఎనిమిది బాణాలను ప్రయోగించి విరాటుని రథాశ్వములను చంపాడు. రథమును కూల్చాడు. విరాటుడు తన కుమారుడైన శంఖుని రథాన్ని అధిరోహించి ద్రోణునిపై శరవర్షం గుప్పించాడు. వెంటనే ద్రోణుడు ఒక దివ్యాస్త్రాన్ని స్మరించి శంఖుని కొట్టాడు. ఆ బాణం శంఖుని గుండెలను చీల్చింది. శంఖుడు రథంపై వాలి మరణించాడు. తన కుమారుని మరణానికి ఖేదపడిన విరాటుడు చేసేది ఏమి లేక తన సైన్యాలను తీసుకుని పారిపోయాడు. అది చూసిన శిఖండి అశ్వథ్థామ ఫాలభాగమున మూడు బాణములు నాటాడు. అశ్వథ్థామ కోపించి తన బాణపరపరతో శిఖండి రథాశ్వములను చంపి, సారథిని చంపి, విల్లును విరిచి, కేతనమును విరిచాడు. శిఖండి రథం దిగి కత్తి దీసి అశ్వథ్థామ బాణములను అడ్డుకున్నాడు. అశ్వత్థామ బాణము ప్రయోగించి శిఖండి కత్తిని ఖండించాడు. శిఖండి వెంటనే సాత్యకి రథం ఎక్కాడు.
దుర్యోధన ధృష్టద్యుమ్నుల పోరు
ధృష్టద్యుమ్నుడు సుయోధనునిపై శరవర్షం కురిపించాడు. సుయోధనుడు వాటినిమధ్యలోనే త్రుంచి ధృష్టద్యుమ్నునిపై అతి క్రూరమైన బాణప్రయోగం చేసాడు. ధృష్టద్యుమ్నుడు కోపించి సుయోధనుని విల్లు విరిచాడు అతడు మరొక విల్లు తీసుకునే లోపే దానిని కూడా త్రుంచి వేసి అతడి రథాశ్వములను చంపి, రథం విరుగ కొట్టాడు. సుయోధనుడు తన కరవాలము తీసుకుని నేలపై దుముకి ధృష్టద్యుమ్నిపై దూకాడు. అంతలో శకుని వచ్చి సుయోధనుని తన రథం పై ఎక్కించుకుని వెళ్ళాడు. సాత్యకి అలంబసునిపై అతి క్రూర బాణ ప్రయోగం చేసాడు. అలంబసుడు సాత్యకిపై అర్ధ చంద్రాకార బాణ ప్రయోగం చేసి సాత్యకి విల్లు విరిచి, అతడి శరీరాన్ని శరములతో తూట్లు చేసాడు. అప్పుడు సాత్యకి ఇంద్రాస్త్రం ప్రయోగించి అలంబసుని మాయలు మటుమాయం చేసి అలంబసుని ముప్పతిప్పలు పెట్టి సింహ నాదం చేసాడు. అలంబసుడు అక్కడి నుండి పారి పోయాడు. సాత్యకి కురు సేనలపై విరుచుకు పడ్డాడు. కృతవర్మ భీమసేనునితో పోరు సల్ప సాగాడు. భీముడు కృతవర్మ రథాశ్వములను చంపి, సారథిని చంపి, రథమును విరుగకొట్టి కృతవర్మ శరీరమంతా బాణములతో ముంచెత్తాడు. కృతవర్మ వృషకుని రథం ఎక్కి అక్కడి నుండి వెళ్ళాడు. భీమసేనుడు కృతవర్మను వదిలి కురు సేలపై విరుచుకుబడ్డాడు. ఇది విన్న ధృతరాష్ట్రుడు " సంజయా ! నువ్వు ఎప్పుడూ కౌరవ సేనల రధములు విరిగాయి, కౌరవులు చచ్చారు అని మన వారి వినాశనం గురించి చెప్తావు పాండవ సేనలో వినాశనం జరగ లేదా ? ఎప్పుడూ వారి విజయులైనట్లు చెబుతావేమి ఇదేమి మాయ " అని వాపోయాడు. సంజయుడు " మహారాజా ! కౌరవ సేనలు కూడా వారి శక్తివంచన లేకుండా పోరుతున్నాయి. కాని సముద్రంలో కలసిన నదుల వలె దాని స్వరూపం మారి పోతుంది పాండవ బలమునకు తాళ లేక పోతున్నారు. అది వారి తప్పు కాదు నువ్వు నీ కుమారుడు చేసిన తప్పుకు వారిని నిందించి ప్రయోజనం లేదు " అన్నాడు. అవంతీ దేశాధీసులగు విందాను విందులను యుధామన్యుడు శరపరంపరతో కప్పేసాడు. అనువిందుడు విందుని రథం ఎక్కాడు. యుధామన్యుడు అనువిందుని రథ సారథిని చంపాడు. రథాశ్వములు చెదిరి పోగా వారి సైన్యాలు కకావికలు అయ్యాయి. మరొక చోట భగదత్తుని ధాటికి పాండవ సేనలు చెదిరి పోగా ఘటోత్కచుడు అడ్డుకుని సేనలకు ధైర్యం చెప్పి యుద్ధోన్ముఖులను చేసాడు. ఘతోత్కచుడు భగదత్తునిపై శరవర్షం కురిపించాడు. భగదత్తుడు వాటిని మధ్యలోనే త్రుంచి వేసి పదు నాలుగు బాణములను ఘతోత్కచునిపై ప్రయోగించాడు. ఘటోత్కచుడు శక్తి ఆయుధమును ప్రయోగించగా భగదత్తుడు దానిని మధ్యలోనే త్రుంచి ఘతోత్కచునిపై బాణపరంపరతో నొపించాడు. భగదత్తుని ధాటికి ఆగలేని ఘతోత్కచుడు పారిపోగా భగదత్తుడు పాండవ సేనపై విరుచుకు పడ్డాడు. శల్యునిపై నకులసహదేవులు శరములు గుప్పించారు. శల్యుడు బెదరక నకులుని రథం విరిచాడు. నకులుడు సహదేవుని రథం ఎక్కి శల్యునిపై ఒక క్రూర బాణం వేసి అతడిని మూర్చిల్ల చేసాడు. శల్యుడు రథంపై పడి పోగానే సారథి రథాన్ని పక్కకు తీసుకు వెళ్ళాడు. నకుల సహదేవులు సింహనాదం చేసి శంఖనాదం చేసారు.
శ్రుతాయువుపై ధర్మరాజు విజయం
యుధిష్టరుడు శ్రుతాయువు మీద తొమ్మిది శమములు ప్రయోగించాడు. శ్రుతాయువు వాటిని త్రుంచి వేసి ఏడు బాణాలు యుధిష్టరుని మీద వేసాడు. యుధిష్టరుడు కోపించి వరాహముఖాన్ని కర్ణమును పోలిన నారాచబాణాన్ని ప్రయోగించి శ్రుతాయువు వక్షస్తలాన్ని చీల్చాడు. మరొక బాణముతో అతని కేతనమును విరిచాడు. శ్రుతాయువు ఏడు బాణములు ప్రయోగించి ధర్మరాజును బాధించాడు. ధర్మరాజు మహోగ్రుడై శ్రుతాయువు రథముకు కట్టిన గుర్రములను చంపి, విల్లు విరిచి, కేతనమును విరిచి, అతని శరీరాన్ని రక్తసిక్తం చేసాడు. శ్రుతాయువు బెదిరి పారిపోయాడు. అది చూసిన కౌరవసేన కకావికలై పోగా పాండవ సేనలు జయధ్వానాలు చేసారు. కృపాచార్యుడు చేకితానుడితో పోరుతున్నాడు. చేకితానుడు కృపాచార్యునిపై నిశిత బాణములు ప్రయోగించగా, కృపాచార్యుడు చేకితానుని రథాశ్వములను చంపాడు. చేకితానుడు గదాయుధంతో కృపాచార్యుని రథం విరుగకొట్టి, రథముకు కట్టిన హయములను చంపాడు. కృపాచార్యుడు చేకితానుని పదహారు నిశిత బాణములతో కొట్టాడు. చేకితానుడు కృపాచార్యునిపై గదను విసిరాడు. కృపాచార్యుడు ఆ గదను మధ్యలో త్రుంచి వేసాడు చేకితానుడు రథము దిగి వాడి అయిన ఖ్డ్గం తీసుకున్నాడు. అది చూసిన కృపాచార్యుడు ఖడ్గం తీసుకుని చేకితానునిపై కలియపడ్డాడు. ఒకరికొకరు గాయపరచుకుని ఇరువురు మూర్చిల్లాడు. అది చూసి కౌరవ సేన నుండి శకుని కృపాచార్యుని, పాండవ సేన నుండి కరకర్షణుడు వచ్చి చేకితానుడిని రథముల మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళారు. ధృష్టకేతు భూరిశ్రవునితో ఘోరయుద్ధం సాగిస్తున్నాడు. ధృష్టకేతు భూరిశ్రవునిపై తొమ్మిది బాణములు వేసాడు. భూరిశ్రవనుడు కోపించి ధృష్టకేతుని రథాశ్వములను చంపి అతడిపై కరకుటమ్ములు ప్రయోగించాడు. అలసి పోయిన ధృష్టకేతు శతానీకుని రథముపై ఎక్కి అవతలకు వెళ్ళాడు. అభిమన్యునికి వికర్ణ, చిత్రసేన, దుశ్శాసనుల మధ్య భయంకర పోరు సాగుతుంది. అభిమన్యుడు వారందరి రథములను విరుగకొట్టి వారిని చంపకుండా భీమసేనుని శపథం గుర్తుకు వచ్చి విడిచి పెట్టాడు. ఇది గమనించిన భీష్ముడు దుశ్శాసనునికి సాయంగా వచ్చాడు. ఒంటరిగా ఉన్న అభిమన్యునికి తోడుగా అర్జునుడు తన రథముతో అక్కడకు వచ్చాడు. త్రిగర్తాధిపతి అర్జునిని అడ్డగించి ఎదుర్కొన్నాడు. అర్జునుడు " మీరు కౌరవ సేనలో మేటి వీరులని విన్నాను భయము వదిలి నాతో యుధం చెయ్యి " అని అతనిపై శరవర్షం కురిపించాడు. అది గమనించిన కురు సైన్యం ఒక్క పెట్టున అర్జునిపై పడింది. పాండవ సైన్యం అర్జునునికి సాయంగా వచ్చాయి. పోరు ఘోరమైంది. అర్జునుడు తన నిశిత శరాఘాతముతో కౌరవ వీరుల రథముకు కట్టిన హయములను చంపుతూ, రథములను విరుగ కొడుతూ, కేతనములు విరుస్తూ, విల్లులను విరుస్తూ యుద్ధరంగమంతా స్వేచ్ఛగా విహరిస్తున్నారు.
సాయంకాలాంతర పోరు
త్రిగర్తాధీశుడు తన చక్రరక్షకులైన ముప్పై రెండు మందిని అర్జునినిపై పంపాడు. అర్జునుడు అరవై నాలుగు బాణము ప్రయోగించి వారిని చంపాడు. త్రిగర్తాధీశుడు స్వయంగా అర్జునితో తలపడ్డాడు. ఇంతలో శిఖండి మధ్యలో అడ్డుకుని సుశర్మను ఎదుర్కొన్నాడు. తనకు ఎదురుగా దుర్యోధనుడు ఉన్నా అతడిని దాటి భీష్ముని ఎదుర్కొన్నాడు అర్జునుడు. తన మీదకు వస్తున్న శల్యుని విడిచి భీమ, నకులసహదేవులతో కూడి అర్జునినికి సాయంగా వెళ్ళాడు ధర్మరాజు. పాడవులతో భీష్ముడు పోరు సాగిస్తున్నాడు. ఇంతలో నీ కుమారుడు సుయోధనుడు సైంధవునితో చేరి పాండవులను ఎదుర్కొన్నాడు. శలుడు, శల్యుడు, చిత్రసేనులు కృపాచార్యునితో చేరి పాడవులను ఎదుర్కోడానికి చేరారు. ఇంతలో శిఖండి భీష్ముని ఎదుర్కొన్నాడు. భీష్ముడు శిఖండితో యుద్ధం చేయక అతడి విల్లును త్రుంచి పక్కకు పోయాడు. ఇది చూసిన యుధిష్టరుడు " శిఖండీ భీష్ముని చంపుతానని శపధం చేసావుగా మరిచావా!" అని అరిచాడు. ఆ మాటలు విని శిఖండి భీష్మునిపై శరవర్షం కురిపించాడు. అది చూసిన శల్యుడు శిఖండిపై అగ్నేయాస్త్రాన్ని వేసాడు. శిఖండి బెదరక శల్యునిపై వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. భీష్ముడు ధర్మరాజు విల్లు విరిచి, కేతనమును విరిచాడు. అది చూసిన భీముడు తన రథం దిగి సుయోధనుని మీదకు వెళ్ళాడు. సైంధవుడు అయిదు వందల వాడి బాణములను భీమునిపై ప్రయోగించాడు. భీముడు నిర్లక్ష్యంతో వాటిని తన గధతో త్రుంచి సైంధవుని రథాశ్వాలను చంపి, రథం విరిచాడు. సైంధవుడు వేరొక రథం ఎక్కి పారిపోయాడు. అతనితో కౌరవ సైన్యం పారి పోయింది. ఇది చూసిన సుయోధనుడు పారిపోవద్దని తన సైన్యాలను వారిస్తూ భీమునితో తలపడ్డాడు. ఇంతలో చిత్రసేనుడు భీముని అడ్డుకుని శక్తి ఆయుధాన్ని భీమునిపై ప్రయోగించాడు. భీముడు తనగధను శక్తి ఆయుధంపై విసిరాడు. అది గిరగిరా తిరుగుట చూసిన కౌరవులుది ఎవరి మీద పడుతుందో తెలియక భీతి చెంది రారాజు మాట వినక పారిపోసాగారు. ఆ గధ తన మీదకు రావడం చూసి చిత్రసేనుడు రథం దిగి పారిపోయాడు. ఆ గధ చిత్రసేనుని రథాన్ని అశ్వములతో సహా నుగ్గు చేసింది. వికర్ణుడు చిత్రసేనుని తన రథంపై ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. భీష్ముడు ధర్మతనయుని రథాశ్వాలను చంపి అతడి శరీరాన్ని శరపరంపరతో గాయపరిచాడు. ధర్మనందనుడు కోపించి శక్తి ఆయుధాన్ని భీష్మునిపై ప్రయోగించాడు. భీష్ముడు శక్తి ఆయుధాన్ని త్రుంచాడు. ధర్మనందనుడు నకులసహదేవుల రథాన్ని అధిరోహించాడు. భీష్ముడు నకులసహదేవుల మీద శరసంధానం చేసి వారిని నొప్పించాడు. ధర్మనందనుని ఆదేశంపై పాండవ సేనలోని రాజులంతా తమ సైన్యాలతో భీష్ముని ఎదుర్కొన్నారు. భీష్ముడు జంకక పాండవ సేనలోని వారి తలలను ఖండిస్తూ స్వైర విహారం చేయడం పాండవ సేనను ఆశ్చర్యచకితులని చేసింది. ఇంతలో శిఖండి భీష్మునిపై నిశితశరములను వేసాడు. భీష్ముడు వాటిని, లక్ష్యపెట్టక పాండవ సైన్యాలను చెండాడుతున్నాడు. కురు సేనలను తనుమాడుతున్న సాత్యకి, ధృష్టద్యుమ్నులను విందాను విందులు ఎదుర్కొని ధృష్టద్యుమ్నుని రథాశ్వాలను చంపారు. విరధుడైన ధృష్టద్యుమ్నుడు సాత్యకి రథం ఎక్కాడు. ఇది చూసిన ధర్మరాజు వారికి సాయంగా వచ్చాడు. రారాజు తన సైన్యములకు ధర్మరాజును ఎదుర్కొనమని సైగ చేసి తాను కూడా భీష్మ, ద్రోణులతో చేరి ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మజునికి సాయంగా వచ్చిన అర్జునినిపై ద్రోణుడు క్రూర బాణప్రయోగం చేసాడు. ఇది గమనించిన కౌరవసేనలు ఇనుమడించిన ఉత్సాహంతో పాండవ సైన్యాలను ఎదుర్కొన సాగారు. ధర్మరాజు తన సేనలకు ధైర్యం కలిగిస్తూ యుద్ధానికి పురికొల్పాడు. ఇరు సైన్యాలు ఘోరమైన పోరు సాగిస్తుండగా సూర్యుడు అస్తమించసాగాడు. త్రిగర్తాధీశుడు సుశర్మ, సైంధవుడు మొదలైన ప్రముఖులను ఓడించి ధర్మరాజుకు ఆనందం కలిగించాడు. అన్నగారికి బాసటగా నిలిచి భీమసేనుడు కురుసేనలను తనుమాడాడు. ఆ రోజుకు యుద్ధం చాలించి అందరూ శిబిరాలను చేరారు.
