ఒక్కమాటలో చెప్పాలంటే పరిస్థితులకు తగిన ఎరుకను కలిగి ఉండటమే .. `జ్ఞానం’
“జ్ఞానం” అనే పదానికి “ఇది అర్థం” అని ఇదమిద్ధంగా చెప్పటానికి వీలుపడదు. ఎప్పుడు ఎలాంటి విపత్కర, అవమానకర పరిస్థితులు ఎదురుపడినా అప్పటికప్పుడే వాటికి తగ్గ ఎరుకను కలిగి ఉండటమే “జ్ఞానం”.
ఉదాహరణకు మయసభలో దుర్యోధనుధు అనేక రకాల భ్రాంతులకు లోనయ్యి నీటి మడుగులో పడిపోయినప్పుధు అటుగా వెళ్తున్న ద్రౌపది అనుకోకుండా నవ్వింది. ప్రయత్నపూర్వకంగా దుర్యోధనుడిని అవమానించటానికి కానీ, పరాభవించటానికి కానీ నవ్విన నవ్వుకాదు అది. ఎవరయినా, జారితే మన ప్రత్యేక ప్రమేయం లేకుండానే నవ్వు ఎలా వస్తుందో .. అలాంటి అతి సహజమైన భావ ప్రకటన .. అ నవ్వు.
దానికి క్రోధంతో, అవమానంతో ఊగిపోయి, క్రుంగిపోయిన దుర్యోధనుడు మొదట ప్రాయోపవేశానికి సిద్ధపడి .. ఆ తరువాత ప్రతీకారజ్వాలతో, ఉక్రోషంతో ఊగిపోయి కురువంశ నాశనానికే కారణభూతుడయ్యాడు. ఒకింత బాధ, అవమానం కొద్దిసేపు కలగటం సహజమే. కాస్తంత సహనం వహిస్తే “అది చాలా చిన్న విషయం” అని ఆయనకు అర్థమయి ఉండేది.
కానీ ఆయనకు “ఎరుక” అనబడే “జ్ఞానం” స్వతహాగా లేదు కాబట్టి .. గోరుతో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నాడు. క్రోధాగ్నిలో పడికొట్టుకుపోయాడు. అదే అజ్ఞానం!
బుద్ధుడు భిక్షాటన చేసుకునే రోజులలో ఒకసారి ఒక ధనికుధు “అడుక్కు తినటానికి సిగ్గులేదా? వయస్సులోనే ఉన్నావు! నీకు కావల్సినంత శక్తి ఉంది. కష్టపడి పనిచేయాటానికి ఒళ్ళు వంగదా?” అంటూ సూటిపోటి మాటలతో విపరీతమైన దుర్భాషలాడాడు. అప్పటికే అన్నింటికీ అతీతుడైన గౌతముడు చిరునవ్వుతో అన్నీ విన్నాడు. అదే “జ్ఞానం”!
ఎలాంటి కష్టాన్ని అయినా ఇష్టంగా భావించటమే “జ్ఞానం” .. మరి ప్రతిదానిలో పడి కొట్టుకుపోవటమే అజ్ఞానం. ఎలాంటి క్లిష్టపరిస్థితిని అయినా నీటి మీద గీతలా తీసుకోవాలే తప్ప .. నుదుటిమీద వ్రాతలా తీసుకోకూడదు. అదే జ్ఞాని లక్షణం.
గురుకులంలో శిష్యుడిని గురువు కొడతాడు, తిడతాడు! ఉత్తరోత్తరా క్రొత్త రోగాలు రాకుండా వేసే టీకాలులాంటివే ఆ తిట్లు మరి దెబ్బలు. దానిని వక్రంగా తీసుకోకుండా చక్కగా స్వీకరించగలిగిన వాడే “జ్ఞాని” అవుతాడు!
మానమయినా, అవమానమయినా సమాన భావంతో తీసుకోగలగటమే “జ్ఞానం” .. మరి దానినే “స్థిత ప్రజ్ఞత” అంటారు.