ఎంతోమంది మహర్షులు ఎంతో తపనతో, ఎన్నో విధాలుగా పరిశోధించి, అనుభవపూర్వకంగా విశ్లేషణ చేసిన మహత్తర జ్ఞానాన్ని అందరూ ఆచరించేటందుకు వీలుగా సత్య, ధర్మాలతో కూడిన సనాతనధర్మాన్ని మానవాళికి అందించి, మానవధర్మాన్ని పటిష్టం చేసారు.
ఈ ధరణిలో జన్మించిన ప్రతి వ్యక్తి కొన్ని కర్మలు ఆచరించక తప్పదు కాబట్టీ, జ్ఞానంతో కూడిన కొన్ని విహిత కర్మలను వీటిలో సూచించడం జరిగింది. తమ జీవన మనుగడకై మానవులు రోజూవారీ చేసే కర్మలతో పాటు ఈ విహితకర్మలను కూడా ఆచరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు మనశ్శాంతి లభించి, తద్వారా చిత్తశుద్ధి కలిగి పరమాత్మ
విభూతిని మనసారా అనుభవించి మరణించేలోపు ఆత్మానుభూతి పొంది తన జన్మను సుసంపన్నం చేసుకోవచ్చు.
ఇటువంటి మహత్తర మానవధర్మము యుగాలపాటూ కొనసాగింది. ఈ ధర్మాన్ని తేలికగా తీసుకున్న అధర్ములను కీర్తిహీనులను చెయ్యడం కూడా జరిగింది. రానురాను మనుజుల మనస్తత్వం మారింది. గత కొన్ని యేళ్లుగా అజ్ఞానం పెంపొంది జ్ఞానం కాస్త మరుగున పడింది. ఇంచుమించు ప్రతి మానవునిలో అరిషడ్వార్గాలు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు), ఈషణత్రయాలు (భార్యేషణ, పుత్రేషణ, ధనేషణ) తీవ్రంగా విజ్రంభించాయి.
ఈ వివత్కర సమయంలో ఎంతోమంది మహనీయులు గురురూపంలో అనేక ప్రదేశాల్లో అవతరించి ఎప్పటికప్పుడు మానవధర్మాన్ని పరిరక్షించే ప్రయత్నం చేసేరు, ఇంకా చేస్తూనే వున్నారు. కొంతమంది అసలు సత్యాన్ని గుర్తించి దారిన పడ్డారు, చాలామంది ఇంకా అజ్ఞానాన్నే నమ్ముకుంటున్నారు.
ప్రస్తుతంలో పాశ్చాత్యశాస్త్రవేత్తలు వాటిని తమ పరిశోధనాంశంగా తీసుకొని, పరిశోధించి అవి నిత్యసత్య మైనవని, సహేతుకమైనవని, ఎంతో శాస్త్రబద్ధమైనవని
గ్రహించి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆ జ్ఞానాన్ని అభివృద్ధిచేసుకుంటూ, పదిమందికీ పంచుతూ, అచట సమాజాన్ని జ్ఞానవంతులను చేస్తూ, ఎంతో లబ్ది పొందుతున్నారు. ఇది మనం గ్రహించని నిజం!!
అంతటి మహత్తర జ్ఞానం మనదైనప్పటికినీ, మనం
మాత్రం ఆ మహత్తర జ్ఞానంలో లోటుపాట్లను పరిశోధిస్తూ, వాటిని విమర్శిస్తూ ఎంతో అజ్ఞానాన్ని మూటగట్టుకుంటున్నాము. కొంతమంది మేధావులు ఈ మహత్తర జ్ఞానానికి మసిపూసి, కొత్తరంగు పులిమి మూఢాచారాలుగా తీర్చిదిద్ది సమాజంలో అజ్ఞానాన్ని విస్తరిస్తున్నారు.
సనాతనధర్మము ఒక మతం కాదు! ఒక జీవన విధానం గ్రహించవలసింది ఏమిటంటే -
ధర్మం వేరు! మతం వేరు! ధర్మం సత్యంపైన ఆధారపడివుంటుంది! మతం అభిమతంపైన వ్యక్తుల
ఆలోచనాసరళి) ఆధారపడివుంటుంది!
సత్యం నుండి ధర్మం పుట్టింది! ధర్మంనుండి శాంతి, ప్రేమ, అహింసలు పుట్టేయి! అందుకే మన పూర్వీకులు సూచించిన “మానవధర్మంలో” వీటిని వరుసక్రమంలో "సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస”లుగా పేర్కొన్నాయి!
సత్యం లేని ధర్మానికి మనుగడలేదు! అవి కొంతకాలం విజృభించి పిమ్మట మరుగున పడిపోతాయి!
ధర్మం లేని శాంతి, అశాంతికి దారితీస్తుంది! ధర్మంలోని ప్రేమ, కపటాన్ని ఆశిస్తుంది! ధర్మం లేని అహింస, హింసను కోరుతుంది,
అందుకే సత్యమే శాశ్వతమైనది, సనాతనమైనది, అదే పరమావధి! అదే పరమాత్మ! అందుకే ఉపనిషత్తులు “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ!” అని చాటిచెప్పేయి.
అంటే అన్నింటా వ్యాపించియున్న పరమాత్మ స్వరూపము “నిజమైనది, జ్ఞానవంతమైనది, అనంతమైనది” అన్నమాట! అంటే దానిని గ్రహిస్తే, ఇక గ్రహించవలసినది ఏమీ వుండడని భావము! పెద్దలు శోధించి ప్రతిపాదించిన అన్ని ధర్మాలు అసలు సత్యాన్ని తెలియపరిచేవే. అన్ని ఆధ్యాత్మిక గ్రంధాలలో అంతర్లీనంగా వున్న విషయమిదే...
ఈ ధరణిలో పరమాత్ముని ప్రతిరూపంగా జీవాత్మగా
జన్మించిన ప్రతిజీవి తమ మనుగడకోసం, తమ పరిధిలో కొన్ని కర్మలు చేయక తప్పదు. అందుకు తగిన శక్తిని, జ్ఞానాన్ని ప్రతి జీవానికి ఆ పరమాత్మ ప్రసాదించేడు.
జీవులన్నింటిలో అత్యంత జ్ఞానసంపన్నుడిగా, తన
సంపూర్ణ ప్రతిరూపంగా, పూర్తి మేధస్సుతో మానవుడ్ని సృష్టించేడు పరమాత్మ. తనలాగే మానవుడు కూడా ఈ సృష్టిని, అందున్న ప్రతి జడజీవాన్ని జాగ్రత్తగా కాపాడుతూ, ఈ సృష్టి నిర్వాహణలో తనకు ఎంతో చేదోడువాదోడుగా వుంటాడని భావించేడు పరమాత్మ.
మానవుడు కూడా తన అపరిమిత జ్ఞానంతో కొన్ని ప్రత్యేక శక్తులను తన స్వంతం చేసుకొని, సృష్టిలో వున్న అన్ని జడజీవాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, అపర పరమాత్మగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మిగతా జీవాలతో పోలిస్తే ఆత్మజ్ఞానం పొందుట మానవులకు మాత్రమే సాధ్యము.
అయితే మానవులు మాయకులోబడి తమ అసలు
స్వరూపాన్ని గ్రహించలేకపోతున్నారు. మానవులలో వున్న ఇంద్రియాలు, మనస్సు ఈ మాయకు దోహదపడుతున్నాయి. వీటికి లోబడి మానవులు వివిధ నైజాలతో జీవిస్తున్నాడు.
ఆత్మజ్ఞాన విషయానికొస్తే మానవుల నైజము మూడురకాలుగా ఉంటుంది. కొందరు భక్తిరసభావంతో, కొందరు క్రియాశీలంతో, కొందరు విచారణాత్మకముతో నుంటారు. ఈ మూడింటినే భక్తిమార్గమని, కర్మమార్గమని, జ్ఞానమార్గమని అనుకోవచ్చు. వీటి మోతాదు ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. ఈ మూడు ఒకదానితో ఇంకొకటి పెనవేసుకొని వుంటాయి. ఆత్మజ్ఞానము పొందుటకు ఈ మూడు అవసరమే. ఈ మూడింటి విశిష్ఠతను అర్ధము చేసుకొని తదనుగుణంగా సాధనచేయువాడు ఆత్మజ్ఞానమును పొందగలడు.
సులువుగా చెప్పాలంటే మనుజులు ఆత్మజ్ఞానం పొందుటకు మధ్వాచార్యులంత భక్తి భావం,
రామానుజాచార్యులంత నిష్కామకర్మభావం,
శంకరాచార్యులంత జ్ఞానభావం కలిగుండాలి.
గీతలో శ్రీకృష్ణపరమాత్మ, ఓ పార్థా! ఎవరు నాకు ఇష్టమైన కర్మలు నిష్కామముతో చేయుదురో (కర్మయోగము), నిత్యము నన్నే ధ్యానించుదురో (ధ్యానయోగము), నాయందు అనన్యమైన భక్తి కలిగియుండెదరో (భక్తియోగము), దృశ్య వస్తువులందు బంధము పెంచుకొనక జ్ఞానవంతులై వుండెదరో (జ్ఞానయోగము) అట్టివారు నన్ను పొందెదరు. అంతేకాదు, ఎవరైతే మూర్ఖత్వముతో కర్మేంద్రియాలను బంధించి, ఇంద్రియ విషయాలను మనస్సుతో ఆలోచిస్తారో వారు మిధ్యాచారులు. వారు స్వయంగా నష్టపోవడమే గాక, ఇతరులకు ఏ మాత్రమూ వుపయోగపడరు. వారు నన్ను పొందడము సాధ్యం కాదు. ఇది యదార్ధమని వివిధ సందర్భాల్లో తెలియజేశాడు.
ఇచ్చట కర్మ చేయడంగాని, చేయకపోవడంగాని
ముఖ్యంకాదు. మనస్సునందు మాలిన్యము అంతరించడమే ప్రధానము. వాటిని మనసా, వాచా, కర్మణా తొలగించకుండా ఒంటరిగా జనసంద్రమునకు దూరంగా పోయి తపమాచరించుట వలన ఉపయోగముండదు. అలాగే ఈ వాసనల నుండీ ముక్తుడైనవాడు జనసంద్రమున నున్నప్పటికీ
కూడా మోక్షమును పొందగలడు.
ఇదంత సులభం కాదు. మొదటి మెట్టుగా మానవులు
దుష్కర్మనుండి (చెడ్డ పనులు) సత్కర్మకు (మంచి పనులు) మారాలి, అందుకోసం భగవతార్పణ బుద్ధితో కర్మలనాచరించాలని బోధించింది. ఎందుకంటే ఏదైనా భగవంతునికి అర్పించేటప్పుడు జాగ్రత్తగా ఉంటాము కాబట్టి. ఇలా చేయడంవలన మానవులు చేయు దుష్కర్మలు కొన్నాళ్ళకు సత్కర్మలుగా మారతాయి. సత్కర్మల వలన శాంతి కలుగుతుంది
పిమ్మట సత్కర్మనుండి నిష్కామకర్మకు (ఎటువంటి
ఫలితం ఆశించకుండా చేసే సుకర్మలు) మారే ప్రయత్నము చేయాలి. దీనివలన చిత్తశుద్ధి కలిగి త్వరలోనే జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానంతో మోక్షము లభిస్తుంది...
చూడటానికి జ్ఞాని, అజ్ఞాని చేయుకర్మలు ఒకేలా
వుంటాయి. అజ్ఞాని, నేను చేస్తున్నానని భావిస్తూ (కర్తృత్యము) ఫలితముల యందు ఆసక్తితో కర్మలను ఆచరిస్తూ, వాటి ఫలితాన్ని అనుభవించుటకు ఈ జన్మ చాలకపోతే ఇంకొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. దానినే ప్రారబ్ధకర్మ అంటారు. కర్మఫలితాలతో బంధము ఏర్పడుతుంది.
జ్ఞాని, ఆత్మస్థితి యందుండి, ఎటువంటి ఫలితములను ఆశింపకా దైవబుద్ధితో కర్మలు చేస్తాడు. అది యజ్ఞంగా, యోగంగా మారి బంధమును కలిగించదు. సాధనతో ఆత్మజ్ఞానము పొంది బంధాలనుండి విముక్తి పొందుతాడు.
ఈ కర్తృత్యమును మానవుడు అనవసరంగా తన
నెత్తినవేసుకొని బాధపడుతున్నాడు. తను తెచ్చింది లేదు, వెంట తీసుకుపోతున్నది లేదు! తానూ పుట్టక మునుపు, మరణము పిమ్మట ఇదంతా ఎవరిదో? అది ఎవరో తెలుసుకొనుటకు సాధనచేయాలి! అప్పుడు బ్రహ్మాండమును నడుపువాడు దైవమని తెలుస్తుంది.
అతడినే పరమాత్మ అన్నారు విజ్ఞులు. అతని ప్రమేయంతోనే విశ్వముదయించిది. అతని అంశయే ఈ చరాచర జగత్తు. మానవుడు కేవలం నిమిత్తమాత్రుడు. మనతో పనులు చేయుంచునదియు అతడే. అతడే సూత్రధారి. అనంత కాలమును, అనంత సృష్టిని అతడే నడుపుతున్నాడు. ఇక డబై, ఎనభై యేళ్లు జీవించే మానవుడు తానె అంతా చేస్తున్నానని అనుకోవడము హాస్యాస్పదము.
కావునా “నా ఆత్మయే నీవు”, “నాచే చేయిస్తున్నది నీవు” అన్న సంకల్పంతో కర్మలుచెయ్యాలని గీత సూచించింది. ఎవరి కర్మ శుద్ధముగా, పాపరహితముగా వుంటుందో అతడు ఎవరికీ భయపడ నవసరంలేదు. అందుకే మానవుడు ముందుగా నమస్కరించవలసినది కర్మకే (తస్మై నమః కర్మణే).
అయితే, బలవంతముగా మానవునిచేత కర్మలను
చేయించేది ఏది? అన్న సంశయం కలుగుతుంది! కామమే (కోరికలు) మనుజులచేత బలవంతంగా కర్మలను చేయిస్తుంది. కామము తీరకపోతే క్రోధంగా(కోపంగా) మారుతుంది.
కామాన్నే క్రోధమని చెప్పవచ్చు. ఇదే మానవునికి మహాశత్రువు, మహాపాపకారి. ధూళి అద్దమును కప్పేసినటులు కోపము మనుజుని జ్ఞానాన్ని కమ్మేస్తుంది. కామానికి ఆధారములు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. ఇంద్రియముల కంటే బలీయమైనది మనస్సు. మనస్సు కంటే అత్యంత బలమైనది
బుద్ధి.
అంటే, ఇంద్రియములను, మనస్సును అదుపులో పెట్టుకొని, బుద్ధితో ఆత్మను కనుగొని, జ్ఞానంతో పరమాత్మను చేరుకోవాలన్న మాట! ఎందుచేతనంటే మానవుడు ఏ యుగంలో పుట్టినప్పటికీ తనలో యున్న ఇంద్రియములు, మనస్సు, బుద్ధి యొక్క వికారములు మారలేదు. వీటి వికారముల వలన తనలో నున్న అఖండమైన ఆత్మశక్తిని కనుగొనలేక వివిధ కర్మలు చేస్తూ వాటి ఫలములు పొందుతూ, సుఖదుఃఖములను అనుభవిస్తూ, తుదకు మరణించి మరల జన్మించి ఈ భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ జన్మకర్మల తత్వమును పూర్తిగా అర్ధంచేసుకుని తదనుగుణంగా జీవించువాడు మరణానంతరము తిరిగి జన్మనెత్తడు..
.
సేకరణ.....