ఎనిమిదవరోజు యుద్ధం
ఎనిమిదవ రోజు యుద్ధానికి కురు సైన్యాలు కూర్మ వ్యూహంలోను పాండవ సేనలు శృంగాటక వ్యూహములో నిలిచాయి. ఇరు పక్షసైన్యాలు భేరి మృదంగనాద్యాల మధ్య యుద్ధానికి సన్నధమైయ్యాయి. హయములు, ఏనుగులు, రథములు, కాల్బముల రణరంగ విహారంతో రణభూమిలో దుమ్ము ఆకాశాన్ని కప్పింది. భీష్ముడు సింహనాదం చేస్తూ పాడవ సైన్యంలో చొచ్చుకుని వెళ్ళి వీరవిహారం చేయసాగాడు. భీష్ముని పరాక్రమానికి ఆగలేక పాండవ సేనలు పలాయనం చిత్తగించాయి. అది చూసిన భీమసేనుడు ఆగ్రహంతో భీష్ముని ఎదుర్కొని ఒకే బాణంతో భీష్ముని సారథిని చంపాడు. భీష్ముని అశ్వములు పట్టుతప్పి ఇష్టం వచ్చినట్లు పరుగెత్తాయి. అది చూసిన పాడవ సేనలు జయజయ ధ్వానాలు చేసాయి. అది చూసి నీ కుమారుడు సునాభుడు అమితపరాక్రమంతో భీమసేనుని ఎదుర్కొన్నాడు. భీమసేనుడు ఒకే బాణంతో సునాభుని తల నరికి భీకరంగా సింహనాదం చేసాడు. అది చూసి ఖిన్నులైన నీ కుమారులు ఆదిత్యకేతుడు, అపరాజితుడు, బహ్వాసి, పండితుడు, కుండధారుడు, వశాలాక్షుడు, మహోదరుడు ఒక్కుమ్మడిగా భీమసేనునిపై పడ్డారు. తమ తమ బాణములతో భీమసేనుని శరీరమును కొట్టారు. భీమసేనుడు జంకకుండా వారి మీద అతి క్రూర బాణములు ప్రయోగించి అర్ధ చంద్రాకార బాణములతో వారినందరిని యమసదనమునకు పంపాడు. ఇది చూసి నీ కుమారులు " నాడు కురు సభలో చేసిన శపధం భీమసేనుడు ఈ రోజే తీర్చుకునేలా ఉంది " అనుకుని " విదురుని ని పలుకులు సత్యము ఔతున్నాయి " అని మనసులో అనుకుని భీమసేనుని ధాటికి తాళలేక పారిపోయారు.
సుయోధనుడు కలవరపడుట
సుయోధనుడు భీష్ముని చూసి " తాతా చూచితిరా ! భీమసేనుడు నా తమ్ములను అందరిని చంపుతుంటే మీరంతా చూస్తూ ఊరకుంటారా. మీకు పౌరుషం రాలేదా మిగిలిన వారి చావు కోరి మౌనంగా చూస్తున్నారా " అని వాపోయాడు. సుయోధనుని మాటలకు భీష్ముడు చలించి పోయి " సుయోధనా నేను నీకు ముందే చెప్పాను. నీ తమ్ములలో ఎవరు భీమసేనునికి ఎదురైనా వారిని రక్షించడం నాకే కాదు ఎవరికి తరం కాదు. ఇందుకు చింతించి ప్రయోజనం లేదు. యుద్ధంలో మరణించిన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందన్న ఒకే ఆశతో పోరాడటమే మనకున్న ఒకే మార్గం. శక్తి కొలది పోరాడుతాము విజయం మనలను వరించ వచ్చు కదా! " అన్నాడు " అన్న సంజయుని పలుకులు విని దృతరాష్ట్రుడు " అయ్యో ! ఎంతటి దురవస్థ దాపురించింది. భీష్మ ద్రోణలు ఉండి కూడా నా కుమారులు భీముని చేత దారుణంగా చంపబడ్డారే. వగచి లాభమేమి నా మాట వినక సుయోధనుడు తమ్ముల మరణం కొని తెచ్చుకున్నాడు " అని దుఃఖించాడు. సంజయుడు తిరిగి చెప్పసాగాడు. " భీష్ముడుని కురుకుమారుల మరణం ఆగ్రహోదగ్రుని చేసింది. అతడు భీముని వైపు పోవడం చూసిన ధర్మరాజు ధృష్టద్యుమ్నుని, సాత్యకిని, శిఖండిని భీమునికి సాయంగా పిలిచాడు. సుయోధన ప్రేరేపిత రథికులు అర్జునిని ఎదుర్కొన్నారు. చేకితానుడు, ద్రౌపదీ తనయులు అర్జునినికి సాయంరాగా అర్జునుడు కురు సైన్యాలపై విరుచుకు పడ్డాడు. అభిమన్యుడు, ఘటోత్కచుడు కురు సైన్యాలపై విరుచుకు పడుతున్నారు. ద్రోణాచార్యులు చిత్రవిచిత్ర రీతుల రథాన్ని నడుపుతూ ద్రుపదుని సేనలపై శరవర్షం కురిపిస్తున్నాడు. భీమసేనుడు తన నిశిత శరములతో కౌరవ గజబలమును నేల కూలుస్తున్నాడు. నకులసహదేవులు తమకరవాలంతో కౌరవ అశ్వదళమును మట్టుపెడుతున్నారు.
ఇరావంతుని పరాక్రమం
అర్జున ఉలూచిల కుమారుడు ఇరావంతుడు తన అశ్విక దళంతో కౌరవ సైన్యమును చుట్టుముట్టాడు. అది చూసిన శకుని తమ్ములు శుకుడు, శర్మవంతుడు, వృషకుడు, ఆర్జవుడు, గజుడు, గవాక్షుడు అను ఆరుగురు తమ అశ్వ సైన్యంతో ఇరావంతుని ఎదుర్కొని ఘోరంగా పోరుతున్నాడు. శకుని తమ్ములు ఇరావంతుని అశ్వమును చంపారు. ఇరావంతుడు తన అశ్వమును దిగి కరవాలంతో యుద్ధం చేస్తున్నాడు. శకుని తమ్ములు కూడా కిందకు దిగి ఇరావంతుని ఎదుర్కొన్నారు. ఇరావంతుడు రకరకముల విన్యాసములు చేస్తూ శకుని తమ్ములతో యుద్ధం చేస్తూ అదను చూసి వారిని పన్నెండు ముక్కలుగా నరికాడు. అది చూసిన సుయోధనుడు అలంబసుని పిలిచి " అలంబసా ! వీడు ఈ రోజే మనసైన్యాలను నాశనం చాసేలా ఉన్నాడు. వెంటనే నీవు అతడిని ఎదుర్కొని హతమార్చు " అని చెప్పాడు. అలంబసుడు ఇరావంతునికి సమాంతరంగా మరొక అశ్వబలమును సృష్టించాడు. రెండు దళాలు ఒకదానితో ఒకటి పోటీ పడి నశించాయి. ఇరావంతుడు ఒంటరిగా పోరాడుతూ అలంబసుని ఖడ్గం, విల్లు విరిచాడు. అలంబసుడు ఆకాశానికి ఎగిరాడు. ఇరావంతుడు ఆకాశానికి ఎగిరి అలంబసునితో మాయా యుద్ధం చేస్తున్నాడు. ఇరావంతుడు అలంబసుని తల నరికాడు. అయినా అతడు చావ లేదు. ఇరావంతుడు తన తల్లిని, తాతాగారిని తలచుకుని విషనాగులను సృష్టించాడు. అలంబసుడు డేగరూపం ధరించి ఆ నాగులను చంపి వెంటనే ఇరావంతుని తల నరికాడు. ఇరావంతుడు మరణించాడు.
ఘటోత్కచుని పోరు
ఇరావంతుని మరణం చూసి ఘటోత్కచుడు తన రాక్షస సైన్యంతో కౌరవ సన్యంతో తలపడ్డాడు. తన శూలాయుధంతో గజ, అశ్వ, పదాతి దళాలను గుచ్చి పైకెత్తి నేలకేసి బాది చంపుతున్నాడు. అందరిని మూకుమ్మడిగా చంపుతున్నాడు. ఇది చూసి సుయోధనుడు, వంగదేశాధిపతి తమ గజ సైన్యంతో ఘటోత్కచుని ఎదుర్కొన్నారు. ఆ గజబలమును చూసిన ఘటోత్కచుడు పొంగి పోయి భుజములు చరిచి కరవాలంతో గజముల తొండములను, దంతములను, శిరములను ఖండించసాగాడు. ఇది చూసిన సుయోధనుడు తానే ఘటోత్కచుని ఎదుర్కొని అతని ప్రధాన అనుచరులైన వేదవంతుడు, విద్యుత్జిహ్వుడు, బహ్వాసి మొదలగు వారిని చంపి ఘటోత్కచుని శరీరాన్ని శరములతో కప్పాడు. ఘటోత్కచుడు కూడా విల్లు అందుకుని సుయోధనునిపై శరవర్షం కురిపించి సుయోధనునితో " సుయోధనా ! నాడు నిండు సభలో ధర్మం మరిచి నా తాల్లి పాండవుల సతి అయిన ద్రౌపదీ మాతను అవమానపరిచావు. అందుకు ప్రతి ఫలం అనుభవించు " అని నల్ల త్రాచుల వంటి బాణములను సుయోధనుని పై ప్రయోగించాడు. సుయోధనుడు వాటిని మధ్యలో త్రుంచి ఇరవై ఉగ్రమైన శరములను ఘటోత్కచునిపై వేసాడు. ఘటోత్కచుడు శక్తి ఆయుధమును సుయోధనునిపై ప్రయోగించాడు. వంగ దేశాధిపతి శక్తి ఆయుధాన్ని ఎదుర్కొన్నాడు. ఆ ఆయుధము వంగరాజు గజమును చీల్చి వేసింది. వంగరాజు పారిపోయి ప్రాణములు దక్కించుకున్నాడు. ఇది చూసి అతడి సైన్యం హాహా కారాలు చేస్తూ పారి పోయారు. సుయోధనుడు ధైర్యంగా ఘతోత్కచుని ఎదుర్కొని తాను నేర్చిన అన్ని అస్త్రములు ప్రయోగించి ఘటోత్కచుని ఎదుర్కొన్నాడు. వాటిన్నంటిని ఆకాశంలో పొడి చేసి ఘటోత్కచుడు సింహనాదం చేసాడు. అది విన్న భీష్ముడు " ఘతోత్కచుడు దేవతలకు కూడా అజేయుడు సుయోధనుని అతడి బారి నుండి రక్షించండి " అని అరిచాడు. అది విని ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, చిత్రసేనుడు, బృహద్బలుడు, బాహ్లికుడు, అవంతి నాధుడు, భూరిశ్రవుడు, సైంధవుడు, సోమదత్తుడు, వివిశంతి, వికర్ణుడు ఒక్కుమ్మడిగా రథములు నడుపుతూ నీ కుమారునికి రక్షణగా నిలిచి ఘటోత్కచునితో పోరాడుతున్నారు. వారిని చూచి ఘటోత్కచుడు రెట్టించిన ఉత్సాహంతో వారందరి మీద తన నిశిత శరములు కురిపించాడు. వారి రథ సారధులను చంపి, విల్లులు విరిచి, రథములను విరిచి వారిని చికాకు పరిచాడు. ద్రోణాచార్యుడు మొదలైనా పన్నెండు మంది ఘటోత్కచునిపై మహాస్త్రాలు ప్రయోగించాడు. ఘటోత్కచుడు ఆకాశానికి ఎగిరి మాయా యుద్ధం చేయసాగాడు.
