పూజల పరమార్థం ఏమిటి....బిల్ గేట్స్ లక్ష్మీ పూజ చేయలేదు. సంపన్నుడయ్యాడు. ఐస్ స్టీస్ సరస్వతీ పూజ చేయలేదు, శాస్త్రవేత్త అయ్యాడు...!

P Madhav Kumar


బిల్ గేట్స్ లక్ష్మీ పూజ చేయలేదు. సంపన్నుడయ్యాడు. ఐస్ స్టీస్ సరస్వతీ పూజ చేయలేదు, శాస్త్రవేత్త అయ్యాడు, కష్టపడి కృషి చేయాలే గానీ పూజలు చేయనక్కరలేదు’ – అని ఒకాయన చెప్పాడు. పూజల పరమార్థం ఏమిటి అంటే, పూజల పరమార్థాలు చాలా ఉన్నాయి.


మనమీనాడు శరీరశక్తి, ప్రకృతి పదార్థాలు, రకరకాల ఐశ్వర్యాలు అనుభవిస్తున్నామంటే అది భగవంతుని ప్రసాదం. ఈ భావం నిలబడడానికే పూజ. ఇది ఒక కృతజ్ఞతా భావం. ఈ పూజలవల్ల చిత్తశుద్ధి ఏర్పడి జీవన పరమార్ధమైన భక్తిజ్ఞానాలు లభిస్తాయి. గ్రహదోషాలరీత్యా, ప్రారబ్ధ కర్మలననుసరించి అనుభవించే దుఃఖరోగ దారిద్ర్యాపదలను తొలగించే శక్తి పూజలకుంది. మీరు చెప్పిన సంపన్నులు, విద్యావంతులు గత జన్మలలో భగవదారాధన చేసి ఉంటేనే ఈ జన్మలో అనుభవించగలుగుతున్నారు. వాళ్ళు కూడా ‘నాస్తికులు’ కాదు కదా! వారికి తెలిసిన భాషలో, పద్ధతిలో వారూ దైవానికి కృతజ్ఞతలు చెప్తూండవచ్చు. పూజలు చేసినంత మాత్రాన సంపద, జ్ఞానం వస్తాయని శాస్త్రాలు ఎన్నడూ చెప్పలేదు.


‘ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి’,

‘ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీః’


అని మన ప్రాచీనులు – ప్రయత్నాల ద్వారానే, శ్రమతోనే కార్యసిద్ధి, లక్ష్మీప్రాప్తి లభిస్తాయని చెప్పారు. అయితే ప్రయత్నానికీ శ్రమకీ దైవశక్తి తోడు కోసం పూజ సహకరిస్తుంది.


లోకంలో ఏ వ్యాయామమూ, ఏ ఔషధ సేవనమూ లేకుండానే కొందరు ఆరోగ్యంగా ఉండవచ్చు. వారిని పేర్కొని ‘వ్యాయామం చేయనక్కరలేదు-మందులు వాడనవసరం లేదు’ అనే సిద్ధాంతాలను ప్రతిపాదించలేము కదా! వ్యాయామం లేకుండా ఆరోగ్యాన్ని తెచ్చుకోలేని వారు, ఔషధ సేవనంలేకుండా అనారోగ్యాన్ని తొలగించుకోలేని వారూ ఉంటారు. వారు వ్యాయామం, ఔషధాలు సేవిస్తూనే ఆహార విహారాలను క్రమబద్ధీకరించి ఆరోగ్యాన్ని సాధించవచ్చు. పూర్వపుణ్యం లేని సామాన్యులకు కాలం కలసి రావాలంటే దైవానుగ్రహం కావాలి. అంతమాత్రాన దేవతల పూజలతోనే అన్నీ సాధించుకోగలం అననక్కరలేదు. ధర్మంతో కూడిన సత్కర్మలతోనే దేనినైనా సాధించగలమని ఋషుల మాట. మన ఉపనిషత్తులు, భగవద్గీతాది శాస్త్రాలు వ్యక్తి ప్రయత్నానికి, కర్తవ్య నిష్ఠకి ప్రాధాన్యాన్నిచ్చాయి.


మన విద్యుక్తధర్మ నిర్వహణయే పూజ.

కర్తవ్య నిర్వహణ సామర్థ్యమే తగిన సాఫల్యం భగవత్కృప ద్వారా వచ్చిన లక్ష్మి, విద్య సవ్యంగా వినియోగింపబడాలన్నా ఆ కృప ఉండాలి. దానికోసం కూడా పూజించాలి. మన కర్మలు భగవత్ శక్తిచేతనే చేస్తున్నామని, నిరంహకారంగా, నీతిగా చేస్తే అదికూడా అర్చనయే.


‘స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విన్దతి మానవః’(భగవద్గీత).


“మానవుడు తన కర్మతో భగవంతుని అర్చించి (నిస్వార్ధమే ఈశ్వరార్పణ)సిద్ధిని పొందుతున్నాడు”


అయినా కేవలం దానం, విద్య మాత్రమే కాకుండా జీవితంలో ఎన్నో ప్రాధాన్యాలు అవసరాలు ఉంటాయి. మన బుద్ధిని సరియైన దిశలో ఉంచి, సత్ఫలితాలను ప్రసాదించడానికి పూజాదికాలు సహకరిస్తాయి. లక్ష్మీ, విద్య లభించినందుకైనా వాటిని దేవతలుగా భావించి ఆరాధించడంలో అద్భుతమైన మనోభావం వ్యక్తమౌతుంది. సైన్స్ కి కూడా అందని పరమసత్యాన్ని ఐన్ స్టీన్ వంటి శాస్త్రవేత్తలు కూడా ఆనాడే అంగీకరించారు.


"పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి

తదహం భక్త్యుప హృత మశ్నామిప్రయ తాత్మనః''


అంటే భగవంతునికి నువ్వేది సమర్పించినా, భక్తితో, హృదయశుద్ధితో సమర్పించు. అది పత్రమైనా, ఫలమైనా, జలమైనా సరే. అందుకే ''భక్తి రేవ గరీయసీ'' అన్నారు. భగవంతుడు కూడా భక్తి అంటే ''నమో భక్తిః ప్రణయ్యతి'' అని భరోసా ఇచ్చాడు.


భక్తి, హృదయశుద్ధి, మోక్షమార్గానికి టిక్కెట్టు వంటిది. కాబట్టి మోక్ష ప్రయాణానికి, భగవత్కృప, మోక్షప్రాప్తికి భక్తి, చిత్త నైర్మల్యం ముఖ్యం. భగవంతునకు విదురుడు ద్రౌపది పత్రమును, గజేంద్రుడు పుష్పమును, శబరి ఫలమును, రంతిదేవుడు జలమును భక్తితో సమర్పించుకుని కృతార్థులయ్యారు.


''భక్తి'' సమర్పణను కోరుతుంది. భక్తుడు ఉన్మత్తుడుగా ఉంటాడు. తన దైవానికి దాసోహం కావడం తప్ప, అతనికి ఇంకేది ఉండదు. ఆకలిదప్పిక ఉండదు. అహాన్ని వదిలి పరిపూర్ణ శరణాగతిని పొందడమే భక్తికి తొలిమెట్టు. భక్తికి అంత్యం ముక్తి. రథానికి ఉన్న రెండు చక్రాలవలె, పక్షికి ఉన్న రెండు రెక్కల వలె భక్తి, విశ్వాసం రెండూ కలిసి వుంటాయి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat