ఋషి అంటే ఒక ఉద్దీప్తుడైన కవి ( Inspired Poet). ఋషి కానిదే కావ్యం ఎవరూ రాయలేరంటారు.(నానృషిః కురుతే కావ్యమ్ ). ఆంగ్లంలో ఈయన్ని Sage అనీ Seer (ద్రష్ట ) అనీ కూడా అంటారు. ఈయన పవిత్రమైన ఋక్కుల (Hymns}ను శ్రావ్యంగా, రాగయుక్తంగా గానం చేస్తాడు కూడా. వేదమంత్రాలను ఛందోబద్ధంగా రచించింది కూడా ఋషులే. అయితే వేదాలు అపౌరుషేయాలనీ ( అంటే మానవులు సృష్టించినవి కావనీ), అవి అనంతమైన, శాశ్వతమైన శబ్దరాశులనీ నమ్మేవారు మాత్రం భగవంతుడి ప్రేరణ కారణంగా నిత్య శబ్దరాశి అయినట్టి వేదాలను ఋషులు విని, వాటికి అక్షరరూపం కల్పించి, వాటి అర్థాలను వివరించారని నమ్ముతున్నారు. అందుకే వేదాలను వారు శ్రుతులు (వినబడినవి) అంటారు. అయితే వేదాలు మానవ లిఖితాలే అనేది శాస్త్రీయ దృష్టి. అవి అపౌరుషేయాలు అనేందుకు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. కనుకనే ఆ యా ఋషుల పేరిట ప్రాచుర్యంలో ఉన్నట్టి వేద మంత్రాలను ఆ యా ఋషుల కృతులుగానే మనం భావించాలి. అయితే వివిధ వేద మంత్రాలు రచించబడిన కాలంలో శతాబ్దాల అంతరం ఉండడం కూడా గమనార్హం. ఆ యా ఋషులు వేనవేల సంవత్సరాలపాటు జీవించి ఉండడం అసాధ్యం. కనుక వేల సంవత్సరాల అంతరం ఉన్న ఆ యా వేద మంత్రాల యొక్క కర్తలు అదే వ్యక్తులు అని కాక ఆ యా వంశాలకు చెందినవారై ఉంటారని మనం గ్రహించాలి. అథర్వ వేదం (10- 10-26) లో దేవతలు, అసురులు, సామాన్య మానవులకు భిన్నమైనవారుగా ఋషులు చెప్పబడ్డారు. వసిష్ఠుడు, అత్రి, అగస్త్యుడు వంటి వారంతా ఋషులకు ఉదాహరణలు. అనంతరకాలంలో ప్రసిద్ధులైన గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, వసిష్ఠుడు, కశ్యపుడు, అత్రి అనే ఏడుగురు ఋషులు సప్తర్షులని పేరు పొందారు. వేదాలను విభజించిన కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. వ్యాస అంటే విభజించినవాడు అని అర్థం. వ్యాసుడు మహర్షిగా ప్రసిద్ధుడయ్యాడు. కనుక ఋషి అనే శబ్దం మౌలికంగా కవి, గాయకుడు, తాత్త్వికుడు అనే అర్థాలను సూచిస్తుంది. మహాభారతం మరీచి, అత్రి, అంగిరసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, వసిష్ఠుడు - ఈ ఏడుగురిని సప్తర్షులని పేర్కొన్నది. మనువు సప్త ఋషుల పేర్లకు దక్షుడు, ప్రచేతసుడు, భృగువు, నారదుడు అనే నలుగురినీ చేర్చి వారిని ప్రజాపతులు అని పిలిచాడు. దేవర్షి, బ్రహ్మర్షి, రాజర్షి, మహర్షి, పరమర్షి, శ్రుతర్షి, కాండర్షి అనేవి ఋషులలో కొన్ని తరహాలు. ఏతావాతా ఋషి అనే పదం ఏకకాలంలో కవి, జ్ఞాని, తాత్త్వికుడు, గాయకుడు అయిన వ్యక్తిని సూచిస్తుంది.
ముని శబ్దం ఒక పవిత్రుడైన సాధువు, భక్తుడు, సర్వసంగ పరిత్యాగిని సూచిస్తుంది. ముని అనే వాడు ఆత్మమననశీలుడని పేర్కొనబడ్డాడు.
' వీతరాగభయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే' ( భగవద్గీత - 2-56). అంటే అనురాగము, భయము, కోపము తొలగిన ఆత్మమనన శీలుడైన స్థితప్రజ్ఞుడిని ముని అంటారు. 'భగవద్గీత' లోని విభూతియోగములో సర్వశ్రేష్ఠమైనవన్నీ తానేనని చెపుతూ తాను మహర్షులలో భృగువుననీ, మునులలో కపిలుడినిననీ కృష్ణుడు పేర్కొనడాన్నిబట్టి వారిరువురూ శ్రేష్ఠులని గ్రహించగలం.
యోగాభ్యాసం ద్వారా చిత్తవృత్తిని నిరోధించిన వాడు యోగి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులనే ఎనిమిది అంగములతో కూడిన అష్టాంగ యోగమనే సాధన ద్వారా అతీతశక్తులు లభిస్తాయని ఒక నమ్మకం ఉంది. కఠోరమైన సాధనద్వారా అలాంటి అతీత శక్తులను సాధించినవాడిని యోగి అంటారు.
సంన్యసించినవాడిని సంన్యాసి అంటారు. సంన్యసించడం అంటే వదిలివేయడం. To put down, To lay down, To give up, To abandon, To quit, నిష్క్రమించడం అని అర్థాలు. 'సంన్యస్త శస్త్రుడు' అంటే 'ఆయుధములను విసర్జించినవాడు' అని అర్థం. ' సంన్యస్తాభరణం గాత్రమ్' (విసర్జించిన ఆభరణములు కలిగిన శరీరం ) అనే ప్రస్తావనలు మన సాహిత్యంలో ఉన్నాయి. సంన్యసించుట అంటే To resign the world, discard all worldly ties and attachments and become an anchorite. ఈ ప్రపంచాన్నీ, దానిలోని సకల వస్తు సంచయాన్నీ విసర్జించేవాడు సంన్యాసి అనబడతాడు. భారతీయ చతురాశ్రమ ధర్మాలలో ఇది నాల్గవది అంటే చివరిది. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము దీని ముందరి మూడు దశలు. ధృతి, క్షమము, దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ, విద్య, సత్యము, అక్రోధము అనే పది ధర్మములను అలవరచుకున్న ద్విజుడు మరణానంతరము ఉత్తమగతిని పొందుతాడని మనుస్మృతి (7-93) పేర్కొంది. వేదాంతములోని ఉపనిషత్తుల అర్థాలు, మర్మాలు క్షుణ్ణంగా తెలుసుకుని ఒక గృహస్థుడైన ద్విజుడు మూడు విధములైన ఋణములను తీర్చివేసిన తరువాతనే సంన్యసించాలని మనుస్మృతి (7- 95 ) పేర్కొంది. ఋషిఋణం, దైవ ఋణం, పితృ ఋణం (పితౄణం) అనే మూడు ఋణాల నుంచి విముక్తుడయ్యాక మాత్రమే ఒక ద్విజుడు సంన్యాసాశ్రమం స్వీకరిస్తాడు.