భీమసేనుని పరాక్రమం
ఇది చూసిన ధర్మరాజు భీముని చూసి " అర్జునుడు భీష్ముని ఎదుర్కొంటున్నాడు. నీవు వెళ్ళి ద్రోణాదులతో పోరుతున్న ఘటోత్కచుని రక్షించు " అన్నాడు. సుయోధనుడు ఒక అర్ధచంద్రాకార బాణమును ఘటోత్కచునిపై వేసాడు. సింహ నాదం చేసుకుంటూ అక్కడుకు చేరిన భీమసేనుని ధనస్సును సుయోధనుడు ఖండించాడు. మరొక నారాచ బాణమును ప్రయోగించి భీముని వక్షష్తలము మీద కొట్టాడు. ఆ దెబ్బకు భీమసేనుడు దిమ్మెర పోయాడు. అది చూసిన ద్రౌపదీ సుతులు సుయోధనుని ఎదుర్కొన్నాడు. ఇంతలో అభిమన్యుడు, ఘటోత్కచుడు వారికి సాయం వచ్చారు. అందరూ కలిసి సుయోధనునిపై నిశితమైన శరవర్షం కురిపించారు. కృపాచార్యుడు, బాహ్లికుడు, భూరిశ్రవనుడు మొదలైన కురు వీరులు పాండుకుమారులను ఎదుర్కొన్నారు. ఇంతలో భీమసేనుడు తేరుకుని తిరిగి శత్రువుల మీద లంఘించాడు. ద్రోణుడు క్రూర శరములతో భీమసేనుని కొట్టాడు. భీమసేనుడు నారాచబాణముతో ద్రోణుని గుండేకు గురిపెట్టి కొట్టాడు. ఆ బాణముల ధాటికి ద్రోణుడు మూర్చిల్లాడు. తండ్రి అవస్థ చూసిన అశ్వత్థామ, సుయోధనులు తమ బలగంతో వచ్చి భీమసేనుని ఎదుర్కొని శక్తి వంతమైన బాణములు భీమునిపై ప్రయోగించారు. భీముడు రథము నుండి కిందకు దూకి ఆ బాణములను తన గధాయుధంతో చిన్నాభిన్నం చేస్తున్నాడు. ఇంతలో ద్రోణుడు తేరుకుని వచ్చి భీమునిపై శరపరంపర కురిపించాడు. ఇది గమనించిన అభిమన్యుడు, ఘతోత్కచుడు, ద్రౌపదీ సుతులు భీమునికి సాయంగా వచ్చారు. భీమసేనుని మిత్రుడు నీలుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ వాడి అయిన బాణములు ప్రయోగించి నీలుని తీవ్రంగా గాయపరిచాడు. ఇది చూసిన ఘటోత్కచుడు అశ్వత్థామ మీద శరవర్షం కురిపించాడు. ద్రోణుడు ఘటోత్కచుని క్రూరమైన బాణములతో నిలువెల్లా కొట్టాడు. ఘటోత్కచుడు మాయా యుద్ధం ప్రారంభించాడు. తన అపూర్వ మాయా శక్తితో ద్రోణుడు, సుయోధనుడు, కృపాచార్యుడు మొదలైన వారు తన బాణములకు తీవ్రంగా గాయపడి రక్తం ఓడుతున్నట్లు కౌరవ సేనలకు తెలిసేలా చేసాడు. అది చూసిన కౌరవ సేనలు పారిపోసాగారు. అది చూసిన భీష్ముడు " ఆగండి ఇది అంతా రాక్షస మాయ అందరూ క్షేమంగానే ఉన్నారు అని ఎంత చెప్పినా వినక సేనలు యుద్ధ భూమి విడిచి పారిపోసాగాయి. ఇది చూసిన సుయోధనుడు " తాతా ! మీరు ద్రోణాచార్యులు యుద్ధభూమిలో ఉండగానే ఇంత అవమానం జరిగింది కదా. ఇంత కంటే తలవంపులు ఏమున్నాయి. నేను ఒంటరిగానే పాండవులను ఎదుర్కొంటాని విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాను " అన్నాడు. భీష్ముడు " సూయోధనా ! నీవొక్కడివి పాండవులను ఎలా ఎదుర్కొంటావు రాక్షస మాయలు ఎదుర్కోడానికి మేము లేమా నీవు నిశ్చింతగా ఉండు " అని భగదత్తుని చూసి " భగదత్తా ! రాక్షస మాయలు నీ వద్ద పని చేయవు. నీవు పోయి ఘతోత్కచుని ఎదిరించు " అన్నాడు. భీష్ముని మాటలకు భగదత్తుడు పొంగి పోయి సుప్రీతకం అనే ఏనుగును ఎక్కి తన సేనలతో ఘటోత్కచుని ఏదుర్కొన్నాడు. ఇది చూసి కౌరవ సేనలు ధైర్యము తెచ్చుకుని తిరిగి చేరాయి. సాయం సమయం అయింది.
సాయంకాలాంతర యుద్ధము
పర్వతంలాంటి తన ఏనుగును ఎక్కి ఘటోత్కచుడు భగదత్తుని ఎదుర్కొన్నాడు. భీమసేనుడు, అభిమన్యుడు, ద్రౌపదీ సుతులు ఘటోత్కచునికి సాయం వచ్చారు. ఘటోత్కచుడు బల్లెంవంటి బాణమును వేసి భగదత్తుని ఏనుగును గాయపరిచి మరొక శూలమును తీసుకుని భగదత్తుని మీద వేసాడు. దాన్నిని త్రుంచి భగదత్తుడు ఘటోత్కచుని రధాశ్వములను చంపాడు. అభిమన్య , ద్రౌపదీ సుతుల రధాశ్వములను చంపి వారిపై శరవర్షం కురిపించాడు. పాలసముద్రమును మంధర పర్వతం చిలికిన విధంగా పాండవ సేనల మధ్య తిరుగుతూ వారిని చికాకు పరిచాడు. సుప్రీతకము తనకు ఎదురు వచ్చిన హయములను, గజములను , కాల్బలమును కాళ్ళతో తొక్కుతూ విహరింస్తూ ఉండగా సుయోధనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు రధములతో వచ్చి వీర విహారం చేయ సాగారు వారి ధాటికి పాండవ సైన్యాలు బెదిరి పారిపోసాగారు. ఇది చూసిన ధర్మరాజు తన సైన్యాలకు చేయి ఊపి ప్రోత్సహించాడు. అర్జునుడు, పాంచాల భూపతితో చేరి కౌరవ సైన్యాలను ఎదుర్కొన్నారు. అర్జునుడు ధనుష్టంకారం చేస్తూ శంఖమును పూరించుచూ గాండీవం తీసుకుని కురు సేనలపై శరపరంపర కురిపించాడు. అప్పుడు అతడి వద్దకు భీముడు వచ్చి ఇరావంతుని మరణ వార్తను చెప్పాడు. అర్జునుడు ఖిన్నుడై భీముడు దారి చూపగా ఇరావంతుడు పడిఉన్న చోటికి వెళ్ళాడు. తల తెగి నేలపై పడి ఉన్న ఇరావంతుని చూసి కళ్ళ నిండా నీళ్ళు నిండాయి. సుయోధనుని అవినీతి ధర్మతనయుని సంధి ప్రయాత్నములు సుయోధనుని మూర్ఖత్వం తలచుకుని బాధపడ్డాడు. పుత్రశోకంతో అలమటిస్తున్న అర్జునిని చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. కృష్ణుని ఆంతర్యం అర్జునుడు అర్ధం చేసుకున్నాడు. " నా నోటి నుండి గుహ్యమైన యోగ శాస్త్రము విని ఎనిమిది రోజులు అవక మునుపే ఈ విషాదం ఏమిటి " అన్నట్లు ఉంది ఆ నవ్వు. " పరంధామా నీ నోటి వెంట వచ్చిన గీతా శాస్త్రం విని రాగద్వేషములు వదిలాను " అనుకుని కృష్ణుని అడిగి రధమును నడిపించి తన కర్తవ్య నిర్వహణకు వారి మధ్యకు రాగానే కృతవర్మ బాహ్లికుడు అతడిని ఎదుర్కొన్నారు. నీ కుమారుడు ద్రోణునితో చేరి భీముని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు , సుయోధనుడు వేసే బాణాలను మధ్యలో త్రుంచి వేసి నిశిత బాణాలతో భీమసేనుడు వారిని నిశిత బాణాలతో నొప్పించాడు. ఆ శరముల ధాటికి నీ కుమారులైన కుండభేది, అనాదృష్యుడు, కనకథ్వజుడు, విరావి, సుభాహుడు, దీర్ఘబాహుడు, దీర్ఘలోచనుడు మరణించారు. భీమసేనుడు కౌరవ సేనలో ప్రవేశించి దొరికిన వారిని దొరికినట్లు హతమార్స్తున్నాడు. ఇది చూసిన సుయోధనుడు భీతిల్లక తన సేనలను ప్రోత్సహిస్తూ భీమసేనుని ఎదుర్కొన్నాడు. భీమసేనుని పరాక్రమం చూసిన పాండవ సైన్యం విజృంభించి కౌరవ సేనలను చీల్చి చెండాడుతున్నాయి. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. చని పోయిన సైనికుల ఆభరణములతో రణభూమి ప్రకాశించింది. ఇంతలో సూర్యాస్తమయం కావడంతో యుద్ధం చాలించి ఇరు సైన్యాలు తమ నెలవులకు చేరాయి.
తొమ్మిదవ రోజు యుద్ధం
తమ్ముల మరణంతో కలత చెందిన సుయోధనుడు దుశ్శాసనుని పిలిచి వెంటనే కర్ణుని, శకునిని పిలుచుకురమ్మని కబురు పంపాడు. దుశ్శాసనుడు కర్ణ, శకునులతో సుయోధనుని వద్దకు వచ్చాడు. ఏకాంతంలో సుయోధనుడు " తాత భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు తటస్థంగా ఉన్నారు. పాండవులను వారు చంపడం లేదు. పాండవ సైన్యం మన సైన్యం అతి వేగంగా తరిగి పోతుంది ఏమి చేయాలి " అన్నాడు. కర్ణుడు రణక్రీడా ఉత్సాహుడై " సుయోధనా ! భీష్ముని రావద్దని చెపితే నేను రణరంగ ప్రవేశం చేస్తాను. పాండవులూ వారి సేనల మదం అణచగలను " అన్నాడు. ఆ మాటలు విని సుయోధనుడు " దుశ్శాసనా ! తాతగారి వద్దకు వెళ్ళి ఈ విషయం చెబుతాము రా " అని ఇరువురు సుయోధనుని వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి " పితామహా ! మిమ్మలిని నమ్మి యుద్ధానికి దిగాను. కాని మీరు యుద్ధ రంగమున దేవదానవులను దిక్కరించగల మీరు ఏమీ చేయక ఎనిమిది రోజుల నుండి దిక్కులు చూస్తూ పాండవులను చంపక నిరీక్షిస్తున్నారు. అర్జునిని చంపడం మీకు చేతకాలేదు కాని నా తమ్ములు మాత్రం మరణిస్తున్నారు. కనుక మీరు రణరంగం నుండి తప్పుకుని కర్ణునికి యుద్ధం చేసే అవకాశం ఇవ్వండి " అన్నాడు.
భీష్ముని వ్యధ
వాడి బాణాల వలె ఉన్న సుయోధనుని మాటలకు భీష్ముడు నొచ్చుకుని కొంత సేపు మౌనం వహించి గాఢంగా నిట్టూర్చి " సుయోధనా ! అర్జునుడు సామాన్యుడు కాదు. ఖాండవ వన సమయంలో ఇంద్రుని జయించాడు. శివునితో హోరాహోరీ పోరి పాశుపతాన్ని పొందాడు. నిన్ను నీ వారిని గంధర్వుల బారి నుండి రక్షించింది అర్జునుడే. అప్పుడు కర్ణుడు పారి పోయిన విషయం నీకు తెలియనిది కాదు. అర్జునుడు, నిన్ను, ద్రోణుని, అశ్వథ్థామను, కృపాచార్యుని, కర్ణుని సమ్మోహితులని చేసి గోవులను తీసుకు పోయిన విషయం మనమెరిగినదే ! అర్జునిని విజయపరంపర మనము వినే ఉన్నాము. ఏనిమిది రోజులు నా శాయశక్తుల యుద్ధం చేసి నీ నోటి వెంట ఈ మాటలు విన్నాను. నేను ఇప్పుడే చెప్తున్నాను నేను గాండీవిని గెలువలేను. శిఖండిని చంపను వీరిద్దరు తప్ప రణమున ఎవరు ఎదురైనా నేను చంపగలను. నేను పాండవ సైన్యంలో పాంచాలరాజు, మత్స్యదేశాధిపతి, యాదవులు వారి సైన్యములను చెండాడుతాను నీవు నీ తమ్ములు పాడవులను, వారి పుత్రులను వారి సైన్యములను మీ పరాక్రమంతో గెలవండి. ఇక వట్టి మాటలు కట్టి పెట్టి నీ తమ్ములతో పాండవుల మీద ప్రతాపం చూపి విజయం సాధించు. నీకు తగని పని అని తెలిసి పాండవులతో పగ పూనావు. నా మాట లక్ష్యపెట్ట లేదు. అయినా రేపు నా పరాక్రమం చూడగలవు. పరాక్రమం చూపి గెలవాలి కాని ఇలాంటి ములుకుల వంటి మాటలతో విజయాన్ని సాధించ లేవు " అన్నాడు. భీష్ముని మాటలకు మనసులో సంతసించి సుయోధనుడు అక్కడి నుండి వెళ్ళాడు. మరునాటి యుధ్ధం ఆరంభమయ్యే సమయంలో సుయోధనుడు " మహాయోధులారా ! పాంచాలరాజుతో సహా అందరిని సంహరిస్తానని పాండవులను గెలువ గలనని నిన్న రాత్రి భీష్ముడు నాతో అన్నాడు. మనమందరం అతడి మాటను నెరవేరుద్ధాం " అని వ్యంగ్యంగా అన్నాడు. అతడి మాటలకు ఆగ్రహించిన భీష్ముడు కోపాన్ని మనసులో దాచుకున్నాడు. ఇది గమనించిన సుయోధనుడు దుశ్శాసనునితో " మీరు తాతగారి వద్ద ఉండి అతడిని కాపాడండి. అతడికి సాయంగా ఇరవై రెండు వేల రథికులను ఉంచండి " అన్నాడు. తరువాత మిగిలిన వారిని చూసి " మహామహులారా! నిత్యసత్యవ్రతుడైన భీష్ముడు శిఖండితో యుద్ధం చేయనని ప్రతిన పూనిన విషయం తెలుసు కనుక మనం ఆనీచ శిఖండిని భీష్ముని ఎదుటకు రాకుండా చూడాలి " అన్నాడు.
