నవగ్రహాలలో ఒకటైన కుజ గ్రహాన్ని *అం:గారకుడు , మంగళుడు* అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం కుజుడిని భూమి పుత్రుడు అని కూడా పిలుస్తారు.
ఒకసారి తన తల్లిదండ్రుల అనుమతి తీసుకొని నర్మదా నది తీరంలో 1000 సంవత్సరాలు వినాయకుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. ఆ విధంగా 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయటంవల్ల కుజుడికి వినాయకుడు *మాఘ బహుళ చవితి* చంద్రోదయం నాడు వినాయకుడు పది భుజాలు కలిగిన ఒక బాలుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు.
ఆ విధంగా కుజుని తపస్సుకు మెచ్చిన వినాయకుడు కుజుడితో నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడగగా దానికి అంగారకుడు ఎంతో సంతోషించి వినాయకుని పూజిస్తాడు. అప్పుడు కుజుడు తనకు అమృతం కావాలని , అంతేకాకుండా తను ఎప్పుడు వినాయక నామస్మరణ చేస్తూ ఉండేలా వరం ఇవ్వవలసిందిగా కుజుడు వినాయకుని కోరుకుంటాడు. అందుకు వినాయకుడు తథాస్తు నీ కోరిక నెరవేరుగాక అని చెబుతాడు.
కుజుడు వినాయకుడి కోసం తపస్సు చేసే సమయంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఉంటాడు. నీవు ఎరుపు రంగులో ఉన్నావు , ఎర్రని దుస్తులు ధరించావు , అంతే కాకుండా ఈరోజు మంగళవారం కనుక ఇప్పటి నుంచి నీ పేరు మంగళుడు అనే నామకరణం చేసి వినాయకుడు మాయమవుతాడు. ఆ తర్వాత వినాయకుడు ప్రసాదించిన అమృతాన్ని సేవించి కుజుడు వినాయకుడి కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు.
ఆలయంలో వినాయకుని ప్రతిష్టించి , ఆ వినాయకుడికి *శ్రీ మంగళ మూర్తి* అనే పేరు పెట్టాడు. ఇవే కాకుండా ఎవరైతే *అంగారక చతుర్థి రోజు కఠిన ఉపవాస దీక్షలతో వినాయకుని పూజిస్తారో అలాంటి వారికి కుజ గ్రహ దోషాలు ఉండవు అనే వరాన్ని వినాయకుడు కుజునికి ప్రసాదిస్తాడు.*
అందువల్ల కుజదోషం ఉన్నవారు చతుర్దశి రోజు వినాయకుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.
గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి , రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని , పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.
ఒకవేళ సంకష్ట హర చతుర్థి *మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి* అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా , చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.
ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.
*☘సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం☘*
సంకటహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి.
ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.
వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి , తరువాత గణపతిని పూజించాలి.
అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని
పసుపు , కుంకుమలతో అలంకరణను చేయాలి.
మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు
ఖర్జూరాలు , రెండు వక్కలు , దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
సంకటనాశన గణేశ స్తోత్రం , సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను.
ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి.
తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి.
శక్త్యానుసారము గరిక పూజను కాని , గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును.
సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు.
సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి.
నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.
*☘సంకట హర చతుర్ధి వ్రత కథ:☘*
ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్‌సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో , అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా ! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా ! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా !
అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి , నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో , వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా ? అని !! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత , *‘నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’* అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని , అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.
ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత , ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
*గణపతి ప్రార్ధన*
*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !*
*ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే !!*
*☘గణనాయకాష్టకం☘*
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్
బాలేందుశకలం మౌళీ , వందేహం గణ నాయకమ్
చిత్రరత్నవిచిత్రాంగం , చిత్రమాలా విభూషితమ్
కామరూపధరం దేవం , వందేహం గణనాయకమ్
గజవక్త్రం సురశ్రేష్ఠం , కర్ణచామర భూషితమ్
పాశాంకుశధరం దేవం వందేహం గణ నాయకమ్
మూషికోత్తమ మారుహ్య దేవాసురమహాహవే
యోద్ధుకామం మహావీరం వందేహం గణ నాయకమ్
యక్షకిన్నెర గంధర్వ , సిద్ధ విద్యాధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణ నాయకమ్
అంబికాహృదయానందం , మాతృభి: పరివేష్టితమ్
భక్తిప్రియం మదోన్మత్తం , వందేహం గణ నాయకమ్
సర్వవిఘ్నహరం దేవం , సర్వవిఘ్నవివర్జితమ్
సర్వసిద్ధి ప్రదాతారం , వందేహం గణ నాయకమ్
గణాష్టకమిదం పుణ్యం , యః పఠేత్ సతతం నరః
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్
*ఇతి శ్రీ గణనాయకాష్టకం*
*☘సంకటహర గణపతి స్తోత్రం☘*
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః
_*☘విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం☘*_
జయ విఘ్నేశ్వర ! నమో నమో , జగద్రక్షకా ! నమో నమో
జయకర ! శుభకర ! సర్వపరాత్పర ! జగదుద్ధారా ! నమో నమో
మూషిక వాహన ! నమోనమో , మునిజనవందిత ! నమో నమో
మాయా రాక్షస మదాపహరణా ! మన్మధారిసుత ! నమో నమో
విద్యాదాయక ! నమో నమో , విఘ్నవిదారక , నమో నమో
విశ్వసృష్టి లయ కారణ శంభో ! విమల చరిత్రా ! నమో నమో !
గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో
అధర్వాద్భుతగానవినోదా ! గణపతిదేవా ! నమోనమో !
నిత్యానంద ! నమో నమో , నిజఫలదాయక ! నమో నమో
నిర్మలపురవర ! నిత్యమహోత్సవ ! రామనాథ సుత నమో నమో