యుద్ధారంభం
తొమ్మిదవ రోజు యుద్ధానికి కౌరవ సేన సర్వతోభద్ర వ్యూహమున నిలిచారు. కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, శకుని, సుదక్షిణుడు, సైంధవుడు, కురుకుమారులు, భీష్మునితో వ్యూహం ముందు భాగంలో ఉన్నారు. ద్రోణుడు, భూరిశ్రవసుడు, భగదత్తుడు అతడి కుడి వైపున సోమదత్తుడు, అశ్వత్థామ, విందాను విందులు ఎడమ వైపున శ్రుతాయువు వెనుక వైపున త్రిగర్తాధీసునితో సుయోధనుడు మధ్యభాగమున నిలిచారు. ఈ వ్యూహము చూసి ధర్మరాజు " ధృష్టద్యుమ్నా ! తాత భీష్ములు పన్నిన వ్యూహమును చూసావు కదా మనం ఈ రోజు శిఖండిని ముందుంచి అతనికి సాయంగా మనం నిలిచి పోరాడవలెను. అందుకు అనువైన వ్యూహ రచన చేయుము " అన్నాడు. సాత్యకి, విరాటుడు కుడి వైపున , అభిమన్యుడు, పాంచాల కేకయ రాజులు ఎడమ వైపున కుంతి భోజుడు వెనుక వైపున, యుధిష్టరుడు, నకులసహదేవ , ద్రౌపదీ పుత్రులతో మధ్యభాగమున నిలిచారు. శిఖండిని ముందు నిలిపి అతడికి ఒక వైపున ఘటోత్కచుడు, భీమసేనుడు నిలువగా అర్జునుడు వేరొక వైపు నిలువగా సకల యోదులు వారికి రక్షణగా నిలువగా ధృష్టధ్యుమ్నుడు యుద్ధానికి సిద్ధం అయ్యాడు. భేరి నినాదములు, శంఖముల పూరింపుల శభ్దాలు మిన్నంటుతుండగా యుద్ధం మొదలైంది.
అభిమన్యుని పరాక్రమం
అభిమన్యుడు కౌరవ వ్యూహంలోకి చొచ్చుకొని పోయి దూదిని నిప్పంటుకున్నాట్లు కౌరవ వీరులను మట్టు పెడ్తుతున్నాడు. తన రధమును గుండ్రంగా తిప్పుతూ ద్రోణా, కృపాచార్య, సైంధవులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఇది చూసి సుయోధనుడు అలంసుని పిలిచి " అలంబసా ! చూసావా అభిమన్యుడు చిచ్చెర పిడుగులా విజృంభిస్తున్నాడు. వాడిని ఎదుర్కొనగలిగిన వాడివి నీవే నీవే వాడిని చంపాలి " అన్నాడు. అలంబసుడు తన రాక్షస మూకతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. వారి ధాటికి పెను గాలికి ఎండుటాకుల వలె పాండవ సైన్యం కకావికలైంది. ఇది చూసి ద్రౌపదీ సుతులు అభిమన్యునికి సాయంగా వచ్చి రాక్షసులను హతమారుస్తున్నారు. కోపించిన అలంబసుడు పాండవ కుమారులపై శరవర్షం కురిపించారు. ద్రౌపదీ సుతులు అలంబసునిపై జడివానలా బాణములు కురిపించారు. ఆ బాణముల ధాటికి అలంబసుడు తెలివి తప్పి మరు క్షణంలో తేరుకుని ద్రౌపతీ సుతులపై పుంకానుపుంఖాలుగా బాణములు గుప్పించి వారి విల్లులు, కేతనములు విరిచి ఒక్కొక్కరిపై అయిదు బాణములు వేసాడు. సోదరుల అవస్థ అలంబసుని విజృంభణ చూసిన అభిమన్యుడు అలంబసునిపై అతి క్రూరమైన నారాచ బాణములు ప్రయోగించాడు. మిగిలిన వారు అలంబసుడు మాయావిధ్యా ప్రవీణుడు అభిమన్యుడు దివ్యాస్త్ర సంభూతుడు వీరిరువురి యుద్ధం ఎంత రసవంతరమో అని చూస్తున్నారు. అభిమన్య అలంబచులు దేవేంద్ర వృత్తాసురుల వలె యుద్ధం చేస్తున్నారు. అలంబసుడు తన మాయాశక్తితో రణభూమిని అంధకార బంధురం చేసాడు. అభిమన్యుడు భాస్కరాస్త్ర ప్రయోగంతో ఆ చీకట్లను పటాపంచలు చేసాడు. అలంబసుడు అనేక మాయలు చేయగా అభిమన్యుడు వాటిని అన్నిటినీ తిప్పి కొట్టాడు. అభిమన్యుని శస్త్రధాటికి తాళలేక అలంబసుడు రథం దిగి పారిపోయాడు. అలంసుడు పారి పోగానే అభిమన్యుడు విజృంభిస్తూ కౌరవ సేనలో చొచ్చుకు పోయి ఊచ కోత కోయడం మొదలుపెట్టాడు. కౌరవ సేనలు అభిమన్యుని ధాటికి గజగజలాడాయి. అది చూసి భీష్ముడు అనేక మంది రథికులతో అక్కడికి చేరి అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు జంకక అనేక రూపములతో వీరవిహారం చేస్తున్నాడు. అది గమనించిన అర్జునుడు కుమారుని పరాక్రమానికి సంతసింస్తూ భీష్ముని ఎదుర్కొన్నాడు.
కురు పాండవ వీరుల పోరు
భీష్మునికి అర్జునునికి మధ్య పోరు ఘోరరూపందాల్చింది. ఇంతలో కృపాచార్యుడు అభిమన్యునిపై శరవర్షం కురిపించాడు. వెంటనే సాత్యకి కృపాచార్యుని శరములు త్రుంచి అనేక కౄర బాణములు అతడిపై ప్రయోగించాడు. వాటిని అశ్వత్థామ మధ్యలోనే త్రుంచి సాత్యకి విల్లును త్రుంచాడు. వెంటనే సాత్యకి మరొక విల్లు అందుకుని అశ్వత్థామ మూర్చిల్లేలా ఒక క్రూరబాణంతో కొట్టాడు. అశ్వత్థామ వెంటనే తేరుకుని సాత్యకి గుండెలకు గురి పెట్టి శరసంధానం చేసి అతడి కేతనమును విరిచి భీకర ఘర్జన చేసాడు. ఆగ్రహించిన సాత్యకి అశ్వత్థామ రథం కనిపించ కుండా కొట్టాడు. అది చూసిన ద్రోణుడు సాత్యకి శరవర్షం కురిపించాడు. అది చూసి అర్జునుడు సాత్యకికి సాయం వచ్చి ద్రోణుని ఎదుర్కొన్నాడు. " అని సంజయుడు చెప్పగా దృతరాష్ట్రుడు " సంజయా ! అర్జునుడు ద్రోణుని ప్రియ శిష్యుడు కదా ! అర్జునినికి ద్రోణుడంటే గురుభక్తి అధికం . మరి వారిరువురు ఎలా యుద్ధం చేసారు " అని అడిగాడు. సంజయుడు అర్జున ద్రోణుల మధ్య జరిగిన యుద్ధం వర్ణించసాగాడు. " మహారాజా ! క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధభూమిలో తలపడిన తరువాత గురువు, తండ్రి, తమ్ములు, పుత్రులు, పౌత్రులు, శిష్యులు, మామలు అనే భేదం విడిచి యుద్ధం చేయాలి కనుక అర్జునుడు, ద్రోణుడు యుద్ధ భూమిలో శత్రువుల వలెనే యుద్ధం చేసారు. అర్జునుడు ద్రోణునిపై మూడు క్రూర నారాచములు ప్రయోగించాడు. ద్రోణుడు వాటిని త్రుంచి అర్జునిపై శరవర్షం కురిపించాడు. సుయోధనుని ప్రేరణపై త్రిగర్తాధిపతి ద్రోణుని దాటి పోయి అర్జునిపై భల్ల బాణములు ప్రయోగించాడు. అర్జునుడు ఆ బాణమును మధ్యలో త్రుంచి త్రిగర్తాధీశుని సైన్యంపై వాయవ్యాస్త్రమును ప్రయోగించాడు. ఆ వాయవ్యాస్త్రధాటికి త్రిగర్తాధీసుని సైన్యం చెల్లాచెదురు అయింది. ద్రోణుడు వాయవ్యాస్త్రానికి విరుగుడుగా శైలాస్త్రం సంధించి దాని ప్రభావాన్ని తగ్గించాడు. అది చూసిన అర్జునుడు వాడి అయిన బాణములను ప్రయోగించి త్రిగర్తాధీసుని కుమారులను తరమి కొట్టాడు. అది చూసిన సుయోధనుడు కృపాచార్యుడు, బాహ్లికుడు, శల్యుడు మొదలైన రథికులతో చేరి అర్జునిని ఎదుర్కొన్నాడు. సుయోధనాదులనే కాక ద్రోణుని కూడా తన వాడి శరములతో అర్జునుడు చికాకు పరిచాడు. ఇంతలో భీష్ముడు అర్జునుని ఎదుర్కొని అతడిపై శరవర్షం కురిపించి తన క్రూర బాణములతో వేలకు వేల శత్రువుల శిరస్సులను ఖండించాడు. మరొక పక్క శకుని, భూరిశ్రవనులు నకుల సహదేవులను ఎదుర్కొన్నారు. కళింగరాజు, భగదత్తులు తమ గజబలంతో భీమునితో పోరుతున్నారు. కొండ మీద నుండి దూకే సింహంలా భీముడు రథం నుండి కిందికి దూకి గజ సైన్యముల కుంభస్థలములను పగుల కొడుతున్నాడు. భీమసేనుని గధాఘాతముకు గజబలం బెదిరి పారి పోయాయి. శ్రుతాయువు, భగదత్తులు వాడి అయిన బాణాలతో భీమసేనుని కవచం చీల్చారు. మరొక వైపు భీష్ముడు పాండవ సైన్యాలను చెండాడుతున్నాడు. ఇది గమనించిన ధర్మరాజు భీముని రమ్మని చెప్పాడు. భీముడు కళింగ రాజు, భగదత్తులను విడిచి అన్నయ్య దగ్గరకు వచ్చాడు. ముందే విరాటుడు, దృపదుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి అక్కడకు చేరి ఒక్కుమ్మడిగా భీష్ముని ఎదుర్కొన్నారు. భీష్ముడు శిఖండిని వదిలి వారిని ఎదుర్కొని శరములు వేయసాగాడు. రథికులు ప్రతిగా శరములు వదులుతున్నారు . పోరు సంకలమైంది.
మధ్యాహ్నానంతర సమరం
మధ్యాహ్నం అయింది విరిగిన రథములు, చచ్చిన హయములు, రక్తపుటేరులతో రణభూమి భయానకంగా ఉంది. ఉభయ సైన్యములు పోరు సల్పుతున్నా మన సన్యంలో నైతిక బలంతగ్గుతుంది. వారిలో వారు " అయ్యో సుయోధనుని లోభత్వం, మూర్ఖత్వం వల్లనే ఇంతటి మారణహోమం జనక్షయం దాపురించింది. అసలు పాండవులను జయించగల వారు ఎక్కడినా ఉన్నారా ? " అని తమలో తాము తర్కించుకున్నారు. వారి మాటలను సావధానంగా వింటున్న సుయోధనుడు " వారి పనికి మాలిన మాటలు విననేల అనేకులు అనేక విధముల అనుకుంటారు. మనం యుద్ధం చేస్తాము రండి " అని అందరిని రణముకు ప్రోత్సహించాడు. ఆ సమయంలో భీమసేనుడు రణరంగంలో వీరవిహారం చేస్తూ శత్రువులను ఊచకోత కోస్తున్నాడు. ఇంతలో భీమసేనుని రథం తెచ్చి సారథి నిలవగానే దానిని అధిరోహించి అత్యంత నిశిత శరములతో బాహ్లికుని రథము విరుగకొట్టాడు. చిత్రరధుడు చిత్ర విచిత్రమైన తన నిశిత శరములు ఉపయోగించి అభిమన్యుని చికాకు పెడుతున్నాడు. అభిమన్యుడు చిత్రరధుని రథము విరుగకొట్టి, సారథిని చంపి, రథాశ్వములను చంపాడు చిత్రరధుడు దుర్ముఖుని రథం ఎక్కి అక్కడి నుండి వెళ్ళారు. ద్రుపదుడు ద్రోణునిపై శస్త్రప్రయోగం చేసాడు. ఆగ్రహించిన ద్రోణుడు పదునైన బాణములు ప్రయోగించి ద్రుపదుని కవచము చీల్చాడు. ద్రోణుని ధాటికి తాళ లేక ద్రుపదుడు అక్కడి నుండి వెళ్ళాడు. సుశర్మ అర్జునితో యుద్ధం చేస్తూ అర్జునిని మీద కృష్ణుని మీద శరవర్షం కురిపించాడు. వాటిని మధ్యలో త్రుంచి అర్జునుడు క్రూరబాణములతో సుశర్మను తరిమి తరిమి కొట్టాడు. అతడి సైన్యం చెదిరి పోగా అర్జునిని ధాటికి ఆగ లేక సుశర్మ ససైన్యంగా వైదొలిగాడు. అది చూసిన భీష్ముడు అర్జునుని ఎదుర్కొని విజృంభించాడు. మధలో సాత్యకి భీష్ముని ఎదుర్కొని అతడిపై శరవర్షం కురిపించాడు. భీష్ముడు కోపించి శక్తి ఆయుధమును సాత్యకిపై విసిరాడు. శరీరం వంచి దానిని వడిసి పట్టి తిరిగి భీష్మునిపై విసిరి సింహనాదం చేసాడు. భీష్ముడు తన ఆయుధమును తానే త్రుంచి సాత్యకిపై పది పదునైన బాణములు వేసాడు. పాండవ సైన్యం ఒక్కుమ్మడిగా భీష్మునిపై పడింది. సుయోధనుడు దుశ్శాసనుడిని పిలిచి " దుశ్శాసనా ! తాత ఒంటరిగా పోరుతున్నాడు. శకునిని తీసుకుని సాయంగా వెళ్ళు " అన్నాడు. దుశ్శాసనుడు అలాగే వెళ్ళి శకునితో చేరి భీష్మునికి సాయంగా పాండవ సైన్యాలను కకావికలు చేస్తున్నారు. ఇది గమనించిన ధర్మరాజు నకులసహదేవులను అక్కడకు వెళ్ళమని చేయి ఊపాడు. నకుల సహదేవులు భీష్ముని ఎదుర్కొన్నారు. సుయోధనుడు పది వేల అశ్విక దళమును పాండవ సైన్యాలను ఎదుర్కొనమని పంపాడు. వారు పాండవ సేనలో చొరబడి విచక్షణ లేకుండా చంపసాగారు. అది చూసిన నకులసహదేవులు, ధర్మరాజు తమ వాడి శిలీకంతో గుర్రములను కొట్ట సాగారు. కాళ్ళు తెగి గుర్రములు పడి పోతూ రణరంమును బీభత్సం చేసింది. అశ్వసైన్యం అంతకంతకూ తరిగి పోయి సైనికులను లక్ష్యపెట్టక దిక్కు తోచక పరుగెట్టాయి. వాటి కింద పడి సైనికులు చనిపోసాగారు. అనేక హయములు రౌతులనుక్రింద వేసి చంపసాగాయి. అనేకులు తమ గుర్రాల క్రింద పడి మరణించారు. అశ్వదళము నశించగానే పాండవులు భేరి తూర్యనాదాలు చేసారు. ఇది చూసిన సుయోధనుడు " మద్రనరేంద్రా ! పాండవ సేనలు చెలియలి కట్ట దాటిన సముద్రంలా విరుచుకు పడి మనసైన్యాలను ఊచ కోత కోస్తున్నాయి. వాటిని నీవే ఆపాలి. శల్యుడు తన సేనలతో నకులసహదేవ, ధర్మనందనులను ముట్టడించి పెక్కు బాణములు వేసి వారిని నొప్పించాడు. అది చూసిన భీమార్జునులు శల్యునిపై విరుచుకు పడి శల్యునిపై బాణవర్షం కురిపించారు. ఇది చూసిన భీష్మద్రోణులు భీమార్జునులను ఎదుర్కొని వివిధ అస్త్రములను వేసి వారిని నొప్పించారు. సాయం కాలం అయింది.
సాయం కాలానంతర యుద్ధం
భీష్ముడు ప్రచంఢునిలా పాండవ సేనలోకి చొచ్చుకు వెళ్ళి పన్నెండు నారాచ బాణములను ధర్మరాజు పైన అర్జున, భీమ, నకులసహదేవులపై ఒక్కొకరిపై మూడేసి ప్రయోగించాడు. సాత్యకి, ధృష్టద్యుమ్నులపై వాడి శరములు వేసి నొప్పించాడు. వెంటనే మగధ, విరాట, కురు దేశాధీసులు, సోమకుడు తమ సైన్యాలతో భీష్ముని చుట్టు ముట్టారు. ద్రోణాచార్యుడు తన వాడి అయిన బాణములతో సాత్యకిని, పాండు సుతులను ఎదుర్కొని అంతటా తానై వీరవిహారం చేస్తున్నాడు. భీష్ముడు తనను ఎదిరించిన వారిని శరపరంపరతో అస్త్రశ్త్రములతో వేధిస్తూ రధమును చిత్ర, విచిత్ర రీతుల నడుపుతూ పాండవ సైన్యాలను చెండాడుతున్నాడు. తన శరములతో హయములను, గజములను తనుమాడుతున్నాడు. రణభూమి అంతా చనిపోయిన హయ, గజములతో నిడి పోయింది. పాండవ సైన్యమంతా భీష్ముని ధాటి చూసి భయకంపితమైనది. భీష్ముని ఆపగలిగిన వారు లేక పోయారు. కనిపించిన వారిని కనిపించినట్లు చంపుతున్నాడు. హయముల, విరిగిన రధముల, సైన్యముల హాహాకారములతో, గజముల ఘీంకారధ్వనులతో రణ రంగం మార్మోగి పోయింది.
శ్రీకృష్ణుడు అర్జునుడిని హెచ్చరించుట
భీష్ముని విజృంభణ చూసిన శ్రీకృష్ణుడు " ఈ రోజు భీష్ముడు అత్యంత శౌర్యంతో మన సేనలను తనుమాడు తున్నాడు. నీవేమో చోద్యం చూస్తున్నావా " అని ఎత్తి పొడిచాడు. అర్జునుడు డోలాయ మనస్కుడై మిన్నకున్నాడు. అది చూసిన కృష్ణుడు " అర్జునా ! నా మాట విన లేదా! నిన్ను నమ్మి యుద్ధమునకు వచ్చిన రథికులు నిన్ను చూసి నవ్వరా ! నాడు విరాటుని కొలువులో సంజయునితో నీవాడిన మాటలు మరిచావా " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! సకల బంధుజనాన్ని చంపి ఏమి ఘనకార్యం చేసానని ఈ రాజ్యాన్ని ఏలుకోను. యుద్ధం చేయ మనస్కరించుట లేదు కాని క్షత్రియ ధర్మం విడవలేను కదా " అని నిర్వేదంగా భీష్ముని ఎదుర్కొన్నాడు. పారి పోతున్న సైన్యాలను " ఆగండి అందరమూ కలిసి భీష్ముని ఎదుర్కొంటాము " అన్నాడు. అర్జునుడు సింహనాదం చేసి గాండీవం సంధించి మహాస్త్రములను భీష్మునిపై సంధించాడు. భీష్ముడు అర్జునిని బాణములు త్రుంచి తిరిగి బాణములు వేసి అర్జునిని శరీరం రక్తసిక్తం చేసాడు. అవమాన భారంతో క్రుంగిన అర్జునుడు పదునైన బాణమును వేసి భీష్ముని విల్లు విరిచాడు. భీష్ముడు మరొక విల్లు తీసుకోగా అర్జునుడు దానిని కూడా విరిచాడు. మనుమడి నైపుణ్యానికి మురిసిపోతూనే పాండవ సైన్యంపై శరవర్షం కురిపిస్తూ అర్జునిని శరీరాన్ని తూట్లు పడేలా కొట్టాడు. అర్జునుడు అలసి పోయాడు. శరీరమంతా బాణపు దెబ్బలకు బాధపడుతూ ఉంది. వివశుడైన అర్జునిని మరింతా తన శరములతో బాధించ సాగాడు భీష్ముడు. మిగిలిన వారు భీష్మునికి ఎదురు నిలువ లేక పారి పోయారు.
శ్రీకృష్ణుడు భీష్ముని ఎదుర్కొనబూనుట
పరిస్థితి విషమించడం చూసిన శ్రీకృష్ణుడు ఆగ్రహోదగ్రుడై పగ్గములను నొగల మీద ఉంచి ఒక్క ఉదుటున ధరణీ చక్రం కదిలిందా లేక దిక్కులన్నీ కంపించాయా అన్నట్లు భీష్మునిపై లంఘించాడు. పీతాంబరం జారిపోతున్నా లెక్క చేయక కారు మేఘములు కదిలి వచ్చాయా అన్నట్లున్న శ్రీకృష్ణుని చూసి కౌరవ సేనలు " ఈ రోజుతో భీష్మునకు అంతిమ ఘడియలు సమీపించాయి " అనుకుంటూ నిశ్చేష్టులై చూడ సాగారు. ఇది చూసిన భీష్ముడు " రావయ్యా కృష్ణా ! వచ్చి వేగమే నన్ను సంహరించి నాకు విముక్తి కలిగించు " అని చేతులు ఎత్తి నమస్కరిస్తూ శ్రీకృష్ణుని ముందు మోకరిల్లి ప్రార్ధించాడు. ఇది చూసిన అర్జునకు మతి పోయినంత పనై కృష్ణుని వెనుక నుండి లాగుతూ కృష్ణుడు విదిలించుకుని పరుగెడుతున్నాడు. మరలా వెనుక పరుగెత్తి కృష్ణుని పట్టి " బావా కృష్ణా ! యుద్ధము చేయనని నాకు ఇచ్చిన మాట మరువకయ్యా. నీవు ఇచ్చిమాట నీవే తప్పితే లోకం ఏమంటుంది. నాకు అపవాదు తీసుకు రాకు. నా అలసట తీరింది భీష్మునితో పోరాడుతాను " అనగానే శాంతించి శ్రీకృష్ణుడు తిరిగి రథం అధిరోహించి పగ్గములు చేత పట్టాడు. ప్రళయకాల రుద్రునివలె ఘర్జించి అర్జునుడు గాండీవం సంధించి కౌరవ సేనను రూపు మాపసాగాడు. మహదవకాశం జారి పోయిన భీష్ముడు తిరిగి విల్లు ఎక్కు పెట్టి కృష్ణార్జునుల మీద శరములు నాటాడు. పాంచాల సేనలను భీష్ముడు భారీ కాయుడు చీమలను నలిపినట్లు నలుపుతుంటే కృష్ణునితో సహా పాండవులు నిశ్చేష్టులై చూడ సాగారు. ఈ ఘోరదృశ్యం చేడలేనట్లు సూర్యుడు అస్తమించగానే ఆ నాటి యుద్ధం పాండవులలో భీతిని కలిగితూ ముగిసింది. అందరూ వారి వారి నెలవులకు చేరారు.
పదవరోజు యుద్ధం
తొమ్మిదవనాటి భీష్ముని విజృంభణ చూసిన ధర్మనందనుని మన్సు కలత చెందింది. కౌరవ శిబిరంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. భీష్ముని వేనోళ్ళ పొగిడారు. నీ కుమారుల ఆనందానికి హద్దు లేదు. భీష్ముని ఉదాత్త హృదయంతో ప్రస్థుతి చేసారు. ఆరోజు రాత్రి ధర్మనందనునికి నిద్ర పట్ట లేదు. తన తమ్ములను తీసుకుని కృష్ణుని శిబిరానికి వెళ్ళాడు. " కృష్ణా ! చూసావు కదా కార్చిచ్చు అడవిలోని మృగములను నాశనం చేసినట్లు భీష్ముడు పాండవ సేనలను ద్వంశం చేసాడు. ఆ మహా వీరుని ముందు మనవాళ్ళెవరూ నిలువ లేక పోయారు. కార్యాచరణ విచక్షణ లోపించి నేను వినాశకరమైన యుద్ధానికి అంగీకరించాను. బంధు మిత్రులను చంపుకుని నేను ఈ రాజ్యాన్ని ఎలా పాలించగలను. కనుక నేను అడవులకు పోయి నిశ్చింతగా ఆకు అలములు తింటూ తపస్సు చేసుకుంటాను. నా తమ్ములతో కూడి ముని వృత్తి స్వీకరిస్తాను వాళ్ళంతా నా కారణంగా ఆడవులలో కష్టాలు అనుభవించారు. వారిని నేను భీష్మునికి బలి ఇవ్వలేను. నా తమ్ముల క్షేమమే నాకు ముఖ్యం కృష్ణా ! మా మీద దయ ఉంచి ధర్మ మార్గాన్ని ఉపదేశించు " అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు " ధర్మనందనా ! నీవు సత్యవాక్పరిపాలకుడవు. నీ తమ్ములు నాలుగు దిక్కులు జయించిన వారు. మీకు ఎలాంటి దుర్గతి కలుగదు. నా సహాయసంపత్తితో మీకు అమాత్యుడనై మీకు రాజ్యసిద్ధి కలుగ చేస్తాను. అర్జునుడు నాకు భక్తుడు, సఖుడు, బంధువు, శిష్యుడు అతని కోసం నేను నా శరీరాన్ని అయినా కోసి ఇస్తాను. ఉపప్లావ్యంలో అర్జునుడు పలికిన పలుకులు నిజం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నేను మీకు సాధకంగా శపథం చేసాను. అవన్నీ నిజం చేయవలసిన బాధ్యత నాకు ఉంది. ఒక వేళ అర్జునుడు తెగువ చేసి భీష్ముని వధించకున్న నేను ఆపని చేసి అయినా మీకు విజయం చేకూరుస్తాను " అన్నాడు. అది విన్న ధర్మనందనుడు " కృష్ణా ! నీవు యుద్ధం చేయనని కేవలం సహాయ సహకారాలు అందిస్తానని చెప్పావు. నీ చేత యుద్ధం చేయించి నీ మాట అసత్యం చేయటం భావ్యం కాదు. అకటా దైవం నాకు ఎన్ని ఇక్కట్లు కలుగ చేస్తున్నాడు.
ధర్మరాజు భీష్ముని పడగొట్టడానికి నిశ్చయించు కొనుట
భీష్ముడు కౌరవుల పక్షాన యుద్ధం చేసినా నాకు మేలు చేస్తానని మాట ఇచ్చాడు. మా తండ్రి పోయిన నాటి నుండి మమ్మలను ఆదరించి అల్లారు ముద్దుగా పెంచిన భీష్మునికి కీడు చెయ్యడానికి మనసు రావడం లేదు. అయినా తప్పేలా లేదు అయినా రాజ ధర్మం ఎంతటి క్రూరమైందో కదా " అని ఖేదంతో పలికాడు. కృష్ణునికి ధర్మనందనుని ఆంతర్యం అర్ధం అయింది. భీష్ముని వధోపాయం తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఆరోజు భీష్ముడు మరలా కలవమని చెప్పడంలో అంతర్యం ఇదే కాబోలు అనుకుని ధర్మనందనా ! నీ ఆలోచన బాగుంది. భీష్ముడు కోపంతో చూస్తే అతడి ముందు ఎవరు నిలువలేరని నీవే చెప్పావు కదా ! నీవు వెళ్ళి అడిగితే చాలు భీష్ముడు తనను వధించే ఉపాయం నీకు తప్పక వివరించగలడు. కనుక మనమందరం భీష్ముని సందర్శించి ఆయనను భక్తితో ప్రార్ధించి అతని వలన ఉపదేశం పొందవలెను " అని పలికాడు. అప్పుడు ధర్మరాజు సౌమ్య వేషధారణతో తన తమ్ములను తీసుకుని భీష్ముని చూడడానికి వెళ్ళాడు. భీష్మునికి సాష్టాంగ నమస్కారం చేసాడు. భీష్ముడు వారిని సాదరంగా ఆదరించి పేరు పేరునా వారి క్షేమం అడిగి " ధర్మనందనా ! ఈ సమయంలో మీరు నన్ను చూడవచ్చిన కార్యమేమి ? సందేహించక అడుగు ఎంతటి దుష్కర కార్యమైనా నెరవేర్చగలను " అని పలికాడు. దీనవదనుడై ధర్మరాజు " పితామహా ! మాకు రాజ్యప్రాప్తి ఎలా కలుగుతుంది. మా సైన్యం క్షీణించకుండా కాపాడే మార్గం సెలవివ్వండి " అని అడిగాడు.
భీష్ముడు తనను పడొగొట్టే మార్గము చెప్పుట
భీష్ముడు " ధర్మనందనా ! నేను యుద్ధ భూమిలో ఉన్నంత కాలం మీకు రాజ్యప్రాప్తి కలుగదు. నన్ను నిర్జిస్తేగాని మీకు రాజ్యప్రాప్తి కలుగదు " అన్నాడు. ధర్మరాజు " పితామహా ! రణభూమిలో మీరు త్రిశూలం ధరించిన రుద్రినిలా నిలబడినంత కాలం మిమ్ము గెలుచు వీరుడేవ్వడు. కనుక మిమ్ము గెలుచు ఉపాయము మాకు చెప్పవా " అన్నాడు. " ధర్మనందనా ! నీవు చెప్పింది యధార్ధం నా చేత ఆయుధం ఉండగా నన్ను గెలుచుట అసాధ్యం . నా శక్తి తెలుసుకుని నన్ను గెల్చు ఉపాయం తెలుసుకొన వచ్చారు. మీకు సహాయం చేయుట కంటే సుకృతం ఏముంది. నేను ఆయుధం విసర్జించిన నన్ను గెలువ వచ్చు. నేను కవచం తీసిన వాడిని, ఆయుధం ధరింపని వాడిని, కేతనమును దించిన వాడిని, స్త్రీలను, స్త్రీగా ఉండి పురుషునిగా మారిన వాడిని, తలపాగా తీసిన వాడిని, అన్నదమ్ములు లేని వాడిని, పుత్రులు లేని వారు ఎదురైన వారితో యుద్ధం చేయను. వెంటనే నా ఆయుధములను విడిచి పెడతాను. పుట్టుకతో పురుషుడు కాక దైవత్వంతో పురుషుడైన వాడితో నేను యుద్ధం చేయను. ద్రుపద కుమారుడు శిఖండి పుట్టకతో స్త్రీ అయి దైవీకంగా పురుషత్వం పొందాడు. శిఖండిని ముందు పెట్టుకుని అర్జునుడు యుద్ధం చేసిన నేను ఆయుధము విసర్జిస్తాను అప్పుడు అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకుని నన్ను సంహరించవచ్చు. తరువాత బంధు మిత్ర సహితంగా సుయోధనుని గెలుచుట సులభం " అన్నాడు. వచ్చిన కార్యం సఫలమైంది అనుకుని ధర్మనందనుడు తమ్ములతో తమ శిబిరానికి మరిలాడు. దారిలో " తన మరణమునకు తానే దారి చెప్పిన భీష్ముని తలచుకుని విషాదం నిండిన హృదయముతో అర్జునుడు " కృష్ణా ! భీష్ముడు లోక మాన్యుడు, దయాళువు, వయోవృద్ధుడు అలాంటి మహానుభావుని చంపడానికి నాకు మనస్కరించుట లేదు. మట్టిలో ఆడుకుని వచ్చిన నన్ను ఎత్తుకుని ముద్దాడి చిన్నతనంలోనే గతించిన నా తండ్రిని తలచుకుని ఆయన కంట తడి పెట్టుకునే వాడు. తండ్రిని కోల్పోయిన మమ్ము చేరదీసి అల్లారు ముద్దుగా పెంచిన తాతాగారిని నేను ఎలా చంపగలను. పితామహుడు పరాక్రమంతో సైన్యాలను అంతమొందించినా ఉపేక్షిస్తానుకాని చంపను ధర్మనందనుని తమ్ములు అంత కృరులు కాదు కదా " అన్నాడు. ఆ పలుకులు విని కృష్ణుడు " అర్జునా ! నీకు క్షత్రియ ధర్మం తెలియదా! క్షత్రియులు కొంచెం క్రూరత్వం అవలంబించి కలత చెందక శత్రు సంహారం చేసి ప్రజలను కంటికి రెప్పలా కాపాడాలి. ప్రజలు కట్టు పన్నుతో ప్రజాశ్రేయస్సు కొరకు పాటు పడాలి. రాజధర్మం ఇదేనని బృహస్పతి ఇంద్రునకు చెప్పాడు. నీవు భీష్ముని చంపుతానని ప్రతిన చేసావు. ఆ మాట తప్పుట న్యాయమా ! లోకులు నిన్ను చూసి నవ్వరా. ఇది రాజ ధర్మమే కాని క్రూరకర్మము కాదు. ఖేదము వదిలి భీష్ముని చంప ప్రయత్నించు " అన్నాడు. " అది సరే కృష్ణా ! భీష్ముని చంపడానికి శిఖండి పుట్టాడు అంటారు కదా ! శిఖండిని చూసిన పితామహుడు యుద్ధం చేయడు కదా ! నేను వేరొకరిని చంపుతాను. శిఖండి భీష్ముని చంపుతాడు " అన్నాడు. " అర్జునా ! ఇక మాటలేల భీష్ముని మరణం నీ చేతిలో ఉంది. నీ వెంత కాదన్నా విధి లిఖితం మార్చుట అసాధ్యము. ఇతర మాటలతో కాలయాపన చేయక భీష్ముని వధించు " అన్నాడు. అర్జునుడు " రేపటి యుద్ధం ఎలా జరగాలో అలా జరుగుతుంది మీరు చెప్పినట్లే చేస్తాను " అన్నాడు. అందరూ తమ శిబిరాలకు వెళ్ళారు. అది విన్న దృతరాష్ట్రుడు " సంజయా ! పాండుసుతులు ఎలా శిఖండిని ముందు పెట్టుకుని భీష్మునితో యుద్ధం చేసారు నాకు వివరించు " అన్నాడు.
యుద్ధారంభం
సూర్యోదయం కాగానే పాండవులు సేనాసమేతులై రణముకు బయలుదేరారు. సేనకు ముందు భాగంలో శిఖండిని నిలిపారు. ఇరువైపులా భీమార్జునులను, వెనుక వైపు అభిమన్యిని, ద్రౌపదీ పుత్రులను, వారికి ఇరువైపులా చేకితానుడు, సాత్యకి వారి వెనుక ధృష్టద్యుమ్నుడు మొదలగు పాంచాలకుమారులను నిలిపారు. నకుల సహదేవులను ఇరివైపులా నిలువగా ధర్మరాజు వీరందరిని పరిరక్షిస్తూ విరాటరాజు, ద్రుపదుడు మొదలగు రాజులు, కేకయరాజులు, ధృష్టద్యుమ్నుడు మొహరిస్తున్నారు. భేరి తూర్య నాదములు మిన్నంటగా యుద్ధం ఆరంభం అయింది. ఇరుపక్షాలు తీవ్రంగా పోరాడుతూ దేవదానవ యుద్ధాన్ని తలపింపి చేస్తుంది. నకుల సహదేవులు చెలరేగి కౌరవ సేనలను తనుమాడుతున్నారు. భీమార్జునులు కౌరవ సేనను ఊచకోత కోస్తున్నారు. మోత్తం పాండవసేన విజృంభించి కౌరవ సేనను ధ్వంశం చేయ సాగింది. ఇది చూసిన భీష్ముడు కల్పాంతంలో విజృంభించిన రుద్రిడిలా పాండవ సేనపై శరవర్షం కురిపిస్తున్నాడు. రధాశ్వములు, గజములు, కాలబలం నేల కూలుతూ ఉన్నాయి. శిఖండి భీష్మునిపై మూడు బాణములు వేసాడు. భీష్ముడు " నిన్ను బ్రహ్మ స్త్రీగా సృంష్టించాడు. నీవు మధ్యలో పురుషత్వం పొందావు. నీవు నా మీద శరవర్షం కురిపించినా నేను నీ మీద కోపం తెచ్చుకోకుండా చిరునవ్వుతోనే నిలబడతాను కాని నీతో యుద్ధం చేయను " అన్నాడు. అది విన్న శిఖండి " భీష్మా ! ఎంతో మంది రాజులను గెలిచావు. పరశురామునితో పోరి నిలిచావు. నీ శౌర్యం నాకు చూపవా ! నీవు నాతో యుద్ధం చేయకున్నా నేను మాత్రం నిన్ను వదలను క్రూరశరములు వేసి నిన్ను చంపుతాను. నేను ఎవరైతే ఎందుకు నాతో యుద్ధం చెయ్యి " అని కవ్వించాడు శిఖండి. ఇది చూసిన అర్జునుడు " నేడు శిఖండి వైఖరి వింతగా ఉంది. భీష్ముడు పడిపోవుటకు సమయం ఆసన్నమైనట్లు కనపడుతుంది. అందుకే దైవ ప్రేరితుడై శిఖండి ఇలా ప్రవర్తిస్తున్నాడు " అని మనసులో అనుకున్నాడు. అర్జునుడు " శిఖండీ ! ఇన్ని మాటలాడి ఊరకున్న లోకం నిన్ను చూసి నవ్వుతుంది. నీ వెనుక నేను ఉన్నాను నిర్భయంగా భీష్ముని మీద నీ వాడి శరములు వేసి హతమార్చు " అన్నాడు. కాని గాంగేయుడు " అక్కడి నుండి తొలగి పోయి పాంచాల సైన్యమును తనుమాడుతున్నాడు. అర్జునుడు తన సైన్యముతో భీష్ముని ఎదుర్కొన్నాడు. అర్జునిని ధాటికి కౌరవ సేన నిలువలేక పారి పోయింది. సుయోధనుడు అది చూసి " పితామహా ! మీరు చూస్తుండగానే సేనలు పారిపోతుంటే చూస్తూ ఊరుకోవడం న్యాయమా " అన్నాడు. ఆ మాటలకు నొచ్చుకున్న భీష్ముడు " సుయోధనా నేను పది రోజులకు పది వేల మందిని చంపుతానని మాటిచ్చాను. పదివేల మందిని చంపి నీ రుణం తీర్చుకున్నాను. ఈ రోజు యుద్ధంలో నన్ను పాండవులో వారిని నేనో చంపడం తధ్యం. కాని నేను మానవమాతృడను వారు దైవాంశ సంభూతులు కనుక నా చేతిలో వారు మరణించుట అసాధ్యం అయినా నా శక్తి వంచన లేక యుద్ధం చేస్తాను " అని భీష్ముడు బదులిచ్చి తరువాత భీష్ముడు సైన్యమును వెంటబెట్టుకుని పాండవ సైన్యాలను నిర్మూలించ సాగాడు. భీష్మునికి సాయంగా నీ కుమారులు అక్కడ నిలిచి పోరాడుతున్నారు. ఇది చూసిన పాండవులు మత్స్య, పాంచాల, కేకయ, పాండ్య, యాదవ రాజులు తమ సైన్యాలతో వచ్చి ఒక్కుమ్మడిగా భీష్మునిపై లంఘించారు. సమరం సంకులమైంది.
అర్జునుడు శిఖండిని ప్రోత్సహించుట
అర్జునుడు " శిఖండీ ! నీవు భీష్ముని ఎదిరించు నేను నీ పక్కనే ఉంటాను నీవేమి భపడ వద్దు. నిన్ను చూసి భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు. నేను భీష్ముని కూలుస్తాను " అని ప్రోత్సహించాడు. ఈ పలుకులు విని ధృష్టద్యుమ్నుడు " రండి మన వీరులంతా ఒక్క సారిగా భీష్ముని ఎదుర్కొనండి మనకు తోడుగా అర్జునుడు ఉన్నాడు " అని అరిచాడు. అది విని ధర్మరాజు, భీముడు, నకులసహదేవులు, అభిమన్యుడు, ద్రౌపదీ సుతులు, విరాటుడు, చేకితానుడు, సాత్యకి, ధృష్టకేతు, కేకయరాజులు, మాగధులు మొదలైన రాజులంతా తమ సన్య సమేతంగా భీష్ముని చుట్టుముట్టారు. ఇది చూసిన అశ్వత్థామ, భూరిశ్రవనుడు, కాంభోజరాజు, కృపాచార్యుడు, కృతవర్మ, వికర్ణుడు, వివిశంతి, దుర్ముఖుడు, చిత్రసేనుడు మొదలైన యోధులు భీష్మునికి సాయంగా వచ్చారు. శిఖండిని ముందు నిలిపి యుద్ధం చేయుచున్న అర్జునునికి భీష్మునికి మధ్యలో దుశ్శాసనుడు నిలిచి కృష్ణార్జునుల మధ్య ఇరవై పదునైన బాణములు వదిలాడు. వాటిని మధ్యలో త్రుంచిన అర్జునుడు దుశ్శాసనునిపై నూరు నారాచబాణములు వేసాడు. దుశ్శాసనుడు అయిదు బాణములు అర్జునుని నుదుటన నాటాడు. అర్జునుడు దుశ్శాసనుని విల్లు త్రుంచాడు. దుశ్శాసనుడు వేరొక విల్లు తీసుకుని అర్జునునిపై ఇరవై బాణములు వేసాడు. అర్జునుడు వాటిన త్రుంచి వాడి అయిన బాణముతో దుశ్శాసనుని వక్షస్థలం పై కొట్టాడు. దుశ్శాసనుడు మూర్చిల్లాడు. దుశ్శాసనుని సారథి రథమును భీష్ముని వెనుకకు తీసుకు వెళ్ళాడు. తెలివి తెచ్చుకున్న దుశ్శాసనుడు తిరిగి భీష్ముని ముందుకు వచ్చి అర్జునినితో పోరు సాగించాడు. సాత్యకితో అలంబస భగదత్తులు, అభిమన్యునితో సుదక్షిణుడు, విరాట ద్రుపద మహారాజులతో అశ్వత్థామ, సహదేవునితో కృపాచార్యుడు, నకులునితో వికర్ణుడు, ఘటోత్కచునితో ధుర్ముఖుడు, భీమసేనునితో భూరిశ్రవసుడు, చేకితానునితో చిత్రసేనుడు, ధర్మరాజుతో ద్రోణుడు పోరు సల్పుతున్నాడు. ఇరువైపులా ఉన్న యోధులు ఒకరి కేతనములు ఒకరు విరుస్తూ, గుర్రములను, ఏనుగులను చంపుతూ, ఒకరిని ఒకరు నరుక్కుంటూ ఉన్నారు. రక్తం ఏరులై పారుతుంది. ఇంతలో మధ్యాహ్నం అయింది. దుశ్శాసనుని అస్త్రశస్త్రములన్నీ త్రుంచిన అర్జునుడు అతడి కేతనమును పడగొట్టి, విల్లు విరిచి శరీరం నిండా శరములు గుచ్చి జయధ్వానాలు చేసాడు. అర్జునుని ధాటికి తాళలేని దుశ్శాసనుడు అక్కడి నుండి వెళ్ళి పోయాడు.
మధ్యాహ్న సమయసమరం
దుశ్శాసనుడు వైతొలగిన తరువాత అర్జునుడు భీష్ముని ముందు నిలిచిన కౌరవ సేనలను చెండాడుతున్నాడు. అది చూసిన ద్రోణుడు మహా కోపంతో అర్జునుని ఎదుర్కొన్నాడు. ఇంతలో అపార సేనావాహినితో అక్కడకు వచ్చిన ధర్మరాజు ద్రోణుని ఎదుర్కొన్నాడు. ఈ పరిణామం చూసి ద్రోణుడు అశ్వత్థామను పిలిచి " కుమారా ! ఈ రోజు నా మనసెందుకో తడబడుతుంది. దివ్యాస్త్రములు స్పురణకు రావడం లేదు. చేతులు వణుకుతున్నాయి, విల్లు జారిపోతుంది, పిడికిలి పట్టు సడలుతుంది, మనస్సు వశం తప్పుతుంది ఈ రోజుతో అర్జునుడు గాంగేయుని వధించి తన శపధం నెరవేర్చుకుంటాడు అనిపిస్తుంది. అది చూడు అర్జునిని ధాటికి గుర్రములు, ఏనుగులు కూలుతున్నాయి. రధములు విరిగి పడుతున్నాయి యమధర్మరాజులా అర్జునుడు రణభూమిలో విహరిస్తున్నాడు. యుధిష్టరుని ముఖంలో కోపం ప్రజ్వరిల్లుతుంది. భీష్మునికి కీడు కలుగుతుందేమో అని అనుమానంగా ఉంది. ద్రౌపదేయులు, నకుల సహదేవుల సహితంగా పోరాడుతున్న ధర్మతనయుని విడిచి నేను రాలేను. కనుక నీవు భీష్మునికి సాయంగా వెళ్ళు " అన్నాడు. తండ్రి ఆదేశం మేరకు అశ్వత్థామ భీష్మునికి సాయంగా వెళ్ళాడు. భీమసేనుడు భీష్ముని ముందు రక్షణగా ఉన్న సైన్యాలను నిర్మూలించాడు. అది చూసిన భగదత్తుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, సైంధవుడు, చిత్రసేనుడు, దుర్మర్షణుడు, విందానువిందులు భీష్మునికి రక్షణగా నిలిచి నానాస్త్రములతో భీముని దుర్కొన్నారు. భీముడు చలించలేదు. అర్జునుడు భీమసేనునికి సాయంగా వచ్చి నిలిచి యోధులందరి కేతనములు విరిచి, విల్లులు త్రుంచి, రథములు విరుగకొడుతూ వీరవిహారం చేస్తున్నాడు. ఇది చూసి సుయోధనుడు సుశర్మను పిలిచి భీమార్జునులను ఎదుర్కొనమని చెప్పాడు. సుశర్మ పదిమంది యోధులతో భీమార్జునులను ఎదొర్కోడానికి వెళ్ళాడు. కాని ఏ ఒక్కరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయ లేక పోతున్నారు. సుయోధనుడు కలవర పడి తనసైన్యం యావత్తు అక్కడకు రమ్మని ఆదేశించాడు.
భీమార్జునులకు సాత్యకి సాయం వచ్చుట
భీమార్జునులు ఒంటరిగా పోరుతున్నారని తెలిసి సాత్యకి మొదలైన ప్రముఖ వీరులు తమ సైన్యాలతో అక్కడకు చేరారు. పాండవుల విజయోత్సాహం చూసి కోపించిన భీష్ముడు అనేక అస్త్రశస్త్రాలతో వారిని ఎదుర్కొన్నాడు. భయంకర ఈ సమరరంలో రథములు విరిగి పడుతున్నాయి, అశ్వములు, గజములు నేల కూలుతున్నాయి. సారధులు చనిపోతున్నారు. భీష్ముడు రణరంగం అంతా తానై తిరుగుతున్నాడు. పొద్దు వాలి పోవడం ఆరంభం అయింది . భీష్ముడు మనస్సులో " ఈ పది రోజుల నుండి ఎంతో మంది ఉత్తమ క్షత్రియులను హతమార్చాను. వేలకొలది సైనికులను దారుణంగా చంపి విసిగి అలసి పోయాను ఇక ఈ శరీర బంధం తెంచుకొనుట మంచిది " అని తలచి భీష్ముడు తన రథమును యుధిష్టరుని వద్దకు పోనిచ్చాడు. అతనితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ " యుధిష్టరా ! పుట్టినది ఆదిగా ఎంతో మంది రాజులను చంపాను ఇంకా చంపుతున్నాను. నాకు వయసు అయిపోయింది. ఈ రాక్షసమయ జీవితంతో విసిగి పోయాను అసహ్యం కూడా కలుగుతుంది. మీరు నా మేలు కోరే వారైతే శిఖండిని ముందు పెట్టుకుని అందరూ నాపై యుద్ధానికి రండి ఆలస్యం చేయక నాకు ఈ దేహం నుండి విముక్తిని ప్రసాదించండి " అని రథమును మళ్ళించి యధావిధిగా శత్రు సైన్యమును నిర్మూలించడం మొదలు పెట్టాడు.
సాయం సమయం తరువాత సమరం
భీష్ముని పలుకులు విన్న యుధిష్టరుడు పక్కనే ఉన్న ధృష్టద్యుమ్నునితో " భీష్ముని పలుకులు విన్నావు కదా ! నువ్వు, భీమసేనుడు, అర్జునుడు మన సైన్యంలోని యోధాను యోధులతో కలిసి ఒక్కుమ్మడిగా భీష్ముని చుట్టు ముట్టండి " అని ఆదేశించాడు. ధృష్టద్యుమ్నుడు మత్స్య, కేకయ రాజులను తక్కిన యోధాను యోధులకు భీష్ముని వద్దకు వెళ్ళమని సైగ చేసి తాను కూడా భీమార్జునులను తీసుకుని భీష్ముని చుట్టుముట్టాడు. ఇది చూసిన సుయోధనుడు కూడా తన తమ్ములు మిగిలిన వారిని కూడగట్టుకుని భీష్మునికి అండగా నిలిచాడు. ఇరుపక్షాల మధ్య పోరు ఘోరమైంది. అభిమన్యుడు సైన్యంతో సుయోధనుని మీదకు దూకి అతడిని క్రూర నారాచబాణములు వేసి నొప్పించాడు. అశ్వత్థామ సాత్యకి శరీరం నిండా శరములు నాటాడు. భీమసేనుడు రారాజును ఎదుర్కొన్నాడు. " భీష్ముని వెంటనే చంపండి " అంటూ పాండవ సైన్యాలు " భీష్ముని రక్షించండి " అని కౌరవ సైన్యాలు వీరాపాలు పలుకుతూ పోరాటం సాగిస్తున్నారు. రెండు సింహాలు పోరుతున్న విధంగా అర్జునుడు భీష్ముడు పోరాడుతున్నాడు. వారిద్దరి మధ్యకు దుశ్శాసనుడు తన సైన్యంతో వచ్చి అర్జునుని ఎదుర్కొన్నాడు. అర్జునుడు తన పదునైన బాణాలతో దుశ్శాసనుని కొట్టి అక్కడి నుండి తరిమి కొట్టాడు. అర్జునిని ధాటికి తట్టుకోలేని దుశ్శాసనుడు భీష్ముని వెనుక దాక్కున్నాడు. అర్జునుడు భగదత్తుని ఎదుర్కొని అతడి గజమును గాయపరిచాడు. భగదత్తుడు అర్జునిని వదిలి పాంచాల భూపతి మీదకు వెళ్ళాడు. అర్జునుడు శిఖండిని చూసి " భీష్ముని గుండెలకు గురి పెట్టి బాణములు వదులు అన్నాడు. తనను ఎదుర్కొన్న కౌరవ యోధులను దూది పింజంలా ఎగురగొట్టాడు. శిఖండి భీష్ముని వక్షస్థలం, భుజముల మధ్య భాగం, మర్మస్థానాలకు గురిపెట్టి బాణం వేస్తున్నాడు. భీష్ముడు శిఖండిని చూడకనే అర్జునుని ఎదుర్కొంటున్నాడు. అది చూసి దుశ్శాసనుడు కోపంతో రగిలి పోతూ భీష్మునికి అడ్డం వచ్చి అర్జునుని ఎదుర్కొన్నాడు. సుయోధనుడు కూడా కళింగ, మాళవ, బాహ్లిక, విదేహరాజులను, శూరసేనుడు మొదలైన ప్రముఖులను చూసి చేయి ఊపుతూ అక్కడకు రమ్మని సైగ చేసాడు. వారంతా తమతమ సేనా వాహినులతో అర్జునుని ఎదుర్కొన్నారు. అర్జునుడు తొట్రు పడక వారందరిని సైన్యంతో సహా కట్టడి చేసి తరిమాడు .
అర్జునుడు భీష్ముడిని ఎదుర్కొనుట
అర్జునుడు శిఖండిని చూసి భీష్మునిపై శరసంధానం చేయమని ఆదేశించాడు. అర్జునుని అండ చూసి శిఖండి భీష్ముని వక్షస్థలానికి గురి పెట్టి క్రూరమైన నారాచములతో కొట్టాడు. భీష్ముని శరీరం రక్తసిక్తం అయింది. శిఖండి శంఖం పూరించి సింహనాదం చేసాడు. దుశ్శాసనుడు తేరుకుని కృపాచార్యుడు, వివిశంతి, వికర్ణుడు మొదలైన యోధులను కూడగట్టుకుని భీష్మునికి అర్జునునికి మధ్య ప్రవేశించాడు. అర్జునుడు వారందరి రధములు విరుగ కొట్టాడు. ఇది చూసిన సుయోధనుడు, అతని తమ్ములు క్రోధంతో రగిలి పోయారు. సుయోధనుడు తన అక్షౌహిని సైన్యాన్ని అర్జునుని ఎదుర్కొనమని చేయి ఊపి సైగ చేసాడు. సుయోధనుని సైన్యం అర్జునిని చుట్టుముట్టాయి. భీష్ముడు ఒక ఉగ్రమైన అస్త్రమును ప్రయోగించి పాండవ సేనను నిర్మూలించాలని అనుకున్నాడు. అస్త్రప్రయోగం చేయబోయే సమయానికి శిఖండి కనిపించగానే ఆ ప్రయత్నం విరమించుకుని విరాటుని సేనలతో యుద్ధం చేయనారంభించాడు. భీష్ముని ధాటికి విరాటుని సేనలు నిలువ లేక పోయాయి. విరాటుని తమ్ముడు శతానీకుడు తన సైన్యముకు ధైర్యం చెబుతూ భీష్మునిపై విరుచుకు పడ్డాడు. భీష్ముని వక్షస్థలంపై అతి కౄర నారాచములు ప్రయోగించాడు. భీష్ముడు కోపంతో ఊగిపోతూ శతానీకుని విల్లు విరిచాడు, కేతనం కూల్చాడు, రధసారధిని చంపాడు రధాశ్వములను చంపాడు. భీష్ముని ప్రతాపానికి తట్టుకోలేని శతానీకుడు తన వద్ద ఉన్న శక్తి ఆయుధాన్ని భీష్మునిపై విసిరాడు. భీష్ముడు దానిని మధ్యలోనే త్రుంచి వేరొక నిశిత అస్త్రంతో శతానీకుని శిరస్సు ఖండించాడు. ఇది చూసిన విరాటుని సేనలు పారి పోయాయి. ఇది చూసిన కృష్ణుడు అర్జునితో " అర్జునా ! భీష్ముని ధాటికి మన సేనలు నిలువ లేక పోతున్నాయి. ఇక నీవు భీష్ముని చంపక తప్పదు. భయంకరమైన అస్త్రాలను ప్రయోగించి భీష్ముని సంహరించు " అన్నాడు. కృష్ణుని మాటను శిరసావహించిన అర్జునుడు భీష్ముని మీద శరములు సంధించి అతని సారధిని చంపాడు, రధాశ్వాలను చంపాడు. ఇది చూసిన శిఖండి భీష్మునిపై వాడి శరములు సంధించాడు. శిఖండిని చూసిన అర్జునుడు భీష్ముని విల్లు త్రుంచాడు. అది చూసి సహించ లేని శల్యుడు, భూరిశ్రవనుడు, కృపాచారుడు, కృతవర్మ, చిత్రసేనాది ప్రముఖులు అర్జునిపై సైన్యమును పురికొల్పుతూ దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ భీష్మునికి అడ్డం వచ్చారు. ఇది చూసిన విరాటుడు, సాత్యకి, భీముడు, అభిమన్యుడు, ఘతోత్కచుడు, ద్రుపదాది పాండవ యోధులు తమ సైన్యంతో కౌరవ యోధులను ఎదుర్కొన్నారు. పోరు గోరంగా సాగింది. అర్జునుడు అంతటా తానై వీరవిహారం చేస్తున్నాడు. ఇంద్ర, వారుణ, ఆగ్నేయాస్త్రాలను ప్రయోగించాడు. మరొక పక్క శిఖండిని భీష్మునిపై శర ప్రయోగం చేయమని ప్రోత్సహిస్తున్నాడు. భీష్ముడు ఎన్ని విల్లులు తీస్తున్నా విరిచి వేస్తూ భీష్ముడు శరసంధానం చేయకుండా ఆపుతున్నాడు. విసిగి పోయిన భీష్ముడు భయంకర శక్తి ఆయుధాన్ని అర్జునిపై ప్రయోగించాడు. అర్జునుడు దానిని మధ్యలోనే త్రుంచి భీష్ముని సారధిని చంపి, కేతనమును విరిచి దేవదత్తం పూరించాడు.
భీష్ముడు విశ్రమించాలని కోరుకొనుట
అర్జునుని పరాక్రమం చూసిన భీష్ముడు " కృష్ణుని తోడు లేకున్న ఈ అర్జునుని నేను నిర్జించలేనా పోనిమ్ము ధర్మరాజాదులు కోరికపై నా మరణాన్ని నేనే కోరుకున్నాను. ఇప్పుడు వీరావేశంతో పోరాడి ప్రయోజన మేమిటి. ఇక విశ్రాంతి తీసుకుంటాను " అనుకున్నాడు . భీష్ముని నిర్ణయాన్ని మహా మునులు , దేవతలు అభినందించారు. వ్యాసభగవానుని కరుణ వలన నాకు ఆ మాటలు వినపడ్డాయి. కాని యుద్ధం చేయని ఎడల సుయోధనాదులు నిందించగలరని భీష్ముడు విల్లు అందుకుని శరసంధానం చేయబోయాడు. శిఖండి భీష్మునిపై దారుణ శరమును సంధించాడు. భీష్ముడు దానిని లక్ష్యపెట్ట లేదు. అర్జునుడు భీష్మునిపై పుంఖాను పుంఖాలుగా శరవర్షం కురిపించాడు. భీష్ముడు ఆగ్రహించి వాటిని త్రుంచి తిరిగి వాడి అయిన శరములను గుప్పించాడు. అర్జునుడు వాటిని త్రుంచి భీష్ముని విల్లు త్రుంచి భీష్ముని వ్క్షస్థలముకు గురి పెట్టి క్రూర నారాచమును ప్రయోగించాడు. అది చూసిన సుయోధనుడు నిశ్చేష్టుడైయ్యాడు. భీష్ముడు సుయోధనుని పిలిచి సుయోధనా ! చూసితివా అర్జునుని ప్రతాపం దేవతలైనా అతడిని గెలువ లేరు. ఇక మానవ మాతృడిని నేనెంత " అన్నాడు.
భీష్ముడు పడి పోవుట
ఇంతలో అర్జునుడు తన వింటిని శిఖండి చేతిలో ఉన్న విల్లు వెనుక పెట్టి అతి క్రూర నారాచములను భీష్మునిపై ప్రయోగించాడు. తన శరీరమున నాటుకున్న నారాచములను చూసి దుశ్శాసనుని దగ్గరకు పిలిచి " దుశ్శాసనా ! చూసితివా ఇవి శిఖండి వింటి నుండి వచ్చిన బాణములు కాదు. అర్జుని గాండీవం నుండి వచ్చిన బ్రహ్మ దండము వంటి బాణములు. నా మర్మస్థానములకు సూటిగా తగులు చున్నవి. యమదూతలవంటి ఇలాంటి దృఢమైన బాణములు వేయడం శిఖండికి చేతకాదు. నిశితమై, దీప్తివంతమై లక్ష్యం తప్పక మర్మస్థానాలకు తగులుతున్న ఈ శరములు అర్జునుడు కాక మరెవరు వేయగలరు " అన్నాడు. వెంటనే తన యావచ్ఛక్తిని ఉపయోగించి అర్జునిపై శక్తి ఆయుధమును వేసాడు. అర్జునుడు దానిని మధ్యలోనే త్రుంచి వేసాడు. భీష్ముడు కత్తి డాలు తీసుకుని రథము దిగాలనుకున్నాడు. అర్జునుడు వాటిని త్తునియలు చేసి సింహనాదం చేసి " భయపడకండి భీష్మునితో పోరాడండి అతనిని చుట్టుముట్టండి చంపండి " అని సేనలను ప్రోత్సహించాడు. పాండవ యోధులు " పొడవండి, వేయండి, నరకండి , చంపండి " అంటూ భీష్ముని పైకి పోసాగారు. వారిని కౌరవ సేన అడ్డుకుంది . ఇరుపక్షాలలో పోరు ఘోరంగా సాగింది. సూర్యుడు అస్థమించ సాగాడు. అర్జునుడు భీష్ముని శరీరంలో క్రూర నారాచములను నాటి అతడిని పడగొట్టి సింహనాదం చేసి దేవదత్తం పూరించాడు. భీష్ముడు రథం పై నుండి క్రిందికి పడ్డాడు. భీష్ముని తల తూర్పుకి పెట్టి భూమిపై కూలాడు. అతని శరీరం నేలకు తగల కుండా అతని శరీరంలోని బాణాలు శయ్యలా మారాయి.
అంపశయ్యపై భీష్ముడు
నేల కూలిన భీష్మునిలో పారమార్ధిక చింత మొదలైంది. దైవీక భావం ఆవేశించింది. దివి నుండి చూస్తున్న దేవతలు " అయ్యో ఇది దక్షిణాయనము కదా ! భీష్ముడు దక్షిణాయనంలో మరణిస్తాడేమో " అని కలవర పడ్డారు. వారి మనోభావం గ్రహించిన భీష్ముడు " దేవతలారా దక్షిణాయనమున ప్రాణము విడుచుట మంచిది కాదని శాస్త్రములు చెప్పాయి కనుక నా ప్రాణములు నా మేనిలో ఉత్తరాయణము వచ్చేవరకు నిలుపుకుంటాను. నా తండ్రికి సత్యవతితో వివాహము జరిపించిన సమయంలో నా తండ్రి నాకు ఇచ్ఛా మరణం వరంగా ప్రసాదించాడు కనుక నా ప్రాణములు నా వశంలో ఉంటాయి " అన్నాడు. అది విన్న దేవతలు సంతోషించారు. భీష్ముని తల్లి గంగాదేవి హంసల రూపంలో కొంతమంది మునులను భీష్మునికి దక్షిణాయనము గురించి తెలపడానికి పంపింది. వారు భీష్మునికి ఆ విషయం ముందే తెలిసిందని తెలుసుకుని సంతోషించి తిరిగి వెళ్ళారు. భీష్ముని స్థితి తెలుసుకున్న దుర్యోధనుడు ఈ విషయం ద్రోణునికి అందించమని దుశ్శాసనుని పంపాడు. దుశ్శాసనుడు ఈ విషయం తెలుపగానే ద్రోణుడు మూర్చిల్లాడు. కొంత సమయానికి తేరుకుని భీష్ముడు కూలిపోయినందుకు విలపిస్తూ భీష్ముడు పడిపోయిన ప్రదేశానికి వెళ్ళాడు. భీష్ముడు పడిపోయినందుకు పాండవ సేనలో ఆనందోత్సాహాలు వెల్లి విరిసాయి. పాండవేయులు, మత్స్య, పాంచాల, యాదవ రాజులు సంతోషించారు. తూర్యనాదాలు మంగళ వాద్యాలు మిన్నంటాయి. నీ కుమారులు కౌరవ ప్రముఖుల ముఖాలలో విషాదం చోటు చేసుకుంది. ఆ తరువాత యుద్ధం ఆగిపోయింది. సూర్యాస్తమయం అయింది " అని సంజయుడు పదవ నాటి యుద్ధ విశేషాలు వివరించాడు. దృతరాష్ట్రుడు " సంజయా ! ఇంతటి ఘోర వార్త విని కూడా నా మనసు ఆవంతయు చలించుట లేదు నాది హృదయమా పాషాణమా ! " అన్నాడు.
అంపశయ్యపై భీముడు
సంజయుడు " మహారాజా ! అప్పుడు పాండవులు తమతమ ఆయుధములు విడిచిపెట్టి గాంగేయుని వద్దకు వెళ్ళారు. ధనుంజయుడు మాత్రం తన గాండీవంతో సహా తాతాగారి చెంతకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇరు పక్షాలు తమతమ ఆవేష కావేషములు విడిచి పితామహుని ముందు నిలిచారు. భీష్ముడు నీ తనయుల వంక చూసి " నా తల వాలి పోతుంది దానికి ఒక ఆధారం కావాలి అన్నాడు. నీ పుత్రులు వెంటనే సుతి మెత్తని దొడ్లు తీసుకుని వచ్చారు. భీష్ముడు వాటిని సున్నితంగా తిరస్కరించి అర్జునుని వైపు చూసాడు. అర్జునుడు కళ్ళలో నీరు పెట్టుకుని పితామహుని తల వైపు మూడు బాణములు సంధించాడు . వాటిపై భీష్ముడు తన తలకు విశ్రాంతి ఇచ్చాడు. భీష్ముడు పాడవులను, కౌరవులను చూసి " నేను ఉత్తరాయణ పుణ్య కాలం వచ్చు వరకు ఈ శరతల్పమున శయనిస్తాను అందుకు కావలసిన రక్షణ ఏర్పాట్లు చేయండి అన్నాడు. వారు వెంటనే భీష్ముని చుట్టూ ఒక ప్రాకారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారు. సుయోధనుని వైద్యులు వచ్చి భీష్మునికి వైద్యం చేయడానికి అనుమతి కోరారు. గాంగేయుడు వారి సహాయమును తిరస్కరించాడు. ఇంతలో గాంగేయునికి దాహం వేసి నీటి కొరకు సైగ చేసాడు. నీ కుమారులు మధురమైన శీతల పానీయములు తెప్పించారు. భీష్ముడు " శరతల్ప గతుడనైన నేను ఇతరములైన జలమును ముట్టను. నేను తేజోమయమైన అస్త్రవిన్యాసంతో బయటకు వచ్చిన భూగర్భజలాలను మాత్రమే స్వీకరిస్తాను " అన్నాడు. నీ కుమారులు భూగర్భ జలములు తీసుకు వచ్చేది ఎలా అని ఆలోచించుచుండగా . భీష్ముడు అర్జునుని చూసి " అర్జునా ! ఈ బాణములవలన కలుగు బాధ నా సర్వాంగములను వేధించుతున్నది. నా దాహం తీర్చు జలములు నీవే తీసుకురావాలి " అన్నాడు. అప్పుడు అర్జునుడు భీష్మునికి ప్రదక్షిణం చేసి దివ్యాస్త్రం సంధించి భూగర్భ జలాన్ని బయటకు తీసుకు వచ్చాడు.
ఆ జలమును సేవించి భీష్ముడు సేదతీరి అర్జునుని చెంతకు పిలిచి " అర్జునా! నేను నారదుని వలన నిన్ను నరునిగా తెలుసుకున్నాను.
కౌరవులకు భీష్ముడు హితవు చెప్పుట
నరనారాయణులైన నీవు శ్రీకృష్ణుడు కలిసిన మీకు అసాధ్యమయినది లేదు. మీ ఇద్దరితో వైరము తగదు అని ఎన్నిమార్లు చెప్పినా కురునాధుడు విన లేదు. అతడు భీముని చేతిలో తగిన ఫలితము అనుభవించుట తధ్యము " అని పలికి నీ కుమారుడైన సుయోధనుని చూసి " సుయోధనా ! అర్జునుడు నరుడు అమిత పరాక్రమ శాలి అతడికి శ్రీకృష్ణుడు ఆప్తుడు కనుక నరనారాయణులను జయించుట అసాధ్యము. నా మాట విని అజాత శత్రువైన ధర్మనందనునికి ఇంద్రప్రస్థముతో సహా సగరాజ్యం పంచి ఇచ్చి మిగిలిన సోదరులతో నిండు నూరేళ్ళు బ్రతకండి " అన్నాడు. ఎవ్వరూ భీష్మునికి బదులు పలుకకనే వారి వారి శిబిరాలకు తిరిగి వెళ్ళారు. ఆ సమయమున కృష్ణుడు " ధర్మరాజా ! దేవతలకు కూడా అజేయుడైన అర్జునుని గెచుట ఎవరికిని అసాధ్యం " అన్నాడు. అందుకు ధర్మరాజు " కృష్ణా ! ఈ విజయం అంతా నీ వలన ప్రాప్తించిందే కాని ఇందు ఇసుమంత అయినా మా పరాక్రమము లేదు " అన్నాడు. అలా ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటూ తమ నెలవులకు వెళ్ళారు.
కర్ణుడు భీష్ముని కలుసుకొనుట
ఆ సమయమున కర్ణుడు ఒంటరిగా భీష్ముని వద్దకు వెళ్ళి భక్తితో పాదములకు నమస్కరించి " పితామహా! నా మీద కోపము మాని వాత్సల్యం చూపి నాకు తగిన చల్లటి మాటలాడండి " అని ప్రార్థించాడు. భీష్ముడు కర్ణుని ప్రేమతో దగ్గరకు పిలిచి ఒక చేయి ఎత్తి కౌగలించుకున్నాడు. అక్కడ ఉన్న రక్షక భటులను వెళ్ళమని చెప్పి తమ మాటలు ఎవరూ వినలేదని దృఢపరచుకుని " కర్ణా ! నీ మీద కోపము నా కెందుకయ్యా ! నీవు కుల భేదముతో మాట్లాడుతున్నావని కురు పాండవుల మధ్య వైరము ఎగత్రోయుచున్నావని నిన్ను నిందించానే కాని నాకు నీపై ఎలాంటి ప్రత్యేక కోపం లేదు. అది పెద్ద వాడిగా నేను నీకు వేసిన శిక్షే కాని ద్వేషం చూపుట కాదు. నీ పుట్టుక దైవీకము. అందు వలన నిన్ను గెలుచుట సాధారణ మానవులకు అసాధ్యము. నీవు కుంతీ పుత్రుడవు కానీ రాధేయుడవు కాదు. ఈ విషయం నేను వ్యాసుడు ఏకాంతంగా చెప్పగా విన్నాను. నాకు నీ పరాక్రమము తెలియును నీవు పాండు పుత్రుడవు కనుక నీ యందు నాకు వాత్సల్యం ఉన్నది. నేను సుయోధనునికి పాండవులతో వైరము తగదు దైవాంశ సంభూతులైన వారిని జయించుట అసాధ్యం అదియును కాక సాక్షాత్తు నారాయణుడు అయిన శ్రీకృష్ణుని అండ వారికి ఉంది అని చెప్పాను . అతడు అది లక్ష్యపెట్ట లేదు. నీవు కూడా నీ తలపు మానుకుని పాండవులతో స్నేహంగా ఉండు " అని హితవు పలికాడు. అందుకు కర్ణుడు " పితామహా ! నేను కౌంతేయుడినని రాధేయుడను కానని నాకు ఇంతకు మునుపే తెలిసింది. పాండవులు మహాబలులు వారికి శ్రీకృష్ణుని అండ ఉన్నది. వారిని జయించుట కుదరని పని ఇది తధ్యము. కాని నాకు ఇప్పుడు కుంతీ పుత్రులతో పొత్తు ఎలా కుదురుతుంది చెప్పు అన్నాడు. నేను ఇప్పటి వరకు సుయోధనుని ప్రాపున మన్ననలంది విపత్కర సమయమున అతడిని విడుచుట న్యాయమా, ధర్మమా? కృతఘ్నుడనని లోకం నన్ను నిందించదా? నన్ను పిరికి వాడని నిందించదా ! అది కాక పాండవులకు నేను అనేక విధముల కీడు చేసాను. కురుసభలో పాండవులను పెక్కు విధముల అవమానపరిచాను. ద్రౌపదిని నీచంగా మాట్లాడాను. వారికి నేనంటే అసహ్యము పుట్టేలా ప్రవర్తించాను. అహర్నిశలు వారికి కీడు తలపెట్టాను. కౌరవులకు పాండవులకు మధ్య వైరము రగిల్చి పెంచి పోషించాను. ఈ సమయంలో నాకు వారితో యుద్ధమే కాని పొత్తు సాధ్యం కాదు. నన్ను నమ్మిన సుయోధనుని వంచించలేను. జయాపజయములు దైవాధీనము. నాకు పాండవులతో యుద్ధమే శరణ్యం. నా సేవాధర్మం నెరవేర్చేలా నన్ను దీవించండి. నా పరాక్రమం కృష్ణార్జునులకు చూపించే తరుణం ఆసన్నమైంది " అని పలికాడు కర్ణుడు. భీష్ముడు " కర్ణా ! నీవు అంతటి పరాక్రమశాలివి అనినాకు తెలియును. సుయోధనునికి నీ బుజబలమే సహాయకారి. రారాజుకు ప్రియం కలిగేలా ప్రవర్తించుటకు నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను " అని పలికాడు. భీష్ముని ఆదర పూర్వకమైన పలుకులు విని ఆనందించిన మనసుతో కర్ణుడు తన నివాసముకు వెళ్ళాడు " అని పలికి సంజయుడు పది రోజుల యుద్ధవిశేషాలు చెప్పడం ముగించాడు.
ద్రోణ పర్వము
ద్రోణ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఏడవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.
ద్రోణాచార్యుని నాయకత్వంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఈ పర్వం కథాంశం